Thursday, August 20, 2009

ఖబడ్దార్ మాష్టారి శిష్యుణ్ణి నేను.....

Thursday, August 20, 2009
జగన్నాధం గారు రిటైర్ అయి చాలా కాలం అయ్యింది. ఆ ఊరి చుట్టుప్రక్కల గ్రామాలలో ముప్పైఏళ్ళ పైబడ్డ సర్వీసు ఉన్న టీచర్ ఆయన. పాఠాలు చెప్పడమే కాకుండా, పల్లెలలోని ప్రజలకు ఉత్తరాలు వ్రాసి పెట్టేవారు. కోర్టు కాగితాలు చదివి బోధపడే దాకా వివరిస్తారు. ఆయన చుట్టుప్రక్క గ్రామాలలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ తన జీవితం సాఫీగా సాగించారు. రిటైరైనా కూడా ఊర్లో, ఊరి చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రజలకు ఏదో విధంగా ఉపయోగపడుతూ ఉద్యోగం చేస్తున్నంత బిజీగా ఉంటారు. రోజూ ఉదయం లేచిన దగ్గర నుండి ఇంగ్లీషు పాఠాలు, ప్రభుత్వ కార్యాలయానికి దరఖాస్తులు, పురపాలక సంఘం వారికి అర్జీలు, రిటైర్ అయిన వాళ్ళ ఫించన్ విషయాలు, బేంక్ విషయాలు, ఇలా ఎన్నో రకాల పనులతో ఆయన అందరి మనిషిగా అన్ని పనులు తనవే అన్నట్లు చేస్తారు. చదువుకోడానికి పిల్లలకి ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్ లు తెప్పించడం, అర్హత అగ్రకులాల బీద పిల్లలకు తనకు వీలైన డబ్బులు ఇచ్చి, నలుగురి చేత ఇప్పించి వారి చదువు పూర్తి అయ్యేలా చూస్తారు. చదువు పూర్తి అయిన వాళ్ళకి ఉద్యోగాలకి దరఖాస్తులు ఎలా పెట్టాలో, ఇంటర్య్వూలకి ఎలా తయరవ్వాలో కూడా చెబుతారు. అవసరం అయితే అర్హతలున్న వారికి తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఉద్యోగాలు వేయిస్తారు. ఊర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచే వెళ్ళేవారు. అందువల్ల ఆయనతో చాలామందికి పరిచయం ఉంది.

ఆయన ఇంటి వీధి చివరన ఉన్న ఐదురోడ్ల జంక్షన్లో క్రిష్ణ ఉంటాడు. అతడికి ఒక కిల్లీకొట్టు ఉంది. సాయంత్రం సాధారణంగా అక్కడ నిలబడి కబుర్లు చెప్పుకుంటారు చాలామంది. ఒకరోజు జగన్నాధంగారు అక్కడ నిలబడి కబుర్లాడుతూ సోడా తాగుతున్నారు, ఈయన్ని చూసి ఆ జంక్షన్ లోంచి వెళుతున్న ఆ ఊరి ఎమ్.ఎల్.ఏ కారు, దానివెనక వస్తున్న మరో రెండు కార్లు హఠాత్తుగా జంక్షన్లో ఆగాయి. కారులోంచి ఎమ్.ఎల్.ఏ ఆయన అనుచరులు దిగారు.

“ఒరేయ్ జగన్నాధం మేష్ట్రు.....” అని ఎమ్.ఎల్.ఏ అరిచాడో, పిలిచాడో తెలియని గొంతుతో గట్టిగా అన్నాడు. ట్రాఫిక్ ఆగిపోయింది. మనుషులు కదలకుండా నిలబడిపోయారు. జగన్నాధం గారికి అటు ఇటు ఉన్న వ్యక్తులు ఆయనకు దూరంగా జరిగారు. జగన్నాధంగారు ఎక్కడ ఉన్నారో అక్కడ కదలకుండా నిలబడ్డారు. ఎమ్.ఎల్.ఏ అతని వైపే పెద్ద పెద్ద అంగలతో నడిచి వెళ్ళాడు. గుంపు ఉత్కంఠతో ఏం జరుగుతుందా అని చూస్తున్నారు.

“ ముసిలోళ్ళ ఫించన్లని, ఇళ్ళ స్థలాలని నా అపోజిషన్ లో ఉన్న మాల, మాదిగల చేత అప్లికేషన్లు పెట్టిస్తావుట్రా? నన్నెదిరించాలను కొంటున్నారా? ఆనా కొడుకులు వంగి దండం పెట్టేదాకా ఆళ్ళకి ప్రభుత్వం నుండి చీపురు పుల్లకూడా అందదు. కలక్టర్ కే అర్జీలు పెట్టిస్తావురా. నువ్వు పెట్టించిన ధరఖాస్తులన్నీ ఆ కలక్టర్ గాడి చేత్తోనే చింపించాను. ఏం చేసుకొంటావో చేసుకో. జాగ్రత్త?” అని అందరి వైపు తిరిగి “నాతో పెట్టుకోవద్దు” ఓ వార్నింగ్ ఇచ్చాడు.

“ఎమ్.ఎల్.ఎ గారూ! మీ నియోజక వర్గంలో ఉన్న చాలా గ్రామాలలో పని చేసాను. ఆ గ్రామాలలో ఉన్న వాళ్ళు ఏ కులం వాళ్ళయిన నాకు కావలసిన మనుషులే వారిని కులాలతో చూడలేదు. గవర్నమెంటు పధకాలకి అర్హులైన వారితో అర్జీలు పెట్టిస్తున్నాను. వాళ్ళకి రావలసిన ఫించన్లు, లోనులు, ఇళ్ళస్థలాలు....” జగన్నాధం మాటలని లెఖ్ఖ పెట్టకుండా

“నామనుషులైతేనే అవి వస్తాయి. నాకు ఓటేస్తేనే వస్తాయి. తెలుసుకో నా నియోజక వర్గంలో ఉన్న వాళ్ళంతా నా ప్రజలు. ఎవరికి ఏంచెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను, నామనుషులు చూసుకొంటాం. నువ్వు నోరు మూసుకొని ఉండు” అన్నాడు ఎమ్.ఎల్.ఏ ఆవేశంతో ఊగిపోతూ.

“నేను దరఖాస్తు పెట్టించిన వాళ్ళంతా ఏడాదిగా ఎదురు చూస్తున్న వాళ్ళే. వాళ్ళకి .......... ఏదో చెప్పబోతుండగానే” మళ్ళీ అతని మాటలకి అడ్డు వస్తూ “నువ్వు ఏ మాల మాదిగ నా కొడుకులకి సాయం చెయ్యాలనుకుంటున్నావో వాళ్ళ చేతనే నీమీద ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం క్రింద కేసు పెట్టిస్తాను జాగ్రత్త” అని మరింత ఆవేశంతో గట్టిగా అరిచాడు. అందరూ చూస్తూ నిలబడ్డారు. ఒక్కరు కాలు కదపలేదు. నోరు మెదపలేదు. వాతావరణం అంతా స్థంభించి పోయినట్లుంది. ఎమ్.ఎల్.ఏ ఆవేశంగా ఊగిపోతున్నాడు.

“ప్రజల్నీ, చట్టాల్నీ పావుల్లా వాడుకోవడం కాదు. ప్రజలకు సేవ చేయాలి. అదీ రాజకీయ నాయకుని ధర్మం!” అని జగన్నాధం మాష్టారు నిర్బయంగా, గట్టిగా, రాజకీయాల్లో ఉన్న అందర్ని ఉద్దేశించి అన్నారు.

“ఇళ్ళిప్పిస్తానని మామూలు ప్రజల దగ్గర డబ్బులు కాజేసేవాళ్ళు కబడ్దార్. వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం సహించను” అన్నారు మేష్టారు.

“ఏమన్నావురా నాకొడకా.......” అంటూ ఆవేశంతో ఊగిపోయాడు ఎమ్.ఎల్.ఎ జగన్నాధం. మాష్టారివైపు వస్తున్న అతని వెనక అతని అనుచరులూ కదిలారు. పెద్ద కలకలం రేగింది. ఇంతలో ఆవేశం ఎక్కువై కాబోలు భారీ కాయం ఉన్న ఎమ్.ఎల్.ఎ ఒక్కసారి తూలిపోయాడు. అతని అనుచరులు వచ్చి పట్టుకున్నారు. చెమటతో ఒళ్ళు తడిసిపోయింది. ఢీలాపడి వెనక్కి వాలిపోయాడు. కిల్లీకొట్టు క్రిష్ణ వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని పరుగున వచ్చి ఎమ్ఎల్ఏ మొహం మీద నీళ్ళు చిలకరించాడు. ఆ జనంలోంచి జగన్నాధాన్ని బయటకు తీసుకు వెళ్ళిపోయారు. కిల్లీకొట్టు క్రిష్ణ ఒక గోలీ సోడా కొట్టి ఎమ్.ఎల్.ఏ గారి చేత మెల్లిగా తాగించాడు. కోలుకున్న ఎమ్.ఎల్.ఎ ని ఆయిన మనుషులు కారెక్కించి తీసుకెళ్ళిపోయారు.

ఇదంతా చూస్తున్న జనం బొమ్మల్లా నిలబడిపోయారు. అప్పటికే అక్కడికి చేరిన కాలేజి కుర్రాళ్ళు స్కూలుపిల్లలు, పెద్దలు ఎమ్.ఎల్.ఎని నడిరోడ్డుమీద ‘ఖబడ్దార్’ అనగలిగిన మొగాణ్ణి చూసినందుకు చాలా గర్వించారు, ఆనందించారు. ఆక్షణం ఆవార్త దావానలంలా వ్యాపించింది. ఊర్లో అందరూ ఆయిన్ని ‘ఖబడ్దార్ మాష్టారు’ అని పిలుస్తుంటారు.

పబ్లిక్ గా మేష్టారితో గొడవపెట్టుకున్నందుకు ఎమ్.ఎల్.ఎ ని వాళ్ళ నాన్న తిట్టాడు. మేష్టారి లాంటి వాళ్ళను ఎలా డీల్ చేయాలో చెప్పాడు తన వ్యాపారవేత్త అయిన తన అన్న. అందరి దృష్టి ఆనాటి సంఘటన మీద ఉండిపోయింది. అపోజిషన్ వాళ్లు దీన్ని పెద్దది చేయాలని చూశారు. మేష్టారు అందుకు అంగీకరించలేదు. మేష్టార్ని అలా తిట్టడం మంచిది కాదని, అందువల్ల ఆమేష్టర్ని మరేం అనడం కాని, చెయ్యడం కాని మంచిది కాదని అనుకున్నాడు.

* * *

కొంతకాలం తరువాత ప్రజలు ఈ విషయం మరిచిపోయారు.

కిల్లీకొట్టు క్రిష్ణకి కొంత పలుకుబడి ఉంది. పైగా సమయానికి సోడా అందించాడన్న కృతజ్ఞతతో ఎమ్.ఎల్.ఏ, మనుషులు క్రిష్ణని చేరదీసారు.

కిల్లీ కొట్టు క్రిష్ణకి ఈ సంఘటనతో ఎమ్.ఎల్.ఎతో పరిచయం అయింది.

లోలోన కిల్లీకొట్టును మించి ఇంకా ఎదగాలన్న ఆశ ఉంది. ఏదో చేయాలన్న తపన క్రిష్ణని ఊర్కోనివ్వడం లేదు. రాజకీయాల్లోకి ఎలా చేరాలో సరిగ్గా తెలియలేదు. సరిగ్గా అటువంటి సమయంలో ఇటువంటి అవకాశం రావడం ఊహించలేకపోయాడు. రాత్రి పగలు రాయకీయాల గురించి ఆలోచించడం, పేపరులో రాజకీయాలు చదవడం, ఎమ్.ఎల్.ఎ తోనో అతని అనుచరులతోనో ప్రజా సమస్యలను చర్చించడం మొదలుపెట్టాడు. దాంతో వచ్చిన కొత్త పలుకుబడి వల్ల కిల్లీకొట్టు వ్యాపారం కూడా పెరిగింది.

మూడేళ్ళలో ఎమ్.ఎల్.ఎకి కొంత దగ్గరయ్యాడు. పార్టీలో చేరాలని చాలామంది మిత్రులు ప్రోత్సహించారు. ఇంతలోనే ముందస్తుగా ఎలక్షన్లు వస్తున్నాయి అన్న వార్త అతనికి కొంత ఆనందం కలిగించింది. ఎలక్షన్ల ముందు ఎంతో మందిని పార్టిలో చేర్చే కార్యక్రమం ఉంటుంది. దాన్ని లాఛనంగా కిల్లీకొట్టు క్రిష్ణతో మొదలుపెట్టాలని ఎమ్.ఎల్.ఏ నిర్ణయించుకున్నాడు. ఓ వంద మందిని పార్టీలో చేర్పించమని కబురు పెట్టాడు. వచ్చేనెల పెద్ద ఫంక్షన్ పెట్టి మంత్రుల్ని రప్పించి క్రిష్ణని, క్రిష్ణ చేర్పించబోయే వారిచేత ప్రమాణం చేయించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ చేరబోయే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక వందమందిని వచ్చే నెలరోజుల్లో చేర్పించేందుకు తగిన పథకం వేశారు. ఆ విధంగా పార్టీలోకి రాబోతున్న వెయ్యిమందికి తాను లీడర్ అవుతానన్నది క్రిష్ణకి అనిపించింది. ఎమ్.ఎల్.ఏ కొడుకు చిన్నవాడు. తమ్ముడు వేరే పార్టీలో ఉన్నాడు. అన్న వ్యాపారంలో ఉన్నారు. ఇంక సరియైన వారసుడు క్రిష్ణే అని అతని మిత్రులు నూరిపోశారు. ఇలాకాకుండా క్రిష్ణకి తాను ఇంకా ఏవో మంచి పనులు చేయాలని అనిపిస్తూ ఉండేది.

రాబోతున్న ఎన్నికల హడావిడితో ఎమ్.ఎల్.ఎ భవంతి కోలాహలంగా ఉంది. ఆ వీధి చివరలో ఉన్న క్రిష్ణ కిల్లీకొట్టు మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. క్రిష్ణ చదువుకునే తన తమ్ముడిని కిల్లీకొట్లో కూర్చోబెట్టాడు. ఇవాళో రేపో ఎమ్.ఎల్.ఎ.కి మళ్ళీ టికెట్టు రాగానే ఊరూరా ప్రచారం మొదలవ్వాలి. సరిగ్గా అటువంటి సమయంలో హైదరాబాదు నుండి పిడుగు లాంటి వార్త వచ్చింది. ఎమ్.ఎల్.ఎ.కి ఈఎలక్షన్ లో ఈ నియోజకవర్గం నుండి టిక్కెట్టు ఇవ్వడంలేదని. అది విన్న ఎమ్.ఎ.ల్ఎ. ఆవేశపడి పార్టీలో ఉన్న పెద్దలు అందరికి ఫోన్ చేశాడు. తన కోపాన్ని ప్రదర్శించారడు. టిక్కెట్టు ఎవడికి ఇచ్చారో తెలిస్తే వాడి అంతు చూస్తానన్నాడు. హైబీపీ ఉన్నా సరే ఎమ్.ఎల్.ఎ. విశ్రాంతి తీసుకోలేదు, డాక్టర్ల మాట పెడచెవిన పట్టి, రెండురోజుల పాటు రాత్రి పగలు టిక్కెట్టు కోసం చేయరాని ప్రయత్నాలు చేసాడు. ఆ టిక్కెట్టు ఇచ్చింది తన్ని రాజకీయాలోకి పంపి, వెనకదన్నుగా ఉన్న వ్యాపరవేత్త ఆ తన అన్నకే అని తెలిసి తట్టుకోలేకపోయాడు. తన అండతోనే దొంగ వ్యాపారం చేస్తూ బాగా డబ్బులు సంపాదించిన తన అన్నే తనకి తెలీకుండానే మాయోపాయాలతో టిక్కెట్టు కొట్టేశాడు. ఈసారి పార్టీకోసం విశ్వాసంగా పని చేస్తే వచ్చే ఎన్నికలకి సీటు ఇస్తామని వాగ్దానం చేసింది పార్టీ. ఇంత మోసం తట్టుకోలేకపోయాడు. ఏమాత్రం ఊహించలేకపోయాడు. ఐనా చివరి ప్రయత్నంగా హైదరాబాదు పోయాడు. అక్కడే చివరి ఆశ విడిచాడు.

ఎమ్.ఎల్.ఎ మరణవార్త విన్న క్రిష్ణకి కాళ్ళు చేతులు ఆడలేదు. రాజకీయమంటే ఇంత క్రూరంగా ఉంటుందా అని విస్తుపోయాడు. తన భవిష్యత్ ఏమిటో అన్న ఆలోచనల నల్లమేఘం కమ్మింది. తను, తను తీసుకొచ్చిన వందమంది, వాళ్ళు తీసుకొని రాబోయే వెయ్యిమంది క్రిష్ణ శ్రేయోభిలాషులు అతనికి ధైర్యం చెప్పారు. లేచి చెయ్యవలసిన పనులు చెయ్యమన్నారు ఎమ్.ఎల్.ఎ అభ్యర్థికి కోపం వస్తుందేమో అని. ఎమ్.ఎల్.ఎ అంత్యక్రియల్లో చాలామంది ముఖం చాటేశారు. అందుకే క్రిష్ణని ముఖ్యమైన పాత్ర తీసుకోమన్నారు స్నేహితులు. పోయిన ఎమ్.ఎల్.ఎ కి క్రిష్ణ వారసుడన్నారు. ఎమ్.ఎల్.ఎ అంత్యక్రియలని కుటుంబంలోని ఒక వ్యక్తిలా ఏర్పాటు చెయ్యడం మొదలు పెట్టాడు. కేవలం మానవతా ధృక్పధంతోనే వేలలో జనం వస్తారని దానికి తగిన ఏర్పాట్లు చెయ్యసాగాడు. తన కిల్లీకొట్టుకి వచ్చే జనానికి సరిపోయే నీళ్ళపేకట్లు, సోడాలు ఉచితంగా ఇవ్వవలసి వస్తుందని ముందుగా డబ్బుపెట్టి సరుకు తెచ్చి ఉంచాడు. అంత్యక్రియలరోజు ఉదయం పాడె సిద్ధం చేసారు. ప్రజలు వచ్చిన తరువాత ఒక ఊరేగింపుగా స్మశానానికి తీసుకెళ్ళాలని నిశ్చయించారు.

ఉదయం తొమ్మిది గంటలైంది. ఎమ్.ఎల్.ఎ ఇంటి ముందు పదీపదిహేను మందికంటే ఎక్కువ మనుషులు లేరు. పదిగంటలైనా యాబైమంది మించలేదు. పన్నెండు అయ్యింది. ఆ ఉన్నవాళ్ళలో కొంతమంది ఇప్పుడే వస్తామని వెళ్ళారు. క్రిష్ణ ప్రయత్నంతో అతి కష్టం మీద సాయంకాలం నాలుగు గంటలకి ఓ వందమంది పోగయ్యారు. ఇక (క్రిష్ణే మరణించిన ఎమ్.ఎల్.ఎ రాజకీయ వారసుడు, శిష్యుడు అని చావూలోనూ పొగిడారు. ఎమ్.ఎల్.ఎ శవయాత్ర అతి సాధారణంగా ముగిసింది. ప్రస్తుత అభ్యర్థి రాజధానికి పని ఉందని చెప్పి వెళ్ళాడు. ఇటు మనుషులు రాక, తెప్పించిన సామాను చెల్లుబడి కాక క్రిష్ణ పరిస్థతి అయోమయంగా మారింది. ఆరాత్రి ఎలాగో అతికష్టం మీద నిద్రపోయాడు. ఇన్ని రోజులు పడ్డ అలసట వల్ల కాబోలు.

* * *

ఏడింటికే ఎండాకాలం సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. “క్రిష్ణా లే! లే! కొట్టు తియ్యాలి. అంటూ తట్టి లేపుతున్న తల్లి మాటలకి క్రిష్ణ కళ్ళు తెరిచాడు.

