Tuesday, April 6, 2010

వెరి ఫాస్ట్ ఫుడ్ బిస్ర్తో

Tuesday, April 6, 2010
సెప్టెంబర్ 3, 2009
అహ్మదాబాద్.

“నేను రవణని సార్.......” అర్ధరాత్రి మోగిన ఫోను ఎత్తితే అవతల నుండి ఒక గొంతు సంబరాలలోని కొలాహలాన్ని మూడు పదాల్లో లైసెన్సు లేకుండా ఛార్జీలు లేకుండా, ఎక్స్ స్పోర్ట్ చేసింది న్యూయార్క్ లో ఉన్న నా చెవికి.

“ఏ రమణ? ఎక్కడ నుండి”? అని అడిగాను. ఎంతమంది రమణలో. అందులో ఏ రమణ ఈ రమణ అన్న ధ్వనితో.

“విశాఖపట్నం రమణ నుండి డ్రైవర్ రమణని” అన్నాడు అవతలి వ్యక్తి. నన్ను మర్చిపోయారా? అన్న ఆశ్చర్యాని కప్పుకుని వచ్చాయి ఆ మాటలు.

“నెంబరు చెపితే నేను ఫోను చేస్తాను” అన్నాను ఆనవాయితీగా.

“అక్కర్లేదండి. నా సెల్ నుండే చేస్తున్నాను” రోజులు మారిపోయాయన్నది స్పష్టం చేస్తూ.

“చెప్పండి....” అన్నాను.

“నన్ను అండి ఏటండి? మీ డ్రైవర్ని. రవణ అనండి చాలు” వినయంలో ముంచి తీసిన మాటల్ని తాజాగా పంపాడు.

“ఉ......” అన్నాను ఏంమాట్లాడో తెలియక

“మీరన్నట్టే లచ్చ సంపాదించానండి. సంపాదించిన తొలి లచ్చ మీకివ్వాలని వొట్టేసుకొన్నానండి. ఎలా ఇవ్వమంటారండి?” చెవులలోకి ఇంజక్ట్ అయిన ప్రతీపదం మత్తుమందులా పని చేసి నా ఆలోచనలన్నీ ఆగిపోయాయి.

రమణంటాడు. డ్రైవర్ నంటాడు. లక్షంటాడు. తనే సంపాదించానంటాడు. నాకిస్తానంటాడు. పట్టపగలు విన్నా అర్థం కాని విషయాలు అర్థరాత్రి నిద్రలేపి చెపితే ఏం అర్థం అవుతుంది. కాని ఈ పరిస్థితిలో మెసేజ్ చెయ్యలేకపోతే ఎలా? నా అహ్మదాబాద్ ఐ.ఐ.ఎమ్, ఎం.బి.యే డిగ్రీ, మద్రాస్ ఐ.ఐ.టి ఇంజనీరింగ్ డిగ్రీల పరువుపోతుందని.

“సంతోషం నెంబరు చెపితే రేపు ఉదయం చేస్తాను. అన్నాను”

“చమించండి. నిద్రలో ఉన్నారా? నానే రేపు ఉదయం చేస్తాను సార్” అని పోను పెట్టేసాడు.

అమ్మయ్య అని పడుకోబోతూంటే

“ఎవరుట” అంది నిద్రమత్తులో. నాకెపుడో ఓ ఆపరేషన్ కి మత్తుమందు ఇచ్చిన డాక్టర్ ఇచ్చిన మందు మత్తుపోయిన తరవాత తన మత్తులో పడేసుకొన్న నా అర్దాంగి.

“ఎవరో రమణట?” అన్నాను అన్న ధ్వనితో

“ఏమంటాడు?” అని అడిగింది. మెడికల్ సీటు వచ్చింది కానీ రాకపోతే పోలీసాఫీసర్ అయ్యుండేది అనుకొన్నాను
వెయ్యినొక్కసారి.

“లక్ష ఇస్తాడంటా”

“రూపాయలా?”

“రూపాయిలే అనుకొంటాను ఇండియానుండి కదా?”

“సరిగ్గా వినుండవు. ఇమ్మంటున్నాడు కాబోలు”

“ఏమో రేపు ఉదయం ఫోను చేస్తానన్నాడులే”! అనేసి “ఇక పడుకో” అన్నాను. ఈమాట గట్టిగా పైకే.

