Saturday, May 16, 2009

అతడొక సృజనాత్మక ఆలోచనల గని

Saturday, May 16, 2009
అతడొక సృజనాత్మక ఆలోచనల యంత్రం. యాంత్రికత తెలియని సృజనాత్మకత అతని సొంతం. కాలంతో పోటీ పడుతూ చాలాసార్లు తానే గెలుస్తూ అలా సాగిపోయే తత్వం. తరుముకొచ్చే పనుల మధ్య నిరంతరం ఒక చిరునవ్వు ముద్దబంతిని ధరిస్తాడు. దిరిశన పూవు కన్నా ఫ్రెష్ గా ఉంటాడు.

’80లో జీవశాస్త్రం పూర్తిచేసి హైదరాబాదు సిసియంబిలో పనిచేస్తూ పిహెచ్.డి (1988) కోసం పారీస్ బాట పట్టాడు. కొంత కాలం అక్కడ పనిచేస్తూ తగిన పనికోసం అమెరికా పయనమయ్యాడు.

అక్కడ నాలుగేళ్ళు కొలంబియా మరియు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాల్ ఆఫ్ మెడిసన్ లో పోస్ట్ డాక్టరేట్ ఫెలోగా చేరాడు. 1993 నుండి 2002 వరకు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. 1996-2001 వరకు సిటి యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో విద్యాబోధన చేశారు. ఆతదుపరి (1999-2001) లాంగ్ ఐలాండ్ జ్యూయిష్ మెడికల్ సెంటర్ లో పరిశోధన కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు.

అదే సమయంలో జీవ సంబంధ పరిశోధనా రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసి తన సత్తా చాటాడు.

చదువుకునే రోజుల్లో తన భార్య వసుంధరకి రాసిన ప్రేమ కవితలు ఆ తరువాత సామాజిక కవిత్వంగా మారింది. నాకన్నా కవిత్వం మా ఆవిడే బాగా రాస్తారని చెబుతారు. 80 లలోనే తాను రాసిన రెండొందల కవితలు పోగొట్టుకున్నా కవిత్వం మీద విశ్వాసం సడలలేదు. ఇప్పటికీ కవిత్వాన్ని సెకండ్ లవ్ గానే భావిస్తాడు.

వెబ్లో పెట్టిన రచనలకన్నా రెండింతల రచనలు దాచి పెట్టకపోవడం వల్ల లభ్యం కావడంలేదు. రచయితగా కన్నా శాస్త్రవేత్తగానే ఎక్కువగా మమేకం కావడంవల్ల రచనలు దాచుకోవాలనీ, అచ్చేసుకోవాలనీ, పుస్తకాలుగా తీయాలని అనుకోలేదు. ఇకముందు కూడా అచ్చువేయరా అంటే వేయాల్సొస్తే వేస్తాను. వేయకపోయినా లోకానికి నష్టమేమీ లేదని చెబుతారు. రచన ఒక అవసరం. ఆ సందర్భంలో అది అనివార్యం. ఆ తరువాత దాని గురించి తంటాలు పడడం నాకెందుకో అలవాటు కాలేదు. అందుకే నేను రచయితగా పనికి రానేమో అంటారు.

స్వస్థలం విజయనగరంలోని బొబ్బిలి. తన ఊరంటే వల్లమాలిన అభిమానం. తన బాల్య స్మృతుల గురించి చెప్పేప్పుడు అక్కడి జీవితం తలచుకుని వైబ్రంట్ గా మారిపోతారు. భారతదేశంలో తాను చేసే పనులకు విజయనగరాన్ని చిన్న కేంద్రం చేసుకున్నారు. ప్రథమ్ (2001) అనే ఫౌండేషన్ ని ఆంధ్రప్రదేశ్ లో (www.pratham.org) ఆరంభించారు.

సామాన్యులకు వందలాది గ్రామాల్లో ప్రాథమిక చదువు చెప్పిస్తున్నారు. వాళ్ళతో పుస్తకాలు చదివింపచేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చదువు నేర్చిన వారినే చదువు నే్ర్పే బాలసాక్షి పెట్టి విద్యా పథకాన్ని కొనసాగిస్తున్నారు. 2004 నుండి సుమారు 350 గ్రామాల్లో పల్లెటూరు గ్రంథాలయోద్యమం అనే దాన్ని ప్రారంభించారు. స్థానికుల సహకారంతోనే దాన్ని విజయవంతం చేశారు. స్థానిక ప్రజల అండదండలు లేనిదే అక్కడ మనం చేబట్టే కార్యక్రమాలు ఏవీ సఫలం కావని ఆయన భావన. ఈనాటికీ ఆ పల్లెటూళ్ళళ్ళో పుస్తకాల రెపరెపల శబ్దాలు వినిపిస్తాయి. ఆ చిరుసవ్వడి వినడానికి ఆయన ఎంతదూరంలో ఉంటేనేం? వానపాములా ఆ కార్యక్రమం సజీవంగా కదులుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమం పదకొండు జిల్లాల్లో కొనసాగించడం విశేషం. ఎన్నో పనుల వత్తిడిలో ఉన్నా ప్రథమ్- విజయనగరాల్ని చూడకుండా అతి దగ్గరగా వచ్చి వాటిని తాకకుండా భారతదేశపు సరిహద్దులు దాటిపోడు.

సామాన్యులకి విద్య చెప్పడం ఒక కర్తవ్యంగా భావించే శ్రీనివాసరావు బయో టెక్నాలజి శాస్త్రాన్ని కూడా అభివృద్ధి పరిచి విదేశాల్లో భారతదేశం పేరు గుర్తింపు తీసుకురావాలని హైరానా పడతాడు. ఇండియావస్తే ఇవ్వాళ ఇక్కడ, రేపు ఈశాన్య ప్రాంతంలో, మరోరోజు మరో చోట! కొన్ని ఆలోచనలు, మరికొన్ని నిర్దిష్టమైన పథకాలతో అతని సంచారం. న్యూయార్క్ లోని సొంతింట్లో ఉండేది తక్కువ. సంచారంలోనే సగం జీవితం గడిపే శ్రీనివాసరావు అందులోనే చాలా విషయాలు నేర్చుకుంటూ వాటిని ఇతరులకు నేర్పుతుంటాడు. లోగడ శాంతా బయోటెక్ సంస్థ అమెరికా విభాగం ఇన్ ఛార్జిగా ఉంటూ కంపెనీ లావాదేవీలు చూస్తూనే పరిశోధనలపై కూడా తన పట్టు నిలుపుకోవడం గొప్ప విషయం.

ప్రస్తుతం శాంతా బయోటెక్ వారి నిర్వహణాధికారం మారిన తరువాత కన్సల్టెంట్ గా ఉంటూ కంపెనీ పరమైన పనులు చేసిపెడుతూ శాస్త్రపరమైన పరిశోధనలు, పరిశీలనలు ఇస్తూ, సేవ చేస్తున్నారు.

ఈ క్షణాన భారతదేశంలో “ఇండియన్ ఇన్ట్సిట్టూట్ ఆఫ్ బయోటెక్నాలజీ” సంస్థ ఏర్పాటు గురించి తలమునకలై ఉన్నా – సాహిత్యం, అందునా తెలుగు సాహిత్యంపై రెండుకళ్ళూ, ఒక మనసు పెట్టి ఉన్నారు. మూడు నాలుగేళ్ళ నుండి పుస్తకరూపంలో రచనలు రావాలంటే ఠలాయించే శ్రీనివాసరావు ప్రస్తుతం తన రచనలను వెబ్ లో ఉంచడానికి నిమిత్తమాత్రంగా అంగీకరించారు.

ఎప్పుడూ ఏదో చేయందే చేస్తూ ఉండందే... నిద్రపోని శ్రీనివాసరావు పరిశోధన మినహా మరేం చేశాడని గూఢచర్యం వహిస్తే తప్ప తెలిసిరాలేదు. ’85 నుండి 88 వరకు పారిస్ లో భారతదేశ ఉత్సవాలను, వివిధ సందర్భాల్లో దేశకీర్తి ఇనుమడింపచేసే కార్యక్రమాల్ని నిర్వహించాడు. అమెరికాకొచ్చాక (1990-94) తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఏర్పాటు చేసి ట్రస్టీ మరియు కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. న్యూయార్క్ వెళ్ళిన చాలామంది తెలుగు సాహిత్యవేత్తలు వారి ఆతిథ్యం తీసుకోనివారు ఉండరేమోనంటే అతిశయోక్తే అవుతోంది. అతిథి మర్యాదకు విజయనగరమైనా న్యూయార్కైనా ఒక్కటే అంటారాయన. 1995 నుండి న్యూజెర్సీ, న్యూయార్కుల్లో నెలవారి తెలుగు సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏతావాతా తేలిందేమంటే ఏపనైనా పునాది స్థాయి నుండి చేయడం ఆయన అభిమతం. అప్పుడే ఎంతో కొంత ఫలితం సాధించగలమని నమ్మకం.

ఎనిమిదేళ్ళ క్రితం హైదరాబాదొచ్చినప్పుడు చైనావాళ్ళకున్నట్లు గొప్ప వేయి గ్రంథాల్ని కంప్యూటరీకరించి భూగోళం మీదున్న ప్రతి తెలుగువాడికి అందించాలని ఆలోచించాడు. నలుగురిని కూడేసి తన ఆలోచనని పంచుకున్నాడు. నిజానికి ఆ వేయి గ్రంథాలేవి? అవెప్పుడెప్పుడు ఎన్ని ముద్రణలు పొందాయనే సమాచారం లభించే చోటు కోసం వెదికాడు. కంప్యూటరీకరణ తరువాత ముందు తెలుగులో ఎన్ని పుస్తకాలు అచ్చయ్యాయని అడిగాడు. ఎవరూ ఇతమిద్దంగా సమాధానం చెప్పలేకపోయారు. వందా ఎనభై ఏళ్ళనుండి అచ్చయిన తెలుగు పుస్తకాల పట్టిక తయారు చేయడానికి ముందుకు వచ్చారు. కమిటీలు, సమావేశాలు జరిగాయి. వాటిలో చర్చించి “సమగ్ర తెలుగు వాఙ్మయ సూచి” తయారు కోసం వందలాది గ్రంథాలయాల పర్యటన ప్రారంభమైంది. తానే స్వయంగా పారిస్ లోని బబ్లియోతెకా గ్రంథాలయంలో ఉన్న అచ్చయిన, అచ్చుకాని వ్రాతప్రతుల పట్టికలు, బ్రిటిష్ లైబ్రరీలోని గ్రంథాల సూచికలు తెప్పించడంలో కృషి చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సుమారు మూడు లక్షలు తెలుగు గ్రంథాల వివరాలు అకారాది క్రమంలో ఉంచడానికి నిరంతరం తన వంతు సహకారం అందించడంలో వెనకంజ వేయలేదు. ఇదంతా సొంత దేశంలో తెలుగు సాహిత్యానికి చేసిన సేవ గురించిన విషయాలు ఇవి.

ఇకపోతే ఆయనలో ఒక నిబద్ధుడైన కార్యకర్త ఉన్నాడు. ఎక్కడైనా ఏ సంస్థ నిర్మాణంలోనైనా ఒదిగిపోయి అందుకు సహకరిస్తుంటాడు. అమెరికాలో ఎకో ఫౌండేషన్ (1996)కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నారు. తెలుగు కళాసమితి సంస్థని స్థాపించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. “గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్” సంస్థలో శాశ్వత సభ్యుడు. సామాజిక అభివృద్ధికోసం పాటుపడే అనేక సంస్థలలో వీరు సభ్యులుగా, అధ్యక్షులుగా ఉన్నారు.

నాలుగేళ్ళనుండి “కేటలిస్ట్ ఫర్ హ్యూమన్ డెవలప్ మెంట్ (http://www.athod.org) అనే పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. అమెరికా, ఇండియా దేశాలలో గల మిత్రులతో ఈ పత్రికని తెస్తున్నారు. ప్రస్తుతం దాని చిరునామా హైదరాబాదే! ఈ పత్రికలో గొప్ప పనులు, ప్రాజెక్టులు, ప్రజలకోసం పనిచేసే సంస్థలనీ, వ్యక్తులనీ పరిచయం చేస్తారు. జరుగుతున్న అభివృద్ధి, అభివృద్ధి జరగాల్సిన రంగాలు, జరిపే తీరు గురించి నలుగురికి తెలియచెప్పి అందులో వారిని భాగస్వాములుగా చేయాలనే ఆశయంతో ఈ పత్రిక నడుస్తున్నది.