“టైం ఎంతైందేంటి?” అన్నాడు మత్తుగా

“ఏడు గంటలు అయింది. కాని.....”

“ఏడేనా? ….. మరో గంట పడుకోనీ. ఇవాళ లేటుగా తీస్తా కొట్టు” అని దుప్పటి ముసుగు పెట్టుకొన్నాడు.

“లే..... లే.....” అని తల్లి ముసుగు లాగేస్తూ కొట్టు కాడ మనుషులు నీళ్ళ పేకట్ల కోసం చూస్తున్నారు లే!

“ఇంత ఉదయాన్న...........”

“అవును. ఏమో మరి కొట్టు తలుపు కొడుతున్నారు అరగంటనుండి.” క్రిష్ణ లేచి, మొహం కడుక్కొని “అమ్మ! టీ ఇవ్వవే” అని చెప్పి ఇంటిముందు భాగంలో ఉన్న కొట్టు వైపు వెళ్ళాడు. అక్కడ అప్పటికే 20-30 మంది మనుషులు నిలబడి ఉన్నారు. వాళ్ళెవరూ రోజూ వచ్చే వాళ్ళు కారు. అయినా ఇంత ఉదయం ఎందుకు వచ్చారో అని అనుకొన్నాడు. అదే వాళ్ళని అడిగాడు.

“మా మేష్టారు గారు సనిపోనారండీ.......” అన్నాడు ఒక పల్లెటూరి నాయుడు. తన ఇంట్లోని మనిషి చనిపోయినంత దీనమైన గొంతుతో.
“ఏ మేష్టారు...” క్రిష్ణ తాళం తీస్తూ అడిగాడు.

“అదే మన ఖబడ్దార్ మాష్టారు” అన్నాడు అపుడే అక్కడకు చేరిన క్రిష్ణ కొట్లో పనిచేసే కుర్రాడు.

తాళం తీసి తలుపులా అమర్చిన ఒక్కొక్క చెక్క తీసి పక్కన పెడుతున్న క్రిష్ణ ఎపుడో తన కొట్టు ముందు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. చెయ్యి జారి చేతిలో చెక్క కాలుమీద పడింది. కాలు జివ్వుమని లాగింది.

అయిదు రోడ్ల జంక్షన్లో ఒకరోడ్డు చివర ఖబడ్దార్ మాష్టారు ఇల్లుంది. అటువైపు తిరిగి చూసాడు. ఆ వీధిలో చాలామంది మనుషులు గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు.

కొట్టు, బేరాలు కొట్లో పనిచేసే కుర్రాడికి అప్పచెప్పి క్రిష్ణ ఖబడ్దార్ మాష్టారింటివైపు దారి తీశాడు. రోడ్డు నిండా జనం. ఒకరితో ఒకరు ఏవేవో చెప్పుకొంటున్నారు.

“మా కుర్రాడు అయిదరాబాదులో ఈ రోజు ఉద్యోగంలో ఉన్నాడంటే ఈ మేష్టారి దయే బాబు” అని ఓ పల్లెటూరి ఆసామి.

“నా పెనిమిటి పోతే నా మడిసెక్క నాకు మిగిలేలా చేసిందీ బాబే” అని ఓ రైతు భార్య.

“నాకీ వయసులో ఒక పూటైనా ముద్ద ఉందంటే ఈ బాబు సలవే” రోడ్డు మధ్యలో కూర్చొన్న ఓవృద్దుడు.

“మా ఊరు బాగుపడిందంటే ఈయన మా స్కూలు హెడ్ మాష్టార్ గా ఉన్నందువల్లే” ఓ గ్రామపెద్ద.

“పదిమంది పదిరకాలుగా మంచిమాటలు చెప్పుకుంటున్నారు.”

క్రిష్ణ రోడ్డుమీద ఉన్న మనుషులను తప్పించుకొంటూ వారి మధ్యనుండి వెళుతుంటే ఇటువంటి మాటలు చాలానే వినిపించాయి. ఎంతోమంది కళ్ళు తుడుచుకుంటుంటే చూసాడు. యాంత్రికంగా ఖబడ్దార్ మాష్టారింటివైపు వెళ్ళాడు. ఆయన శవాన్ని ఇంటిముందు పాడెమీద ఏర్పాటు చేశారు. రోడ్డుకు అటువైపు మరింతమంది జనం ఉన్నారు. చిన్న, పెద్ద, ఆడ, మొగ, ముసలి వారితో సహ అన్ని వయసుల వాళ్ళు చక్కని బట్టలు కట్టుకున్న వాళ్ళు, ఒంటిమీద సరియైన బట్టలు లేని వాళ్ళు, చుట్టుపక్కల పల్లెలనుండి ఆదరాబాదరగా వచ్చినవాళ్ళు, ఆయన్ని ఒక్కసారి చూడాలని ఆత్రంగా ఉన్నవాళ్ళు, నలభైఏళ్ళ ఉపాధ్యాయవృత్తిలో ఆయన తిరిగిన ఎన్నో ఊళ్ళలోని ప్రజలు, ఆయన సహాయం అందుకొన్న సామాన్యులు, ఏళ్ళ తరబడి ఆయిన మంచితనాన్ని గుర్తుంచుకొని ఇవాళ కడసారి చూపుకోసం వచ్చిన వాళ్ళతో ఆ అయిదు రోడ్ల జంక్షన్ నిండిపోయింది. అక్కడొక శోక ప్రవాహం కనిపించింది క్రిష్ణకి.

దూరం నుండి వచ్చిన వాళ్ళు దాహానికి క్రిష్ణ కిల్లీకొట్టులో నీళ్ళపేకట్లు కొంటున్నారు.

క్రిష్ణ తిరిగి వచ్చేటప్పటికి కొట్లో పనిచేసే కుర్రాడు ఓ వంద పేకట్లు అమ్మానని చెప్పాడు. క్రిష్ణ మాట్లాడకుండానే చేత్తో పేకట్లు అమ్మొద్దని చెప్పాడు.

“అదేంటన్నా బేరం జోరుగా సాగుతున్నది. నిన్న తెప్పించినవి ఏవీ అమ్మలేకపోయాం. ఇవాళ అన్నీ ఒక్క గంటలో అమ్మేయ్యచ్చు..............”అంటున్నాడు.

“అమ్మొద్దు... అడిగిన వాళ్ళందరికి ఫ్రీగా తలా ఒక నీళ్ళ పేకెట్టు ఇయ్యి” అని చెప్పి ప్రక్కన ఉన్న స్కూటర్ తీసి మరిన్ని పేకట్లు ఆర్డరు పెట్టి వస్తాను అన్నాడు స్కూటర్ స్టార్టు చేస్తూ.

మధ్యాహ్నానికి క్రిష్ణ కొట్లోనే ఓ వెయ్యి నీళ్ళ పేకట్లు ఉచితంగా అందించారు. మనుషులు ప్రవాహంలా వస్తున్నారు, పోతున్నారు. సాయింత్రం 5 గంటలయ్యేసరికి ఓ వెయ్యిమంది పైబడ్డ జనంతో ఖబడ్దార్ మాష్టారి అంతిమయాత్ర ఘనంగా జరిగింది. ఆ వందలాది మంది సహాయం అందించడానికి ముందుకి వచ్చారు.

* * *

మర్నాటి ఉదయం అన్ని పేపర్లలో ‘ప్రజల మాష్టారు అస్తమయం, లోటు పూడ్చలేని ఉపాధ్యాయుని మృతి అని పెద్ద పెద్ద అక్షరాలతో ఖబడ్దార్ మేష్టారి జీవిత వివరాలు అనేకం వెలువడ్డాయి. ఆయన బతికున్నప్పుడు చేసిన గుప్తదానం విశేషాలు, ప్రజల అభిప్రాయాలతో వివరంగా ఓ పేజి వ్యాసం జిల్లా సెంటర్ స్ప్రెడ్ లో వచ్చింది. ఈ పల్లెల్లో పేదప్రజలని ఆదుకునే దయామయుడిని కోల్పోయిందనే వార్త మెయిన్ పేపర్లో రాశారు. ఈ చుట్టు ప్రక్కల పల్లె ప్రజలని విద్యవైపు ప్రోత్సహించాడని, ఆర్ధిక సహాయం చేస్తూ ఇతరులతో చేయిస్తూ వందలాది విద్యార్థుల్ని ప్రోత్సహించాడనీ, ఎన్నో కుటుంబాలని నిలబెట్టే ఆ వ్యక్తి మరికి లేడు అని పత్రికలన్నీ పొగిడాయి. అదే పేజీలో ఆ ఊరి ఎమ్.ఎల్.ఎ పోయాడనే వార్త నిన్న చాలా చిన్నగా వెలువడింది.

క్రిష్ణ ఆరెండింటిని చదివాడు. చదివిన తరువాచ ఏదో ఆలోచనలో పడిపోయాడు. పది గంటలయ్యింది. ఐదురోడ్ల జంక్షన్ ట్రాఫిక్, మనుషులతో హడావిడిగా మారిపోయింది. ప్రస్తుతం టికెట్టు వచ్చి ఎమ్.ఎల్.ఎగా పోటీ చేస్తున్న ఆయిన అక్కడకు వచ్చారు. కృష్ణ లేచి నిలబడి కిల్లీకొట్టులోంచి బయటకు వచ్చాడు.

“క్రిష్ణా! ఎల్లుండి సాయంత్రం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంది నువ్వు, మీ వాళ్ళు సమయానికి వచ్చేయండి. మినిష్టర్ గారు కూడా వస్తారు.......” అంటున్న ఆయన్ని చూసి -

“అయ్యా! నమస్తే. నేను పార్టీలో చేరడం లేదండి. నన్ను వదిలి పెట్టండి. మిగిలిన వాళ్ళు వస్తే వాళ్ళని చేర్చుకోండి.” అన్నాడు మెల్లగా వినయంతో.

“అదేంటి క్రిష్ణా! నువ్వు మా తమ్ముడి కుడి భుజానివి. నీకు పార్టీలో మంచి భవిష్యత్ ఉంది. ఎందుకలా ఉన్నావు. పార్టీలో చేరడానికి ఏంకావాలో చెప్పు” బుజ్జిగించబోయాడు క్రిష్ణని. వచ్చి కారులో తన పక్కన కూర్చోమని సైగ చేశాడు ఎం.ఎల్.ఏ
“నేను ప్రజలకు సేవ చేద్దాం అనుకొంటున్నానండి.......” అన్నాడు మెల్లిగా.

“మరి పార్టిలో చేరకుండా ప్రజలకి సేవ ఎలా చేస్తావ్?” నవ్వుతూ కొంటెగా అన్నాడు.

ఒక్క క్షణం నిశ్శబ్దం. ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు క్రిష్ణ. కాసేపాగి చెప్పక తప్పదు కదా అనుకొని “ఖబడ్దార్ మాష్టారి శిష్యుడిగా!” అన్నాడు క్రిష్ణ ధృడంగా.

అప్పటికే గుమికూడిన క్రిష్ణ అనుయాయులు అది విని ఉత్సాహంతో చప్పట్లు కొట్టసాగారు.

ఒక మాష్టారు తన ఆచరణతో రాజకీయ నాయకులకి చెక్ పెట్టగలడు. మంచి మేష్టారెప్పుడూ ప్రజలవైపుంటాడు. విద్యాసంస్థలో పాఠాలు చెప్పడమే కాదు, తన చదువుని ప్రజలకు వినియోగించడమే విజ్ఞత. అంతటి మంచి మేష్టారు జీవితం క్రిష్ణని బాగా ఆలోచింప చేసింది. నిరక్ష్యరాస్యుడైన క్రిష్ణ మాష్టారి మరణం తరువాత ఆయనకి మొదటి శిష్యుడయ్యాడు. ఒకసారి మాష్టారి రూపాన్ని గుర్తు తెచ్చుకున్నాడు.

క్రిష్ణలో ఒక్కసారి చైతన్యం నిండింది.

* * *

శ్రీ అనపర్తి సుబ్బారావు మాస్టారిని తలుచుకుంటూ)





0 వ్యాఖ్యలు

ప్రేమ లేఖ నేర్పిన పాఠం

రసాయన శాస్త్రం తరగతి జోరుగా సాగుతోంది. రసాయన చర్యల కారకాలు, కారణాలను విశ్లేషించి చెబుతున్నాడు అధ్యాపకుడు.

ఇంతలో ప్యూన్ వచ్చి ఒక లేఖ అందించాడు. సర్కులర్స్ చదివి వినిపించడం ఆనవాయితి కాబట్టి ఉత్తరం విప్పి గబగబా చదివాడు.

“సోంబాబు పేరున్న ఇంటర్ సెకెండియర్ విద్యార్థి ఈకాలేజిలో చదువుతున్న ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడు. దాన్ని ఆమెకు తరగతి గదిలో అందిస్తూ పట్టుబడ్డాడు. ఇటువంటి తప్పు చేసిన సోంబాబుకి 50 రూపాయలు జరిమానా విధించడమైనది. ఇలాంటి తప్పు మరోసారి చేస్తే తీవ్ర చర్య తీసుకోబడుతుంది” రసాయన శాస్త్రం పాఠంలోని సమీకరణాలని వివరిస్తున్న లెక్చరర్ పాఠాన్ని మధ్యలో ఆపి చదివాడు.

ఈ సర్క్యులర్ లోని విషయం క్లాసులో ఉన్న వంద పైగా విద్యార్థినీ విద్యార్థులు ఒక్కసారి ఎటెన్షన్లోకి వచ్చేలా చేసింది. అందరి చూపులు మధ్యవరసలో మూడో బెంచిలో ముగ్గురి మధ్యన ఉన్న సోంబాబు మీద పడ్డాయి. సోంబాబు లేచి నిలబడ్డాడు. ఎటెండెన్స్ తీసుకుంటున్నపుడు లెక్చరర్లు పిలిచే సెవెంటీసిక్సుకి ఎస్సార్ అనే గొంతు ఈ సోంబాబుదేనని క్లాసులో చాలామందికి ఇపుడే తెలిసింది. “సోంబాబు...” అంటున్న లెక్చరర్ మాట పూర్తి అవ్వకముందే సోంబాబు భళ్ళుమని పగిలిన మట్టికుండలోని నీళ్ళు చేసే శబ్దంలా ఏడుపు మొదలుపెట్టాడు. “ఆపు ఆపు...” అని లెక్చరర్ అంటున్నా స్టాపులో ఆగని ఆర్టీసీ బస్సులా వింత వింత శబ్దంతో సోంబాబు ఏడుపు సాగుతూనే ఉంది.

మా కాలేజీలో విద్యార్థులు ఎవరు ఏతప్పు చేసినా మా ప్రిన్సిపాల్ విచారణ చేసి, జరిమానా విధించి ఆ విషయాన్ని ఓ సర్క్యులర్ గా వ్రాసి, క్లాసు క్లాసుకి పంపి, బహిరంగంగా చదివించి, తప్పు చేసిన విద్యార్థికి సిగ్గు వచ్చేలా చేస్తారు. తప్పు చేసినవారు మరోసారి తప్పు చేయకుండా ఇతరులు అలాంటి తప్పు ఇకముందు చేయకూడదని దాని ఉద్దేశ్యం. వారంలో ఒకటో రెండో ఇలాంటి సర్కులర్ లు రావడం మామూలే. సాధారణంగా క్లాసులో అల్లరిచేసారనో, లెక్చరర్లని ఏడిపించారనో, కాలేజి రూల్సు పాటించలేదనో, కాయలు, పళ్ళు కోసారనో అభియోగాలు ఉండేవి. అవి సామాన్యమైనవే కాని పెద్ద తప్పులు కాదు. ప్రేమలేఖలలాంటి సమస్యలు ఎపుడో కాని బయటకు రాలేదు. పైగా ఆ తప్పు చేసినవాడు మాక్లాసులో వాడు. మనం ఉండే వీధిలోనే రాత్రి దొంగతనం జరిగిందన్న వార్త తెల్లారి న్యూస్ పేపర్లో చదివినలాంటి ఆశ్చర్యం. విద్యార్థుల్లో ఈ సోంబాబు ప్రేమలేఖ వార్త కల్లోలం లేపింది.

ఇన్నాళ్ళు కలిసి చదువుకొంటున్నా సోంబాబు అన్నవాడు ఆక్లాసులో ఉన్నట్లు చాలామందికి తెలీదు. లెక్చరర్లు అతనిని పెద్దగా పట్టించుకోలేదు. అతనికి స్నేహితులు కూడా తక్కువే. ఎవరితోనైనా కలిసి కబుర్లు చెప్పగా ఎవ్వరూ చూడలేదు. టైముకి క్లాసుకు వస్తాడు. బెల్లు కొట్టగానే బయటకు వెళతాడు. ఎప్పుడూ ఒకే తీరుగా నడుస్తాడు. ఒకే దారిలో వెళతాడు. పైగా తలవొంచుకునే వెళతాడు. ఎవరైనా తగులుతారేమోనని కుంచించుకు మరీ నడుస్తాడు. అబ్బాయిలతోనే స్నేహం లేనివాడు అసలు అమ్మాయిలవైపు కన్నెత్తి చూస్తాడా అన్నది సందేహమే! పీలగా, సన్నగా, నల్లగా, పొట్టిగా ఉండే సోంబాబుని యవ్వనంలోకి అడుగుపెడుతున్న కాలేజి స్టూడెంట్ గా, ఓ యువకుడిగా ఎవ్వరూ గుర్తించలేదు. పొరపాటున కూడా “సోంబాబు ప్రేమలేఖ రాయడమేమిటి?” అందరిలో వచ్చిన అనుమానం. “వీడికి కూడా ప్రేమా.....దోమా? అని విస్తుపోయారు అమ్మాయిలు. అబ్బాయిలు కూడా అలాగే అనుకున్నారు. ఏది ఏమైనా ప్రేమలేఖ రాశాడు. దాన్ని అందించాడు, ఆపై దొరికాడు, ప్రిన్సిఫాల్ ఫైన్ వేసారు కాబట్టి నిజంగానే రాసాడన్నమాట. అందరూ అలాగే అనుకొన్నారు. నేనూ అలానే అనుకొన్నాను. ముక్కుమీద వేలేసుకున్నాను కూడా. కాని వీడికింత ధైర్యం ఎలా వచ్చిందో మాకెవ్వరికి అర్థం కాలేదు. ప్రేమలేఖ రాద్దామా వద్దా అన్న ఊగిసలాటలో ఉన్న కలాలకి ఒక్కసారి భయం వేసింది.

నిశ్శబ్దంగా ఉన్నా క్లాసుని తనవైపు ఎలా తిప్పుకోవాలో తెలియని లెక్చరర్ అవస్థపడుతున్నాడు. “సైలెన్స్......” అని డష్టర్ తో టేబుల్ మీద పదేపదే కొట్టారు. పిల్లకాలువలా పారుతున్న సోంబాబు ఏడుపు ఆపి “నా దగ్గర ఏభైరూపాయలు లేవు సార్....” అంటూ వెక్కిళ్ళు తీశాడు.

ఇంక ఇవాళిటికి పాఠం చెప్పడం జరగదని నిశ్చయించుకున్న లెక్చరర్ “అతని సంగతేంటో నువ్వు చూడవోయి....” అని పరిస్థితి కంట్రోల్ లో లేదని తెలిసిన తరువాత కిందవాళ్ళని కంట్రోల్ చెయ్యమని చెప్పి వెళ్ళిపోయిన పెద్ద పోలీసాఫీసర్లా ఠీవిగా, కొత్త బూట్లు టకటక లాడించుకొంటూ వెళ్ళిపోయాడు.

క్లాసు లీడర్ అయిన పాపానికి సోంబాబు ఏడుపు ఆపే పని నాపై పడింది.

కాసేపాగి “సోంబాబూ! ఏడుపాపి ఇంతకీ ఏం జరిగిందో చెప్పు” అన్నాను.