“అందరికి ఇండియా వెళ్ళడానికి, అక్కడా తిరగడానికి ఖర్చు ఉంటుంది. నీకు వచ్చింతరవాత కూడా ఇండియా ఖర్చుంటుందంటే ఎవరూ నమ్మరు కాని....” అంది తనదైన థీరీని ప్రూవ్ చేసిన ఇండియన్ సైంటిస్టులా.
నిద్రపోవాలని కళ్ళుమూసుకొన్నాను.

* * *

ఫోనులో విన్న గొంతుని నెమరు వేసుకోవడం మొదలు పెట్టాను ఆ గొంతు తాలూకూ మనిషిని గుర్తు తెచ్చుకొందామన్న ప్రయత్నంలో. మెల్లిమెల్లిగా ఆ మాటలలోని ఆనందాన్ని, ఆవేశాన్ని, ఆతృతనీ పొరలు పొరలుగా తీసి విన్న గొంతు అసలు మూలాన్ని మనస్సులో వినే ప్రయత్నం చేసాను. కొద్దిపాటి ప్రయత్నంతోనే అర్దం అయ్యింది. ఆ గొంతు మాఫ్రెండ్ వాళ్ళ డ్రైవర్ రమణదే అని ఖచ్చితంగా గుర్తుపట్టాను. డ్రైవర్ డబ్బు సంపాదించడమేమిటి? నాకు లక్షఇవ్వడమేమిటి? అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకొన్నాను.

నిద్ర వచ్చీరాని స్థితి. ఇండియాలో ప్రయాణాల విశేషాలు అక్కడక్కడ చెదురుమదురుగా గుర్తుకు వచ్చిపోతున్నాయి. ఇండియా ప్రయాణం పూర్తి అయి వచ్చిన తరవాత ఆ ప్రయాణాన్ని, విశేషాలని తలుచుకొంటూటే మరో ఏడాది గడిచిపోతుంది. అన్ని విశేషాలు విషయాలు ఉంటాయి మరి. ఈ రవణ విషయం ఎక్కడా దొరకడం లేదు. డ్రైవర్ నాకు లక్ష ఇవ్వడమేమిటి? ఇస్తాన్నది కలకాదు. ఫోను చేసి మరీ చెప్పాడు. సరే రేపు పోను చేస్తానన్నాడు కదా అని నిద్రలోకి జారుకొన్నాను.

* * *

ఉదయాన్నే ఆరు గంటలకి మెలుకువ వచ్చింది. మెలుకువతోపాటు అప్పటిదాకా తెరలు తెరలుగా వస్తున్న కలలమాలిక తెగిపోకుండా గుర్తుకూడా ఉంది, కాని గుర్తుకు వచ్చిన వాటిలో డబ్బు గురించి డ్రైవర్ తో ఏంసంబంధమో తెలియడం లేదు. బెడ్ రూమ్ లోంచి బయటకు చూసాను. తూర్పున వున్న సూర్యుడు మేఘం వెనక మీదకు వస్తున్నాడు, వెలుగు ఇస్తున్నాడు కాని స్పష్టంగా కనబడలేదు. నా కలలలో రమణ విషయంలా.

మొహం కడుక్కొని వచ్చేసరికి కాఫీతో శ్రీమతి సిద్దం. న్యూయార్క్ నగరంలోనే ఉన్నా చుట్టూ చూస్తే చూడగానే అడవా? అని అనిపించే లాంటి చోట ఇల్లు కట్టుకొన్నాం కాబట్టి ఉదయం ఎండ ఎక్కువకాకముందు బయట తూర్పువైపున్న వసారాలో కూర్చొని దక్షిణంగా ఉన్న న్యూయార్క్ వృక్ష సంపదని ఆనందించడం అలవాటు. అలాగే ఇవ్వాళ్ళ కూడా కూర్చొన్నాం ఇద్దరం.

నామెదడు, ఆలోచనలు నాకంటే బాగా తెలిసిన శ్రీమతి “ఏం గుర్తువచ్చింది?” అని అడిగింది.