0 వ్యాఖ్యలు

విషయసూచిక

విషయసూచిక

ముందుమాటః
జీవధారలో తడుస్తూ – డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్

కథలు – గల్పికలుః
1. ఆటోమీటర్ – ఆటోమేటిక్
2. మీ ఆవిడను కొట్టరా
3. తైల వర్ణ (వి) చిత్రం
4. తెలివి
5. చెత్తకు కరువొచ్చింది
6. పిలుపు
7. సంకల్పం
8. డెత్ సర్టిఫికెట్

వ్యాసాలుః
1. చిన్న దీపం
2. అస్తిత్వం
3. ఒక శీతకథ
4. బొబ్బిలి – 1876
5. Just A Minute
6. మా ఊరంటే నాకిష్టం
7. గతమెంతో ఘనకీర్తి కలవాడా
8. పెరుగుతున్న సంఘాలు – తరుగుతున్న భాష
9. మూడోలెఖ్ఖ
10. తెలుగుమాట్లాడడం తెలుగునేర్పడం

కవితలుః
1. సుస్వాగతం
2. ప్రశ్న-జవాబు
3. వసుంధర
4. మనిషి-మృగం
5. తెలుగుతనంతో పెళ్ళి
6. మాటలు, చూపులు, చేతులు
7. ఆడదాని నవ్వు
8. ఎదురుచూస్తూ
9. లేజరించనీ
10. ప్రేమ
11. ఆకాశం
12. బిజి
13. గజిబిజి
14. కాలం
15. తీరం
16. ప్రపంచం
17. గాలి
18. నీరు
19. అమెరికా ఆంధ్రుల ఆహ్వానం
20. జవాబు-ఫలితం


0 వ్యాఖ్యలు

జీవధారలో తడుస్తూ.... (సంపాదకీయం)

కలశపూడి శ్రీనివాసరావు గారి రచనలు చదివిన వారికి దూరానవున్నదేదో దగ్గరవుతున్నదన్న భావన కలుగుతుంది. బహుశా దూరతీరాల వెంట తిరుగాడే వారికి గాలి, నీరు, వెలుగు, వెన్నెల వంటి ప్రకృతి శక్తులన్నీ తమ వాహికలో, మాధ్యమాలో అనిపిస్తాయేమో! ఫలితంగా కాళిదాసుకు ఒక మేఘం, జాషువాకు ఒక గబ్బిలం రాయబారాలు చేస్తే, ప్రవాస భారతీయులకు ప్రకృతి శక్తులన్నీ సొంతనేలవైపు సాగిపోతున్న దూతలై, తిరుగు ప్రయాణంలో అక్కడి అనుభవాలు మోసుకొస్తున్న గాధలౌతాయి. దేశానికి దూరాలలో వుండే వారికి ఒక ఎడబాటు భావన వుంటుంది. అందునా కవి హృదయం వున్న వారిలో మరికొంత ఎక్కువ ఉంటుంది. దీన్ని దూరం చేసుకునే యత్నాలలో ఆత్మీయులతో భావాలు పంచుకోవటం ఒకటైతే, ఆ భావనకు అక్షర రూపం ఇచ్చి అజ్ఞాత మిత్రులతో కూడా కరచాలనానికి చొరవ తీసుకోవటం మరొకటి.

కలశపూడి శ్రీనివాసరావు గారి రచనలతో కథానికలు, గల్పికలు,వ్యాసాలు, వచన కవితలు వున్నాయి. ఈ అన్ని ప్రక్రియల్లోని రచనల్లో మనకు కనిపించేది తన దేశంపట్ల, తన వూరిపట్ల రచయితకున్న నిసర్గమైన అభిమానం. ఇది సంఘసంస్కరణ భావాల రూపంలో కూడా మనకు దర్శనమిస్తుంది. ఈ సంస్కరణ భావాలు కేవలం భావాలు కావు. ఒక దూరదృష్టి వున్న మేధావి రచించిన పథకాలు. ఇవి సమస్యా పరిష్కారానికి కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలు మనముందుంచుతాయి. అంటే Theory తో పాటు application ను కూడా వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆచరణాత్మకతకు ఆమడదూరంలో వుండే ఆదర్శాలతో శ్రీనివాసరావు గారికి పని లేదు. ఉదహరణకు ‘ఆటోమీటర్ – ఆటోమేటిక్’ అన్న మొదటి కథ చూడండి. హైదరాబాదులో వినియోగదారుడు ఆటోలో ప్రయాణం చెయ్యాలంటే, మీటర్ చూపించే డబ్బుమీద కొంత అదనంగా ఇవ్వాలి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే వుద్దేశంలో విశ్వం అన్న స్టాటిస్టిక్స్ లెక్చరర్ శాస్త్రీయ అవగాహనతో, తన విద్యార్థుల సహాయంతో ఒక ప్రాజెక్టు చేపడతాడు. దీనిలో మీటర్ ప్రకారం డబ్బు తీసుకున్న ఆటోడ్రైవర్లు, దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన డ్రైవర్లకన్నా ఎక్కువ సంపాదించారని తేలుతుంది. ఈ కథకు కథానాయకుడి నాయకత్వ లక్షణం జీవశక్తి. దీన్ని వెలికితీయటంలో రచయిత కృతార్థుడైనాడని చెప్పవచ్చు.

సమాజంలో పురుషాధిక్యత ఘనీభవించి వున్న కాలంలో భర్త భార్యను దండించటం ఒక సాధారణ అంశంగా వుండేది. ఆధునిక యుగంలో విద్యావ్యాప్తి, సంస్కరణ భావాల ప్రచారం జరిగిన తర్వాత కూడా భారతదేశంలో భార్యభర్తల సంబంధాలలో సమానత్వం రాలేదు. ‘స్త్రీవాదం’ అన్నది తెలుగునాట ఒక ఉద్యమంగా వచ్చిందంటే, చదువుకున్న వర్గాలలో కూడా ఎంత వివక్ష వుందో అర్థం చేసుకోవచ్చు. ‘మీ ఆవిడను కొట్టారా?’ అన్న కథ రెండు తరాల స్త్రీల దైన్యాన్ని కథనం చేస్తుంది. జానకమ్మ, ఆమె కోడలు కోమల ఇద్దరూ తమతమ భర్తల మూలంగా మాటలపరంగా, మానసికంగా, దైహికంగా హింసను – మరొకమాటలో నిత్య హింసను అనుభవించిన వాళ్ళే. తరాల అంతరం అన్నదానికి అక్కడ అంతగా తేడా కనిపించదు. ఇది వంశపారంపర్యంగా సంక్రమించే జబ్బని, తన భర్తకు వున్న దుర్గుణాలే, తన కొడుక్కు సంక్రమించాయని జానకమ్మ నమ్మకం.

ఒక ఆటవికమైన ధోరణి, సంస్కారరహితమైన ప్రవర్తన సున్నితమైన మానసిక స్థితి వున్నవారిని వేటాడుతుంది. అతడు కథకుడు కావచ్చు, పాఠకుడూ కావచ్చు. ఈ కథలో జరిగింది అదే. అందుకే, భార్యలమీద జరుగుతున్న పీడనను కొంత తక్కువ స్థాయిలోనే జానకమ్మ కథనం చేస్తున్నా, భావుకుడైన రచయిత దాన్ని తీవ్రమైన విషయంగానే పరిగణిస్తాడు. అతనిలోని ఈ ప్రతిచర్యను గమనించిన జానకమ్మ అతని కాళ్ళమీద పడి తన ‘కొడుక్కు బదులు తనను జైల్లో పెట్టించమని కోరుతుంది! ఇట్లాంటి ఫలితం రాబట్టటం కథకుడుగా శ్రీనివాసరావు గారు సాధించిన సాఫల్యం. ‘మీ ఆవిడను కొట్టరా?’ అన్న ప్రశ్నకు సంబంధించి తనలో చెలరేగుతున్న కల్లోలాన్ని రచయిత మనలోకి బదలాయిస్తారు. దీంతో కథ ముగిసినా, దాని ప్రభావం పాఠకుల మీద పనిచేస్తూనే వుంటుంది.

‘తైలవర్ణ చిత్రం’ అన్న కథానికను విదేశాల్లో వున్న వర్ణ వివక్షను ఒక ఆఫ్రో-అమెరికన్ తాను వేసిన వర్ణచిత్రంతో జయించిన ఉదంతంగా చెప్పుకోవచ్చు. ఇది పైకి సరదాగా అనిపిస్తూనే కళకు వున్న శక్తిని నిరూపించే కథానిక, కథకుని కుటుంబం అతనికి ఆ రాత్రి ఆశ్రయం ఇవ్వటం సంస్కారానికి సంబంధించిన అంశం కాగా, కళాకారుడు వాళ్ళకోసం ఒక వర్ణచిత్రం గీసి బహూకరించటం కృతజ్ఞతా సూచకం. వేలంపాటలో ఆ కళాకృతిని అమ్మటంలో డబ్బు వ్యవహారం వున్నా, ఆ కళను మరింత బాగా అర్థం చేసుకుని ప్రేరణ పొందేవారికి అది సంక్రమించటం మంచిదే. అందునా, కొన్న వ్యక్తి తెల్లవాడైవుంటే, ఆ ప్రయోజనం మరింత బలంగా నెరవేరినట్లే! దీన్నే ‘ధ్వని’ అంటారు. చిన్నకథలో ఒక ప్రధాన సంఘటన, ఒక ముఖ్యమైన అంశం, పరిమితమైన పాత్రలు వుండాలని విమర్శకులు చెప్తారు. ఎంత చిన్న కథ అయినా, అది పూర్తయిన తర్వాత మరేమీ చెప్పవలసింది మిగలలేదన్న భావన పాఠకులకు కలగాలంటారు. దీన్నే సమగ్రత అనీ అనవచ్చు. వీటన్నింటి ఫలితంగా అనుభూతి కూడా కలిగితే అది మరింత మంచికథ అవుతుంది. పై కథలలో ఇవన్నీ కొద్దిపాటి తేడాలతో వున్నాయి.

ఈ కథానికల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది, ‘బొబ్బిలి 1876’. అన్ని చారిత్రకమైన జాగ్రత్తలు రచయిత తీసుకున్నారు. ఈ కథానికలో 1876 నాటికి బారెట్లా ఉత్తీర్ణుడై ఇంగ్లాండులో ఒక ప్రముఖ న్యాయవాది సహచరుడుగా పని చేస్తున్న వేణుగోపాలాచార్యుల వారు, విద్యావైద్య రంగాల మీద, వాటిని ప్రజల అందుబాటులోకి తెచ్చే ప్రణాళికల మీద బొబ్బిలి రాణి వారి సమక్షంలో జరిగిన చర్చలో పాల్గొని తన ప్రత్యేకతను చాటుకుంటారు. మతాతీత దృష్టితో ఒక పర్షియన్ కవి కుమార్తెను వివాహమాడడానికి నిర్ణయించుకుంటారు. కథానిక ఇలాగే సాగుతుందని భావిస్తున్న పాఠకులు – ఇది కేవలం రచయిత కల అని తెలుసుకోవటంతో, ఒక చారిత్రక ఘట్టం నుంచి వాస్తవికతలోకి – బలవంతంగా – వస్తారు. నిజానికి దీన్ని ఆద్యంతం చారిత్రక కథానిక గానే మలిచివుంటే బాగుండేది.

శ్రీనివాసరావు గారు రాసిన వ్యాసాలలో ఒక తడి వుంటుంది. దీంతో Matter of Fact ను చెప్పవలసిన వ్యాసం కూడా సజీవమైన భావాలను కలిగి ఉంటుంది. దీంతో పాఠకుడు కూడా వ్యాసకర్తతో పాటుగా సహచరిస్తాడు. చిన్నప్పటి జ్ఞాపకాల తోరణంగా కదలాడే ‘మాఊరంటే నాకిష్టం’ రచన ఇందుకు మంచి ఉదాహరణ. ఇది చదివిన పాఠకుడు రెండు ప్రయాణాలు చేస్తాడు. ఒకటి తన ఊరివైపు, రెండు తన బాల్యంలోకి!