“నాదగ్గర డబ్బులేవు. మా అయ్య దగ్గరా లేవు.... ఏభై రూపాయలంటే మాటలా..... ” వణికిపోతున్నాడు మళ్ళీ ఏడుపు. ఆపాటికే మరికొంత మంది అబ్బాయిలు గుమికూడారు. అందరిలో కుతూహలం కనుపిస్తున్నది. వీడు అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు అన్నది అందరినీ ఇంకా ఆశ్చర్యపరుస్తూనే ఉంది.

నిజంగా జరిగిందేమిటో తెలుసుకోవాలని అనిపించింది.

“నువ్వే ఉత్తరం ఆ అమ్మాయికి ఇచ్చావా?” అడిగాడొకడు

“ఇచ్చాను” అన్నాడు సోంబాబు.

“ అమ్మ సోంబాబూ......” అన్నారు విన్నవాళ్ళంతా.

“నిజంగా ఇచ్చాడు. నిజంగా ఇచ్చాడు..... అని క్లాసంతా ఒకరికొకళ్ళు చెప్పుకుని ఆశ్చర్యపోతున్నారు. కాని నాకు ఎందుకో నమ్మకం కలగడంలేదు. వాళ్ళ మధ్యలోంచి ఏడుస్తున్న సోంబాబు చెయ్యిపట్టుకుని బయటకు తీసుకెళ్ళాను. ఓ చెట్టు క్రింద కూర్చోబెట్టి అతన్ని సముదాయించే ప్రయత్నం చేశాను.

“నిజంగా నువ్వు ప్రేమలేఖ రాసావా?” నేను కొంచెం ఆశ్చర్యం కలిసిన అపనమ్మకంతో అడిగాను.

“రాయలేదు ”

“మరైతే ఇచ్చానంటున్నావ్. ఓవైపు రాయలేదంటున్నావ్”

“నేను రాయలేదు. కాని ఇచ్చాను....” బెక్కుతూ అన్నాడు సోంబాబు.

“నువ్వు రాయలేదు. కాని ఇచ్చావు. మరి ఈ ఉత్తరం నీకెవవరిచ్చారు?”

“అతనెవరో తెలీదు”

“తెలీకుండా ఎలా వచ్చింది నీదగ్గరికి?”

“మొన్నఒకరోజు బస్ స్టాపు మీంచి కాలేజికొస్తున్నాను. ఒకాయన బస్ లోంచి పిలిచి ఈ కాలేజిలోనే చదువుతున్నావా అన్నాడు. ‘అవును’ అన్నాను ఓ ఉత్తరం ఇచ్చి “మీ కాలేజిలో ఉన్న బైపీసి ఇంటర్ ఫైనల్లో ఉన్న సరోజినికి ఇమ్మ”ని కోరాడు. అది తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాను. అంతే.”

“అంతేనా అయితే నువ్వు నీ చేత్తో ఏ ప్రేమలేఖ రాయలేదన్నమాట”

“అవును.”

“మరి ప్రిన్సిపాల్ గారితో చెప్పావా?”

“చెప్పాను... కాని నన్ను ప్రిన్సిపాల్ గారి దగ్గరికి తీసుకెళ్ళిన లెక్చరర్ గారు” నన్ను పూర్తిగా చెప్పనివ్వలేదు.

“నిజంగా నువ్వు ప్రేమలేఖ రాయలేదు కదూ” మరోసారి రెట్టించి అడిగాడు.

“నిజంగా రాయలేదు. సరస్వతి తోడు..” అన్నాడు అప్పుడప్పుడు వస్తున్న వెక్కిళ్ళమధ్య.

ధైర్యంగా నిజాన్ని ఢంకా కొట్టినట్టు వాదించైనా ఎదుటివారిని వొప్పించాలని డిబేటింగ్ సొసైటీలో ప్రిన్సిపాల్ గారు అంటూ ఉండేమాట నాకు బాగా నాటింది. సోంబాబుని వెంటపెట్టుకొని ప్రిన్సిపాల్ ఆఫీసుకి వెళ్లాను.

“ప్రిన్సిపాల్ గారూ....... ఇతను...”

“సోంబాబు, ఇంటర్ సెకెండియర్ నాకు తెలుసు. ఇతను తప్పుచేసాడు. చేసినట్లు ఒప్పుకున్నాడు కూడా. సోబాంబుని పట్టించిన లెక్చరర్ చెప్పాడు. అందుకే ఫైన్ వేసాను. పూర్ బాయిస్ ఫండ్ కి 50 రూపాయలు కట్టమన్నాను. ఇలాంటి వెధవ పనులు చెయ్యద్దు మళ్ళీ...” ఇంతకీ ఎందుకు తీసుకొచ్చావీతణ్ణి?

“ఇతను ప్రేమలేఖ రాయలేదండీ...” స్పష్టమైన స్వరంతో అన్నాను.

“అబద్దాలాడితే ఫైను పెంచి సస్పెండ్ చేస్తాను” అన్నాడు ప్రిన్సిపాల్.

“నేను చెప్పేది వినండి. ఈ విషయం మీ దృష్టికి తీసుకురాక తప్పదు మరి. ఇతను మొన్న బస్టాపు నుండి వస్తుంటే ఎవరో బస్ లోంచి ఒక ఉత్తరం ఇచ్చి మనకాలేజిలో ఇంటర్ ఫైనల్ బైపీసీచదువుతున్న సరోజినికి ఇమ్మన్నాడు. పోనీలే అని ఇతను తీసుకొచ్చి ఇచ్చాడు. అంతే! ఇతను ఏ తప్పు చెయ్యలేదు.” అని నేను గట్టిగా, నిర్భయంగా తొణుకుబెణుకు లేకుండా చెప్పాను.

ప్రిన్సిపాల్ నిశ్శబ్దంగా కొద్దిసేపు మా ఇద్దరివైపు చూసారు. ఆలోచించారు. ఆ తరువాత తలపంకించారు. టేబుల్ పై నున్న బెల్ మెల్లిగా కొట్టారు. ఫ్యూను ఆదరా బాదరగా వచ్చాడు. లెక్చరర్ రామనాధంని తీసుకొని రమ్మన్నారు.

కాసేపటికి ఆ లెక్చరర్ వచ్చారు.

“అటుమొన్న మీరు పాఠం చెప్తుండగా ఈ కుర్రాడు మీ క్లాసులో అమ్మాయికి...”

“అవునుసార్! లవ్ లెటర్ ఇచ్చాడు. నేను స్వయంగా పట్టుకొన్నాను...” అంటూ గర్వంగా చెప్పాడు. ఆయన్ని ఆపుతూ.
మీరు “జరిగింది జరిగినట్లు చెప్పండి” అన్నారు ప్రిన్సిపాల్ ఓ జడ్జిలా.

“నేను పాఠం బాగా చెప్తున్నానండి. ఇంతలో ఈ కుర్రాడు” అని సోంబాబుని చూపించి” సరోజినిగారు కావాలండి అన్నాడండి. సరోజిని అన్నానండి. ఓ అమ్మాయిలేచి నిలబడిందండి. ఈ కుర్రాడు నీకు తెలుసా అని ఆ అమ్మాయిని అడిగానండి. తెలీదు అందండి. నువ్వెవరని ఈ అబ్బాయిని అడిగానండి. అంతే జేబులోంచి లవ్ లెటర్ తీసి అమ్మాయివైపు విసిరి పారిపోబోయాడండి. నేను కారిడార్ లోకి పరిగెట్టి పట్టుకోండి పట్టుకోండి అని గట్టిగా అరిచానండి. మన ఫ్యూన్ సోములు వీడిని పట్టుకొన్నాడు. ఆ తరువాత నేను మీదగ్గరికి తీసుకొచ్చానండి.

“మీరు ఆ ఉత్తరం చదివారా?”

“లేదండి. పెళ్ళైన అమ్మాయికి ప్రేమలేఖ రాయడమేంటండి? అందుకే బాధపడుతుందని ఆ అమ్మాయికి కూడా ఇవ్వలేదండి.”

ఒక్క నిమిషం ఆగి – ఇస్తే ఎంత బాధ పడేదో. ఇంట్లో కూడా గొడవయ్యేది కదండీ!

“ఆ ఉత్తరం నీ దగ్గరే ఉందా?”

“ఆఁ! “ఉందండి. పరీక్ష పేపర్ల కవర్లో వేసుంటాను..” అని వెతికి తెస్తానుండండి. ఒక్కక్షణం ఆగి గబగబా వెళ్ళిపోయాడు. ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి అంటించిన కవర్ ని ప్రిన్సిపాల్ కి అందించాడు. ఆ తరువాత ప్రిన్సిపాల్ గారు దాన్ని తీసి చదివారు.

అమ్మాయిని పిలిపించమన్నారు. ఆ అమ్మాయి వచ్చింది.

“నీకు పెళ్ళైందా?” అని అడిగారు ప్రిన్సిపల్ గారు.

“అయ్యింది సార్”

“మీ ఆయన ఎక్కడున్నారు”

“పొరుగూరిలో సార్.”

“ఈ ఉత్తరం చూసి చెప్పు. మీ ఆయన ఇలాగే రాస్తాడా?” అని ఆ ఉత్తరం ఆ అమ్మాయికి అందించారు.

ఆ అమ్మాయి ముసిముసి నవ్వులతో చదివింది.

“ఇది మా ఆయన రాసిన ఉత్తరమే సార్.” అంది బిక్కమొహం వేసుకొని జాలిగా.

“సరే మీరు వెళ్ళవచ్చు.” అన్నారు ప్రిన్సిపల్ గారు లెక్చరర్ని. తలవంచుకొని వెళ్లడానికి సిద్ధమైన నన్నూ, సోంబాబుని ఆగమని చేత్తో సైగ చేసారు. మేం ఆగాము.

“ధైర్యంగా ఈవిషయాన్ని నాకు తెలియచెప్పినందుకు నిన్ను మెచ్చుకుంటున్నా” అని నాతో అన్నాడు. “ధైర్యం అన్న మంచి లక్షణం లేకపోతే ఎన్ని సుగుణాలున్నా అవన్నీ దండగే. ధైర్యం నేర్చుకో” అని సోంబాబుతో అన్నారు.
మేం ఇద్దరం ఆయనకి కృతజ్ఞతలు అర్పిస్తూ బయటకు వచ్చాం.

అది జరిగి రెండు రోజులు గడిచాయి.

మా తరగతిలో అది వరకున్న ఉత్సాహం లేదు.

ఏదో వెలితి కనిపిస్తోంది.

సోంబాబు తప్పు లేదని నాకు తెలిసినా ఆ విషయాన్ని క్లాస్మెట్స్ కి చెప్పలేక పోతున్నాను.

అల్లరి పిల్లలు సోంబాబుని ఆట పట్టిస్తున్నారు. చాటుమాటుగా గేలి చేస్తున్నారు. ఆడపిల్లలు అతడినో నేరస్తుడిలా చూస్తున్నారు. అతని వైపు చూడ్డమే తప్పన్నట్లు ప్రవర్తిస్తున్నారు.

నా అంతరాత్మకి మాత్రం సోంబాబు తప్పులేదని తెలుసు. కాని ఎలా చెప్పాలో తెలీడం లేదు.

ఇంకా సోంబాబే తప్పు చేశాడని, శిక్ష అనుభవించాలని లేఖను పట్టిచ్చిన లెక్చరర్ ఠాం ఠాం చేస్తూనే ఉన్నాడు.

ఇదంతా చూసి సోంబాబు బిక్కచచ్చాడు. అప్పటికి అది మూడోరోజు.

ఏభై రూపాయల ఫైను ఎలా కట్టాలో తెలియక క్షణక్షణం సతమతమవడం కనిపిస్తూనే ఉంది.

మూడోరోజు రసాయన శాస్త్రం లెక్చరర్ సెవంటీ సిక్సు! అని పిలిచినప్పుడు ఎస్సార్ అనే పలుకు వినబడలేదు.

ఒక్కక్షణం నిశ్శబ్దం తరువాత అందరూ ఆ విషయాన్ని మరిచిపోయారు.

నాకెందుకో బాగనిపించలేదు. లెక్చరర్ రసాయనాల కలయికకి తీసుకునే సమయం, ఆ సమయం వల్ల వచ్చే ఫలితాల గురించి చెబుతున్నాడు. మధ్యమధ్యలో పరీక్షల కోసం ఏం చదవాలో ఎలా చదవాలో సూచనలు ఇస్తున్నాడు.
బయట నుండి ఫ్యూను సార్ అని పిలిచిన శబ్దం. పాఠం ఆపి అతను తెచ్చిన సర్కులర్ విప్పి చదివాడు.

ఆ విద్యార్థి ఫైన్ కట్టనవసరం లేదు. నాకు తెలియకుండా నా చేతులారా ఓ తప్పుచెయ్యని విద్యార్థికి జరిమానా విధించాను. ఆ తప్పుకు గాను ఈ కాలేజి ప్రిన్సిపాల్ గా ఉన్న నేను 500 రూపాయలు జరిమానా విధించుకొంటున్నాను. ఈ డబ్బుని పూర్ బాయిస్ ఫండ్ కు చెల్లించగలను.” ప్రిన్సిపాల్ పంపిన సర్కులర్ చదవడం మొదలు పెట్టిన లెక్చరర్ పూర్తి చేసేటప్పటికి, తన తప్పుకు తానే ఫైన్ వేసుకొన్న ప్రిన్సిపాల్ గారి డిసిప్లిన్ కి అందరం ఆశ్చర్యపోయాం.

ఏం చెయ్యాలో తెలియని విద్యార్థినీ విద్యార్థులంతా లేచి నిలబడ్డారు. ఒక్క సర్కులర్ తో ప్రిన్సిపల్ గారు కాలేజి అంతటికి ఒక గొప్ప పాఠం నేర్పారు అని అనిపించింది.

ఆ పాఠం ఇప్పుడు అమెరికాలో ఏ హోదాలో ఉన్న నాకు నిత్యం పఠనీయంగా అనిపిస్తుంది. అలాంటి ఒక గొప్ప పాఠం నేర్పడానికి తరగతి గదే కానక్కరలేదని తెలిసాక విద్యాలయం అంటే తరగతి గది సరిహద్దులు కాదని తెలుసుకున్నాను.
మరిచిపోలేని ఈ పాఠం పదిమందికి చెప్పాలని అనిపిస్తుంటుంది.

అందుకే ఆ జ్ఞాపకంతో ఇప్పుడు మీ ముందుకొచ్చాను.


నిజానికి నేను కథకుణ్ణి కాదు.
- కలశపూడి శ్రీనివాసరావు




0 వ్యాఖ్యలు

తీరాల మధ్య....

తీరాల మధ్య....
న్యూయార్క్:
“సూర్యంగారు మన కుమార్ గారి విషయం మీకు తెలుసు కదా!”
“అవునండి నేను వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరించాను. ఇంత అకస్మాత్తుగా ఆయన పోతారనుకోలేదు”.

“మీకు ఆయిన ఎంత పరిచయమో నాకు తెలీదు. కాని ఆయిన చాలా మంచివాడండి. అందరిని కూడకట్టి మన తెలుగు వాళ్ళకి ప్రతీ ఏడాది క్రిస్మస్ డిన్నర్లు ఇస్తూండేవారు”.

“తెలుసండి రామయ్యగారు, నేను కూడా కొన్నిసార్లు వాళ్ళింట విందు చేసినవాడినే”

“మీరూ చాలా ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు కదా అని ఫోను చేసాను”.
“ఏమిటో చెప్పండి”
“ఆయిన చితాభస్మం ఇండియా పంపించాలండి. పోష్టులోనా, కొరియర్ లోనా ఎలా పంపాలో మీకు ఏమైనా తెలుసా?”.
“చితాభస్మం....... అవును. ఫ్యునరల్ హోమ్ వాళ్ళు సీల్ చేసి ఇస్తారు. పోష్టాఫీసులో డెత్ సర్టిఫికెట్ చూపి రిజిష్టర్ పోష్టులో పంపవచ్చు. ఏ పోష్టాఫీసులోనైనా వెళ్ళి అడిగితే వివరాలు ఇస్తారు. నేనొకసారి చాలా ఏళ్ళ క్రిందట పంపాను. అందింది కూడా”.

“కుమార్ గారి బంధువులు హైదరాబాదులో ఉన్నారు. వాళ్ళకి పంపితే చాలుట. ఎన్ని రోజులు పడుతుందో చేరడానికి?”

“నేను విశాఖపట్నం పంపినప్పుడు 20 రోజులు పట్టింది. మరి ఇపుడు ఇంకా తక్కువ సమయం పట్టవచ్చు. హైదరాబాద్ అయితే వారం లేదా పదిరోజులు పట్టవచ్చు. ఇంకా వేగంగా చేరాలంటే ఫేడర్స్, లేదా యుడియస్ కొరియర్ వాళ్ళని అడగమనండి.”

“అవును అలాగే చెబుతాను.”
“మంచిదండీ.”
మరో అరగంటలో-
“సూర్యంగారూ! వాళ్ళకి అంత తొందరేమీ లేదుటండి”
“అయితే పోష్టాఫీసు ద్వారా పంపమనండి”
“అది సరేకానీ మీరు ఏమైనా ఇండియా వెళుతున్నారా రెండు మూడు వారాల్లో?”
“అవునండి. వచ్చేవారం వెళ్తానేమొ. ఇంకా పూర్తి నిశ్చయం కాలేదు.”

“మరింకేం. మీకు ఆ చితాభస్మం ఇస్తే మీరు వెళ్ళినపుడు తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాలకి ఇవ్వగలరా?”
“సరే అలాగే”.
“చాలా థేక్సండీ! ఉదయాన్నే వాళ్ళింటికి వెళ్ళాను ఈ విషయం మాట్లాడాలని. చితాభస్మం తీసుకొని మరో గంటలో వస్తాను. మీరు ఇంట్లో ఉంటారా?”
“అలాగే”
మరోగంట తరవాత
“సూర్యంగారూ మీరు చాలా సులభంగా ఈ సమస్యని సాల్వ్ చేసారండి ఈ చితాభస్మం ఈ డబ్బాలో చక్కగా సీల్ చేసి ఇచ్చారు ఫ్యునరల్ హోమ్ వాళ్ళు. దీన్ని మీరు ఇలాగే తీసుకెళ్ళవచ్చు.”

“సరే. చితాభస్మం నాతో తీసుకెళ్ళడానికి కావలసిన ఏ కాగితాలు కావాలో చెబుతాను. ఆ కాగితాలపై వాళ్ళ అబ్బాయితో కాని ఆయన భార్యతో కాని సంతకం పెట్టించి ఆయిన డెత్ సర్టిఫికెట్ కాపీ ఒకటి కూడా ఇమ్మనండి”

“సూర్యంగారూ ఐతే మీకు కావలసిన పర్మిషన్ లెటర్ మీరే డ్రాప్ట్ చేసి మెయిల్ చెయ్యండి. వాళ్ళతో దానిపై సంతకం పెట్టించి మీకు పంపమని చెప్తాను. ఇక వెళ్తాను. చితాభస్మం మీరు తీసుకెళ్ళడం పెద్ద సహాయమండి”.
మరో గంట తర్వాత -
“సూర్యంగారూ! మీరు హైదరాబాదు వెళ్ళడం నిశ్చయం అయిందన్న మెసేజ్ చూసాను. మీరు చేరేటప్పటికి వాళ్ళ చుట్టాలు ఎయిర్ పోర్టుకు వచ్చి తీసుకొంటారు. మీ ఇండియా ఫోను నెంబరు, ఫ్లైట్ నెంబరు వివరాలు అన్నీ వాళ్ళ చుట్టాలకి ఇచ్చి, వాళ్ళ చుట్టాల కాంటాక్టు ఇనఫర్మేషన్ మీకు ఇవ్వమంటాను.
మరో పావు గంట తర్వాత -
“వాళ్ళ చుట్టాలు ఎయిర్ పోర్టుకు రాలేరట. హైదరాబాదులో మీరు ఎక్కడుంటారో చెపితే మర్నాడు వచ్చి తీసుకొంటారుట.”
“దాందేముంది మాడ్రయివర్ కి ఇచ్చి వాళ్లింటికే పంపుతానులెండి.”
“అది కాదండి వాళ్ళు ఈ చితాభస్మాన్ని బయట లాకర్లోనో, స్టోరేజ్ లోనో పెట్టాలనుకొంటున్నారుట.”
మీరు హైదరాబాదు చేరినతరువాత మీ దగ్గరే ఉంచుకొంటే స్టోరేజ్ విషయం నిశ్చయం అవగానే మిమ్మల్ని కలిసి తీసుకొంటామంటున్నారు. వాళ్ళకి చితాభస్మం ఇంట్లో ఉంచుకోవడం ఇష్టంలేదుట. మంచిది కాదని వారి నమ్మకమట”.