“కిందటి మారు నేను ఇండియా వెళ్ళినపుడు మన శ్రీదర్ డ్రైవర్ నన్ను ఉన్న రెండు రోజులు తిప్పాడు. నా హైస్కూల్ క్లాస్ మేట్ శ్రీరాములు రకరకాల వ్యాపారాలు చేసి ఏదీ కలిసిరాక ఇక అమెరికానో, ఆస్ట్రేలియానో వెళ్ళిపోదామనుకొంటున్నాను. అక్కడ ఏదైనా చేద్దామనుకొంటున్నాను. నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు ఇద్దరం కారులో కలిసివెళుతుంటే. అదేంట్రా అందరూ ఇండియాలో వ్యాపారం బాగుందని ఇక్కడికొస్తుంటే, నువ్వు ఇండియా వదిలివెళ్ళిపోవడం ఏమిటని మందలించాను.

నువ్వు ఎన్నైనా చెప్పు ఇక్కడ ఏవ్యాపారం సరిగ్గా సాగటంలేదు. లాభాలు పెద్దగా లేవు అన్నాడు.

నాఉద్దేశంలో ఇండియా బెష్టు అన్నాను. నేను బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్ని అనికూడా చెప్పాను.

అయితే నీ ఉద్దేశ్యంలో ఇండియాలో ఏవి మంచి వ్యాపారాలో చెప్పు అన్నాడు.

గుడి, బడి, తిండి ఇవి భ్రహ్మాండమైనవి అన్నాను. గుడి, బడి సరే కాని తిండి వ్యాపారం చాలా డేంజరస్ తెలుసా కుక్కులతో పడలేం నేనొకసారి ట్రై చేసా చాలా నష్టం వచ్చిందన్నాడు.

మాటవరసకి అందరూ తింటారుకదా అది వ్యాపారసూత్రాల ప్రకారం నిశ్చయంగా ఉండే వ్యాపారం అని అన్నాను.
ఇంతలో అప్పుడే వాళ్ళ ఊర్లో తెరిచిన ఓ పెద్ద పాష్టుఫుడ్ చెయిన్ లోనే మొదటిరోజు తినాలని అది వాళ్ళ స్నేహితులదని తీసుకెళ్ళాడు శ్రీరాములు. అక్కడ చాలా కోలాహలంగా ఉంది. మొదటిరోజు అంతా అమెరికా పద్దతిలోని ఏర్పాట్లు. నిజానికి అమెరికాలోని చాలావాటికంటే బాగానే ఏర్పాటు చేసారు. శ్రీరాములు వాళ్ళ స్నేహితులకి నన్ను పరిచయం చేసి నాకు కొంత తినడానికి ఇచ్చి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. తింటూ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నాను.
అందరూ టీనేజర్స్! అందరూ ఇంగ్లీష్ లోనే కబుర్లు. ఉన్నది ఇండియా, కనిపిస్తున్నది ఇండియన్స్ అని కాని ఈ పాష్టుపుడ్ రెస్టారెంట్ అమెరికాలో ఏఊర్లోదైనా కావచ్చు.

అంతమంది టీనేజర్ల మధ్య ఒక టేబుల్ దగ్గర వున్న అమ్మాయి నాదృష్టిని ఆకర్షించింది. ఆ అమ్మాయిలో ప్రత్యేకత ఏమీ లేకపోయినా ఆఅమ్మాయితో కూర్చున్నవాళ్ళ వల్ల ఆఅమ్మాయి ప్రత్యేకంగా అనిపించింది. అమ్మాయితో ఆ అమ్మాయి తల్లి తండ్రి కాబోలు కూర్చున్నారు. వాళ్ళ టేబిల్ మీద ఒక చిన్నసైజు ఫ్రెంచ్ ఫేస్, ఓ పెద్దసోడా, గ్లాసు ఉన్నాయి. అదే ముగ్గురూ మౌనంగా తింటూ తాగుతున్నారు. బహుశా అమ్మాయి బలవంతం మీద తల్లి దండ్రలు అమ్మాయితో పాటు వచ్చి ఉంటారు. ముగ్గురికి కావలసినన్ని కొనుక్కోవటానికి చాలా ఖరీదు చాలా ఖరీదు అక్కడున్నవన్నీ. అందుచేత ఇలా తక్కువలో సర్దుకొని అందరిలా వాళ్ళుకూడా కొత్త ఫాష్టుఫుడ్ రెష్టరెంట్లో తింటున్నారు. మధ్య తరగతిలో అంత కన్నా దిగువలోనే ఉన్నపుడు ఎన్నెన్ని కోరికలు, ఎన్నెన్ని అడ్డంకులు, వాటిని మించిన ఆలోచనలు అని ఆశ్చర్యంగా వాళ్ళ వైపే చూస్తూ కూర్చొన్నాను. వాళ్ళు తిని వెళ్ళిపోయారు. ఆఖాళీ టేబుల్ చూస్తుంటే తళుక్కున ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళకి ఏంతిన్నాం అన్నది ముఖ్యంకాదు అక్కడ తినడం ముఖ్యం అన్నది.