అమెరికాలో తెలుగు వారి అస్తిత్వానికి సంబంధించిన వ్యాసాలు కూడా వీరు రాశారు. భౌతికమైన అస్తిత్వం అన్నది పెద్ద సమస్య. కాని విదేశాల్లో, భాషాపరమైన, సంస్కృతిపరమైన అస్తిత్వాల కోసం పడే సంఘర్షణ ఎప్పుడూ చర్చనీయాంశంగానే వుంటుంది. అమెరికా తెలుగువారు, ఆ మాటకొస్తే ఏ దేశంలో వున్న ప్రవాసాంధ్రులైనా రెండు భాషల మధ్య, రెండు సంస్కృతుల మధ్య నలిగిపోతారు. వారికి అక్కడ పుట్టిన తమ పిల్లల విషయమై అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే, అక్కడి మహా యాంత్రికతకు తలొగ్గి జీవించే వాళ్ళకు ఇవేవీ సమస్యలు కాకపోవచ్చు. కాని, తాను ‘పుట్టి పెరిగిన దేశం సంస్కృతిని, పూర్వీకుల నుండి సంక్రమించిన మాతృభాషను రక్షించుకుందాం, వారసులకు మనమిచ్చే నిజమైన సిరసంపదలు ఇవే’ అని సున్నిత మానసిక సంస్కారంతో, అభిమానంతో ఆరాటపడి పోరాటాలు చేసే వారు కొందరుంటారు. శ్రీనివాసరావుగారు ఈ కోవకు చెందినవారన్నది వారి అన్ని వ్యాసాలు నిరూపిస్తాయి. ‘పెరుగుతున్న సంఘాలు – తరుగుతున్న భాష’ అన్న పెద్ద వ్యాసం ఇందుకు నిదర్శనం. ‘తానా’, ‘ఆటా’ – వంటి అంతర్జాతీయ స్థాయి వున్న సంఘాలు ఈ రంగాలలో చేస్తున్న కృషిని ప్రశంసిస్తూనే, చేయవలసింది ఎంతో వుందని చెప్తున్నారు. అందుకు నిర్మాణాత్మకమైన సూచనలు కూడా చేస్తున్నారు. ఇదిగో, ఇక్కడే శ్రీనివాసరావు గారి ప్రత్యేకత కూడా వుంది. ముఖ్యంగా – ఈ సంఘాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా చేపట్టవలసిన కార్యక్రమాలెన్నో వున్నాయంటారు. ఇది సత్యాధికం. భారత రాజకీయ నాయకుల ప్రసంగాలతో అన్ని రంగాలు బీడువారిన స్థితిలో వున్నప్పుడు, భూలోక స్వర్గం నుంచి జీవగంగ ప్రవహించి రావలసి వుంది.

కవిత్వంలో కూడా తెలుగు భాషాభిమానాన్ని ప్రకటించే కవితలున్నాయి. వరకట్న సమస్య మీద రాసిన ‘వసుంధరా’ కవితలో గురజాడ అప్పారావు, గుడిపాటి వెంకటచలం గారల ప్రస్తావనలున్నాయి. వీళ్ళిద్దరూ స్త్రీపురుష సమానత్వం గూర్చి కలలు కని వారికి కలాలను అంకితం చేసినవారే.

‘మనిషిని మనిషిగా
చూడని వాళ్ళు
మళ్ళీమళ్ళీ
దళితులను సృష్టిస్తుంటారు’ (‘ఎదురుచూస్తూ’)

ఈ కవితాపంక్తులు శ్రీనివాసరావు గారి తాత్వికమైన లోతును ప్రదర్శిస్తున్నాయి, అదీ కవితాత్మకంగా. అన్ని దేశాల్లో ఏదో ఒక స్థానిక నామంతో ‘దళితులు’న్నారు. ఇది సంస్కృతీ నాగరికతలను ప్రశ్నార్థకం చేస్తున్న అంశం. ఇది కుల సమస్య మాత్రమే కాదు. సంస్కారానికి ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కూడా. ఎదుటివాణ్ణి మనిషిగా చూడనివాడు – ముందు – తాను మానసికంగా, తాత్త్వికంగా పతనమై పోతున్నాడు. అంటే కులపరంగా తక్కువగా చూడబడుతున్న దళితుడే పతనావస్థలో వున్న అసలు దళితుని కన్నా ఉన్నతుడు. ఫలితంగా పతిత దళితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది.

‘ప్రేమ’ అన్న కవిత ముగింపు చూడండి-
‘ప్రేమ స్వార్థానికి పరాకాష్ఠ
తన్నితాను ప్రేమించుకునే మనిషి
అంతర్భాగంగా సమాజాన్ని ప్రేమిస్తే రుషి’

ప్రేమకు ఉన్న అన్ని షేడ్స్ ను ఈ కవితలో ప్రదర్శించారు కవి. చివర సారాంశంలో మనిషి తనను తాను ప్రేమించుకునే ఆదిమ దశలోనే వున్నాడంటున్నారు. మరి సమస్యల పరిష్కారం సంగతి? సమాజాన్ని కూడా ప్రేమిస్తే – మనిషి రుషిగా పరిణామం చెందుతాడన్నది కవి గాఢ విశ్వాసం.

‘నా నృషి కురుతే కావ్యం’ అన్నారు ఆలంకారికులు. అంటే రుషి కానివాడు కావ్యం రాయలేడన్నది వాళ్ళ విశ్వాసం. రుషికానివాడు సమసమాజ కావ్యాన్ని రచించలేడన్నది శ్రీనివాసరావు గారి విశ్వాసం. విశ్వాసం మాత్రమే కాదు, ఆదర్శ ఆచరణలను ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా పీలుస్తూ జీవిస్తున్న శ్రీనివాసరావుగారి సంకల్పం కూడా అదే. సంకల్పబలం వున్నవారు సాధించే పనులే కల్పాంతం దాకా నిలుస్తాయి. అందుకే ఉద్యమకారుల బాటలో నడుస్తూ శ్రీనివాసరావుగారు మరెన్నో సత్ఫలితాలు సాధించాలని ఆశిస్తున్నాను.


డా. అమ్మంగి వేణుగోపాల్
11-7-2008
11-9-130/3, లక్ష్మీనగర్, వీధి సంఖ్య 4,
కొత్తపేట, హైదరాబాద్ – 500 035.
ఫోన్ 9441054637, 040-24040276





0 వ్యాఖ్యలు

Friday, May 15, 2009

ఆటోమీటర్ – ఆటోమేటిక్

Friday, May 15, 2009
మహానగరంలో బస్టాప్ మధ్యతరగతి ఆశలా చెల్లాచెదురుగా నిలబడి వున్న మనుషులతో విశాలంగా పరుచుకుని ఉంది. రాని, వచ్చినా ఆగని, ఆగినా ఎక్కడానికి వీలులేని బస్సులను అరగంట నుండి నిలబడి చూస్తున్నాడు. విశ్వం కోపం క్షణక్షణానికి పెరిగిపోతుంది. బస్సుల మీద కంటే, అక్కడక్కడే తిరుగుతున్న ఆటో వాళ్ళమీద. అటుఇటు కదులుతున్న ఆటోవాళ్ళు విశ్వంలాంటి వాళ్ళని ఆటో తీసుకుందామా? వద్దా? అని ఊగిసలాడిస్తున్నాయి.

విశ్వం మెల్లగా నడచి ఒక ఆటో దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు.

‘వస్తావా?’అని అడగకముందే ఆటో డ్రైవర్ “మీటర్ మీద ఎగస్ట్రా 10” అన్నాడు. ఇక బేరాలు లేవన్న విషయం స్పష్టం చేస్తూ.

“మీటర్ మీద ఎందుకు రావు?” అన్నాడు విశ్వం కోపాన్ని అణుచుకుంటూ.

“మీటరేస్తా. దానిమీదే 10 అన్నానుగా అన్నాడు” ఆటో డ్రైవరు విసుగు దాచుకోకుండా. అప్పటికే పదిసార్లు లెక్కపెట్టుకున్నాడు విశ్వం. తార్నాకకు బస్సు మీద వెళితే 3 రూపాయలు టిక్కెట్టు. ఆటో మీద మీటరు ప్రకారం 15 రూపాయలు. అదే బస్సుకంటే ఐదురెట్లు ఎక్కువ. టాక్సీలో వెళితే ఏ 200 రూపాయలో అవుతుంది. రైల్వేస్టేషన్ నుండి ప్రీ పెయిడ్ టాక్సీ అయితే 140 రూపాయలు అవుతుంది. ఇంటి దగ్గర దిగిన తరువాత టాక్సీ డ్రైవరుకు కనీసం పది రూపాయలైనా ఇవ్వకపోతే ఏంబాగుంటుంది. కానీ సరిగ్గా ఆ పదిరూపాయలు ఆటో డ్రైవరు మీటరు మీద ఎక్కువ ఇవ్వమని అడిగేసరికి కష్టం అనిపిస్తుంది. పదోసారి గుర్తుతెచ్చుకున్నాడు. తన పర్సులో ఉన్న రెండు పది రూపాయల నోట్లను. విశ్వం కోపం విశ్వాన్ని ఆక్రమించి కాళ్ళను వెనక్కి తిప్పింది. కానీ కోపం ఆపుకోలేక తల ఆటోవాడిపైపు తిప్పి, “మీటరుమీదే తీసుకెళ్ళాలని తెలీదా నీకు?” అన్నాడు. అక్కడ చుట్టూ ఉన్న అందరికీ ఆటోవాడిని అదే ప్రశ్న అడగాలని ఉన్నా, విశ్వానికి మద్దతుగా ఏమాత్రం కనిపించినా విశ్వం లీడర్ అయిపోతాడేమోనని తగినంత దూరం జరుగుతున్నారు ప్రయత్న పూర్వకంగా.

“తెల్సుసార్ తెల్సు, నాలుగురోజులు స్ట్రైక్. పూరా ఖాళీ. భర్తీ చెయ్యాల్నా వద్దా? మీటర్ కే ఊపర్ దస్ బస్” అని అందరి వైపు ఒకసారి చూసి, ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ రారని నిశ్చయించుకుని ఇవ్వగల వారికోసం మరింత ముందుకి వెళ్ళాడు.

ఇంతదాకా దాచుకున్న కోపాన్ని బయటపెట్టడానికి విశ్వానికి అవకాశం వచ్చినట్లు భావించి చుట్టూ ఉండి, తనలాంటి పరిస్థితిలోనే ఉండి కూడా మాట సహాయమైనా చేయని వాళ్ళని తిట్టలేక, తిట్టినా వినిపించనంత దూరం వెళ్ళిపోయిన ఆటోవాడిని గట్టిగానే తిట్టడం మొదలుపెట్టాడు.

“ఈ ఆటోవాళ్ళకి బుద్ధిలేదు. ఎంత దొరికితే అంత దోచేద్దామనే. ఒక రూలు పాటిద్దామని అస్సలు ఆలోచన లేదు. ఖాళీగా పోతారు కాని మీటరు మీద రారు. బుద్ధిలేనివాళ్ళు” అని మరోసారి అన్నాడు. ఇలా రకరకాల మాటల్లో, రకరకాల వాక్యాలలో, ఆగిఆగి అదే అర్థం వచ్చేట్టు పదేపదే అంటున్నాడు.

చుట్టూ ఉన్నవాళ్ళు వినీ విననట్టు మొహం పెట్టి అంతా వింటున్నారు. మాటలు అంటూనే మిగిలిన వాళ్ళంతా వింటున్నట్టు గమనిస్తున్నాడు విశ్వం. అలాంటప్పుడే చెల్లాచెదురుగా ఉన్నవాళ్ళ మధ్య నుండి పంచెకట్టుతో, పండు జుట్టుతో, పదార్ల వయసు దాటినా సడలని వంటి దారుఢ్యంతో సాయంకాలం ఆహ్లాదంగా వాహ్యాళికి వెళ్ళే తీరున ఒక వ్యక్తి విశ్వం దగ్గరగా వచ్చి “వీళ్ళను ఎవ్వరు ఏమీ చేయరు. వీళ్ళు బాగుపడరు అని అంటున్నారు. ఎవరో ఎందుకు చెయ్యాలి. మీరే ఎందుకు ఆ పని చేయరాదు?”

“మీరు చెప్తుంటే నిజమే ఏదో ఒకటి చెయ్యాలని ఉంది. ఆలోచిస్తాను” అన్నాడు విశ్వం వినయంగా.

“మీకు స్టాటిస్టిక్సులో ఉన్న ప్రావీణ్యం ఉపయోగించి ఈ సమస్యకు పరిష్కారం చూపించగలరని నాకు నమ్మకం ఉంది. మరి నేను వెళతాను”.

“మాఇల్లు ఇక్కడే దగ్గరలోనే, వచ్చి కాఫీ తీసుకుని వెళ్ళండి” అని కోరాడు విశ్వం.

“అబ్బే. ఎందుకు శ్రమ. మరోసారి కలుద్దాం” అన్నారు నవ్వుతూ ముందుకు నడుస్తూ. “అలాగే” అన్నాడు కలలో ఉన్నవాడిలా తన ఇంటివైపు తిరుగుతూ.

ఛీఛీ ఛీఛీ
మరోరోజు.... ఏదో.... కానీ

“బాగా చదువుకున్న వాళ్ళు, నలుగురికి చదువు చెప్పే మీలాంటి వాళ్ళు ఏదో ఓ సమస్యని తీసుకుని, చక్కగా ఆలోచించి, ప్రజలకి ఒక పరిష్కార మార్గం చూపించాలి, అటువంటి మీరే ‘నేను సామాన్యుణ్ణి’ అని ఏమీ చెయ్యకుండా ఉంటే మిగిలినవాళ్ళు ఏం చెయ్యగలరు బతుకు గాడిలో బండగా, జడంగా జీవితం గడిపేయడం తప్పించి” అన్నాడు మెల్లిగా బోధపరుస్తున్న తీరులో.