“నేను మా తమ్ముడింట్లో ఉంటానండి. మరి వాళ్లేమంటారో?”
“మరి ప్రోబ్లమేనే?”
“ప్రోబ్లెం ఏముందండి? ఇంట్లో ఉంచుకోవాలని లేకపోతే అదేరోజు తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తే సరిపోతుంది కదా?”

రామయ్య గారు రెండు క్షణాలు ఆలోచించాడు.
మరో పదినిముషాలలో -
“అలా కుదరదండి. వాళ్ళకి రిజర్వేషన్లు అంత తొందరగా దొరకవటండి. రిజర్వేషన్లు దొరికినా శలవు దొరకదటండి. కాబట్టి మిమ్మల్నే ఓ స్టోరేజ్ లోనో, మీకు తెలిసిన వాళ్ళ దగ్గరో ఉంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వీలున్నపుడు నిమజ్జనానికి వెళ్ళే ముందు దాన్ని తీసుకొని వెళతారుట.”
“అలాగా”

“అవును నిజమే. కాని నేను మా తమ్ముడింటిలో ఎలా ఉంచగలను. వాళ్ళు ఉంచుకోమంటే ఏంచేసేది. సరికదా అమెరికా నుండి వచ్చి స్టోరేజ్ లో ఓ సీలు చేసిన డబ్బా నేను పెట్టడం, ఇంకెవరో వచ్చి తీసుకోవడం చాలా రిస్క్. హైసెక్యూరిటీ ఉన్నచోట, టెర్రరిష్టుల సమస్య ఉన్న ఈ రోజులలో.”

“అవును. అదీ నిజమే”
“మరి మీరే ఏదో ఒక సలహా ఇవ్వండి”

“పోనీ ఇవన్ని ఏర్పాటు చేసానే అనుకోండి వాళ్ళ చుట్టాలు పిత్రుకర్మలు నిర్వహించి నిమజ్జనం చేస్తారని మీకు గట్టి నమ్మకం ఉందా?”

“ఇన్ని సార్లు వెనక్కి ముందుకు వెళుతున్న సంభాషణ ద్వారా వాళ్ళకి చితా భస్మం నిమజ్జనం చెయ్యడం మీద అంత ఇంట్రస్టు ఉందనుకోను.”

“ఇంతెందుకు కుమార్ గారి కొడుకుల్లో ఎవరో ఒకరు వెళ్ళి నిమజ్జనం చెయ్యవచ్చుగా.”
“వెల్.. ఆ పాజిబిలిటీ లేదండి. అందుకే మిమ్మల్ని సలహా అడుగుతున్నాం.”
“నన్నా?”
“మీకు వీలయితేనే. మీకు ఇలాంటి పట్టింపులు లేవని మా అందరికి తెలుసు. మీకు అభ్యంతరం లేకపోతేనే.”

“నాకు పట్టింపులు లేవు కాని, అంత ఆస్థి ఉండి, ఉద్యోగాలు చేసుకొంటూ, బాగా సంపాదిస్తున్న పిల్లలుండి.......”

“వెల్ మరి వాళ్ళకి ఆ సెంటిమెంట్ లేనట్లే కనిపిస్తున్నది.”
“ఇండియాలో చితా భస్మం నిమజ్జనం చెయ్యాలన్నది ఎవరి ఉద్దేశ్యం?”
“ఉద్దేశం కాదు. కుమార్ గారి కోరిక.” తాను దేశం కాని దేశంలో తనువు చాలిస్తే భారతదేశంలో అదీ గోదావరిలో తన అస్థికలు కలవాలని కోరేవాడు.
నిశ్శబ్దం.
“రామయ్యగారూ! కుమార్ గారి చితాభస్మం నేనే నిమజ్జనం చేస్తాను ఫరవాలేదు.”

“మీరు చేసినట్లయితే ఆ కుటుంబానికి పెద్ద సహాయం చేసినవాళ్ళవుతారు. కుమార్ గారి ఆత్మకి శాంతి కలుగుతుంది. ఎంత ఖర్చు అయితే అంతా ఇస్తామంటున్నారు వాళ్ళు నాకూ ఒక బ్లాంక్ చెక్ కూడా సంతకం పెట్టి ఇచ్చారు మీకు ఇమ్మని.”

“నాకు ఖర్చు ఇవ్వఖ్ఖర్లేదు. కుమార్ గారు నాకూ స్నేహితులే!”

“అలా కాదు. మీరు ఖర్చు తీసుకోవాలి. చితాభస్మం నిమజ్జనం చేసిన ఫలితం పుణ్యం ఏమైనా ఉంటే అది వాళ్ళ కుటుంబానికి, కొడుకులకి దక్కాలి కదా. అందుకని.”

“హమ్మయ్య నెలరోజుల నుండి గుండెల మీద ఉన్న భారం తీరింది. కుమార్ గారి చితాభస్మం సవ్యంగా మీ చేతులమీద గోదావరిలో నిమజ్జనం అయితే ఆయన ఆత్మ శాంతిస్తుంది.” నిట్టూర్చాడు రామయ్యగారు.

***


నర్సీపట్నం
తన మరణం తరువాత చితాభస్మం అస్థికలను తనవాళ్ళు కాశీలోనో, గోదావరిలోనో కలపుతారని అప్పుడే తనకు శాంతి చేకూరుతుందని వెంకటశాస్త్రిగారు అనుకునేవారు. కాని ఆర్థిక పరిస్థితి రానురాను క్షీణిస్తుంటే ఆ కోరికను భార్య వెంగమాంబతో బాహాటంగా అనలేక పోయేవాడు. కాని అంత్యక్రియలప్పుడు పురోహితుడు అస్థికలను గోదావరిలో కలపాలని చెప్పినప్పటి నుండి శాస్త్రిగారి కోర్కె వెంగమాంబగారిని చుట్టుముట్టింది.

వెంగమాంబ ఎనభైఏళ్ళ వృద్దురాలు. ఆమె భర్త చనిపోయి పదిహేను రోజులైంది. వారికి పెద్దగా ఆస్థిలేదు. గుమస్తాగా పనిచేసిన భర్త గాంధేయవాది.. జీవితం అంతా గాంధీ మార్గంలోనే నడిచిన వాడు. సత్యాగ్రహ కాలంలో జైళ్ళలో ఉన్నాడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని చదువు పాడుచేసుకొన్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సొంత ఊరు నర్సీపట్నంలోనే చిన్న గుమాస్తా ఉద్యోగంలో చేరాడు. లంచాలకి దూరంగా, నిజాయితీకి దగ్గరగా బ్రతికాడు. చాలీచాలని జీతంతో గుట్టుగా సంసారం చేసేవారు. వెంగమాంబ కాపాయం వల్ల పిల్లలిద్దరికీ చదువు చెప్పించగలిగాడు. అప్పట్లో డొనేషన్లు లేవు కాబట్టి ఒకడు ఇంజనీరింగులో మరొకరిని మెడిసన్ లో చేర్పించాడు. వారిద్దరు తెలివైన పిల్లలు. బాగా చదువుకునే వారు. ఇంజనీరింగ్ లో చేరినవాడు మొదట కమ్యూనిస్టు వెంట, ఆ తరువాత మావోయిష్టుల వెంట నక్సలైటై చివరికి ఏమయ్యాడో తెలియదు. మెడిసిన్ లో చేరిన కొడుకు చక్కగా చదివి, ప్రాక్టీస్ పెట్టి, రెండు చేతులా ఆర్జించాడు. కాని కల్కిభగవాన్ భక్తిలో పడి ప్రాక్టీసు పాడుచేసుకొని, ఉన్న ఆస్థంతా పూజలు, పునస్కారాల కోసం, ఆ భగవాను భక్తులకు కైంకర్యం చేసి వాళ్ళలో కలిసి ఎక్కడికో పోయాడు. సమాజాన్ని తూటాతో మార్చి స్వర్గం చేద్దాం అని ఒకడు బాబాల భక్తితో స్వర్గం పొందాలని మరోకొడుకు మాయల్లో పడి తల్లితండ్రిని ఒంటరి వాళ్ళని చేసిపోయారు.

భార్యాభర్తలిద్దరూ వాళ్ళకొచ్చే అతి కొద్ది పింఛన్ తో జీవితం వెళ్ళబుచ్చుతున్నారు. వెంగమాంబకి భర్తతో పదో ఏట పెళ్ళైంది. డెబ్బై ఏళ్ళ సహచర్యం. భర్త ఆరోగ్యం క్షీణిస్తూ, చనిపోతాడని తెలిసినా ఆమె నిబ్బరంగానే ఉండేది. ఎందుకంటే అతను చనిపోతే తాను బ్రతకలేదు. తాను కూడా సహజంగా అతనితో పాటే చనిపోతానన్న ధీమా ఆమెలో ఉండేది. కాని అతను చనిపోయి పదిహేను రోజులైంది. ఇంకా బ్రతికే ఉంది. వీథిలో ఉన్నవాళ్ళే చెయ్యవలసిన కర్మ అంతా చేసారు. పన్నెండో రోజుతో ఇంక తమపని అయిపోయిందని ఎవ్వరూ కనిపించలేదు.

తాను తన భర్తతోనే ఎందుకు పోలేదు? ఆలోచించింది. మనసుకేమీ తట్టడం లేదు. తన వొడిలోని చితాభస్మం పాత్రని మరోసారి తడుముకుంది.

పెంకులు రాలిపోతే డబ్బులు లేక పూరికప్పు వేయించుకొన్న ఇంటి మధ్యలో చితాభస్మం, అస్థికలు ఉన్న పాత్రని ఒడిలో పెట్టుకుని ఆమె కూర్చొని ఉంది. ఆ పాత్రని ముట్టుకొంటే వేడిగా ఉంది. అది వేసవి ఎండల వల్లో- లేక ఆత్మ చల్లబడదని భర్త చితాభస్మం వల్లో తెలియదు.

ఇంకెంతో కాలం అసహనాన్ని భరించలేకుండా ఉంది. డెబ్బైయేళ్ళుగా కలిసి బ్రతికిన వ్యక్తి, ఎన్నో అనుభవాలను పంచుకొన్న వ్యక్తి, ఆగని అనుభూతుల కెరటాల సముద్రం, అభౌతిక ప్రేమని, అతి సాధారణంగా, అందంగా ఆవిష్కరించిన ఆత్మ, ఒక్క స్పర్శకి వళ్ళంతా ఝల్లుమనిపించిన దేహం, ఒక్క చూపుతో మనసులో పువ్వుల వానని కురిపించిన ప్రియుడు, ఒక్క పిలుపుతో జీవితకాలాన్ని కనురెప్పపాటుగా నడిపించిన సహచరుడు. ఒక స్పర్శతో, ఒక నవ్వుతో, ఒక కవ్వింపుతో భౌతిక సుఖాల పరాకాష్టకు చేర్చే రసాత్మక లోకంలో విహరింపజేసిన భర్త, ఏడడుగుల బంధాన్ని డెబ్బై వసంతాల కావ్యంగా మలిచిన వ్యక్తి, తన ఆ సర్వస్వం ఈ పాత్రలో ఉంది అని తలుచుకోగానే వెంగమాంబ ఉద్వేగంతో ఆ పాత్రని కౌగలించుకొని కన్నీరు కార్చింది. ఇలా పదే పదే ప్రతీరోజూ జరుగుతుండడం చూసి ఆత్మ శాంతించాలంటే చితాభస్మాన్ని అస్థికలని గోదావరిలో కలపడమే మార్గమన్నాడు పురోహితుడు. అలా చెయ్యడానికే తాను చనిపోలేదేమో అని అనిపించింది వెంగమాంబకు. పోనీ మనసు గట్టి చేసుకొని చితాభస్మాన్ని గోదావరిలో నిమజ్జనం చెయ్యలన్నా వెళ్ళడానికి అక్కడ కర్మకాండలకి కావలసిన డబ్బులు లేవు. ఆరోగ్యం చూస్తే ఏ మాత్రం బాగోలేదు. పైగా తనని తీసుకెళ్ళే వారెవరూ లేరు. ఎవరిని అడగాలో తెలీదు. తనతోపాటు వస్తారని నమ్మకం కూడా లేదు. అదనంగా బస్సు ఛార్జీలు పెట్టే పరిస్థితి అసలే లేదు. ఇరుగు పొరుగు చెయ్యగలిగినంత సహాయం చేసారు. ఇంకా వాళ్ళని అడగడం బాగుండదు. ఇదే స్థితిలో వారం రోజులుగా సతమతమవుతూ ఉంది వెంగమాంబ. చుట్టుప్రక్కల వాళ్ళ పిల్లలు వచ్చి కొద్ది సేపు కూర్చొని ఆమె చేత ఇంత తినిపించి వెళుతున్నారు. వాళ్ళకి ఆమె కష్టం తెలుసు. ఆమె కూడా వాళ్ళని అర్థం చేసుకుంది. తినడానికే వాళ్ళపై ఆధారపడడం వల్ల ఏమీ అడగలేకపోతోంది. కాని అంత్యేష్టి దృశ్యం ఆమె కళ్ళలో మసకగా కదలాడుతోంది.

కోటిలింగాల రేవు, రాజమండ్రి.
అస్మద్ పిత్రుః సుఖేన, పుణ్యలోకా వ్యాప్త్యర్ధం, కోటిలింగ మహాక్షేత్రే, అఖండ గోదావరీ తీరే గంగా భసి­­­­ ­­అస్థి నిమజ్జనం కరిష్యే!
అంటే -
నా మిత్రుడి సుఖంకోసం, పుణ్యలోకాలు కలగాలని కోటిలింగ మహాక్షేత్రంలో గంగనుండి వచ్చిన అఖండ గోదావరి తీరంలో­­ అస్థికలు నిమజ్జనం చేస్తున్నాను. అని మొదలు పెట్టిన సూర్యం బ్రాహ్మడు పట్టుబట్టడం వల్ల ఓ రెండు గంటల సేపు కుమార్ గారి చితాభస్మాన్ని ఆయనకి చెయ్యవలసిన ఆఖరిదైన శోడష (పదహారవ) కర్మ జరిపాడు. పరవస్తి మనుష్యాణాం గంగాతో యేషువ తిష్ఠతి తవాత్ వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతీ అంటారు. దాని అర్థం ఏమంటే- ఏ మనుష్యుని యొక్క అస్థికలు గంగలో ఎంతకాలం ఉంటాయో అంతకాలం ఆ వ్యక్తి స్వర్గంలో ఉంటారు అని ముగించాడు. తన చెమటలు తుడుచుకుంటూ వేదోక్త కర్మలు ముగిసాయని చెప్పాడు. సంభావనల పేరుతో పోగేసిన ధాన్యం, డబ్బు సంచిలో వేసుకున్నాడు.

“అందుచేత - అయ్యా మీరు ఇక ఈ చితాభస్మాన్ని తీసుకొని పడవలో వెళ్ళి గోదావరి మధ్యలో కలపాలి” అన్నారు అపరకర్మ చేసే పురోహితుడు. నీళ్ళలో ఉన్న పడవను చూపిస్తూ.

“అలాగే చేద్దాం” అన్నాడు సూర్యం. పడవపైపు నడుస్తూ.
“అయ్యా నాదో చిన్న మనవి.....” సంశయిస్తూ అంత్యేష్టి నిర్వహించిన పురోహితుడు అన్నాడు.
“చెప్పండి. సంశయమెందుకు?”

“అటు చూడండి. ఆ మెట్ల మీద కూర్చొని ఉన్న ముసలామెని చూపాడు. ఆమె ఎనభైఏళ్ళ పైబడ్డ వృద్దురాలు. పైగా డస్సిపోయింది. భర్త అస్థికలను గోదావరిలో నిమజ్జనం చెయ్యాలని నర్శీపట్నం నుండి ఒంటరిగా వచ్చింది. వచ్చినప్పటి నుండి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఆమెకి పిల్లలు లేరు. డబ్బులు లేవు. ఇక్కడదాకా ఎలాగో వచ్చింది. ఒంటరిగా ఎలా రాగలిగిందో ఆశ్చర్యమే. నేను అణాకాణీతో కర్మ ముగించాను. కాని నదిలో అస్థికలు కలపడానికి పడవ ఎక్కాలి. సాధారణంగా ఇందుకోసం పడవవాడు వంద రూపాయలు తీసుకొంటాడు. నేను ఎంత చెప్పినా వాడు నా మాట వినడు. మీరు ఒప్పుకొంటే ఆమెను మనతో పాటుగా అదే పడవలో తీసుకెళ్ళి ఆమె భర్త అస్థికలను కూడా ....... అంటూ ఆమె కథను వివరించాడు.
“అయ్యా! తప్పకుండా ఆమెని రమ్మనండి......”
అప్పుడే గోదావరిలో స్నానం చేసిన తడి బట్టలతో, జుత్తుతో జీవమంతా కళ్ళలో మాత్రమే మిగిలి ఉన్న ఆ ముదుసలి ఆకులు రాలి ఖాళీ కొమ్మల ప్రాచీనవృక్షంలా అనిపించింది. వణికే చేతులతో పట్టుకుని ఉన్న ఆ ఇత్తడి పాత్ర ఆమె తన సర్వస్వంగా భావిస్తున్నది.
పురోహితుని కేక విని తడబడి లేచి నిలబడే ప్రయత్నం చేసింది. అందరూ పడవ వైపు నడిచారు. పురోహితుని సహాయంతో సూర్యం, ఆ తరువాత ఆ వృద్ధురాలు కష్టంగా పడవ ఎక్కారు.

పురోహితుని మంత్రాలమధ్య పడవ వాడు వేసే తెడ్డుతో పడవ గోదావరి మధ్యకు చేరింది. తీరం నుండి దూరంగా మెల్లిగా సాగుతున్నది. ఆ వృద్ధురాలి చూపు పాత్రలో ఉన్న ఆమె భర్త అస్థికలు, చితాభస్మంపై ఉంది. ఆమె ఆ పాత్రని పట్టుకొన్న తీరు చూస్తే గుండెలకు హత్తుకున్నట్లనిపిస్తుంది. ఆ పాత్రను తన శరీరం అంతటితో స్పర్శించాలన్న భావన చెప్పకనే చెపుతున్నది.

కుమార్ గారి చితాభస్మాన్ని సూర్యం మొదట గోదావరిలో కలిపాడు. ఆ తదుపరి పురోహితుడు వృద్ధురాలిని ముందుకు తీసుకెళ్ళి ఆమె తెచ్చిన పాత్రలోని చితాభస్మాన్ని, అస్థికలను మంత్రాల మధ్య నిమజ్జనం చేయించాడు.

“ఇంతటితో ఈ నిమజ్జన కర్మ ముగిసింది” అని పురోహితుడు ఈ ఇద్దరిని చూసి అన్నాడు. “పడవ వాడివైపు తిరిగి ఒడ్డు చేర్చవోయి” అన్నాడు..

తిరిగి వస్తున్న పడవలో నిశ్శబ్ధం. గోదావరి అలల మీద వీస్తున్నది గాలి, పడవ నడిపేవాడు తెడ్డు వేస్తున్నాడు. తెడ్డు గోదావరి నీటిని తాకే సమయంలో మాత్రమే శబ్దం స్పష్టంగా వినబడుతున్నది. ఆమె ఎలాంటి కదలిక లేకుండా నిశ్శబ్దంగా ఉంది. ఆమెలో ఒక సంతృప్తి భావన కనిపిస్తోంది.