ఇంతలో శ్రీరాం వచ్చాడు. మళ్ళీ కారెక్కి బయలుదేరాం. కారులో శ్రీరాంతో అన్నాను. వంట వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు లేకుండానే నడుపు అన్నాను. వాళ్ళు లేకుండా ఎలా? నాఉద్దేశంలో చాలామంది పోష్ వాతావరణంలో తినాలని అనుకొంటారు కాని ఏంతిన్నాం అన్నది వాళ్ళకి ముఖ్యం కాదు. కాబట్టి ఎవరి తిండిని వాళ్ళనే తెచ్చుకోమని నువ్వొక మంచి వాతావరణం, టేబుల్స్, మ్యూజిక్, లైట్లు పెట్టి అక్కడ కూర్చున్నందుకు అరగంటకి మనిషికి ఓ పదిరూపాయిలు ఫీజు తీసుకో. ఓ వందమందికి సరిపడే హాలులాంటిది మంది జనసమ్మర్దం ఉన్న జాగాలో తీసుకో ఓ నలుగురు మంచి పనివాళ్ళని పెట్టి ఆ జాగాని స్టార్ హోటళ్ళలో ఉన్నంత శుభ్రంగా ఉంచు. మంచి నీళ్ళు, నేప్ కిన్లు మాత్రమే ఇయ్యి.

అందమైన చెత్తవేసే డ్రమ్ములు ఏర్పాటు చెయ్యి. ఎవరికి నచ్చిన వాళ్ళు తెచ్చుకొని నీకు పది రూపాయలు కట్టి వెంటనే కూర్చొని అక్కడ తిని వెళ్లిపోతారు. ఆర్డరు చెయ్యడం, వెయిట్ చెయ్యడం ఇవేవి ఉండవింక. కాబట్టి దీన్ని వెరిఫాష్టుఫుడ్ రెష్టారెంట్ అని అనవచ్చు అన్నాను శ్రీరాంతో. వాడు చాలా ప్రశ్నలు వేసి అయినో సర్ డబ్బులు సంగతేంటి అన్నాడు.
రోజులో 12 గంటలు తెరిస్తే సగం నిండినా రోజుకి 12,000 రావాలి. పోనీ పదివేలేసుకొన్నా నెలకి మూడులక్షలు. అద్దెలు, జీతాలు, టేక్సులు అన్నీ కలుపుకొన్నా లక్ష కన్నా ఉండవు నెలకి. కాబట్టి లక్షల్లో లాభాలు అన్నాను ఉత్సాహంగా.
వాడు అదంతా విని సర్లేరా అన్నాడు. నేను మరిచిపోయాను ఆవిషయాన్ని” అన్నాను ఖాళీ కాఫీ కప్పు కిందపెడుతూ. ఇంతలో ఫోను మ్రోగింది.

“హల్లో సార్ నేను రవణని” మళ్ళీ అతనే

“ఆ చెప్పు రవణ”

“ఏంచెప్పమంటారు సార్.... మీరిచ్చిన ప్లాన్ భ్రహ్మాండం సార్” నేను మీరు చెప్పిందంతా విన్నాను సార్ కార్లో మీ స్నేహితులు శ్రీరాంగారికి చెప్పింది.

“ఓ రెండు మూడు నెలలు చూసాన్ సార్ ఆయన ఆ వెరి ఫాష్టుఫుడ్ హోటలు పెట్టలేదు సార్. నేనే ధైర్యం చేసి బేంకీలోను తీసుకొని సిరిపురం జంక్షన్ లో పెట్టేసాను సార్ నాలుగు నెల్లక్రింద”

“చాలాసంతోషం” అన్నాను నిజంగానే నమ్మలేకపోతూ.