“అలాగే దిగుదాం” అన్నాడు విశ్వం.

మరికొద్ది సేపటికి విశ్వం దిగవలసిన స్టాప్ లో ఇద్దరు దిగారు. బస్సు దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది.

“ఇప్పుడు చెప్పండి. ఇంత చదువు చదివిన మీకు ఆలోచించవలసిన బాధ్యత ఉందా? లేదా?” అని అడిగాడు.

‘ఉంది’ అన్నట్లు బుర్ర ఊపాడు విశ్వం.

“మరైతే మీ కళ్ళముందున్న, ఈ ఆటోమీటర్ ప్రకారం నడపబడని విషయం మీకు మీలా వేలాది మందికి రోజూ ఉన్న సమస్య కదా. మరి దానికి తగిన పరిష్కారానికి ఆలోచించండి”.

“రోజుకి ఒక్క ఆటోకు దాదాపు 200 రూపాయల ఆదాయంతో, సుమారు 50,000 ఆటోలు తిరుగుతున్న ఈ నగరంలో ఈ వ్యాపారం రోజుకి కోటి రూపాయలు దాటిన వ్యవహారం” అన్న లెక్చరర్ విశ్వం మాటలకి, ఎవడో ఒక లెక్చరర్ వస్తాడు. ఏదో ఒక పాఠం పాడుకొని పోతాడు అన్న భావంతో సాధారణంగా అల్లరిచేస్తూ శ్రద్ధ చూపని బికాం ఫైనలియర్ క్లాస్ లో ఉన్న 24 మంది అబ్బాయిలు, 16 మంది అమ్మాయిలు ఒక్కసారి ఆశ్చర్యపోయి, నిశ్శబ్దంగా, శ్రద్ధతో లెక్చరర్ విశ్వం మాటలు వినడం మొదలు పెట్టారు.

“సుమారు రోజుకు కోటి రూపాయలు దాటిన ఆటో వ్యాపారంలో కష్టించేవాడికి, కష్టమర్ కి మధ్య ఉన్న అతి ముఖ్యమైన పాత్ర పోషించవలసినది ‘ఆటోమీటర్’. అటువంటి ‘ఆటోమీటర్’వేసి ఆటోనడిపి, దాని ప్రకారం డబ్బులు తీసుకోవడం వల్ల ఆటోడ్రైవర్లకి లాభమా? నష్టమా? మీరు నేర్చుకున్న ఎకౌంటింగ్, స్టేటిస్టిక్స్ ఉపయోగించి ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వగలరా?” అని ఆగిన లెక్చరర్ విశ్వం ప్రశ్నకి క్లాస్ అంతా మరింత ఆశ్చర్యపోయి, మాటరాక నిశ్శబ్దంతో లెక్చరర్ విశ్వం మొహం చూస్తూ ఉండిపోయారు.

అప్పుడే మొదలైన వర్షం జల్లులు కిటికీకి ఆనుకుని ఉన్న చెట్టు ఆకులపై చేస్తున్న సవ్వడి స్పష్టంగా వినిపిస్తోంది క్లాసులో ఉన్న అందరికి.

మీరు ఈ విషయాన్ని ఒక ప్రాజెక్టుగా తీసుకొని పనిచెయ్యాలని నా ఉద్దేశం. ఎంతమందికి ఈ ప్రాజెక్టు చెయ్యాలని ఉందో చేతులెత్తండి అన్నాడు లెక్చరర్ విశ్వం. ఆశ్చర్యం నుండి తేరుకుంటూ విద్యార్థులు చేతులెత్తారు.

“నేను చేస్తాను సార్”, “నేను చేస్తాను సార్” అని అంటున్న 40 మంది మాటలతో ఆ క్లాసు అంతా నిండిపోయింది.

బయట వర్షం పెరుగుతూ చేస్తున్న చప్పుడు ఇప్పుడు క్లాసులో వినపడడం లేదు. ఊహించనటువంటి ఉత్సాహం చూపుతున్న విద్యార్థులను చూస్తూ లెక్చరర్ విశ్వం, తాము చదివే చదువును మార్కులకే పరిమితం చేయకుండా, చైతన్యదాయకమైన అంశాలను కూడా విస్తరిస్తున్న లెక్చరర్ ని ఆనంద సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ క్లాసు విద్యార్థులు కొద్దిక్షణాలు తమని తాము మరిచిపోయారు.

తేరుకున్న తర్వాత ఆ పని ఎలా చెయ్యాలి అన్న ఆలోచనలో మునిగిపోయారు. ఒక్కొక్క టీమ్ లో ఇద్దరేసి చొప్పున 20 టీములు ఏర్పాటు చేసారు. ఒక నెలరోజులలో ప్రతి టీమ్ 60 మంది ఆటోడ్రైవర్లతో మాట్లాడి మొత్తం 1200 మంది ఆటో డ్రైవర్లని ఒకనెల రోజులపాటు ఈ ప్రాజెక్టులో పాల్గొనడానికి ఒప్పించాలి అందులో 600 మందిని మీటరుతో కాక మీటరు మీద ఇంత ఎక్కువ అని కాని లేదా వారికి తోచినట్లు బేరాలాడి కాని ఆటో ఒక నెలరోజులపాటు నడపాలని కోరాలి. ఎవరు ఎలా నడిపినా వాళ్ళు ఆటో ఎన్ని మైళ్ళు నడిపింది, ఎంత పెట్రోల్ ఆటోలో వేయించింది. ఎన్ని బేరాలు ఎక్కించుకున్నది, ఏఏ బేరంలో ఎంత వచ్చింది, ఎన్నిగంటలు పనిచేసింది వంటి వివరాలు ప్రతిరోజు విధిగా ప్రతి టీము, తమ టీములో ఉన్న 60 మంది వివరాలు సేకరించాలి. అప్పుడప్పుడు తమ టీముల్లో ఉన్న ఆటోడ్రైవర్లు ఎవరెవరు ఎంత నిజాయితీగా ఈ ప్రాజెక్టు నియమాలని పాటిస్తున్నారో ప్రతి టీము వారి స్నేహితులు, బంధువుల సహాయంతో పరీక్షించుకోవాలి. ప్రాజెక్టు నియమాలని పాటించని ఆటో డ్రైవర్లని గుర్తించాలి.

ఒక వారం రోజులలో ఏఏ టీమ్ ఏఏ జంక్షన్లలో పనిచేయాలన్నది నిశ్చయించుకొన్నారు. సేకరించవలసిన విషయాల జాబితా క్షుణ్ణంగా క్లాసులో చర్చించి మరీ నిశ్చయించారు. పదిహేనేళ్ళుగా చదువుతున్న ఆ విద్యార్థులు అంత శ్రద్దగా చేపట్టిన విషయం ఇదే అంటే ఆశ్చర్యపడనక్కరలేని విధంగా ఈ ప్రాజెక్టు మీద శ్రద్ధ చూపిస్తున్నారు. పదిహేనేళ్ళుగా పాఠాలు చెప్తున్నా, గురువుగా విద్యార్థుల గౌరవం పొందింది ఇప్పుడే అని అనిపించింది లెక్చరర్ విశ్వానికి.

ప్రిన్సిపాల్ని ఒప్పించడానికి, ఈ ప్రాజెక్టుకు కావలసిన వివరాలు, కాగితాలు సేకరించడానికి ఒక వారం రోజులు పట్టింది. ఆ తరువాత నగరంలో ఉన్న నాలుగు పెద్ద ఆటో యూనియన్ల లీడర్లని లెక్చరర్ విశ్వంతోపాటు 40 మంది విద్యార్థులు రెండు మూడు తడవలు కలిసి ఈ ప్రాజెక్టును వివరించి, వారిని ఒప్పించడానికి మరో మూడు వారాలు పట్టింది. ఆగస్టు పదిహేను నుండి ఈ ప్రాజెక్టు కార్యరూపంలోకి వచ్చింది.

ఈ ప్రాజెక్టులో పాల్గొన్న ఆటోడ్రైవర్లను ప్రతిరోజు కలిసి సేకరించవలసిన వివరాలన్నీ సేకరించడం మొదలుపెట్టారు విద్యార్థులు. ఆ వివరాలతోపాటు ఆటోడ్రైవర్ల వ్యక్తిగత వివరాలు కూడా తాపీగా తెలియసాగాయి విద్యార్థులకు. వాళ్ళలో కొద్దిమందిలో, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లలో కూడా కనిపించని మానవత్వాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వాళ్లు చేసే వేషాలు, డబ్బుకోసం చేసే మోసాలు అన్ని తరగతుల వాళ్ళు చేసేలాంటివే అని తెలుసుకున్నారు. కొద్దిమంది డ్రైవర్లతో విద్యార్థులకు మంచి పరిచయాలే ఏర్పడ్డాయి. ఆటోడ్రైవర్ల మీద చాలామందికి లాగే వీళ్ళకీ మొదటలో ఉండే అపోహలు తొలగిపోయాయి. నెలరోజులలో కావలసిన వివరాలన్నీ జాగ్రత్తగా, పద్ధతి ప్రకారం తీసుకున్నారు. పరిశోధనలో అన్నివిధాలా ప్రాజెక్టు నియమాలని సరిగ్గా పాటించనివాళ్ళు కొంతమందైనా ఉంటారని ముందుగా ఎక్కువమందిని తీసుకున్నారు. ప్రాజెక్టు నియమాలని సరిగ్గా పాటించనివాళ్ళ వివరాలని పరిశోధనలో చేర్చలేదు. అలా తీసివేయగా మిగిలిన 520 మంది మీటరు మీద నడిపిన వాళ్లనుంచి, 516 మీటరు ప్రకారం కాకుండా నడిపినవాళ్ళ నుంచి తీసుకున్న వివరాలన్నింటిని వివిధ ఎకౌంటింగ్, స్టాటస్టిక్స్ పద్ధతుల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. ముందు వేసుకున్న ప్రశ్నలకి వచ్చిన సమాధానాలని వివిధ కోణాలనుండి పరిశీలించారు. ముందు వేసుకున్న ప్రశ్నలకి వచ్చిన సమాధానాలని వివిధ కోణాల నుండి పరిశీలించారు. యూనివర్సిటీలో ఉన్న ముగ్గురు ప్రొఫెసర్లకు ఈ ప్రాజెక్టుని క్షుణ్ణంగా వివరించారు. వాళ్ళ సహాయంతో ప్రాజెక్టు ఉద్దేశాలని, పద్ధతులని, ఫలితాలని ఇస్తూ, వివరిస్తూ, చర్చించి ఒక చక్కనైన పరిశోధనా పత్రం రాసారు. దానిని భారతదేశంలో పరిశోధనారంగంలో పేరున్న ‘సాంఖ్య’ పత్రికకు పంపారు.

మరోరోజు ఆయన బస్సుస్టాపులో కలిశారు. “ఇటువంటి సామాజిక ప్రయోజనం ఎందుకు పనికి పూనుకోకూడదు?” అని సూటిగా స్నేహపూర్వకంగా నవ్వుతూ అడిగాడు.

“నేనా? వీళ్ళనా? నేనేం రాజకీయ నాయకుడిని కాదు. లీడర్ని కాదు. పోలీసాఫీసర్ని కాదు”. అన్నాడు పరిసరాలని మరిచిపోయి. సూటిగా, సూదుల్లా సూర్యకిరణాలు కళ్ళల్లో పడ్డప్పుడు రెండు చేతులు అడ్డంపెట్టి కళ్ళు మూసుకుంటున్న కుర్రాడిలా.

“మీరేం చేస్తుంటారు?”
“నేను డిగ్రీ కాలేజిలో లెక్చరర్ని” అన్నాడు విశ్వం.
“ఏం పాఠాలు చెప్తారు?”
“స్టేటస్టిక్సు”
“ఓహో... అలాగా”

ఇంతలో బస్సు వచ్చింది. “రండి” అని విశ్వంతో అని ఆయన పరుగులాంటి నడకతో బస్సువైపు కదిలారు. విశ్వం కూడా ఆయన వెనకే వెళ్ళి బస్సు ఎక్కాడు. బస్సు కదిలింది.

* * *

“చూడండి, ఏదైనా చెయ్యాలనుకుంటే మీరే చెయ్యాలి. వాళ్ళని వీళ్లని తిట్టుకుంటే ప్రయోజనం లేదు. మీకున్న చదువు, అవకాశాలు ఆ ఆటోవాళ్ళకి లేవు కదా!” అంత రద్దీగా ఉన్న బస్సులో రోదలో తాపీగా, గట్టిగా విశ్వం చెవికి దగ్గరగా ఆయన మాట్లాడుతున్నాడు.