“పిల్లలు లేరని మీరు విచారించకండి. ఈ సూర్యంగారు అమెరికాలో పిల్లలు భార్య, డబ్బు అన్నిఉన్న ఒకాయన చితాభస్మాన్ని నిమజ్జనం చెయ్యడానికి అక్కడ నుండి ఈయన ఇక్కడకు వచ్చారు.....” అని సూర్యం గురించి చెపుతూ ఆమెని ఊరడించే ప్రయత్నం చేస్తున్నాడు.

మనిషి చనిపోయిన తరువాత - ఆ కుటుంబ వ్యక్తులు ఆ మనిషి చితాభస్మానికి, ఎంత గౌరవం ఇస్తారు? ఆ మనిషి ఆత్మకి, అస్థికలకు చెయ్యవలసిన అపరకర్మకి ఎంత ప్రాధాన్యం ఇస్తారు? పుణ్యం, స్వర్గ నరకాల మీద నమ్మకం ఉన్నా లేకపోయినా, అప్పటిదాక కలిసి మెలిసి తిరిగిన వ్యక్తి ఒక్కసారి మాయమయిపోయి చితాభస్మంగా మిగిలితే ఆ చితాభస్మం విలువేంటి? .... ఇలాంటి ప్రశ్నలతో సూర్యం మనసంతా గందరగోళంగా మారింది.
మరణించినవారి చివరికోర్కె తీర్చడం బతికి ఉన్నవాళ్ళ మొదటి విధి కావడం ఒక మానవీయ అనుబంధం అవుతోంది.
“అమ్మా! మీ భర్తగారి షోడశకర్మని చక్కగా చేయించారు. గోదావరీ నిమజ్జనం కూడా అయ్యింది. ఈయన దయవల్ల” అని సూర్యాన్ని చూపిస్తూ “మీ భర్త ఆత్మ శాంతిస్తుంది. స్వర్గం పొందుతారు” అన్నాడు.

ఇక మీరు ప్రశాంతంగా ఉండండి. ఇన్నేళ్ళ నా అనుభవంలో ఎంతో మందిని కలిసాను. మనిషి పుట్టుకనుండి చనిపోవడం దాకా జరగవలసిన పదిహేను కర్మలు, ఆ తరువాత ఆఖరిది అయిన ఈ షోడశకర్మతో సహ ఎన్నో కార్యక్రమాలు చేయించాను. కానీ మీ వంటి వారిని ఇప్పటిదాకా చూడలేదు. మిమ్మల్ని కలవడం నా భాగ్యం. మనిషి చనిపోయినా ఆత్మ ఉంటుందని దానిని ప్రేమించగలరని, దానితో స్నేహం చెయ్యగలమని అది వినాశనం పొందదని నమ్మిన మీ ఇద్దరూ ధర్మశాస్త్రాలలో ఆత్మ గురించి చెప్పిన దాన్ని నమ్మి, ఆచరించి అనుసరణీయులైనారు.” అని చేతులెత్తి నమస్కారం చేసాడు ఇద్దరికి.

ఆమెకు ఆ మాటలు వినబడడం లేదు. తలఎత్తి సూర్యం కళ్ళల్లోకి చూసింది. సూర్యం ఒళ్ళంతా ఒక్కసారి మూలిగింది. ఎన్నడూ కలగని ఒక వింత ప్రవాహం వళ్లంతా పాకింది. వారిద్దరి మధ్య అభౌతిక, అలౌకిక పరస్పర సంబంధానికి అది వారధి అయ్యింది.
ఆమె చూపులతోనే ఏదో చెప్పాలనుకుంది.
ఆమె వంగి అతని పాదాలకు నమస్కరించబోయింది. అతను ఆమెను తన రెండు చేతులతో పట్టుకొని వారించబోయాడు. ఆమె శరీర ప్రకంపనలు అతని చేతుల ద్వారా అతని శరీరంలో ప్రవహించాయి. రెండు కన్నీటి చుక్కలు అతని పాదాలమీద పడ్డాయి. అతను చలించిపోయాడు. ఆమెను మరింత దగ్గరగా తీసుకొన్నాడు. బలమైన అతని చేతులకి తేలికయిన ఆమె దేహం తగిలింది. పడవ తీరంవైపు నడుస్తున్నది. పురోహితుడు, అతడినీ ఆమెనీ చూస్తు అవాక్కయ్యాడు.

పడవ మధ్యలో ఉన్న బల్లపై కూర్చుంటూ ఆమెని జాగ్రత్తగా పట్టుకొని తన ప్రక్క కూర్చొనేలా చెయ్యడానికి ఎంతో ప్రయత్నించాడు సూర్యం. ఆమె అతడి ఒళ్ళో వాలిపోయింది.

ఇదేమీ గమనించని పడవవాడు ఒడ్డుకి చేరామన్నాడు.
“పడవ ఒడ్డుకి చేరింది. కాని ఇంకా తీరాలమధ్యే ప్రవాహంగానే ఉన్నాం” సూర్యం తనలో తాను అనుకున్నాడు. “అమెరికాలో కావొచ్చు – కోటిలింగాలు కావొచ్చు. తీరాలమధ్యే ఉన్నాం”.




0 వ్యాఖ్యలు

Wednesday, August 19, 2009

ఇల్లు అమ్మిపెట్టి చూడు

Wednesday, August 19, 2009
“నాది బయోటెక్నాలజీ ఫీల్డ్. నేను ఇల్లు అమ్మించే ఏజెంట్ ని కాదు. మీరు ఏదో తప్పు అడ్రస్ కు ఫోన్ చేశారు.”

‘లేదు లేదు. మీ గురించి అంతా తెలిసే ఫోన్ చేశాను. కిడంబి రఘునాథ్ గారు చాల ఏళ్ళ క్రితం మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు అభయ టెక్నాలజిస్ట్ అని పరిచయం చేశారు. నాకు బాగా గుర్తు. నేను ఉన్న పరిస్థితులలో మీవంటి వారి సహాయం చాల అవసరం. దయచేసి నేను చెప్పేది వినండి.’ అని మొదలు పెట్టి ఆయన వివరంగా విషయం చెప్పేరు.

పేరు ప్రభాకరం. న్యూయార్క్ మహానగరంలోని క్యూఎంస్ లో నివాసం. వయసు అరవై ఏళ్ళు. అమెరికా ప్రెసిడెంట్ జార్జి బుష్ అవకతవక ఆర్థిక రాజకీయ విధానాలవల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఫలితంగా ఆయన పనిచేసే కంపెని మూసేసారు. పెన్షన్ డబ్బు కూడా సగానికి సగం పడిపోయింది. పిల్లలు ఎదిగినవాళ్ళే. అయితే ఇంటి మురిపెం తీరిపోయింది. వచ్చే దబ్బుతో హాయిగానే బతకవచ్చు. అందుచేత ఆయనకున్న పెద్ద ఇల్లు అమ్ముదామని కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా దిగజారడం వల్ల పరిస్థితులు బాగోలేదు. ఇటువంటి పరిస్థితులల్లో పూర్తి కాష్ పెట్టి కొనే మరో ఇండియన్ మార్కెట్లో ఉన్నాడుట. అతడు వాస్తు అంటే చాల పట్టింపు ఉన్నవాడు. ఐతే ఈ ఇల్లు 30 ఏళ్ళ క్రిందట కొన్న ఇల్లు. ఆరోజుల్లో వాస్తు విషయం ఆలోచించేవారు కాదు. కానీ ఈ రోజుల్లో ఈ HI వాళ్ళల్లో చాలమంది వాస్తు చూసే కొంటారు. ఆరోజుల్లో ఇండియా అమెరికా లా ఉంటే బాగుండునని అమెరికాలో ఇండియా ఉంటే బాగుండునని అనుకొన్నాం. కాని ఇలా వాస్తు వంటివి వస్తాయని ఏనాడూ అనుకోలేదుట. నేను ఏదో ఒకలా ఆ HI కుర్రాడిని వప్పించి ఈ ఇల్లు అమ్మించి పుణ్యం కట్టుకోవాలిట. ఇదీ ఫోను సారాంశం.

* * *

నడిమింటి నాగ సత్య శివ వీర వెంకట సుందర సీతారామ రంగనాథ సంపద శ్రీనివాస ప్రసాదు సదరు HI కుర్రాడు. ఇంటి పేరు పిలవలేక ఎవరికితోచినట్టు వారు పొట్టిపేరు పెట్టి పిలుస్తుంటారు. అది ఇతనికి అలవాటే. చాంతాడు ప్రసాదు, NNSSVVSSRRSS ప్రసాదు, లాంగ్న మే ప్రసాదు టెంపుల్ ప్రసాదు ఇలా చాల పేర్లతో చలామణి అయ్యే ప్రసాదు ప్రస్తుతం ‘వాస్తు ప్రసాదు’ అయ్యేడు. గత మూడు నెలలుగా ప్రతీ రోజు ఇల్లు చూడడం, వాస్తు బాగోలేదని మానెయ్యడం అతను చేస్తున్న పని. అతనికి మరోపని లేదు. అది నిజమే, ఎందుకంటే అతనికి ఉద్యోగం లేదు. బెంచి మీద ఉన్నాడు. ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉద్యోగాలున్న వాళ్ళకే ఇల్లు నిలబెట్టుకోవడం కష్టమయిపోతుంటే ఉద్యోగం లేకపోయినా ఆయన ఇల్లు కొనడం ఆశ్ఛర్యమే మరి.

వాస్తు ప్రసాదు చాల చాదస్తమున్న కుటుంబంలో పుట్టెడు. అతని పేరే దానికి ఉదాహరణ. సహజంగా సంక్రమించిన చాదస్తం ప్రసాదు వయసుతో పాటుగా పెరిగింది. స్కూల్ రోజుల్లో తోటి పిల్లలు అతని ఛాదస్తాన్ని చూసి వెక్కిరించడం వల్లో లేదా సహజంగా తల్లిదండ్రుల కంటే భిన్నంగా ఆలోచించాలన్న ఉద్దేశంతోనో, తల్లిదండ్రుల ఛాదస్తమంటే చికాకు, కోపం, అసహ్యం ఏర్పడి కాలేజి రోజుల్లో కమ్యూనిష్టుగా మారాడు. పట్టుదల ఉన్నవాడు. బాగా చదువుకున్నాడు. ఇండియా ఐఐటి మద్రాసులో, అమెరికా ఐఐటి (ఇల్లినాయి ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చికాగోలో డిగ్రీలు సంపాదించేడు. ముప్పయి ఏళ్ళ లోపే మంచి ఉద్యోగం కూడా వచ్చింది. పెళ్లి అయింది. ఉద్యోగంలో మంచి పేరు కూడా వచ్చింది. గ్రూప్ లీడర్ అయ్యాడు. గ్రూప్ బాగా పనిచెయ్యడం వల్ల ఇతనికి పని తగ్గింది. ఒకరోజు పెళ్ళాన్ని గుడిలో దింపి బయట ఎదురు చూస్తుంటే లోపలున్న బాబాగారు పిలుస్తున్నారని ఆ బాబా గారి భక్తులొకరు వచ్చి చెప్తే ఆశ్చర్యంలో ఆలోచించకుండా వెళ్ళిన కమ్యూనిస్ట్ ప్రసాదు కళ్ళు తెరిచి మూసేలోగా బాబా భక్తుడయిపోయాడు. ఆ తరవాత ఓ అమ్మ భక్తుడయిపోయాడు. వెఁటనే అమెరికాలో అతి పెద్ద ఛాదస్తపు సమాజానికి ముఖ్య కార్యకర్త అయిపోయాడు. కల్యాణానికి కక్కు ఏ విధంగా ఫలితమో, బాబా భక్తికి ఛాదస్తం ఫలితం కాబోలు. అదే జరిగింది. కమ్యూనిష్టు ప్రసాదు తన తల్లిదండ్రుల కంటె ఛాదస్తుడిగ తయారయ్యాడు.

స్వంతంగా ఆలోచించే వ్యక్తి అసలు స్వంత ఆలోచనే లేనివాడిలా తయారయ్యేడు. ప్రతీ పని చెయ్యడానికి ముందు ఆఫీసు పని కాగానే బాబాకి ఇంటికి సంబంధించిన పనులయితే అమ్మకి తెలియబరిచి వారు చెప్పినట్టు తు.చ. తప్పక నడుచుకునేవాడు. గ్రూపు లీడర్గా తానూ తీసుకోవలసిన నిర్ణయాలలో కూడా బాబాగారి సలహాలు తీసుకోవడం వల్ల ఆఫీసులో పనిలో ఇబ్బందులు వచ్చాయి. ఇతని మారిన పనితీరు ఆఫీసులో వారందరికీ తెలిసింది. ఉద్యోగంలో నుండి తీసివేసారు. ఇంతకాలం బాగా పనిచేసినందుకు కొంత కంపెనీ స్టాక్ ఇచ్చారు. అతను ఇంతకు ముందునుండి కొన్న ఆ కంపెనీ స్టాక్కి దీనిని జతచేసి ఆ కంపెనీ స్టాక్ ఇచ్చారు. అతను ఇంతకు ముందునుండి కొన్న ఆ కంపెనీ స్టాక్కి దీనిని జతచేసి ఆ కంపెనీ స్టాక్ అంతా అమ్మి డబ్బు చేసుకొని బ్యాంకులో వేసాడు. సరిగ్గా ఇదంతా జరిగిన మరుసటి వారంలో ఆ కంపెనీ మూసివేసారు. స్టాక్ మార్కెట్ పడిపోవడం మొదలుపెట్టింది. అందుచేత ప్రస్తుతం అతని దగ్గర పూర్తి డబ్బు పెట్టి బేంక్ లోను తెచ్చుకోకుండా ఇల్లు కొనడానికి కావలసినంత నగదు డబ్బుంది.

వాస్తు చూడకుండా ఇల్లు కొనొద్దని అమ్మ ఆదేశం. వాస్తు ప్రకారం వాస్తు గురించి వెబ్లో ఉన్నదంతా చదివాడు. తెలిసిన వాళ్ళందరి సలహాలు ఉద్దేశాలు తెలుసుకొన్నాడు. ఏది ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకున్నాడు. చాలా ఇళ్ళు చూసాడు. వాస్తు ప్రకారం ఒకటి సరిగ్గా ఉంటే మరొకటి ఉండడం లేదు. ఇంటి ఉత్తర దక్షిణ, తూర్పు పడమరలే కాకుండా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం కూడా అతి జాగ్రత్తగా చూస్తాడు. తనని మోసం చెయ్యాలని, ఏదో ఒక ఇల్లు అమ్మేయాలని దిక్కులు కూడా సరిగ్గా చెప్పరని దిక్చూచిని మాత్రమే నమ్ముతాడు. దిక్చూచి పెట్టి మరి చూసుకొని ఇంటి మంచి చెడ్డలు నిర్ణయిస్తాడు. ఇంటి వాస్తు బాగుంటే ఆరోగ్యం మాత్రమే కాదు. ఆస్తి, అంతస్తు, ఉద్యోగం, బిడ్డల సుఖశాంతులు అన్ని బాగుంటాయని వాదిస్తాడు. ఇతనికి ఇళ్ళు చూపించని రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆ ప్రాంతాలలో లేదంటే అతిశయోక్తి కాదు. నిజం. ప్రతీ ఇంటికి ఏదో ఒక వంక కనిపిస్తూనే ఉంది అతనికి.

అతనికి తొందరగానే ఇల్లు కొనాలని ఉంది. పూర్తి డబ్బు పెట్టి కొనే వాళ్ళు దొరకడం ఇల్లు అమ్మేవాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి గొప్ప అదృష్టం. కాని వాస్తు ప్రసాదు ఇప్పటిదాకా ఏ ఇంటిని కొనడానికి మాటివ్వలేదు.

ప్రభాకరం గారి ఇల్లు వాస్తు ప్రకారం ఉండే అవకాశం ఎక్కువే. ఆయన దగ్గరుండి గాలి వెల్తురు సరిగ్గా వచ్చేటట్టు, విశాలంగా ఇల్లు కట్టించుకొన్నారు. వాస్తు ప్రసాదుకి అన్ని సరిపోయేటట్టు ఉన్నాయోలేదో తెలుసుకొని మరి ఇల్లు చూపించాడు రియల్ ఎస్టేట్ ఏజెంట్. వాస్తు ప్రసాదు ఇల్లంతా దిక్చూచి పెట్టి చూసి సుమారుగా బాగానే ఉంది అనుకున్నాడు. మళ్ళీ, మళ్ళీ చూసాడు. లివింగ్ రూంలో ప్రాబ్లం ఉందని, అది సరిగ్గా తెలియడం లేదని ఒకసారి ఒకలాగా మరోసారి మరోలాగా ఉందని, లివింగ్ రూం మధ్యలో ఒక గోడ ఉండాలని, లివింగ్ రూంకి డైనింగ్ మధ్యలో ఉన్న గుమ్మం ఉండవలసిన దానికంటే ఒక మూడు అడుగులు ఎక్కువ వుందని, గోడ కట్టించడం, గుమ్మం కొట్టించడం విషయంలో మళ్ళీ మరోసారి పరిశీలించి, అమ్మ సలహా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తానన్నాడు. అమ్మ మరోసారి అన్ని చెక్ చెయ్యమన్నారని రెండురోజుల తరువాత ఇల్లు చూడాలని వస్తున్నాడు వాస్తు ప్రసాదు. వాస్తుకి సరిపోయేట్టుగా ఇంటిని ఎలా చూపించడం ? ఆ ప్రశ్నతో సతమతమవుతున్న ప్రభాకరం గారికి ఎప్పుడో కిడంబి రఘునాథ్ గారు పరిచయం చేసిన నేను గుర్తు వచ్చానుట.

“వాస్తు ఒక శాస్త్రం. భారతదేశంలో పూర్వికులు దేవాలయాలనుండి ఇళ్ళ దాకా అన్ని రకాల కట్టడాలకి కావలసిన సూచనలు తెలియబరిచే శాస్త్రం. దీనిని పూర్తిగా అర్థం చేసుకొన్న వాళ్ళ సలహామీద చేస్తే మంచి ఫలితాలే వస్తాయి. కాని అన్ని రంగాలలో ఉన్నట్లే ఇందులో కూడా అన్ని రకాలవాళ్ళు ఉన్నారు.” అన్నాను ప్రభాకరం గారితో

“మీకు తెలిసిన వాస్తు చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి వాళ్ళతో సంప్రదిస్తే” బాగుంటుంది అన్నారు ప్రభాకరం గారు.

“అలా చెయ్యెచ్చు కాని ఒకరు చెప్పిన వాస్తుని మరొకరు ఒప్పుకోకపోవచ్చు. ఒకరు చెప్పేది అందరూ ఒప్పుకొనేలా ఈ వాస్తు శాస్త్రం ఉంటే ఎంతో బాగుండేది. అన్ని ఆధునిక శాస్త్రాలలాగే. గాలి వెల్తురు విషయంలో పెద్ద బేధాలు ఉండకూడదు. కాని తమకే ఈ వాస్తు శాస్త్రం తెలిసినట్లు రకరకాల అతిచిన్న విషయాలని కూడా సరియైన అవగాహన లేక అసలు వాస్తు విలువని తగ్గించే సలహాలు ఇస్తూ దీన్ని ఒక భారతీయ ఛాదస్తంగా మారుస్తున్నారు”అన్నాను.

“అది సరేనండి కాని ఒకసారి దిక్చూచితో చూసి అంతా బావుందని మరోసారి దిక్చూచితో చూసి బాగులేదేమొ అంటే ఎలాగండి?”

“ అలా అన్నారా?”

“అవునండి మా లివింగ్ రూమ్ దివ్యం అని గోడలు గుమ్మాలు ఉండవల్సిన చోట లేవని రెండోసారి తెలిసిందంటారు.”