“మీరన్నట్టే నెలకి రెండు లచ్చలు లాభం వచ్చింది సార్. నాను కూడా డ్రెయివర్ ఉద్యోగంలో వచ్చే ఆరువేలజీతం తీసుకొని పనిచేసాను సార్. మూడునెలల్లో చేసిన అప్పులన్నీ తీర్చేసాను సార్. మన ఆడిటర్ కుమార్ గారు ఇవాళ పిల్చి ఇదిగో నీ మొదటి లచ్చ లాభం అని కాగితాల మీద వేసి చూపించి బేంకులోంచి తీసికోచ్చన్నారండి.”

“చాలా ఆనందంగా ఉంది రవణ....” అన్నాను. ఇది కలా నిజమా అని నన్ను నేను ప్రశ్నించుకొంటూ మనసులో.

“నానీ యాపారం పెట్టి మీరన్నట్టు లచ్చలు లచ్చలు డబ్బు సంపాదిస్తే మొదటి లచ్చ మీకే ఇయ్యాలనుకొన్నాసార్” అన్నాడు ఆనందంగా.

రమన నిజాయితికి, పట్టుదలకి, నాకు నోటిమాట రాలేదు.

“గొప్ప అయిడియా సార్... అసలు వంటలేదు, గోలలేదు ఏటీనేదు. చక్కగా నీట్గా, హాయిగా ఉంచడమే సార్....” చిన్నపిల్లడిలా ఆనందపడిపోతూ ప్రతీపదం పువ్వులు విసిరినట్లు విసిరి వినిపించాడు.

(ఇన్నేళ్ళు ఇంతపెద్ద అమెరికన్ బిజినెస్ స్కూల్లో పాఠాలు చెప్పాను కాని) రవణ చేసిన ప్రయోగం వింటుంటే చెప్పలేనంత ఆనందం కలిగింది. అలాంటిది ఎపుడూ కలగలేదు.

“సార్ ఒద్దనకండిసార్ తప్పకుండా ఈ లచ్చ తీసుకోండి సార్” ఇది మీరు తీసుకొంటేనే నేను మిగిలిన లాభం ముట్టగలను సార్ అన్న ప్రాధేయపూర్వకంగా నా నిశ్శబ్దాన్ని మరోలా అర్దం చేసుకొన్నాడు కాబోలు.

“తప్పకుండా రమణ. తప్పకుండా తీసుకొంటాను నాకు నువ్వు చేసిన పనికి చాలా ఆనందంగా ఉంది” అన్నాను చెమర్చిన కళ్ళతో.

రమణ ఇచ్చిన లక్షతో కృష్ణుడు అర్జునునికి గీతాబోధ చేస్తున్న గంధపు చెక్కతో చెక్కిన బొమ్మని కొన్నాను. నా ఆఫీసులో పెట్టుకొన్నాను. మిగిలిన అవార్డుల కంటే ఇది చాలా ఆనందం ఇస్తుంది రోజు. కర్మ చెయ్యడమే కాని దాని ఫలితాన్ని గురించి ఆలోచించకు అన్న విషయం రమణ ఆచరించినాకు చెప్పినట్లు తోస్తుంది దాన్ని చూసినపుడల్లా.





2 వ్యాఖ్యలు

తలుపుల రసీదు

బొబ్బిలిలో యూనివర్సిటీ పెట్టే విషయంలో పెద్దగొడవ జరిగింది. గొడవ బొబ్బిలి వాళ్ళకి విజయనగరం వాళ్ళకి మధ్య కాదు. బొబ్బిల్లో ఉన్న బొబ్బిలి వాళ్ళ మధ్యే. యూనివర్సిటీ పేరు పెట్టడంలో పేచి వచ్చింది. కొందరు వీరబొబ్బిలి యూనివర్సిటి అనాలని “కాదహే.... రెండొందల ఏబైమంది ఇక్కడ మిగలకుండా చచ్చిపోతే ఈరత్వం ఏడంటుంది?” అని ప్రశ్నించి “ఉప్పుడు మనం అంతా కేవిస్ కాబట్టి వి బిల్ కాదు కెవిబిల్ ఊనివర్సిటి అని పేరు పెట్టాలి”. ఇది గొడవ. కేవి అని పెడితే కులం తీసుకొచ్చినట్లవుతుందని కొందరు వాదించారు. యూనివర్సిటీ అత్యున్నత అధికారులను కులపతి, ఉపకులపతి అని అంటారు కదా అని వెంఠనే మరొకరన్నారు. కులపతి అంటే ఛాన్సలర్, వైస్ ఛాన్స్ లర్ అని భోధపరిచి ఎలాగో ఒకలాగా అందరిని ఒక కొలిక్కి తీసుకొచ్చాను.