“కానీ ఈ ఆటోవాళ్ళని మీటర్ మీద నడిపించగల అధికారం, బలగం ఉన్న పోలీసువాళ్ళే ఈ పని చెయ్యలేకపోతే నాలాంటి సామాన్యుడు ఏం చెయ్యగలడండి?” అన్నాడు విశ్వం.

“కనీసం ఏం చెయ్యగలనని ఆలోచన చెయ్యగలరు కదా?”

“అంటే...”

“ఆటో వాళ్ళు మీటర్ మీదే ప్రయాణికులని తీసుకువెళ్ళడం వల్ల వాళ్ళకే మంచిదని వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఏం చేయాలి అని ఆలోచించండి!”

ఏదో స్టాప్ వచ్చింది. బస్సు ఆగింది. మళ్ళీ ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు. వాళ్ళ కదలికలో విశ్వం ఆయనకు దూరం అయిపోయాడు.

బస్సు కదిలింది. కళ్ళతోనే ఒకనొకళ్ళు చూసుకొన్నారు. ఈ వయస్సులో కూడా ఈయన బస్సులో చక్కగా ప్రయాణం చేస్తున్నారు. గొప్పే అని అనుకున్నాడు బస్సుల్లో ఈ రద్దీ భరించలేక వీలయినప్పుడల్లా ఆటోలోనే ప్రయాణం చేసే విశ్వం. ఆలోచించమని ఆయన ఇచ్చిన ఆలోచనకు మరింత ఆశ్చర్యపడ్డాడు.

విశ్వం ఒక డిగ్రీ కాలేజిలో స్టాటస్టిక్స్ (గణాంక శాస్త్రం) బోధించే లెక్చరర్. అతనికి ఉన్న అనుభవం అంతా పాఠాలు చెప్పడమే. చదువుకొన్న రోజులలో కాని ఇప్పుడుకానీ చదువు తప్ప మరే విషయాలలో పాల్గొన్నవాడు కాదు. లీడర్ అసలు కానే కాదు. తన చదువు, తన ఉద్యోగం, తన సంసారం, అంతే, సమాజంలో మిగిలిన విషయాల గురించి కానీ రోజూ ఆలోచించడు. సాయంత్రం భార్యని పిల్లల్ని ఇంటి దగ్గర ఉన్న ‘ఆరాధన’ హాలులో సినిమాకి తీసుకువెళతానని చెప్పాడు ఉదయం, ఊర్లో పని పూర్తి అయ్యేసరికి ఐదు దాటిపోయింది. లేటు అయిపోతోంది. తొందరగా ఇల్లు చేరుకోవాలి అన్న ఉద్దేశంతో ఆటో గురించి ఆలోచించాడు. బస్సు మరో రెండు స్టాపులలో ఆగి బయలుదేరింది. ఈలోగా తాపీగా విశ్వం దగ్గరకు చేరుకుని ఆయన,

“నేను మరో రెండు స్టాపుల తరవాత దిగాలి” అన్నాడు.

“అలాగా, నేను మీకంటే ఒక స్టాపు ముందే దిగాలి” అన్నాడు విశ్వం.

“సరే, అయితే నేను మీతోపాటే దిగి, మనం మాట్లాడడం మొదలుపెట్టిన విషయం మాట్లాడటం పూర్తిచేసి, ఆ తరవాత నడిచి మా యింటికి వెళతాను మీకు సమ్మతమేనా?”

“ఏదో మాటవరసకి అన్నారనుకున్నాను కానీ......”

నెలరోజులలో జవాబు వచ్చింది. పరిశోధన చాలా మెచ్చుకోదగ్గదని దీనిని చాలా మాసపత్రికల్లో ప్రచురించడం ద్వారా మరిన్ని ఇటువంటి పరిశోధనలు జరిగే అవకాశం ఉందని, డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు ఇంత చక్కనైన పరిశోధన జరిగిందంటే ఆశ్చర్యంగా ఉందని పొగుడుతూ కూడా రాసాను. ఈ పరిశోధన సామాజిక ప్రయోజనం దృష్ట్యా కొద్ది సాంకేతిక మార్పులతో వెంటనే డిసెంబరు నెలలో రానున్న వారి మాసపత్రికలో ప్రచురించడానికి సంపాదక వర్గం నిశ్చయించిందని తెలుపుతున్నందుకు సంతోషిస్తున్నామని రాసారు.

విశ్వం ఆ ఉత్తరాన్ని ముందు సంప్రదించిన యూనివర్సిటీలో ఉన్న ముగ్గురు ప్రొఫెసర్లకు తీసుకువెళ్ళి చూపించాడు. వాళ్ళు కూడా మరోసారి అభినందించారు. పత్రికల వాళ్ళని పిలిపించారు. విశ్వం ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు, విద్యార్థినులు తాము చేసిన పరిశోధన ఫలితాలని అందరికి అర్థం అయ్యేలా వివరించారు.
* * *

‘మీటర్ పై నడిపే ఆటోడ్రైవర్లే ఎక్కువ సంపాదిస్తున్నారు’ అన్న శీర్షికతో మర్నాడు అన్ని వార్తాపత్రికలు మొదటి పేజీలోనే పెద్ద అక్షరాలతో ప్రచురించాయి. నగరంలో జరిగిన పరిశోధన గురించి వివరంగా రాసాయి. మీటరు మీద మాత్రమే ఆటో నడిపే డ్రయివర్లు, బేరాలాడే వారికంటే 50 శాతం ఎక్కువ సంపాదిస్తున్నారని, 60 శాతం తక్కువ శ్రమ పడుతున్నారన్నది ముఖ్యమైన విషయంగా గణాంక లెక్కలవల్ల తేలిందని రాసాయి. మీటరు మీదేకదా అని ప్రయాణికులు తక్కువ దూరాలకి కూడా ఆటో వాడడం ఎక్కువ చేసారని, అలా చేయడం వల్ల తక్కువ దూరాలు తిరగడం వల్ల ఖాళీగా వెనక్కి రావడం బాగా తగ్గి, ఆదాయం పెరగడానికి తోడ్పడిందని, ఏవిధంగా చూసినా బేరాలాడే ఆటోడ్రైవర్ల ఆదాయం రకరకాల కారణాలవల్ల కూడా తక్కువగానే ఉందని, ఈ భేదాలు గణాంక శాస్త్ర లెక్కల ప్రకారం గణనీయమైనవని రుజువైందని, ఈ పరిశోధన శాస్త్రీయంగా చేసింది కాబట్టి ఈ రంగంలో పరిశోధనలని ప్రచురించే ‘సాంఖ్య’ పత్రిక వల్ల దేశవ్యాప్తంగా నగరంలో జరిగిన ఈ పరిశోధనకి గుర్తింపు కూడా వచ్చిందని రాసాయి.

పరిశోధనలో పాల్గొన్న 1000 పైబడ్డ ఆటోడ్రైవర్ల నోటిమాటతో అప్పటికే నగరంలో నలుమూలల మీటర్ మీద తిరిగే ఆటోల సంఖ్య బాగా పెరిగింది. వార్తపత్రికలలో ఈ పరిశోధన రావడం వల్ల నగరంలో మీటర్ మీద మాత్రమే వచ్చే ఆటోల సంఖ్య చాలా ఎక్కువైంది.

ఆటోమీటర్ మీద రావడం ఆటోమేటిక్ గా జరగడం నగరంలో అన్ని వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా పోలీస్ వర్గాన్ని ఆలోచింపజేసింది. డజన్ల కొద్ది పోలీసులని పెట్టి, చలానలు కట్టించి, నానా తిప్పలు పడ్డా నిజమైన మార్పు ఎప్పుడూ రాలేదు. అలాంటిది ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా ఇంత పెద్ద మార్పు సులభంగా రావడమంటే పోలీసువారి పనితీరులోనే ఏదో లోపం ఉందని వారికి, ఆలోచించినవారందరికి తోచింది.

డిగ్రీ కూడా పూర్తికాని వాళ్ళతోనే ఇంత చక్కనైన, ఉపయోగకరమైన పరిశోధన చేయించగలిగితే, పరిశోధనలకై లక్షలు ఖర్చు పెడుతూ పిహెచ్.డి డిగ్రీల వాళ్ళని తయారుచేస్తున్న యూనివర్సిటీలు మరెంత ఎక్కువ ప్రజలకి ఉపయోగకరమైన పరిశోధన చెయ్యగలవో కదా! అనిపించింది.

ఈ పరిశోధన అంతటికి ముఖ్యమైన వ్యక్తి అయిన విశ్వంకి మాత్రం మామూలు స్టాటస్టిక్స్ లెక్చరర్ అయిన తనని ఇటువంటి పరిశోధనకు పురికొల్పిన ఆ వ్యక్తి మళ్ళీ కనిపించలేదు. అతను ఎవరు? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడు? కనిపిస్తే మనకున్న మిగిలిన సమస్యలన్నింటికీ కూడా ఆటోమేటిక్ గా పరిష్కారం దొరికే మార్గం చూపించగలడా? అతడు మనలోని వ్యక్తా? విశ్వం ఆలోచనలలో మునిగిపోయాడు ప్రేరేపించేది ఎవరైనా, ప్రేరణ ఇచ్చేది ఏదైనా పనిచెయ్యవలసినది మనమే అన్న పాఠం బోధపడిన విద్యార్థిలా విశ్వం ఆనందంతో వెలిగింది.
-వార్త, 15 మే, 2000





1 వ్యాఖ్యలు

మీ ఆవిడను కొట్టరా?

చుట్టపు చూపుగా ఆ ఊరు వచ్చిన నేను, చుట్టాల సలహాపై గుండె జబ్బు వచ్చిన వాళ్ళ ఆయనను పరామర్శించాలని వచ్చిన నన్ను ‘ఎవరు మీరు?’ అన్న ప్రశ్నకి నేను చెప్పిన జవాబు విని, ఆవిడ కోడలి తరఫు చుట్టం అని గ్రహించిన వెంటనే, మనిషి బిగుసుకుపోయి, బొమ్మైపోయి, వాలుకుర్చీ వేయించి, నన్ను కూర్చోమని,

“ఆయన లేరు. ఆయన ఆవిడను నేనే. నాతో మాట్లాడండి” ఈ విషయం ఇక్కడితో తేల్చి పారేస్తాను. అన్న ధీమాతో జానకమ్మ గారు అనబడే ఒక ఆంధ్ర ఇల్లాలు మా ఇల్లాలి గురించి నన్ను అడిగిన ప్రశ్న అది.

అది వినగానే, ఈ చుట్టపు చూపు అయిపోయిన తరువాత బీచ్ కు వెళ్ళి పాత జ్ఞాపకాలలో పరవశించి, దనపల్లాలో డిన్నరు పార్టీకి వెళ్ళి, అక్కడ నుండి సాహితీ మిత్రులతో కిళ్ళి బిగించి, కళ్ళు మూతలు పడేదాకా కథల కబుర్లలో కదిలే కాలాన్ని కలకాలం గుర్తుండేలా గడుపుదాం అనుకున్న నా సాయంత్రం ప్లానంతా ఒక్కసారి ఎవరో నా బుర్రలో ఆలోచనలని ‘రబ్బరు’తో తుడిపేసిన భావన కలిగింది.

ఆ ప్రశ్న వేసిన ఆవిడ మొహాన్ని చూద్దామని వాలు కుర్చీలో కూర్చున్న నేను తల ఎత్తేసరికి వాలుకుర్చీకి ఒక ఐదడుగుల దూరంలో ఆవిడ ఆ హాల్లో నేలమీద చతికిలపడుతున్నది. ఆవిడ చతికిలపడడం పూర్తి అవగానే, నా మొహాన్ని ఆవిడ కళ్ళు ‘పొజిషన్’ చేస్తున్న సమయంలో, గదిలో వెలుగుతున్న ట్యూబ్ లైట్ వెలుగులో ఆవిడ మొహం చూశాను.

‘ఈ ప్రశ్న అడగడం కోసమే ఇన్నాళ్ళు వేచి ఉన్నాను’ అని అనిపించింది ఆమె మొహంలో భావం. తాను వెయ్యబోయే ప్రశ్నకు నేను భయపడి పడిపోతానేమో అని ముందే ఆలోచించి, వాలుకుర్చీలో కూర్చొన్న తరవాతే అడిగిందేమో అని అనిపించింది.