“మొదటిసారి సరిగ్గా ఉన్నవి రెండోసారి ఎలా మారుతాయి. దిక్చూచి చూపించడంలో ఏదో మార్పు ఉండి ఉండవచ్చు” అన్నాను.

“అదే అర్థం కావడం లేదండి” అన్నారు ప్రభాకరం గారు విచారంగా. “మీరొక్కసారి వచ్చి మా ఇల్లు చూడండి” అన్నారు అభ్యర్ధనగా.

“నాకు వాస్తు తెలియదండి” అన్నాను నిర్మొహమాటంగా.

“అమ్మమ్మ! అలా అనకండి ఒకసారి మా ఇంటికి వచ్చి చూడండి. మీ సలహా పాటిస్తాను. ఈ ఇల్లు ఎలాగైనా అమ్మించండి దయ ఉంచి” అన్నారు ప్రభాకరంగారు వేడికోలుగా.

అంత పెద్దాయన, అంతలా ప్రాధేయపడుతుంటే కాదనలేక వస్తానన్నాను. వాస్తు తెలియకపోయినా!

* * *

మర్నాడు ప్రభాకరంగారి ఇంటికి వెళ్ళాను. ఆయనకి సంగీతం అంటే అభిమానం మాత్రమే కాదు. బాగా నేర్చుకొన్నారు. ఇక్కడ సంగీతం నేర్పుతుంటారు. అమెరికాలో సంగీతం నేర్పే గురువులలో మొదటి తరానికి చెందినవారు. ఆయన అభిరుచికి అద్దంపట్టేటట్లు వారి లివింగ్ రూమ్ ఉంది. ఇంటినిండా స్పీకర్లు పూర్వం రోజులలోవి అవ్వడం వల్ల పెద్దపెద్దగా చక్కగా అమర్చిన స్పీకర్లు లివింగ్ రూమ్ కి అందం ఇస్తున్నాయి.

ఇల్లంతా చూసిన తరువాత లివింగ్ రూమ్ లో సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నాం.

“ఏమంటారు” అన్నారు ప్రబాకరం గారు.

“ఇల్లు చాలా బావుంది. ఇది వాస్తు ప్రకారం అయినా అవకపోయినా చాలా హాయినిచ్చే ఇల్లులా అనిపిస్తుంది. కాని నేను మీకేమి సలహా చెప్పలేను” అన్నాను.

“మీరు ఏదో ఒక ఉపాయం చెప్తారని”

“ముందే చెప్పానుగా నాకు వాస్తు తెలియదని” వినయంగా అన్నాను.

“మీరు శాస్త్రజ్ఞులు” కదా అన్నారు. ఈ విషయాన్ని కొంత పరిశోధించవచ్చుగా అనే ఆలోచన ప్రతిధ్వనిస్తూ.

“వాస్తు ప్రకారం ఒకసారి బాగుండి మరోసారి బాగుండకపోవడానికి అవకాశం లేదండి”

“అదేనండి ముందుసారి బాగున్నట్లు రెండోసారి ఎందుకు బాగోలేదని” మొదటే బాగోలేదంటే సరేలే అని మరొకరికోసం ఎదురు చూసేవాళ్ళం.”

“ముందుసారికి రెండోసారికి ఏమైనా మార్పు ఉందా?” ఆయన ఆలోచనలో పడ్డారు.

“ఏమీలేదండి. ముందుసారి ఆయన వచ్చింది ఆదివారం. రెండోసారి వచ్చింది మంగళవారం. ముందుసారి వచ్చింది సాయంత్రం, రెండోసారి వచ్చింది ఉదయం.” నాకు ప్రత్యేకంగా ఆలోచించడానికి ఏమీలేక లివింగ్ రూమంతా చూస్తున్నాను. ఉన్నట్టుండి స్పీకర్ల మీద పడింది నాదృష్ఠి. నాలుగు పెద్ద పెద్దవి మరో నాలుగు చిన్నవి ఉన్నాయి. వెంటనే ఓ ఆలోచన స్ఫురించింది.
“ప్రభాకరంగారు, ఈ స్పీకర్లు ఎప్పుడూ ఒకోచోట ఉంటాయా లేక మారుస్తుంటారా?”
“కచేరి అయితే అన్ని స్పీకర్లు వాడతాం. అప్పుడు వీటిని ఈ లివింగ్ రూము అంతా చక్కగా వినిపించేటట్లు ఏర్పాటు చేస్తాం. ఏం వాటిగురించి అడుగుతున్నారు?”

నా ఆలోచనకు బలం వచ్చింది. ఒకసారి ఒకలాగ మరోసారి ఇంకోలాగా వాస్తు ప్రసాద్ కి అనిపించడం కరక్టేనని తోచింది. దానికి కారణం స్పీకర్లే అని అనిపించింది.

“మీరు ఆదివారం కచేరి చేసారా?” అన్నాను.

“అవును చేసాను మీకు ఎలా తెలిసింది?”

ఆయన సమాధానంతో నాకు చిక్కుముడి విడినట్లయింది.

“ఆదివారం ఈ స్పీకర్ల అమరిక వల్ల వాస్తు ప్రసాద్ దిక్చూచికి కోణాలు కావల్సినట్లు చూపించింది. మంగళవారం మీరు వీటిని మార్చడం వల్ల అతని దిక్చూచి కూడా మారినట్లు చూపించింది. మీరు మళ్ళీ అతను వచ్చేటప్పటికి ఆదివారం అమర్చినట్లు స్పీకర్లు అమరిస్తే అతని దిక్చూచి అతని వాస్తుకి కావల్సినట్టు చూపిస్తుంది” అన్నాను.

“అంతే అంటారా?”

“అంతే”అన్నాను నిశ్చయంగా

- - -

ఓ నాలుగు రోజుల తర్వాత ప్రభాకరం గారు ఫోనుగీను లేకుండా ఇంటికి వచ్చారు. తలుపు తియ్యగానే రెండు చేతులు పట్టుకొని “మీరు గొప్ప సహాయం చేసారు. మీరు చెప్పినట్టే ఆ స్పీకర్లను అమర్చాం. వాస్తు ప్రసాద్ వచ్చి చూసుకొంటామన్నారు. ఇవాళ వాళ్ళ లాయర్ దగ్గర నుండి కాంట్రాక్ట్ వచ్చింది. మీ గొప్ప సహాయం మరువలేను” అన్నారు.

“చాలా సంతోషం రండి కూర్చోండి.” అన్నాను ఆనందంతో. ఆయన ఆనందంతో ఏవేవో మాట్లాడారు.

“మీకు వాస్తు తెలుసు. తెలియదని చాలా వినయంగా అంటారు” అన్నారు ప్రభాకరం గారు

“నాకు నిజంగా వాస్తు తెలియదండి” అన్నాను నిజాయితీగా.

“అమ్మమ్మ! అలా అనకండి. లేకపోతే ఒక్క సలహాతో అంత సులభంగా ఈ సమస్య ఎలా తేలిపోతుంది?”

“అంతా మీ స్పీకర్ల మహత్యం”

“స్పీకర్లా? వాటికి వాస్తుకి సంబంధం ఏమిటి?”

“స్పీకర్లలో అయిస్కాంతం ఉంటుంది. అది దిక్చూచి మీద పని చేస్తుంది. వాస్తు ప్రసాద్ ముందుసారి వచ్చినపుడు వాటి ప్రభావం వల్ల దిక్చూచి ఒకలా చూపిస్తే, మరోసారి వచ్చినపుడు, మీ స్పీకర్ల స్థానం మారింది కాబట్టి మరోలా చూపించింది. అంతే! ముందుసారి ఆయనకి నచ్చినతీరులో ఉంది. మళ్ళీ అలా చూపించడానికి మీ స్పీకర్లు పాత పద్ధతిలో ఏర్పాటు చేస్తే సరిపోయింది.” అన్నాను మేజిక్ రహస్యం విప్పిచెప్పిన మాంత్రికుడిలా.

“అందుకే కిడంబి రఘునాధ్ గారు అన్నారు మీరు అభయ టెక్నాలజిస్ట్” అని , మీరు మమ్మల్ని ఈ ఆర్థిక ఇబ్బందులలో గట్టెక్కించారు.

“సంతోషం” అన్నాను కిడంబిరఘునాధ్ గార్ని తలుచుకొని.


* * *

వంద అబద్దాలు ఆడి అయినా ఒక పెళ్ళి చెయ్యమన్నారు పూర్వం. ఇటువంటి ఆర్థిక ఇబ్బందులలో వంద అబద్ధాలు ఆడి అయినా ఒక ఇల్లు అమ్మించడం అత్యాధునిక అవసరం.






0 వ్యాఖ్యలు

హచ్...!

దేముడికి కష్టం వచ్చింది.
దేముడి పూర్తి పేరు భుజంగ దేవర.
ఆయన తన నియోజక వర్గంలోని ప్రజలకు దేవుడే. దేవుడంటే ఎపుడూ వరాలు ఇచ్చేవాడే కాదు. ‘దుష్ట శిక్షణ’ చేసేవాడు కూడా. పాపులు ఎక్కువైపోయిన ఈ రోజుల్లో భుజంగదేవర ఆలియాస్ దేవుడు గారు శిక్షించదనికే అవతారమెత్తిన దేవుడు. అయితే ఆయన ఎక్కువకాలం హైదరాబాదు, డిల్లీలో ఉండి ‘ప్రజాసేవ’ చేస్తుంటారు. కాబట్టి ఆయన నమ్మినబంటులు ప్రజలను శక్తివంచన లేకుండా శిక్షిస్తూంటారు. ఇప్పుడుదాకా దేవుడుగారు ఆ నియోజక వర్గం ఎమ్మెల్యే. ఆయన గత చాలాఏళ్ళుగా ఆనియోజక వర్గం ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆయన ఎన్నికల్లో ‘ప్రజాసేవకోసం’, ‘ప్రజలకోరికపై’ ‘ప్రజలబాగుకై’నిలబడుతూ ఉంటారు అందుకే ఆయన ఎపుడూ ఓడిపోరు.

ఎంత కలికాలం అయనా భరతఖండంలో రాను రాను ‘ప్రజాసేవ’ చెయ్యాలన్న ప్రగాఢమైన కోరిక చాలా చాలామందికి పుట్టుకొస్తున్నది. బస్తాలకొద్ది డబ్బు ఖర్చుపెట్టి అయినా సరే, ఎన్నికల్లో నిలబడి, గెలిచి ‘ప్రజాసేవ’ చెయ్యలన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోయినది. దేవుడులాంటి నాయకులను ఓడించడం మాట అలా ఉంచి అసలు ఎదిరించి నిలబడడమే కష్టం. ఒకవేళ పోటీకి నిలబడ్డా ఓడిపోవడం ఖచ్చితం. అందుకే అలా జరిగింది. దేవుడుగారు గెలిచారు.

కాని ఓడిపోయిన అభ్యర్ధి అక్కడితో ఊరుకోక దేవుడిగారి మూలాలు వెతికాడు. ఆ నియోజక వర్గం ఎస్టీలకు కేటాయించబడింది. దేవుడు ఎస్టీ. ఓడిపోయిన అభ్యర్ధి తీగలాగడంవల్ల దేవుడు గారు ఎస్టీ కాదని తేలింది. కోర్టు ఓ నాలుగేళ్ళ తరువాత తీర్పు ఇచ్చింది. దేవుడుగారి ఎలక్షన్ చెల్లదని అందుకే దేవుడు మాజి ఎమ్మెల్యే గారు అయ్యారు. దొంగ ఎస్టీ సర్టిఫికెట్ పెట్టినందుకు ఆయన్ని ఎవరూ శిక్షించలేదు. ఎందుకంటే ఆ నియోజక వర్గంలో ఎవరినైనా ‘శిక్షించేది’ ఆయన కాబట్టి. ఇప్పుడు ఆయన ఎస్టీ కాదని తేలింది. కాబట్టి రాబోయిన ఎన్నికల్లో నిలబడడానికి వీలుకాదు. అది దేవుడికి ఇప్పుడు వచ్చిన కష్టం.

వంగరాణి దేవుడి నియోజక వర్గంలో ఒక సామాన్య స్త్రీ. ఆమె భర్త చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొంటూ ఏదో కొంత సంపాదించుకుంటాడు. ఆ సంపాదనని అతి జాగ్రత్తగా పొదుపుగా ఖర్చుపెడుతూ తమ వీధిలోకెల్లా బాగా ఉన్నవాళ్ళు అనిపించేలా సంసారం నడుపుకొస్తున్నది. ఆమెలాంటి వాళ్ళు దేవుడి నియోజక వర్గంలో చాలామంది ఉండవచ్చు కాని ఆమెకో ప్రత్యేకత ఉంది. ఆమె తండ్రిడి నిజమైన ఎస్టీ కులం.. ఆమె తల్లి కులం బిసి. ఆమె తండ్రి ఎస్టీ అన్న విషయం ఎక్కడో రికార్డులలో తప్ప ఎవరికి తెలియదు. అది తెలుసుకొన్నారు దేముడు మనుషులు. తండ్రి ఎస్టీ కాబట్టి వంగరాణి ఎస్టీ. అంచేత ఆమె పోటీ చెయ్యడానికి అర్హురాలు అని నిశ్చయించి, ఆమె భర్తను వొప్పించి, చచ్చిపోయిన ఆమె తండ్రిని చాలా గొప్పవాడిని చేసి వంగ రాణిని దేముడిగారి అభ్యర్ధిగా ఎన్నికల్లో నిలబెట్టారు.

దేవుడిగారి మీద కోర్టులో విజయం సాధించిన వ్యక్తికి టికెట్టు ఇస్తే ఈ మారు తమ పార్టీ తప్పనిసరిగా గెలుస్తుందని అపోజిషన్ పార్టీ నిశ్చయించింది. అతనికి టికెట్టు ఇచ్చింది. అతని పేరు వీరభద్ర దొర. అతను నిజంగానే ఎస్టీ. ఎస్టీ రిజర్వేషన్ మీద చదువుకొన్నాడు. మిగిలిన ఎస్టీలను మొదలైన వాళ్ళని కూడగట్టుకొని గిరిజన వనరుల వ్యాపారంలో మంచి సంపాదన కలిగి ఉన్నవాడు. ఒకస్థాయి సంపాదన దాటిన తరవాత అధికారం, ఆ అధికారం వల్ల వచ్చే ఎన్నోరెట్ల సంపాదన మీద ఆశ మళ్ళకంలాంటి కారణాలవల్ల వీరభద్ర దొర అతి సౌమ్యుడుగా కనిపిస్తాడు. మంచి వ్యాపారవేత్త, వ్యవహారకర్త కూడా కాబట్టి రాజకీయాలలో రాణించడం పెద్ద కష్టం కాలేదు. కాకపోతే ఒక్క దేవుడిని ఓడించడం అతని వల్ల కాలేదు. ఈ మారూ దేవుడు నిలబెట్టిన వంగరాణిని ఓడించడం కష్టం కాదనుకొన్నాడు. అయినా సరే తను ఖర్చు పెట్టవలసిన డబ్బు జాగ్రత్త చేసుకొన్నాడు. తను దేవుడిది దొంగ ఎస్టీ సర్టిఫికెట్ అని కోర్టులో నిరూపించడం ద్వారా కూడా తనకు అనుకూలంగా పనిచేస్తుందనుకొన్నాడు. అతను ఊహించింది ఒకటైతే జనం మధ్యే జరిగింది మరొకటి.

‘దొంగ’ సర్టిఫికెట్ విషయంలో వివరాలు సగం తెలిసి సగం తెలియక మాట్లాడుకొనే జనం ఇతనిని ‘దొంగ దొర’ అనడం మొదలుపెట్టారు. ఆకతాయిలు ‘దొంగ దొర’ ‘వంగరాణి’ అని గోడలమీద రాసారు. అలా ఈ మారు ఎన్నికల్లో ‘దొంగ దొర’ ‘వంగరాణి’ పోటీలో ఉన్నారు.
ఎన్నికల ప్రచారాలు భారీగా సాగుతున్నాయి. వంగరాణిని ప్రతీరోజూ ఉదయం దేవుడి మనుషులు ఇంటికివచ్చి కారులో ప్రచారానికి తీసుకొని వెళుతున్నారు. ఆరోజు కూడా వంగరాణి తన మనుషులతో ఇంటి గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నది రావలసిన కారు కోసం.

వంగరాణి అత్తగారు ఇవేవి పట్టనట్టు ఇంటి ముందు ఉన్న అరుగుమీద చోడి గింజలు ఎండ బెట్టుకొంటున్నది. అరుగుకు ఆనుకొని ఉన్న పిట్టగోడ మీద ఒక కోడి నిలబడి చోడిగింజల వైపు ఆశగా చూస్తున్నది. కాని వంగరాణి అత్తగారి చేతిలోని కర్ర వైపుకూడా చూస్తున్నది. ఆమె చూపు చోడిగింజల నుండి మళ్ళి వెళ్ళబోతున్న కోడలివైపు తిరిగింది. ఆ అదును చూసుకొని కోడి చోడిగింజల పైకి దూకబోయింది. సరిగ్గా అదే సమయానికి అత్తగారి ముక్కుమీద ఓ సీతాకోకచిలుక వాలింది. దాని ప్రభావం వల్ల అత్తగారికి గట్టి తుమ్ము వచ్చింది. ఆమె తుమ్ము అకస్మాత్తుగా రావడం వల్ల పిట్టగోడ మీద నుండి కిందికి దూకుతున్న కోడి గాబరా పడి రోడ్డుపైపు ఎగిరింది. ఎగురుతూ వస్తున్న కోడిని ఆఖరిక్షణంలో చూసిన ఒక మోటర్ సైకిల్ మీద వెళుతున్న వ్యక్తి దాన్నుండి తప్పించుకొనే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న కారును గుద్దాడు. మోటర్ సైకిల్ మనిషి కింద పడ్డాడు. కారు మరోవైపునకు తిరిగి ప్రక్కనే ఉన్న రోడ్డు గుంతలో పడి ముందుకు వెళ్ళి కాల్వలో ముందు చక్రం పడ్డంవల్ల బురదలో కూరుకు పోయింది.

మోటర్ సైకిల్ మనిషిని అందరూ గట్టిగా తిట్టారు. అతని తప్పేమీ లేదని వంగరాణి చెప్పడంతో అతన్ని వదిలేసారు.

కారు నుండి దిగిన కామయ్యసెట్టిని వంగరాణి పరామర్శించింది. కారు డ్రైవర్ కి కాని కామయ్యసెట్టికి కాని పెద్దగా దెబ్బలు తగలలేదు. ఎంత ప్రయత్నించినా కాలవలో పడ్డ కారు మాత్రం బయటకు రాలేదు. బయటకు తియ్యడానికి మనుషుల్ని పిల్చుకొస్తానని డ్రైవర్ వెళ్ళాడు. కామయ్యసెట్టి, వంగరాణి కబుర్లు చెప్పుకొంటున్నారు. ఇక్కడ జరిగింది పెద్ద ఏక్సిడెంట్ కాకపోయినా ఎవరూ కంప్లయింట్ ఇవ్వకపోయినా దారినపోతూ చూసి ఓ సైకిల్ కుర్రాడు ముందు జంక్షన్ లో ఉన్న ట్రాఫిక్ పోలీసుకు చెప్పాడు.

ట్రాఫిక్ పోలీసు పరుగు పరుగున వచ్చి వివరాలడిగాడు. కామయ్యశెట్టి, వంగరాణి ఆ ట్రాఫిక్ పోటీసును పట్టించుకోకుండా వెళ్ళిపొమ్మని కసిరారు. ట్రాఫిక్ పోలీసుకు కోపం వచ్చింది. పోలీస్ స్టేషన్ కి ఫోను చేసి ఎస్సైకి ఈ విషయం చెప్పాడు. రాష్ట్రం అంతా ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు పోలీసులు కార్లు చెక్ చేసి డబ్బులు పట్టుకొంటున్నారు. వారంరోజులైనా తనకి అలాంటి కేసొక్కటీ తగలలేదని నిరాశలో ఉన్న ఎస్సైకి ఇదో మంచి అవకాశం అనిపించింది. అందులోను ఓ వ్యాపారస్థుడు, ఓ రాజకీయ వ్యక్తి కలగలసి ఉన్నారు. ఇందులో ఏదో ఒక మతలబు ఉండాలి అని హుటా హుటిన వచ్చాడు. కారు చెక్ చేస్తానన్నాడు.