బోష్టన్ యూనివర్సిటిని బియు అంటారు. బ్రౌన్ యూనివర్సిటి ఉంది. బర్మింగ్ హమ్ యూనివర్సిటీ ఉంది. ఇలా చాలా బితో మొదలయ్యే యూనివర్సిటీలు ఉన్నాయి. మనం కూడా బొబ్బిలి యూనివర్సిటి అని పేరు పెడితే బియు ఆఫ్ ఇండియా అంటారు. వాళ్ళంతా మనతో కలిసి బొబ్బిలి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తారు అని రాత్రి పగలు కష్టపడి అందరిని బొబ్బిలి యూనివర్సిటీ అన్న పేరుకు ఒప్పించాను.

అందరిని ఒప్పించేను కాబట్టి వీళ్ళతో కలిసి పనిచేసి యూనివర్సిటిని నిలిపి నాలుగు డిగ్రీలు ఇచ్చి పదిమందికీ పనికి వచ్చేలా ఓ రూపకల్పన చెయ్యమన్నారు.

దేశంలో వేల వందల యూనివర్సిటీలు కావాలని అందరూ అంటున్నారు. కాని వాటిని నడపడానికి, పాఠాలు చెప్పడానికి, మంచి రిసెర్చి చెయ్యడానికి కావల్సినంత మంది మనుషులు లేరు. ఇంజినీరింగ్ కాలేజీలకే దిక్కు లేకుండాపోతున్నాది మరి యూనివర్సిటీ అంటే మాటలా. మీరు ఇక్కడ ఉండి ముఖ్యమైన వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకొని అప్పుడు కాని మీరు వెళ్ళండి అన్నారు.

బొబ్బిలి యూనివర్సిటి నడపడానికి అర్హులైన వాళ్ళు అన్ని రకాల ఉద్యోగాలకి కావలెను అని ప్రపంచవ్యాప్తంగా నెట్ ప్రకటన ఒకటి ఇచ్చాం. వచ్చినవాళ్ళకి ఇవాళ ఇంటర్వ్యూలు చేస్తున్నాం. ఇప్పటికే ఓ ఇరవై మందిని ఎడ్మినిస్ట్రేషన్ లో ఒక ముఖ్యమైన ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేసాం. దేశదేశాల నుండి వచ్చిన తెలుగు వాళ్ళున్నారు. ఇంకా మరో పది మందిని ఇంటర్వ్యూచెయ్యాలి. ఒక్క పదినిముషాల విరామం తరువాత మొదలుపెడ్తాం అని అనుకొన్నాం.

నేను ఎలక్ట్రానిక్ పేపరు రెండు చేతుల మధ్య పట్టుకొని చదువుతున్నాను. ఈ ‘పేపరు’ పూర్వం అచ్చం పేపరు చదివినట్లే విప్పి రెండు చేతులతో పట్టుకొని చదువుకోవచ్చు. పూర్వం లేప్ టాప్ లాంటి స్క్రీన్ లో చక్కగా అన్ని రంగులు అచ్చం కాగితం మీద కనిపించినట్లు కనిపిస్తాయి. సేటిలైట్ ద్వారా వచ్చే సంకేతాలతో మొత్తం పేపరంతా చదవచ్చు. ఈ పరికరంలో ఏపేపర్ కావాలంటే ఆపేపరు ఇంగ్లీషు, తెలుగు ఏభాష కావాలంటే ఆ భాషలో చదవచ్చు.. తెలుగు పేపరుని ఇంగ్లీషులో, లేమాంద్ అన్న ఫ్రెంచి పేపరుని తెలుగులో కూడా చదవచ్చు. అంతా గూగుల్ టెక్నాలజీ మహిమ.
సరిగ్గా అలాంటపుడు ‘మే ఐ కమిన్...... నేను రావచ్చా?’ అని రెండు భాషలలో అంటూ పొడవైన ఒక అభ్యర్థి లోపలికి వచ్చాడు. అంటే విరామ సమయం అయిపోయిందన్నమాట అని అనుకొన్నాను. eపేపర్ ని చుట్టి జేబులో పెన్నులా పెట్టుకొంటూ!