ఊగడం కోసమే వాలుకుర్చీ ఉందని చిన్నప్పటి నుండి నమ్మి వాలుకుర్చీలో కూర్చోగానే ఊగడం అలవాటైన నేను కదిలితే బాంబులు పేలిపోతాయేమోనన్న భయంతో యుద్ధ భూమిలో నిలబడ్డ సైనికుడిలా, ఆ సైనికుడి చేతిలో ఉన్న పేలని తుపాకిలా, నడుం నిటారుగా పెట్టుకుని కూర్చొని ఉన్నాను.

ఒంటిలో కొన్నిచోట్ల చల్లగా, మరికొన్ని చోట్ల వేడిగా అనిపించింది. చల్లబడిపోతున్న భాగాలకి రక్తం వెంటనే ప్రసరిస్తే బాగుంటుందనిపించింది. నా గుండె కొట్టుకుంటున్నట్టు నాకే తెలుస్తున్నది. కొద్దిసేపట్లో వినిపిస్తుందేమో అని అనిపించింది. ఉన్నట్టుండి నా స్నేహితులు, కార్డియాలజిస్టు అయిన డాక్టర్ శివప్రసాద్ గుర్తుకు వచ్చారు. వెర్రి నాగన్న జడుసుకున్నాడు. దిస్టి తీయండి అన్న ధైర్యం చెప్పే అమ్మమ్మ ఏ లోకాలకు వెళ్ళిపోయిందో ఆ లోకాల నుండి దిగి వస్తే బావుణ్ణనిపించింది.

‘నీకసలు బుద్ధి లేదు. నీలాంటి నిరుపయోగ ఛాందసుల’ వల్లే ఇలాంటి ప్రశ్నలు 1999లో ఆపైన 2099లో కూడా ఉంటాయి. అని బాధ, కోపం మేళవించి, సరికొత్త రసాన్ని ప్రసాదించే దీపం లాంటి కళ్ళతో మా ఆవిడ అమాంతం గుర్తుకు వచ్చింది.

‘ఇలాంటి వాళ్ళకు ఏ జవాబు చెపుతావో చెప్పు’ అన్నట్టు అనిపించింది.

“బాబూ జవాబు చెప్పు” అన్నారు జానకమ్మగారు” “అందరు మొగవాళ్ళు కొడతారు పెళ్ళాన్ని కొద్దో గొప్పో. అందరు ఎప్పుడో ఒకప్పుడు వర్షంలో తడుస్తారన్నంత సామాన్యంగా. అంత మాత్రాన పుట్టింటికి పారిపోతారా? ఇలా అయితే సంసారాలు చేసినట్టే”.

“అసలు మా ఆయన నన్ను పెళ్ళి అవ్వకముందు నుండి కొట్టేవారు. కాబోయే మొగుడూ పెళ్ళాలు అని అందరూ నవ్వేవారు. నేను మాత్రం కళ్ళనీళ్ళతో, సిగ్గుతో పారిపోయేదాన్ని అక్కడనుంచి.

ఆయన కూడా వాళ్ళతో పాటే నవ్వేవారు. మా డాక్టర్ గారి పుణ్యమా అని మా వాళ్ళు ఏడుస్తూ ఇచ్చిన కట్నం డబ్బుపోయినా, ఆ నవ్వు ఆయన పెదాలమీద నుండి చెరిగిపోలేదు” అని ఆగి మెడలో మంగళసూత్రం తీసి కళ్ళకు అద్దుకొని, తల వంచుకుని, “శోభనం నాడు గదిలో సిగ్గుపడ్డానని, మొట్టికాయ మొట్టారు. తలంతా జివ్వుమంది. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి”.

“తమకాన తేలించు తలపుల
గమకాలు రివ్వు రివ్వుమను
తరుణాన తనువంత తేలియాడు
గజ్జలు ఘల్లుఘల్లుమని
పూల వర్షమై, పూల పాన్పుపై
పవళించ వధువు, నీ మధువు”

పెళ్ళి కానుకగా నా స్నేహితుడు అప్పారావు రాసిచ్చిన కవిత గుర్తుకు వచ్చింది. దాని మాధుర్యం అంతా వెగటనిపించింది. ఆ పదం తాగుతున్నప్పటి బెల్లం ముక్కలా.

పదహార్రోజుల పండుగనాడు మోటు సరసం మానమని మా పెద్దనాన్నగారి మూడో అమ్మాయి నాకంటే ఒక ఐదేళ్ళు పెద్దది ఈయనతో అందని, నన్ను గదిలోకి తీసుకెళ్ళి, ‘దానితో ఎందుకు చెప్పావని’ అన్నారు.

“నేనేం చెప్పలేదని అంటున్నా వినిపించుకోకుండా, లెంపలు వాయించాడు” అని ఆవిడో నవ్వు నవ్వింది. ఆ నవ్వు మురికివాడలో మెర్సిడిస్ కారు హారన్ లా వినిపించింది.

“మా వాళ్ళంతా బుగ్గలు ఎర్రగా కందాయని ఏడిపించారు. అయితేనేం మా పెళ్ళి చాలా వైభవంగా జరిగింది అన్నారు అంతా. గృహప్రవేశం అయిన తరువాత ఒక రోజు బియ్యం ఏరుతూ ఉంటే, మా అత్తగారు అడిగారు అంతా సవ్యంగా ఉందా అని. ‘ఊ!’ అని ఊరుకున్నాను. కాని ఆవిడ మరీ రొక్కించి అడిగితే ‘మొట్టికాయలు’, ‘లెంపకాయల’ గురించి చెప్పాను.

ఆవిడ నవ్వేసి, మొగుళ్ళంతా అంతేనే అన్నారు.
‘కానీ మా నాన్నగారు మా అమ్మని కొట్టరే’ అంటే,

‘అందుకే మీ అమ్మ ఆడింది ఆట, పాడింది పాట’. మీ నాన్న ఒట్టి మెతక మనిషి మొగాళ్ళంతా అలా ఉండరు. వీరంతా వాళ్ళ నాన్న పోలిక. వట్టి కోపిష్టి. చిన్నప్పటినుండి అంతే ఊళ్ళేలవలసిన మొగమహారాజు వాడు. నలుగురితో సాకుకు రావాలి. నాలుగు వ్యవహారాలు చక్కబెట్టుకుని రావాలి. మగాడన్న తరువాత బయట ఎన్నో వ్యవహారాలు, గొడవలు ఉంటాయి. ఉద్యోగం అంటే మాటలా? అయినా ఆడవాళ్ళకేం తెలుస్తాయి? ఇది తెలుసుకోకుండా మనం ప్రవర్తిస్తే ఎవరికి మాత్రం కోపంరాదూ? ఎందుకు కొట్టడు? అన్నారు.
మనవరాలి కోడలని, మా అత్తగారి అత్తగారు కూడా అప్పుడప్పుడు విషయాలు అడిగి తెలుసుకుంటుండే వారు. మా ముందు జీవితం బాగుండాలని ఎన్నో సలహాలు ఇస్తూ ఉండేవారు. ఆవిడ కూడా మొగుడు పెళ్ళాన్ని కొట్టడం ఒక పెద్ద విషయం కాదని, మా ఆయన తాతగారు, అంటే వాళ్ళాయన కూడా అప్పుడప్పుడు కొట్టేవారని చెప్పారు.

అప్పుడనిపించింది పెళ్ళాన్ని కొట్టడం వీళ్ళ వంశంలో ఉందని.

ఆ తరువాత ఇరుగు పొరుగులతో కలసి మెలసి మాట్లాడుతుంటే తెలిసింది సుమారు అన్ని కుటుంబాలలో ఎంతోకొంత పెళ్ళాన్ని కొట్టడం ఉంటుందని అంచేత నేనుట్టినే బాధపడాల్సిందేం లేదని, నిక్షేపంలాంటి సంసారం హాయిగా చేసుకుంటూ, గంపెడు పిల్లల్ని కను అన్న పెద్దావిడ దీవెనలను, సలహాలను ఇంకా మరిచిపోలేదు. కాకపోతే మొదట్లో ఒంటిమీద దెబ్బపడిన చోట, మనసులో చాలాబాధగా ఉండేది. ఒంటికంటే మనసులోనే బాధ ఎక్కువ సేపు ఉండేది. రాను రాను అలవాటు అయిపోయింది. ముందు మనసులో బాధ లేకుండా పోయింది. తరువాత ఒంటి బాధ ఓర్చుకోవడం అలవాటయిపోయింది.

ముసిలావిడ పోయే ముందొక జాగ్రత్త చెప్పి పోయింది. ఆ రోజసలేవయిందంటే, ఈయన షర్టు వేసుకుంటున్నారు. నేను పాలవాడికి డబ్బులివ్వాలి అన్నాను ఎంత అన్నారు. రోజుకు రూపాయి, నెలంతటికి ముప్ఫై అన్నాను.

‘ఈ నెలకెన్ని రోజులే?’ అన్నారు. ముప్ఫై అన్నాను. చేతిలో ఉన్న హేంగరుతో ఎడాపెడా కొట్టారు వెంటనే. అప్పటికప్పుడు ఏడాదిలో నెలలు, ప్రతీ నెలకు ఎన్ని రోజులో వల్లె వేయించారు. అప్పుడు తెలిసింది. ఆ నెల ఆగస్టు, అంచేత ముప్ఫై ఒక్క రోజులు ఉంటాయని.

ఒక మూల మంచంలో పడుకొని చూస్తున్న ముసలావిడ, ఆయన వెళ్ళిపోయాక దగ్గరకు పిలిచి వాడొట్టి మూర్ఖుడు. చేతికి ఏదందితే దానితో కొడతాడు. వాడితో ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు చేతిలో చుట్టుపక్కల ఏవీ వస్తువులు లేకుండా చూసుకో అని జాగ్రత్త చెప్పారు.

మరోసారి ఇలాగే చిన్నవాడి చేత లెక్కలు చేయిస్తున్నాను. ఏదో తప్పు చెప్పానని, ఎదురుగా టేబుల్ మీదనున్న కంపాక్స్ బాక్స్ నా మొహం మీదికి విసిరారు. అక్కడితో ఆగక ఎక్కాలు వల్లె వేయించారు కూడా. ఈయనకు లెక్కలంటే మహా ఇష్టం,. ఒక తప్పు రాకూడదు. వాళ్ళ ఆఫీసరు ఈయనకు లెక్కల్లో ఉన్న తెలివికి మురిసిపోతుంటారుట.

అదే పోలిక మా అబ్బాయిలకు కూడా వచ్చింది. వంశంలో పోలికలు ఎక్కడకు పోతాయి అని ఆగి, ఏమే కోమలా ఇలారా ఒకసారి అని వంటింటి వైపు తిరిగి కేకవేశారు.

కోమలంగా ఉన్న ఒక పాతికేళ్ళ అమ్మాయి వచ్చి, హాలు గుమ్మం దగ్గరే నిలబడిపోయింది.

“రకరకాల చిట్కాలు ఉపయోగించి, మొగవాళ్ళని శాంతపరచడమో, దెబ్బపడకుండా చూసుకోవడమో చెయ్యాలిగాని” అని తల వెనకు తిప్పి.

“ఇలా ముందుకు రావే” అని. దీనికి బారెడు జుత్తు. అది చూసే మురిసిపోయి దీన్ని చేసుకుంటాను అన్నాడు మా పెద్దాడు. మా ఆయన కట్నం కొద్దిగా తక్కువని అన్నా సరే, వాడి సరదా కూడా చూడాలని ఆయన్ని ఒప్పించాను. అయితే, వాడికి కోపం వచ్చినప్పుడల్లా దీని జడ పట్టుకుని లాగుతాడు. ఇది కొంపలంటుకుపోయినట్టు కేకలు, ఏడుపులు. అంచేత దీన్ని ముడేసుకు తిరగమన్నాను. అప్పటి నుండి వాడి ఆగడం తగ్గింది. ఏవో చెప్పవే అని కోడలి వైపు చూసి అన్నారు.

నా తల వంగినంత వంగి, ఇంకెప్పటికీ ఎత్తులేనంత కిందికి వంగిపోయినట్టు అనిపించింది. కదలక కాళ్ళేకాదు తలకూడా తిమ్మిరెక్కినట్టయింది. గుండె కొట్టుకోవడమే కాదు, నేను ఊపిరి పీల్చడం కూడా నాకు తెలుస్తున్నది. ఆ వాలు కుర్చీ ఒక నేల నూతిలా అనిపిస్తున్నది.

నాకున్న పరిసర జ్ఞానం అంతా జానకమ్మగారి గొంతుకు, ఆ హాలుకు, ఆ హాలులో వెలుగుతున్న ట్యూబ్ లైట్ కు మాత్రమే పరిమితమైపోయింది. సమయం ఆగిపోయినట్లు, నేను రాయి అయిపోయినట్లు అనిపించింది. ఈ తటస్థ అనిశ్చిత స్థితికి అంతం ఎప్పుడో తెలియడం లేదు. ఉలుకు పలుకు లేకుండా ఆవిడ మాటలు వినడానికి మాత్రమే నా జ్ఞానేంద్రియాలు ఉన్నట్లు, వాటికి జీవం ఇవ్వడానికి నేను ఉన్నట్లు ఉంది అప్పటి నా స్థితి.