' నీకు మతికాని పోయిందా ‘నాను ఏపారం చేసుకొనేవాడిని నాకు ఈ రాజకీయాలు తెలవవు’ అన్నాడు కామయ్యశెట్టి.
అయినా సరే నా డ్యూటీ నాది అని ఎస్సై కారు తనిఖీ చేసాడు. నిజంగానే ఆకారులో లక్షరూపాయిల కేష్ దొరికింది. ఎస్సై మహదానందంతో ఆ డబ్బు తీసుకొని కామయ్య శెట్టిని కోర్టుకు రమ్మన్నాడు. తమ వ్యాపారానికి ఇంతకన్నా ఎక్కువ డబ్బే రోజూ కారులో తీసుకెళతానని ఎంత వాదించినా వినలేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయపడిపోయిన వంగ రాణి నోరు విప్పలేదు. కామయ్యశెట్టిని తీసుకొని ఎస్సై పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయాడు.

కామయ్య శెట్టి వంగ రాణికి ఎలక్షన్ లో పంచడానికి కేష్ ఇస్తూ దొరికిపోయాడని ఊరంతా గుప్పుమంది. దేవుడికి ఈ విషయం తెలిసి వెంటనే వంగరాణిని రప్పించి విషయం అడిగారు. నిజం చెప్పమని బెదిరించారు. ఆ డబ్బుతో నాకేమీ సంబంధం లేదని గట్టిగా చెప్పింది. కామయ్య శెట్టి కూడా అదే చెప్తున్నాడని అంది. దేముడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎస్సైతో అదే చెప్పాడు. మాకు ఈ డబ్బుతో సంబంధం లేదు అని. అయితే రసీదు రాసిస్తాను తర్వాత వచ్చి డబ్బు తీసుకెళ్ళమని ఎస్సై అన్నాడు. తన ఖాతాలో ఒక బోణి ఎలక్షన్ కేసు రాసుకున్నాడు ఎస్సై.

ఈ విషయం ఇటు ప్రజలలో అటు దేవుడి మనసులో కల్లోలం రేపింది. ‘ఇప్పట్నించే డబ్బులిచ్చేస్తున్నారుట’ అని ప్రజలు, ‘డబ్బులివ్వడంలో మనం చాలా జాగ్రత్తపడాలి’ అని దేముడు గట్టిగా అనుకపన్నారు.
‘దొంగదొర’ అమ్మె ఇప్పటినుండే ఏంచేస్తున్నారా? అని ఆశ్చర్యపడి పోయాడు. కాని తనుకూడా ఇప్పటినుండి పంచడానికి కావలసినంత డబ్బు లేదని భాదపడ్డాడు. పోన్లే వాళ్లని ఇప్పటి నుండే పంచనీ నేను చివరిలో పంచుతానులే అని అనుకొన్నాడు.
దేవుడు తన మనుషులని పిలిచి ఇచ్చిన డబ్బు చాలా జాగ్రత్తగా పైకి తెలియకుండా తాపీగా పంచమని ఆజ్ఞలు జారీ చేసాడు. గెలిచేది ‘వంగ రాణి’ కాని ఆజ్ఞ ఇచ్చేది దేముడు. కింద పనిచేసేవాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. దేవుడు ఇంక ఎప్పటికీ ఇక్కడ పోటీ చెయ్యలేడు కాబట్టి పదవి ఉన్న నాయకుడు కాలేడు అని నిశ్చయించుకున్నారు. ఇతన్ని అంటిపెట్టుకొని ఇన్నేళ్ళు ఉన్నందుకు ఎక్కువగా ఏమీ మిగలలేదు. నియోజక వర్గంలో ఒక్కో అభ్యర్థికి కోటిపైనే ఖర్చు దాటిందని ఆనోట ఈనోట ఆపేపర్లో, ఈ పేపర్లో విన్నారు దేవుడి మనుషులు. తమకి పంచమని ఇచ్చిన లక్ష పూర్తిగా పంచకపోతే? అన్న ప్రశ్న ఉదయించింది అతని కింద మనుషులలో. అదికూడా చాలా జాగ్రత్తగా పంచమన్నాడు కదా మరి జాగ్రత్తగా పంచడం అంటే పైకి తెలియకుండా జరగాలి కదా ఇందులో సగం నొక్కేస్తేనో అన్న ఆలోచన కూడా వారిలో మొదలైంది.
- - -
ఎలక్షన్ ప్రచారం సాగుతున్నది. అభ్యర్థులకు డబ్బు నీళ్ళలా ఖర్చు అవుతున్నాది. దేవుడే వంగరాణి తరఫున ఖర్చంతా పెడుతున్నాడు. వంగరాణి జాకీ బొమ్మలా అతని వెంట తిరుగుతున్నది. దేవుడి మనుషులు మొదటిసారి ఇచ్చిన డబ్బులో సగం దాచుకొని మిగతాది ఖర్చుపెట్టారు. ప్రచారం జోరులో దేవుడు అంతగా పట్టించుకోలేదు. రాను రాను దేవుడి మనుషులు పంచమని ఇచ్చినదానిలో పదో వంతు మాత్రమే పంచి మిగిలింది దాచేసుకున్నారు.
అంతా దొంగ సొమ్ము. ‘దొంగల తల్లికి ఏడవ భయం’ అన్న సామెతలా దేవుడికి కొద్ది కొద్దిగా తెలిసినా ఎన్నికలు అవ్వనీ వీళ్ళ పని పడతానని మనసులో అనుకుని ఎవరితోనూ గొడవ పడలేదు.
- - -
ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వచ్చాయి. వంగరాణి ఓడిపోయింది. దేవుడు ఢీలాపడిపోయాడు. తన రాజకీయ జీవితానికి తెర దిగినట్లుగా భాదపడ్డాడు. అసలు ఎందుకిలా జరిగిందని విచారించాడు. నిదానంగా విషయం పూర్తిగా తెలుసుకొంటే కనీసం రాబోయే కాలంలో మరో ఎత్తు వెయ్యొచ్చు అని అనుకొన్నాడు. తన క్రింద పనిచేసిన వాళ్ళు డబ్బు పంచకపోవడం వల్లే తన అభ్యర్థి వంగరాణి విషయం గ్రహించేడు.
కారణాలను వెతికాడు. తెలిసుకొన్నాడు. ఈ డబ్బు వ్యవహారానికంతటికి మూలకారణం కామయ్యశెట్టి, వంగరాణి మంతనాలు అని అనుకొన్నాడు. వంగరాణిని పిలిపించాడు. వివరంగా వాళ్లిద్దరి మధ్య ఆనాడు జరిగిన విషయం చెప్పమన్నాడు. వంగరాణి భయపడి, భోరుమని ఏడ్చి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానని ఇలా మొదలుపెట్టింది. తన అత్తగారి ముక్కుమీద సీతాకోకచిలుక వాలడం ఆమె ‘హచ్...’ అని తుమ్మడం దానివల్ల కోడి భయపడి ఎగిరి మోటర్ సైకిల్ వాడిపై పడడం వాడు వెళ్ళి కారుని గుద్దడం, కారు చక్రం వెళ్ళి కాలవలో పడ్డం, పోలీసు రావడం, పోలీస్ స్టేషన్ లో దేవుడు వచ్చి సర్ది చెప్పడం దాకా అంతా వివరంగా చెప్పింది మళ్ళీ.
అయితే ఆ సీతాకోక చిలక వంగరాణి అత్తగారి ముక్కుమీద వాలకపోతే, ఆమె ‘హచ్....’ అని తుమ్మకపోతే, కోడి గాభరాపడి ఎగిరి మోటర్ సైకిల్ వాడిపై పడకపోతే, వాడు కారు గుద్దకపోతే, కారు వెళ్ళి కాలవలో పడకపోతే, పోలీసు రాకుంటే ఈ డబ్బు గొడవ జరిగుండేది కాదు కదా! అని వాపోయాడు. ముక్కుమీద తన రెక్కాడించిన సీతాకోకచిలుకని తన నియోజకవర్గంలో నిషేధించాలని భావించాడు. ఏమనుకున్నారో ఏమోగాని అప్పటినుండి దేవుడు తన ముందు ఎవరూ ‘హచ్.....’ అని తుమ్మడానికి వీలులేదని శాసించాడు.



0 వ్యాఖ్యలు

చెట్టు చెప్పిన పాఠం

మామిడితోటల మధ్య మా కాలేజి గురుకులాన్ని గుర్తు తెస్తుంది. ఊరికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉన్న కాలేజి కాంపస్ లోకి అడుగు పెడితే వేరే లోకంలో ఉన్నట్లు ఉండేది. కొందరు కాలినడకనగాని, మరికొందరు సైకిల్ మీద కాని కాలేజీకి వెళ్ళే వాళ్ళు. ఒక్క ప్రిన్సిపాల్ గారు మాత్రం ఒక పాతకారులో వచ్చేవారు. ఎపుడు నవ్వుతూ ఆనందంగా ఉండేవారు. తన చుట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉంచేవారు. అటువంటి వారిని సాధువు అని అంటారు. ఆ లెక్కన మా ప్రిన్సిపాల్ గారు కూడా సాధువే. కాని ఆయన రూల్సు మనిషి. ఆయన పెట్టిన రూల్సుని ఎవ్వరూ తప్పకూడదు. ఆయన కూడా. చిన్న చిన్న తప్పులకు శిక్ష విధించేవారు. జరిమానా రూపంలో ఉండేది. దాన్ని తప్పకుండా కట్టాల్సిందే. అది పూర్ బాయిస్ ఫండ్ కి వెళుతుంది. దానితో ఫీజు డబ్బులు కట్టలేని అర్హులైన విద్యార్థులందరికి జీతం కట్టేవారు. ఆయన చేసిన తప్పులకి అపుడపుడు ఆయన కూడా ఈ పూర్ బాయిస్ ఫండ్ కి డబ్బులు కట్టేవారు. ఎప్పుడు పడితే అప్పుడు మామిడి తోటలో విద్యార్థులు కాయలు కోయకూడదు. అది ఆయన పెట్టిన రూల్సులో ఒకటి. దాన్ని ఎదిరించిన వాళ్ళు ఇప్పటిదాకా ఎవ్వరూ లేరు.

మా కాలేజీ అంతటికి అతి పెద్ద హీరో బి.ఏ మూడవసంవత్సరంలో ఉన్న కిషోర్. వంశపారంపర్యంగా వచ్చిన అహంకారం అతనికి పెద్ద అలంకారం. అంత పొడవైన వాడు కాడు. అందుచేత ఎత్తు మడమల బూట్లు వేసుకొస్తాడు. అంత అందమైన వాడు కాడు. అందుచేత జుత్తు రకరకాల స్టైల్సులో దువ్వుకొని వస్తాడు. అంత మంచి మాటకారి కూడా కాడు. అందుచేత అందరిని చూపులతోనే బెదిరిస్తాడు. కాదంటే నోటికి వచ్చినట్లు అరుస్తాడు. రోజూ మోటర్ బైక్ మీద వస్తాడు. నలుగురిని తనతో తిప్పుకుంటాడు. కేంటీన్లో నలుగురిని పోగేసి గప్పాలు కొడుతుంటాడు. తనతో ఉన్న వాళ్ళందరికి టీలు పోయిస్తాడు. నీ అంతటివాడు ఈ కాలేజీలోనే లేడని అనిపించుకొంటాడు, తన మిత్రబృందంతో. ఈ ఏడాదే రాజధాని నుండి వచ్చి ఈ కాలేజిలో చేరాడు. అతనికి ఉన్న అతి ముఖ్యమైన క్వాలిఫికేషన్ వాళ్ళ నాన్న ఈ కాలేజి కరస్పాండెంట్ అవ్వడమే. అందుచేత అతన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరన్న భావన అతనికి అతని మిత్రబృందానికి ఉంది, చాలా గట్టిగా.
అయితే అనుకోకుండా, జరిగిన సంఘటన వల్ల ఆభావనకి కొద్దిగా నమ్మకం సడలింది. కిశోర్ కేంటీన్లో మిత్రబృందంతో సమావేశమై టీ తాగుతుండగా ప్రిన్సిపాల్ ఫైన్ల మీదకి మళ్ళాయి వాళ్ళ మాటలు. ఈ కాలేజిలో ప్రిన్సిపాల్ వేసే ఫైన్లని ఎవ్వరూ ఎదిరించలేరని కట్టవల్సిందేనని మిగిలినవాళ్ళు అన్నారు. “కట్టకపోతే?” అన్నాడు కిషోర్ పొగరుగా. “ఇన్నేళ్ళలో కట్టని వాళ్ళు ఒకళ్ళు కూడా లేరని” అన్నారు మిగిలిన వాళ్ళు. “సరే నేనే ఓ రూలు బ్రేక్ చేస్తాను. ఫైన్ వేసినా కట్టను. బెట్!” ఏంచేస్తాడేం ఈ ప్రిన్సిపాల్? వెళ్ళి మానాన్నకి చెప్పుకుంటాడా? అని వెటకారంగా నవ్వాడు కిషోర్.
“అవున్రా! నువ్వు ఫైన్ కట్టకపోతే ఇక ఈ రూల్సు, ఫైన్స్ పోతాయి. నువ్వు మన స్టూడెంట్లందరికి గొప్ప సాయం చేసినవాడవవుతావు అని రకరకాలుగా చెప్పి అతని చేత ఏదైనా ఒక రూల్ బ్రేక్ చేయించి తమాషా చూద్దామని అందరూ అతడిని ప్రోత్సాహించారు. కాలేజి మామిడితోటలోని మామిడికాయలు కోయకూడదన్న రూలు అందరికి చాలా కష్టం కలిగించేది. ఈ రూల్ నే ఎదిరిస్తే అన్న ఆలోచన వచ్చింది కిషోర్ కి.

కిషోర్ని ఓ మామిడిచెట్టు ఎక్కి కాయలు కోయమన్నారు. కిషోర్ సరేనన్నాడు. చెట్టు ఎక్కి కాయలు కోయడం మొదలుపెట్టాడు. “నాకొకటి రా నాకొకటిరా....” అంటూ మిత్రులంతా కాయలు కోయించుకొంటున్నారు. తోటమాలి వచ్చి కేకలు వేసాడు. కిందనున్న కుర్రాళ్ళంతా పారిపోయారు. కిషోర్ చెట్టుమీదనే ఉండిపోయాడు. తను ప్రిన్సిపాల్ కి కాయలుకోస్తూ దొరకాలి. ఫైను వేయించుకోవాలి. ఫైను కట్టనని చెప్పాలి. అందుచేత కిషోర్ చెట్టు దిగే ప్రయత్నం చెయ్యలేదు. అదే విషయం తోటమాలికి చెప్పాడు. తోటమాలి వెళ్ళి ప్యూన్ కు చెప్పాడు. ప్యూన్ వెళ్ళి ప్రిన్సిపాల్ కి చెప్పాడు. ప్రిన్సిపాల్ నడుచుకుంటూ వచ్చి చెట్టు క్రింద నిలబడి చెట్టు దిగవోయ్ అన్నారు తలఎత్తి చెట్టు మీదనున్నకిషోర్ని చూస్తూ.

“మీరు ఫైన్ వెయ్యనంటే దిగుతాను” అన్నాడు కిషోర్.

“ఎందుకెయ్యను ఫైన్ వెయ్యడానికే వచ్చాను.”

“నేనెవరో తెలుసా?” అన్నాడు కిషోర్ గర్వంగా.

“దిగొచ్చాక అవన్నీ చెప్పు” అన్నారు ప్రిన్సిపాల్ నువ్వెరైతే నాకేంటి అన్నట్లు.

“మీరు ఫైన్ వెయ్యలేరు.”

“ఎందుకు వెయ్యలేను?”

“నేను కరస్పాండెంట్ గారి కొడుకుని”

ఓరి, నువ్వ ట్రా! “అయితే ఫైన్ డబుల్ వెయ్యాలి” అన్నారు ప్రిన్సిపాల్

“మా నాన్నకి తెలిస్తే మిమ్మల్నేం చేస్తారో తెలుసా?”

“ఆయన పెట్టిన కాలేజీని బాగా నడుపుతున్నానని గర్విస్తాడు.”

“కాదు. ఎంత పొగరు నీకు? నా కొడుకుకే ఫైన్ వేస్తావా అని వార్నింగ్ ఇస్తారు. ఆయన తల్చుకుంటే మీ ఉద్యోగం తీసేయగలుగుతారు” అన్నాడు కిషోర్ చెట్టుమీద నుండి క్రిందకు చూస్తూ.

“ఓరేయ్ వెధవేషాలు మానేసి కిందకి దిగు. ఫైన్ కట్టి ఇంటికి ఫో.” అన్నారు ప్రిన్సిపాల్ నవ్వుతూ.

“టూమచ్ చేస్తున్నావ్. తరువాత బాధపడతావ్! ”

“తప్పు చేసినప్పుడు అప్పటికప్పుడే అనుభవించేస్తే సరి లేకపోతే నిజంగానే నువ్వన్నట్టు టూమచ్ అవుతుంది. చాలాకాలం బాధ పడవల్సి వస్తుంది” అన్నారు ప్రిన్సిపాల్ గారు చెట్టుమీద వున్న కిషోర్ ని సూటిగా చూస్తూ.

అప్పటికే చాలామంది స్టూడెంటులు, రోడ్డు మీద పోయే వాళ్ళు, కొంతమంది లెక్చరర్లు అక్కడకి చేరారు.

“నువ్వు దిగుతావా? దిగనంటే చెప్పు నేను కుర్చీ తెప్పించుకుంటాను” అన్నారు ప్రిన్సిపాల్ గారు.

“నేను దిగను” అన్నాడు కిషోర్ పంతంగా

“ఓరేయ్ సోములు నాకు కుర్చి, టేబుల్ తీసుకురా! ఈ చెట్టు క్రిందే వెయ్యి,” అని ప్యూన్ కి చెప్పి తలెత్తి చెట్టు మీదనున్న కిషోర్ని చూసి నేనిక్కడున్నా నాపని ఏదీ ఆగిపోదు. అని అపుడే అక్కడేం జరుగుతున్నదో అని చూడడానికి వచ్చి ఆగుంపులో చేరిన కాలేజి క్లర్కుని చూసి “మీరు ఇవాళిటి ఫైళ్ళు తీసుకొని రండి” అని చెప్పారు.

“అలాగే సార్” అని క్లర్క్, ప్యూన్ కదిలారు.

“వస్తున్నప్పుడు నాకు కాఫీ తీసుకని రండి” అని గట్టిగా అరిచినట్లు చెప్పారు. వెళ్ళిపోతున్న వాళ్ళిద్దరూ వినాలని అంత కన్నా ముఖ్యంగా చెట్టుమీదనున్న కిషోర్ వినాలని.

ప్రిన్సిపాల్ గారు మిగిలిన వాళ్ళతో ఏవేవో కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు. టేబుల్, కుర్చి, ఫైళ్ళు, కాఫీ వచ్చాయి. అయితే చెట్టుమీద ఉన్న కిషోర్కి కనిపించేలా చెట్టు కింద టేబుల్, కుర్చి వేయించుకుని కూర్చొని కాఫీ తాగుతూ ఫైళ్ళు చూడడం మొదలుపెట్టారు

దూరంగా కారు హారన్ వినిపించింది. గుంపు అంతా అటు తిరిగి చూసారు. నీలిరంగు ఎంబాసిడర్ కారు. అది ఆ ఊర్లో ఉన్న అందరికి తెలిసిన కారే. కాలేజి కరస్పాండెంట్ గా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ యజమాని కారు. కిషోర్ వాళ్ళ నాన్న కారు. కొడుకు కాలేజిలో ఏదో గొడవ పడుతున్నాడని తెలిసి ఆయన ప్రిన్సిపల్ కి ఫోను చేసాడు. ప్రిన్సిపల్ ఇక్కడ చెట్టుకింద ఉన్న విషయం తెలుసుకొని వెంఠనే బయలుదేరి వచ్చారు. కారు ఆగింది. కిషోర్ వాళ్ళ నాన్న దిగారు. ప్రిన్సిపల్ గారు లేచి నిలబడి

“నమస్కారమండి” అన్నారు.