అతన్ని ఎక్కడో చూసాను సుమా అని అనుకొన్నాను. అచ్చం మా కనకప్రసాద్ లాంటి మొహం. కళ్ళద్దాలు కూడా అలాగే అనిపించాయి. వయస్సు 55 దాటి ఉంటుంది. ఈరోజుల్లో కుర్రాళ్ళు ఎవరూ కళ్ళద్దాలు పెట్టుకోవడం లేదు. కళ్ళకి కావలసిన సర్జరీలు చేయించేసుకొంటున్నారు. ఇదుగో ఇలా ఏభైలు దాటిన వాళ్ళే అలవాటుకొద్ది కళ్ళజోళ్ళు పెట్టుకొంటున్నారు.

“మీపేరు” అని అడిగాను.

“తలుపుల రసీదు” అన్నాడు తెలుగు కొత్తగా నేర్చుకున్నవాడిలా.

“తలుపుల ఇంటిపేరు అయ్యుండాలి” రైట్ అన్నాను నవ్వుతూ.

“అవునండి. మాదికూడా బొబ్బిలే” అదో క్వాలిఫికేషన్ లా అన్నాడు.

“కాని ఈ రసీదు అన్న పేరే ఆశ్చర్యంగా............”

“నా అసలు పేరు రషీద్ అండీ. చాలామంది సరిగ్గా పిలవలేక చివరికి రసీద్, రసీదు అయిపోయిందండి” అన్నాడు కొద్దిగా సిగ్గుపడుతూ.

“సరే. మీరేం చదువుకొన్నారు......” అని బటన్ నొక్కి నా అరచేతిలో ఉన్న గూగుల్ ఆర్గనైజర్ లో అతని పేరుతో ఉన్న బయోడేటాని వెతుక్కోవలసి వచ్చింది. ఎక్కడా డిగ్రీ కనిపించలేదు. మిస్సయ్యేనేమోనని మరొకసారి చూసాను. లేదు. మీకు ఏ డిగ్రీ లేదా ? అన్నాను ఆశ్చర్యంగా.

“లేదండి....” అన్నాడు వినయంగా

“మరి ఇంటర్వ్యూలోకి ఎవరు రానిచ్చేరు” అని గట్టిగా అరిచాడు ఇంటర్వ్యూ చేసే మరో కమిటి సభ్యుడు.

“నన్ను పిలవలేదండి. కానీ ఉద్యోగం తప్పక ఇస్తారన్న ఆశతో నాఅంతట నేనే లోపలికి తలుపు తోసుకొచ్చానండి” అని ఓ క్షణం ఆగి “క్షమించండి” అన్నాడు.

“క్షమించేం. వెళ్ళండి. పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లతో ఎంతోమంది బయట వెయిట్ చేస్తున్నారు” అన్నాను చిరాగ్గా.

“నా బేక్ గ్రౌండ్...”

“రిజర్వేషన్లంటే లాభం లేదండి. రిజర్వేషన్ లు పోయి చాలా ఏళ్ళు అయ్యింది. మీరు ముస్లిం అయినా మరేదయినా నో యూజ్” అన్నాను వెళ్ళమని చెయ్యి చూపిస్తూ.

“నా ఎక్స్పీరియన్స్...............”

“ఏంటి మీ ఎక్స్పీరియన్స్.......” ఒక కమిటీ సభ్యుడు మర్యాదగా అడిగాడు.

“అమెరికాలో.......”

“అమెరికాలో ఎక్స్పీరియన్స్ ఎవడికి కావాలండి........” అన్నాడు ఇంకో కమిటీ మెంబరు.

“అమెరికాలో నేను ఒక పెద్ద సంస్థ నడిపానండి.” అన్నాడు ఒక పెద్ద ఫైల్ తీసి టేబుల్ మీద పెడుతూ.

“ఆ సంస్థ ఏం చేసేది.”

“కంప్యూటర్ల ఆపరేషన్ సిస్టమ్స్... ప్రోగ్రామ్ లు......”

“సరే మరి అవన్ని మీరు మాకు పంపారా?”