అలా ఆవిడ ఆ ఇంట ఏఏ ఆడపడుచు, ఏ విధాన వారి వారి భర్తల వల్ల ఏ విధమైన తిట్లు, తన్నులు తిన్నారో, వారింట అది ఎంత సహజమో, వివరంగా, కోర్టులో లాయర్లు సాక్షులని ప్రవేశపెట్టి చెప్పిన తీరులో, ఒక రెండు గంటలపాటు, ‘ఆడదానిపై మగవాడి అమానుషత్వం’ అన్న విషయాన్ని సోదాహరణంగా, సోషియాలజీ ప్రొఫెసర్ లా లెక్చరిచ్చారు. ఆ వివరాలు, మగవాడిగా నేను చెప్పలేను, వ్రాయలేను.

దోమలు జోరుగా తిరుగుతున్నాయి. కళ్ళకు కనబడుతున్నాయి. ఆడవాళ్ళ నిస్సహాయ స్థితికి ఆపకుండా ఏడుస్తున్నాయా అన్నట్లు చప్పు డు చేస్తున్నాయి. ఆడవాళ్ళ ఆ బాధలన్నింటికి మూలకారణమైన మగ మనిషిని నేనే అన్నట్లు నన్ను కసిగా కుడుతున్నాయి. ఎదురుగా ఉన్న ఆడవాళ్ళని కుడుతున్నట్లు నాకనిపించలేదు.

దోమలకి ఆడ, మగ మనుషులని పోల్చే శక్తి ఉంటుందా అన్న శాస్త్రీయమైన ప్రశ్న అత్యంత అసందర్భమైన సమయంలో నా మెదడుకు తట్టింది. ఆ ఇంటికి వచ్చిన తరువాత నా మెదడు చేసిన మొట్టమొదటి పని అది న్యూరో బయాలజీలో పరిశోధనలు చేస్తున్న ఓ నలుగురి మిత్రులకు, డాక్టర్ ఫ్రాన్సిస్ క్రిక్ కు ఈ ప్రశ్న వెంటనే ఈమెయిల్ ద్వారా పంపాలనిపించింది. అది కాని నిజమైతే, దోమలలో మనుషులని పోల్చుకునే శక్తి కేంద్రాలని పని చేయనివ్వని మందులని తయారు చేయవచ్చునని, దానివలన మనుషులకి హానిలేని విధంగా, దోమలని చంపకుండానే, దోమలద్వారా వ్యాపించే మలేరియా, ఫైలేరియా వంటి జబ్బులని అరికట్టవచ్చునని, అలా అపరిసరాలు మరిచిపోయి మెదడు పనిచేసే తీరుమీద ఆ పరిజ్ఞానపు ప్రయోజనాల మీద, నా మెదడు పనిచేయడం మొదలుపెట్టింది.

“కాఫీ పుచ్చుకోండి” అన్న జానకమ్మ గారి మాటతో ఆ పరిసరాలకు వచ్చాను.

తల ఎత్తలేదు. నా కళ్ళకు ఎర్రంచు పచ్చ చీరె కుచ్చెళ్ళు. ఆ కుచ్చెళ్ళ అంచునున్న పాదాలు, ఆ పాదాలకున్న మట్టెలు కనిపించాయి. ప్రస్తుతం నాకు ఏ ఆడపిల్లని, ఆడ మనిషిని చూడాలని లేదు.

ఇదంతా నేను చదువుతున్న కథలోనో, నవలలోని సన్నివేశం అయితే, ఆ నవలని అక్కడికక్కడ టక్కున మూసెయ్యాలని, కల అయితే కళ్ళు తెరిచెయ్యాలని, ఒకసారి ఊపిరి పీల్చుకోవాలని, మొహాన్ని చల్లని నీళ్ళతో కడుక్కోవాలని ఉంది. కానీ ఇది కథ, నవల, కలకాదు. అంతా కళ్ళముందే జరుగుతున్నది. కాళ్ళు కదపలేని పరిస్థతి. కదలలాని ఉంది. కదలలేను. పారిపోవాలని ఉంది. పారిపోలేను.

విచ్చుకున్న భూమిలోకి వెళ్ళిపోయిన సీతలా, ఎందులోకైనా చొచ్చుకుపోవాలని ఉంది. కాని నిస్సహాయంగా ఆ వాలు కుర్చీకి అతుక్కుపోయాను. కొన్నేళ్ళ క్రిందట కాల్టెక్స్ క్వార్టర్స్ లో కేరళ అమ్మాయి కాఫీ అందిస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసినప్పుడు కూడా ఇలాగే ఆ కుర్చీకి అతుక్కుపోయిన జ్ఞాపకం వచ్చింది. కానీ ఆ ఊహ అతిచేదుగా వేగంగా, పచ్చి కరక్కాయి కొరికినట్టు అనిపించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు దాచుకున్న సుకుమారమైన భావం ఒకటి కొలిమిలోపడి కాలిపోయిన పువ్వులా అనిపించింది.

కళ్ళు మాత్రమే ఎత్తి, కనిపించినంత వరకు చూశాను. ఎదురుగా, కొద్దిగా వంగి, సెగలు కక్కుతున్న కాఫీ గ్లాసు పట్టుకుని ఒకామె ఉంది. క్షణాలు గడుస్తున్నాయి. చెమటలు కారుతున్నాయి.

“అదక్కడ పెట్టి విసినకర్ర తెచ్చి విసరవే. ఆయనకి” అన్న జానకమ్మ గారి కేకకి ప్రతి చర్యగా ఆమె మరింత వంగుని నేనందుకోని కాఫీ కప్పుని నాకందే అంత దగ్గరలో వాలుకుర్చీకి ప్రక్కగా పెట్టింది. అప్పుడు అయిన గాజుల చప్పుడు మరే పరిస్థితిలో అయినా విని ఉంటే ఏఏ భావాలను కలిగించేదో, ఏఏ భాగాలను కదిలించేదో కాని, ఇప్పుడు ఖాళీ గాజు సీసా పగిలినప్పుడు వినిపించే ఆఖరి శబ్దాన్ని మాత్రమే తలపించింది.

జానకమ్మగారు అలా మాట్లాడుతున్నారు.

విసనకర్రతో విసిరిన గాలి చల్లగా తగిలింది. కాని హాయిని కలిగించలేదు. దెబ్బమీద టించర్ అయొడిన్ వేసి ఊదినట్టనిపించింది.

‘చాలు’ అన్న ఒక్క మాట రెండుసార్లు నా నోటి నుండి ‘చాలు చాలు’ గా వచ్చింది. మౌనం రాతి విగ్రహమై లేచి నిలబడ్డట్టుగా లేచి నిలబడ్డాను. రాతి విగ్రహాలలో కూడా రమ్యమైన భావాలను చెక్కగల శిల్పులుంటారు. కాని మౌనమే ఘనమైన నా మొహంలో ఏ భావము లేదని, ఎదురుగా ఉన్న అద్దంలో కనిపించిన నా ప్రతిబింబం నిరూపించింది.

అప్పుడు నాకు తలలేకపోతే బావుణ్ణనిపించింది. అప్పుడు తలలేనితనం కావాల్సి వచ్చింది. లక్షలాది సంవత్సరాల ప్రకృతి పరిణామశక్తి వల్ల మెరుగులు దిద్దబడ్డ లక్షణమైన నా తల నాకు నచ్చలేదు. చాలా బాధ కలిగించింది. అసహ్యం కలిగించింది. ఆ తల నేను చెయ్యని తప్పులకు ఎల్లకాలం నా తోటి ఉండే నా తప్పుడు సాక్షిలా అనిపించింది.

ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ మరమనిషిలా కదిలాను.

అంతలో అమాంతంగా జానకమ్మగారు నా కాళ్ళను ఆమె రెండు చేతులతో చుట్టి పట్టుకునే ప్రయత్నంలో ముందుకి వంగి, తల ఎత్తి “బాబ్బాబు పెళ్ళాన్ని కొట్టాడని మా వాడి మీద కేసు పెట్టకండి. పెద్దదాన్ని కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుతాను. ఇలాంటి పిల్లల్ని కన్నందుకు నన్నే జైల్లో పెట్టించండి” అంటున్న ఆవిడ చేతులకు అందకుండా వెనక్కి జరిగి ఆ హాలులోంచి, వాకిటిలోకి, వాకిటిలోంచి వీధిలోకి, వీధిలోంచి బీచ్ రోడ్డు మీదకి, అక్కడి నుండి బీచ్ లోకి నిద్రలో నడిచి వెళ్ళే మనిషిలా నడచి వెళ్ళి కూర్చొన్నాను.

కొన్ని గంటల సేపు నన్ను నిశ్చేష్టుణ్ణి చేసిన జానకమ్మ గారి ప్రశ్న మెల్లిగా నాలో ఆలోచనలు రేకెత్తించింది. కొట్టే వాళ్ళని తిరిగి కొట్టడం, కొట్టించడం, కొట్టడానికి తగిన శిక్షణ అందించడం, పెళ్ళాన్ని కొట్టడం అనే సాంఘిక సమస్యకు సమాధానాలు కావు. ఆవేశం ఇంధనమైన ఆలోచనల ఫలితమే అవుతుంది. కేసు పెట్టవచ్చు. కానీ దానికి కొట్టబడిన ఆడది ధైర్యంగా నిలబడి, అత్తమామలతో, బహుశా తల్లిదండ్రులతో, బంధువులతో తన చుట్టూ ఉన్న సమాజంతో పోరాడుతూ నెగ్గుకు వచ్చి, ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడినప్పుడే అది సాధ్యం. చాలామంది తమకెంత కష్టం ఉన్నా భరిస్తారు కానీ, తమ సంసారాన్ని కోర్టుకు తీసుకురారు. కోర్టు ఇచ్చే తీర్పు ‘మనిషి’ని మార్చలేదు. ‘మనిషి’ ఆలోచనలో మార్పు మాత్రమే ఇటువంటి సాంఘిక సమస్యలకు తగిన పరిష్కారం. ఈ దశలో నా ఆలోచనలు ముందుకి వెనక్కి సాగాయి. ఏ మార్పువల్ల అయితే ఇటువంటి సమస్యలు సమసిపోతాయో, అటువంటి మార్పు అవసరం నా ఆలోచనలకు కూడా ఉందని తోచింది.

ఓక్షణం అడివిలో ఎండి, రాలి నేలపైపడి ఉన్న ఆకులని చిన్న నిప్పురవ్వ పొగలేకుండా కాల్చిన తీరులో నా ఆలోచనల అడవిని శుభ్రం చేసింది. ఏ వాదాలు, ఉద్యమాలు చెయ్యని పని ఒక్క రోజులో చేసింది. అయితే ఈ మార్పు నా ఒక్కడికే పరిమితం. బహుశా ఈ మార్పు తీర్పు ఇంతేనేమో. అంచేత నేను మీకు కూడా అదే ప్రశ్న వేస్తున్నాను. ‘మీ ఆవిడను కొట్టరా?’
- ఆంధ్రజ్యోతి, 6 ఆగస్ట్ 1999


1 వ్యాఖ్యలు

తైలవర్ణ (వి) చిత్రం

న్యూయార్కు నగరం పొలిమేరలో ఉంది నాఇల్లు. అందువల్ల అర్ధరాత్రి అయినా సరే మా ఆవిడతో పాటు ఒక రెండు మైళ్ళు అటు ఇటు వాకింగ్ కు వెళ్ళడానికి వీలవుతుంది. ఆకురాలు కాలం ప్రారంభం అవ్వగానే మారీ మారని ఆకులు వివిధ రంగులు సంతరించుకుంటున్న ఒకానొక రోజు సాయంత్రం తొమ్మిది గంటలకి భోజనం చేసి ‘వాక్’ కి వెళ్ళాం. దార్లో ఉన్న ఒక బస్ స్టాప్ లో ఒక ఆఫ్రో అమెరికన్ (వాళ్ళని నల్లవాడు అని అనగూడదని మావాడికి స్కూల్లో నేర్పేరు. వాడు మాకు ఇంట్లో నేర్పేడు) భుజానికో సంచి, చేతిలో ఒక చిన్న పెట్టెతో ఒంటరిగా బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. మేం మా వాకింగ్ పూర్తి చేసుకొని వెనక్కి వస్తుంటే మళ్ళీ అక్కడే కనిపించాడు దూరంనుండే.