“నమస్కారం ఏమిటి మా కిషోర్ ఎక్కడ?” అన్నాడు ఆతృతగా

“ఇక్కడ నాన్నా చెట్టు మీద. ఈ ప్రిన్సిపాల్ నన్ను దిగనివ్వడం లేదు” అన్నాడు సగం ఏడుపుగొంతుతో.

“ఏంటయ్యింది ప్రిన్సిపాల్ గారు?” అన్నాడు కిషోర్ వాళ్ల నాన్న అధికారం నిండిన గొంతుతో.

ప్రిన్సిపాల్ గారు జరిగిందంతా వివరించారు క్లుప్తంగా. “అంటే మీవాడు చెట్టుదిగి 25 రూపాయలు ఫైన్ కట్టి ఇంటికి వెళ్లాలి మన కళాశాల రూల్సు ప్రకారం.” అని ఆగారు ప్రిన్సిపల్ గారు.

“నాన్న ఇది మన కాలేజి. ఆయనకి ఉద్యోగం ఇచ్చింది నువ్వు. మనకి రూల్సు పెట్టడానికి ఆయనెవరు. ఆయన్ని ఉద్యోగంలోంచి తీసెయ్యి” అని పౌరుషంగా అన్నాడు చెట్టుమీద కిషోర్.

కిషోర్ తండ్రి ఏమీ మాట్లాడలేదు. కొడుకువైపు, ప్రిన్సిపల్ వైపు మార్చి మార్చి చూసాడు. చుట్టూఉన్న మనుషులని కూడా చూసాడు. సుమారు వందమంది ఉన్నారు ఇక్కడేం జరిగినా, ఏమన్నా ఊరందరికి తెలుస్తుంది. జరగబోయేదాని మీద తన పరువు, కుటుంబం పరువు, కాలేజి పరువు అన్నీ ఆధారపడి ఉన్నాయి. అందుచేత అతను ఏమీ అనలేకపోయాడు. “అయ్య మీరొక్కసారి ప్రక్కకి వస్తారా?” అన్నారు ప్రిన్సిపాల్ గారు కరస్పాండెంట్ ని. గుంపు అవతలకి, చెట్టుకు దూరంగా వెళ్లదామని చేత్తో సూచిస్తూ, ముందు తాను నడిచారు. ప్రిన్సిపాల్ వైపు కరస్పాండెంట్ వెళ్లారు. వాళ్లు మాట్లాడినవి గుంపుకు వినపడనంత దూరం చేరాక కాసేపాగి ప్రిన్సిపల్ కరస్పాండెంటు గారివైపు తిరిగి, “మీ కుర్రాడు బెదిరించినట్లు నన్ను మీరు ప్రిన్సిపాల్ ఉద్యోగంలోంచి తీసివేయవచ్చు. కాని పెట్టిన రూల్సు తనకిమాత్రం తీసేస్తే ఇకముందు తను ఏదైనా చెయ్యగలననుకొంటాడు. ఈ చిన్న తప్పునుండి పెద్ద పెద్ద తప్పులు చెయ్యడానికి వెనుకాడడు. సంఘం కట్టుబాట్లు దాటి చెడ్డ తోవలో పడతాడు. ఆఖరికి ఒకరోజు మిమ్మల్ని కూడా లెఖ్ఖ చెయ్యడు. మిమ్మల్ని కూడా తండ్రి హోదానుండి తీసేస్తాడు. మీరు నా ఉద్యోగం తీసేసినా నాకు కలిగే కష్టం, నష్టం ఏమీలేదు. ఏదో ఒక కాలేజీలో ఉద్యోగం దొరక్కపోదు” మౌనంగా వింటున్న కరస్పాండెంట్ తో అన్నారు.

కరస్పాండెంట్ కి ముందు కోపం వచ్చింది. తన క్రింద పనిచేసే ప్రిన్సిపాల్ ఇంత సూటిగా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచించిన మీదట ప్రిన్సిపల్ మాటలలో ఉన్న నిజం కొంత అర్థమయ్యింది. ఇవాళ అహంకారంతో ప్రిన్సిపాల్ ని ఫైన్ వెయ్యకుండా చేసినా, ఏదో ఒకరోజు తన కొడుకు ఇదే అహంకారంతో తన అధికారాన్ని కూడా ఎదిరించి తనని ఎందుకూ పనికిరానివాడిగా చేస్తాడు. ఇక తాను అప్పుడేమీ చెయ్యలేడు. ఏమైనా చేస్తే ఇప్పుడే చెయ్యాలి అని అనుకున్నాడు మనసులో ఏదో ఒక నిశ్చయానికి వచ్చి వెనుతిరిగి చెట్టు కిందకి వెళ్లాడు. “కిషోర్ కిందకి దిగి వచ్చి ప్రిన్సిపల్ గారికి క్షమాపణ చెప్పి ఫైన్ కట్టి ఇంటికి వెళ్లు” అని శాసించినట్లు చెప్పి, మౌనంగా ప్రిన్సిపల్ గారికి నమస్కారం పెట్టి కారెక్కి వెళ్ళిపోయాడు.

ఆ చెట్టుమీద నేను చాలాసేపు కదలిక లేకుండా ఉండిపోయాను.

చెట్టుకింద ప్రిన్సిపాల్ అలాగే కూర్చున్నారు.

ఈ సంఘటన జరిగి ఇరవై ఏళ్ళు కావస్తున్నది.

మళ్ళీ చెప్పడం ప్రారంభించాను. దేశ విదేశాల నుండి వచ్చిన మిత్రులు ఆసక్తిగా వింటున్నాం. అకస్మాత్తుగా నేను చెట్టు దునికి ఎటో పారిపోయాను. రిజిగ్నేషన్ లెటర్ పడేసి తెల్లారే ప్రిన్సిపాల్ గారు ఊరు విడిచి వెళ్ళిపోయారు. తప్పుచేసిన వాడిని శిక్షించలేకపోయినందుకు గాను తానే వంద రూపాయలు పూర్ బాయ్స్ ఫండ్ కి జరిమాన కట్టారు వెళ్ళేముందు.
ఇది జరిగిన తరువాత మెల్లిమెల్లిగా మామిడితోట పాడుపడింది. ఆ చెట్లకి ఇక కాయలు కాయలేదు. ఎంత బాగుచేద్దామని ప్రయత్నించినా ఏ ప్రిన్సిపాల్ విజయం సాధించలేకపోయారు. నాన్నగారు అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు.
నాలుగేళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చాను. చాలారోజులు స్తబ్దంగా ఉండిపోయాను.

మెల్లిగా మళ్లీ మామిడి తోట వేశాను. పూత పూసింది. పిందెలు వేసింది. కాయలు కూడా కాచాయి. ప్రిన్సిపాల్ గారు కూచున్న చోటే నేను వేదిక నిర్మంచి అక్కడే కూచున్నాను. ఇప్పుడు నేను కూచున్న చోటు అదే.

ఇప్పుడు మీరున్నది ఆనాటి కళాశాల. ఈనాడు పేద విద్యార్థుల ఆశ్రమ పాఠశాల. నాలో మార్పు రావాలని మా నాన్న చివరికోర్కె.

కాని ఆ మార్పుకి దోహదం చేసింది ప్రిన్సిపాల్ గారి వ్యక్తిత్వం. జీవితాంతం అది నన్ను వెంటాడింది.

అలాంటి వ్యక్తిత్వాలకి రూపకల్పన చేయడానికే ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. పాఠ్య ప్రణాళికలు, తరగతి గది బోధన, జ్ఞాన్నాన్ని పెంచుతాయి. కాని వ్యక్తిత్వాలు నేర్పే పాఠాలు జీవితాల్ని మారుస్తాయి. మంచి మార్గంలోకి మళ్ళిస్తాయి.

మనకి ఇప్పుడు అలాంటి ఉపాధ్యాయులు అవసరం.

అందుకే విద్యార్థులను తయారుచేసే ముందు ఉత్తమ ఉపాధ్యాయులను తయారుచేయాలి. ఇందుకోసం పాఠ్యప్రణాళిక ఎలా తయారుచేయాలో ఆలోచించాలి.”

చెట్టు మీద కదలకుండా నిలుచున్న ఓ విద్యార్థి దృశ్యం మసకబారుతుంటే కిశోరుబాబు కంఠం సవరించుకుని తన ప్రణాళికను వివరించసాగాడు.







1 వ్యాఖ్యలు

అరవైలో ఇరవై, ఇరవైలో అరవై

ఇరవై ఐదో ఏట దాకా ఇండియాలో బతికి వచ్చి అమెరికాలో మరో ఇరవై ఐదేళ్ళు బ్రతికిన నాకు అమెరికా అయినా ఇండియా అయినా ఒకటే అన్న భావన చాలా గట్టిగా ఉండేది. అమెరికాలో పగలైతే ఇండియాలో రాత్రి, ఇండియాలో పగలైతే అమెరికాలో రాత్రి అని మొదలుపెట్టి ‘అక్కడ’ ‘ఇక్కడ’ అని వాదించే వాళ్ళను పట్టించుకొనే వాడిని కాదు. అలాంటి నాకు కనువిప్పు కలిగించింది వాసా విశాలాక్షి గారి వాక్యం. ‘ఇండియాలో ఇరవైలలో అరవైలలా బ్రతికిన నేను అమెరికాలో నా అరవైలలో ఇరవైలలా బ్రతుకుతున్నాను.’

వాసా విశాలాక్షిగారు న్యూయార్కులో సంగీతం టీచరు. కర్ణాటక సంగీతానికి చేతులడ్డుపెట్టి ఒక ‘కాపు’ కాస్తున్నాం అని అనుకొంటున్న ఎందరో వ్యక్తుల కంటే, సంస్థల కంటే, ఎక్కువ. ‘పెద్దకాపు’ వాసా విశాలాక్షి గారు. ముప్పైఏళ్ళుగా ఆవిడ న్యూయార్క్ లో ఉన్నారని గాని, ఎంతో సంగీత సేవ చేస్తున్నారని కాని మనం న్యూయార్కులో ఎన్నాళ్ళున్నా మీకు నాకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెని ఏ సంఘాలు గుర్తించలేదు. అవార్డులు ఇవ్వలేదు. ఇండియా ఎబ్రాడ్ న్యూస్ పేపరులో వ్రాయలేదు. ఆవిడ చేస్తున్న సేవని, ఆవిడ ఉనికిని నలుగురికి తెలిసేలా చేసింది ఓ తెల్లవాడు. అతడికి సంగీతంకాని, భారతదేశం గురించికాని ఏమీ తెలీదు. అసలు భారతదేశం అనేది ఉందని కూడా తెలియదు.

అతడికి తెలిసిందంతా రోజూ ‘ఎలాగో ఒకలాగ’ డబ్బులు ‘సంపాదించి’ ‘డ్రగ్స్’ తీసుకొని ఆనందో బ్రహ్మ అని జీవితం గడపడం. అలాంటి వాడికి సంగీత విద్వాంసురాలు, పూజ చెయ్యకుండా పచ్చి మంచినీళ్ళు అయినా ముట్టని, పరాయివాళ్ళ ఇళ్ళల్లో పళ్ళు తప్ప మరేమీ తినని ఛాందసురాలైన వాసా విశాలాక్షి గారికి లింకేమిటని ఆశ్చర్యపోకండి. ఉంది.

ప్రతిరోజూ ఉదయం పూజ చేసుకొని, మడిగా వంట వండి భర్తకి పెట్టి, తాను తిని, పట్టుచీర కట్టుకొని లోపల థెర్మల్స్ (చలిని తట్టుకోడానికి తొడుక్కునే లోపలి గుడ్డలు) తొడుక్కోకని, మఫ్లర్ కట్టుకొని, న్యూయార్కు బస్సులలో, సబ్ వేలో తిరుగుతూ అభిరుచి ఉన్న వాళ్ళకి సంగీత పాఠాలు చెప్పడం ఆమె దినచర్యలో భాగం. అటువంటి ఆమెని ఒకరోజు సబ్వేలో ఓ తెల్లవాడు అటకాయించి ‘మగ్గింగ్’ అనే మెనహటనం స్టైల్ ముష్టికై ప్రయత్నించాడు. ఆమె మగ్గింగ్ కోసం దాచుకొన్న ఐదు డాలర్లు ఇచ్చే అంతలో ఆమె శృతి పెట్టెని పట్టుకొన్నాడు. అపుడు శృతి పెట్టె పట్టుకొన్న ఆమె చెయ్యిని తాకాడు. ఐదు డాలర్లు ఇద్దామనుకొన్న ఆమెకి వాడు చెయ్యి తాకడం వల్ల మడికి భంగం అయి కోపం వచ్చింది.

“ముష్టి వెధవ్వి ముష్టి వెధవలా ఉండక ముట్టుకొని నా మడిని మైల చేస్తావా?” అని అరిచింది. ఆమె ఆవేశాన్ని ఆమె గాత్రం అద్భుతంగా అనువదించింది. పక్కవాడు చచ్చిపోతున్నా పట్టించుకోని జనాన్ని నిలబెట్టింది. గొడవైంది. పోలీసులొచ్చారు. ఓస్ ఇంతేనా? అని వెళ్ళిపోయారు. అలాంటి పోలీసుల్ని ఆపి ‘మడి’ దాని ప్రాముఖ్యత గట్రా వివరించారు. అటువంటి తప్పుని అమెరికా ఖండంలో చేసేవారిని వదిలేస్తే ఈ ఖండం అపవిత్రమైపోతుందన్నారు. ముష్టి వాళ్ళు ముష్టి అడగడం మనం ఇవ్వడం సనాతన ధర్మం అని చెప్పారు. ఆమె చెపుతున్న విషయం కంటే ఎంతసేపైనా వినాలనిపించే ఆమె గొంతు వినడానికై మరిన్ని ప్రశ్నలు వేసారు పోలీసులు. ముచ్చటపడి కేసు రాసి, నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అమెరికాలో క్రైం న్యూసు ఎక్కువ. కాని అందులో ఇండియన్ పేర్లు అతి తక్కువ. అంచేత మనం ఇక్కడ ఉన్నామని నలుగురికి తెలియదని, న్యూయార్కు అంటే ‘మెల్టింగ్ పాట్’ అని అది సంస్కృతుల సంగమం అని అందులో ఇవాళ ‘మడి’ అనే భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయం అమెరికాలో క్రైం కి కొత్త కోణాన్ని ఇస్తుందని న్యూయార్కులోని ఇండియన్ ప్రెస్ విజృంభించింది.

వాసా విశాలాక్షిగారి ఇంటి ఎడ్రస్ పట్టుకొన్నారు. కెమేరాలు వెంట తెచ్చుకొన్నారు. ఆమెని వివిధ ప్రశ్నలు వేసారు. ఆమెకి ఇది ప్రథమ ఇంటర్వ్యూ అవడం వల్ల ఆమే ఏ సమాధానం చెప్పకుండా ముందు ‘మహా గణపతిం....’ అంటూ మొదలు పెట్టారు. ఆ తరవాత ఆమె అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారు. ఆమె జీవిత చరిత్ర అంతా వివరించారు. మగ్గింగ్ పాలబడ్డా మరేమి జరిగినా అమెరికానే నచ్చిందన్నారు. విలేఖర్లు వివరంగా చెప్పమన్నారు. ఎన్నో కారణాలు వివరాలు ఎందుకు ఒక్కటి చాలన్నారు ఆమె. ఆ సమాధానమే ‘అమెరికాలో అరవైలలో ఇరవై, ఇండియాలో ఇరవైలలో అరవై.’ అదెలా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది ఇరవైలలో ఉన్న జుహి ఝం ఝాంగ్ వాలా అన్న విలేఖరిణి.

‘నాకు ఇరవైయవ ఏట పెళ్ళైంది. నేను వాళ్ళింట కాలు పెట్టిన వేళా విశేషమేమో కాని నా భర్తకి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. తుళ్ళుతూ, తేలుతూ, తిరుగుతూ సంగీతం ఊపిరిగా బ్రతుకుతున్న మా పల్లెటూరి నుండి’ ఢిల్లి వెళ్ళిన నాకు అదో పెద్ద జైలులా అనిపించింది. వాసావారింటి అబ్బాయి అని మానాన్న నన్ను ఒప్పించి చేసిన పెళ్ళి నాది. వారి ఇంట ఉన్న సంగీత సంప్రదాయాన్ని గౌరవించి అటువంటి కుటుంబంలో పుట్టిన ఆయనకి ‘ఇంగువ కట్టిన గుడ్డ’ లా ఎంతో కొంత సంగీతం రాదా అని అనుకొన్నాం. అయితే అది మా రోజుల్లో పెళ్ళిచూపుల్లో పెళ్ళి కూతురు అడిగే ప్రశ్న లేదుకదా. పెళ్ళైన తరువాత తెలుసుకొందాం అని వాయిదా వేసాను. ఢిల్లీ వెళ్ళిన తరువాత తెలిసింది అది ‘ఇంగువ కట్టిన గుడ్డే’ కాని మా ఆయన తరంలో అది ‘సర్ఫ్’ వేసి శుభ్రంగా ఉతికి ఆరేసిన బట్ట అని. ఆయనకి సంగీతం రాకపోతేనేం నలుగురికి పాఠాలు చెప్పుకొని నా సంగీతాన్ని నిలబెడదాం అనుకొన్నాను. కాని కుదిరేది కాదు. రోజు తెల్లవారు ఝామున మూడు గంటలకి లేచి నీళ్ళుపట్టుకోవాలి. ఐదు గంటలకి పాలబూత్ దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకోవాలి. ఆరుగంటలకి భర్తనిలేపి కాఫీ అందించాలి. ఏడు గంటలకి పిల్లల్ని లేపి తయారు చెయ్యాలి. వంట చెయ్యాలి. వాళ్ళను బస్సెక్కించాలి. భర్తకి టిఫిన్ పెట్టాలి. కేరేజ్ కట్టి ఇవ్వాలి. మార్కెట్ కి వెళ్ళాలి. ఆ తరువాత ఇంత తిని పడుకొందామంటే కుదరదు. కొత్తగా కొన్న టీవి చూడడానికి రోజూ పొరుగువాళ్ళు వస్తారు. కునికిపాట్ల మధ్య చూస్తూ లేస్తూ ఉండేసరికి పిల్లలు వచ్చేస్తారు. రాత్రి పదిదాకా ఏవేవో పనులు. పడుకొనేసరికి పదకొండు. మళ్ళీ తెల్లవారు ఝామున మూడు గంటలకి లేవడం. అలా పనిచేసి చేసి నా ఇరవైలలో అరవై ఏళ్ళ దానిలా తయారయ్యాను. నాకు వచ్చిన సంగీతానికి కనీసం ఓ గంటైనా ఆ రోజుల్లో దొరికేది కాదు. కాని ఇపుడు అరవైలలో అమెరికాలో నాకు నచ్చిన సంగీతాన్ని నలుగురికి నేర్పుకొంటున్నాను. అంచేత ఇండియాలో ఇరవైలలో అరవైలలా బ్రతికిన నేను అమెరికాలో అరవైలలో ఇరవైలలా బ్రతుకుతున్నాను.” అన్నారు.

అది I –TV లో విన్న నాకు అమెరికా జీవితం గురించి కనువిప్పు కలిగింది. అప్పటినుండి నేను చూసిన, విన్న అమెరికా భారతీయ జీవనంలోని అనుభవాలు శతపత్రదళ పుష్పంలా వికసించడం మొదలుపెట్టాయి.

27 మార్చి 2009





0 వ్యాఖ్యలు