“పంపానండి”

“మరి మా గూగుల్ ఫోన్ ఆర్గనైజర్ డేటాబేస్ లో లేవే!”... అన్నాం అందరం గబగబ మరోసారి వెతికి.

“బహుశా ఫార్మెట్ ప్రాబ్లమ్ అయింటుందండి.... నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010లో పంపానండి.”

“అలా చెప్పండి గూగుల్ డాక్స్ లోనే గత పదేళ్ళుగా ప్రపంచం ఉంటే మీరు ఇంకా ఎప్పుడో పాత మైక్రోసాఫ్ట్ పట్టుకు వేలాడితే ఎలా?” అతను చేప్తున్నప్రతి మాటని నేను గూగుల్ ‘బ్రైన్’ లోకి పంపుతున్నాను. కంప్యూటర్ లు పోయి లేప్ టాప్ లు, లేప్ టాప్ లు పోయి గూగుల్ బ్రైన్ లు వచ్చేసాయి. నేనో టెక్నాలజీ, బయోమెటీరియల్ సైన్స్ లు బాగా డెవలప్ అయి టెరా బైట్ కంప్యూటర్ లు చిన్న క్రెడిట్ కార్డు సైజుకి దిగిపోయాయి. దాన్ని కూడా అతి పల్చగా తయారు చేస్తున్నారు. దాన్ని విడిగా పట్టుకొని తిరగడం కష్టం కాబట్టి కావాలనుకొన్న కొంతమంది తలపై భాగంలో ఓ చిన్న సర్జరీతో అమరుస్తారు. దానిని మనుషులు ఆలోచనతో నడుపుతారు. ఆలోచనల తీరు, జోరు, ఆ గూగుల్ బ్రైన్ కనిపెట్టి అడిగిన వివరాలను అందిస్తుంది. దానికి కావలసిన విషయాల కొన్ని దానిలో పొందు పరిచినా అపారమైన విజ్ఞానాన్ని, విశేషాలని, వివరాలని సేటిలైట్ ద్వారా నేనో సెకన్ల లో తీసుకొంటుంది. మౌఖికం పోయి, తాళపత్రాలు, తాళపత్రాలు పోయి, అచ్చుపుస్తకాలు, అచ్చుపుస్తకాలు పోయి కంప్యూటర్లు, కంప్యూటర్లు పోయి గూగుల్ బ్రైన్ వచ్చేసింది.

సాధారణంగా మాలాంటి వాళ్ళంతా గూగుల్ బ్రైన్ తో పని చేస్తున్నాం చాలా మట్టుకి. అప్పుడప్పుడు మాత్రమే స్వంత బ్రైన్ వాడేది. అది కూడా ఏదో అమ్మాయితో, ప్రేమగా కబుర్లు చెప్పడానికి మాత్రమే. అనుభూతులు ఇంకా గూగుల్ బ్రెయిన్ పరిధిలోకి రాలేదు. అనుభవాలని మాత్రం దాస్తున్నది.

మిగిలిన కమిటీ సభ్యులు అతనిని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అతను తాపీగా సమాధానాలు చెప్తున్నారు. నేను కళ్ళు మూసుకొని అతని సమాధానాలని నా గూగుల్ బ్రైన్ లోకి పంపుతున్నాను. గూగుల్ బ్రైన్ ని ఈ సమాధానాలని అన్నింటి శోధించి అతని గురించిన అసలు వివరాలని ఇమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అది ఇచ్చిన సమాధానం విని ఆశ్చర్యంతో లేచి నిలుచున్నాను. నోటమాట రాలేదు. ఏమైయిందో తెలియక నాతో పాటే అందరూ నిలుచున్నారు. నేను కొద్దిసేపటికి తేరుకొని

“మీరు బిల్ గేట్సా?” అన్నాను. ఒక్కొక్క అక్షరం వత్తి పలుకుతూ.

“అవును. చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయాను మా కుటుంబంతో. అసలు పేరు మీద మమకారంతో తలుపుల రసీదు పేరుని బిల్ గేట్స్ గా మార్చుకొన్నాను. అన్నాడు చిర్నవ్వుతో!”

(అక్షరాలతో ఆటలాడుకోవడం అలవాటున్న అప్పారావుకి అభిమానంతో)
- కలశపూడి శ్రీనివాసరావు





4 వ్యాఖ్యలు