“ఆఖరి బస్ మిస్సయ్యేడేమో” అంది కరుణ అని పిలవబడే మా ఆవిడ. కె. అరుణ.

“అంటే అతన్ని ఇప్పుడు మనింటికీ తీసుకెళ్ళి ఈ రాత్రి ఉంచాలనా నీ ఉద్దేశ్యం” అన్నాను భాషకి అందని భావాల్ని పదాల మధ్య ‘స్మగ్లింగ్’ చేసి మా ఆవిడ తత్వం తెలిసిన నేను. “వద్దన్నానా” ఆమె సంక్షిప్త, సాధికార సమాధానం ప్రశ్నగా “ఇప్పటికే ఇల్లు ‘సత్రం’ చేసానంటున్నావ్” అని ఆగిపోయాను. “అన్నా అనకపోయినా అయ్యేది అదేగా” అంది నవ్వుతూ. ఇంతలో బస్ స్టాప్ దగ్గరికి వచ్చాం.

“లాస్టు బస్ మిస్ అయ్యారా?” అని అడిగాను ఇంగ్లీషులో “లాస్టుబస్ ఎప్పుడు?” అని వచ్చీరాని ఇంగ్లీషులో ఫ్రెంచియాసతో అడిగాడు.

బహుశా పూర్వం ఫ్రెంచి వాళ్ళు పాలించిన ఏ ఆఫ్రికా దేశస్థుడో అయి ఉంటాడని అనుకొని మనకొచ్చిన ఫ్రెంచి భాష వెలగబెట్టడానికి అవకాశం వచ్చింది. కదా అని మనసులో సంతోషించి ఫ్రెంచిలో సంభాషణ సాగించాం.

బస్ స్టాప్ లో ఉన్న టైంటేబుల్ చూపాను. లాస్టు బస్ వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం 5-30 నిముషాలకు మొదటి బస్ ఉంది. ఇక్కడ టాక్సీ దొరకాలంటే ఫోను చెయ్యాలి అని చెప్పాను. ఇక్కడ నుండి మెన్ హటన్ లో ఉన్న పోర్టు అథారిటీ బస్ టెర్మినస్, అంటే (పై ఊర్లు వెళ్ళే బస్ స్టేషన్) వెళ్ళాలంటే ఎంతవుతుంది అని అడిగాడు అతను. “సుమారు 50 డాలర్లు అవుతుంది” అని చెప్పాను. చాలా ఎక్కువే అని తటపటాయించాడు.

మాఆవిడ నేత్రావధానంతోనే “మరెందుకు టైమ్ వేస్టు, పిలువు, రాత్రి మనింట్లో ఉండి ఉదయం బస్సులో వెళ్ళమను” అంది. అడగ్గానే వెంఠనే ఒప్పేసుకొన్నాడు. కమారూన్ అనే ఆఫ్రికా దేశస్థుడట. విజటర్ గా అమెరికా వచ్చాడట. క్వీన్స్ లో ఉన్న స్నేహితునితో ఉందామని అతని ఎడ్రస్ పట్టుకొని వచ్చాడట. తీరా తన దగ్గర ఉన్న ఎడ్రస్ ప్రకారం వెళితే ఆ ఫ్రెండ్ ఆ ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోయి చాలా రోజులైందని ఆ ఇంట్లోవాళ్ళు చెప్పారట. అంచేత ఇప్పుడు మెన్ హటన్ వెళ్ళి అక్కడ నుండి వాషింగ్ టన్ (డిసి) అన్న ఊరు వెళ్ళాలిట. ఈ విషయాలు అన్ని చెప్తుండగానే మా ఇల్లు వచ్చేసింది. అతనికొ గెస్టు బెడ్ రూమ్ చూపించి పడుకోమన్నాం.

అలా వచ్చి ఆరాత్రి ఉన్న వ్యక్తి ఉదయం వెళ్ళిపోతూ ఒక తైల వర్ణచిత్రం ఇచ్చాడు మేం చేసిన సహాయానికి కృతజ్ఞతతో. అది మోడ్రన్ ఆర్టులా ఉంది. దానిని ఆ రాత్రే మా ఇంట్లోనే వేశాడుట. అదిమాకర్థం కాకపోయినా ఇచ్చాడుకదా అని మర్సి ( ఫ్రెంచిలో కృతజ్ఞతని సూచించే పదం) అని ఆ తైలవర్ణ చిత్రం తీసుకొన్నాను. అతను వెళ్ళిపోయాడు. మేం మా లైబ్రరీ గదిలో ఒక మూల పెట్టి మరిచిపోయాం దానిగురించి.

కొన్ని నెలల తరవాత చాలామంది అమెరికన్ లలాగే “స్ప్రింగ్ క్లీనింగ్” అని ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసి పారేసే కార్యక్రమంలో ఈ అర్థం కాని మోడ్రన్ ఆర్టుని ఏం చెయ్యాలి అని ఒక చిన్న చర్చ జరిగింది మా డైనింగ్ టేబుల్ దగ్గర. మోడ్రన్ ఆర్ట్ ప్రం కమరున్ ఫర్ సేల్ అని వెన్నిసేవర్ లో ఎడ్వర్ టైజ్ మెంట్ ఇస్తే అన్న మా అబ్బాయి సలహా అమలుపరిచాం. అంతే, ఒక పాతిక ఫోన్ కాల్సు వచ్చాయి. ఒక ఆదివారం అందరిని రమ్మని చెప్పాం.

వచ్చిన వారి కారు బట్టి, వారు ఆ తైలవర్ణ చిత్రం చూసిన తీరు బట్టి, దాన్ని చూడ్డానికి వారు వెచ్చించిన కాలాన్ని బట్టి మా అమ్మాయి ఆ తైలవర్ణ చిత్రం ధర అతి జాగ్రత్తగా పెంచుకొంటూ పోయింది. సాయంత్రం ఐదు అయ్యింది. “ఎంతో కొంతకి అమ్మేయవే, ఇక బయటపార్టీకి వెళ్ళాలి” అని గట్టిగా చెప్పాను. కారు చవకగా అమ్మేస్తున్నానని చెప్తూ ఖరీదైన కారులో వచ్చిన ఒకాయనకి వెయ్యిడాలర్లకి అమ్మేసింది. అతను చెక్కిచ్చి చిత్రం తీసుకొని వెళ్ళిపోయాడు.

తల్లి, “పుత్రికపుట్టంగకాదు. ఆ పుత్రిక...” అని పుత్రికోత్సాహాన్ని ప్రదర్శించితే, ఆ చెక్ ఎన్ కేష్ అయి డబ్బురానీ అని కొట్టిపారేశాను. నిజంగానే ఆ వెయ్యిడాలర్లు చెక్ ఎన్ కాష్ అయ్యింది అని తెలియగానే ముందు ఆశ్చర్యపోయాను తర్వాత అయ్యో ఆ చిత్రకారుని చిరునామా తీసుకోలేదే అని బాధపడ్డాను.


0 వ్యాఖ్యలు

తెలివి

చచ్చీ చెడి ఎలాగోలా వేసంకాలం సెలవులయ్యాయనిపించాం. కొన్నాళ్ళు అమ్మమ్మ వాళింట్లో కొవ్వూరులోనూ, రాలి పెద్దనాన్న గారింట్లోనూ, కాకినాడ తాతగారింట్లోనూ తిరిగి తిరిగి వచ్చాం కదా. అన్నిటికన్నా మా ఇల్లే హాయిగా ఉందనిపించింది. మేం లేమని సువర్ణ చాలా దిగులు పడిందిట. సెలవలకి ముందురోజే అందరికీ ప్రోగ్రెసు కార్డులిచ్చేశారు కదా. రేపట్నించి బడికెళ్ళాలి. ఇంతింత కాలం బడికెళ్ళకుండా వుంటే ఎంత విసుగొచ్చేసిందో.

ఈ సెలవుల్లో చిన్నారికి నాకూ రోజూ ఏదో ఒక దానికోసం యుద్ధమే. నేను క్లాసు ఫస్టు వచ్చానని అయిదోక్లాసు చదవనక్కర లేకుండా ఫస్టుఫారంలోకి డబుల్ ప్రమోషన్ ఇచ్చేశారుగా... చిన్నారి సెకండొచ్చింది కాబట్టి అది నోరెత్తకుండా మూడో క్లాసు చదవాల్సిందే. సువర్ణేమో సెకండు ఫారంలోకొచ్చింది. చిన్నారి సెకండు రాంకొస్తే అందులో నా తప్పేవుంది? ఈ సెలవలన్నాళ్ళు కుళ్ళుకు చావడమే కాకుండా ఇంక తెల్లారి బడుగా నేనా వెధవ బళ్ళో చదవనే చదవనూ అని ఒకటే ఏడుపు? పొద్దున్నే దాని గోల చూసి నాన్న “పోనీలే నీకు చదవాలని లేకపోతే చదువుమానేయ్. రెండో క్లాసు పాసయ్యావుగా? చాల్లే” అని ఆఫీసుకెళ్ళిపోయారు. దీని ఏడుపు విని ఇల్లుగల అత్తయ్యగారొచ్చారు ఏవిటవుతోందో అనుకుని.

“వదినగారూ! ఆ స్కూల్లో పిల్లేదో జడుసుకున్నట్లుంది పోనీ స్కూలు మార్చకూడదూ” అన్నారు.

“ఇది అందర్నీ జడిపిస్తుంది గానీ తను జడుసుకునే రకం కాదు. దీని విషయం మీకు తెలియదు. ఏదో ప్లానుండే వుంటుంది దాని బుర్రలో! సుశీలకి డబుల్ ప్రమోషనొచ్చి మరి దీనికి రాలేదు కదా. ఇప్పుడు మూడు క్లాసులు తక్కువ చదవడం దానికి నామోషట. ఇంక అందుకని ఆ స్కూలుకి చచ్చినా వెళ్ళదుట. ఏవన్నా అర్థవుందా! ఈ ఏడాది ఫస్టొస్తే దీనికి ఇస్తారుగా డబుల్ ప్రమోషన్” అని అంది అమ్మ.

“అమ్మా నీ పెద్దకూతురు కొట్టే ఫోజులు భరిస్తూ అసలు నేను ఏడాదంతా బతికి చదివి పాసయినప్పుడు కదా ఫస్టుర్యాంకు సంగతి? నేమాత్రం చచ్చినా దానితో కలిసి ఆ బడికి వెళ్ళను. రేపు నువ్వు సువర్ణా వాళ్ళ గుమస్తాగారితో ఫీజు కట్టించేసినా నే వెళ్ళను నీ ఇష్టం” అని చిన్నారి ఖచ్చితంగా చెప్పేసింది.

అమ్మయితే తలపట్టుకు కూచుంది. ఎప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకం లేకుండా వుండని చిన్నారి అసలు చదువే మానేస్తానంటే మరి అమ్మకి భయం వేయదూ! ఇంతలోకి వెంకాయమ్మ గారొచ్చారు. “పోనీ మా మనవడు ఈ వీధి చివర ఈదర వెంకట్రామయ్యగారి బళ్ళో చదువుతున్నాడు. అక్కడ చేర్పించమ్మా ప్రస్తుతానికి కాస్త పిల్లదానికి తిక్క తగ్గాక మళ్ళీ కాన్వెంటులో పడేయొచ్చు” అని ఉపాయం చెప్పారు.

“ఏవే? ఆ బడికెడతావా?” అనడిగింది అమ్మ.

“రేపోసారి చూసొస్తా. నాలుగులో చేర్చుకుంటానంటే చేరతా”నని – ఒప్పుకుంది. ఇంక అక్కడితో ఆ గొడవయిపోయిందని అమ్మయ్య అనుకుంది అమ్మ.

మర్నాడు నేనూ సువర్ణా వెడుతూ ‘రావే! వీళ్ల కొత్తకారులో వెడదాం’ అన్నా కూడా వినిపించుకోలా. వేసవికాలం సెలవుల్లో సువర్ణా వాళ్లు మంచి నల్లకారు కొనుక్కున్నారు. నడిపేందుకు ఒక డ్రైవరు తాతగారిని పెట్టుకున్నారు. దానికి కారెక్కి స్కూలు కెళ్లాలని రాసి పెట్టుండాలి కదా! ఎవరేం చేస్తాం. నే వెళ్ళి క్లాసులో కూచుంటే అందరు పిల్లలూ నా కన్నా ఎత్తుగా అనిపించారు. మా ఫ్రెండ్సంతా అయిదో క్లాసులో వుండిపోయారు కదా! తెల్సిన వాళ్లెవరూ లేరు. దానికి తోడు ఫస్టుఫారంలో ఎక్కడెక్కడి కొత్త పిల్లలో ముందు పరీక్ష రాసి పాసయి జేరతారు. అందుకే ఫస్టుఫారం నుంచి నాలుగు సెక్షన్లుంటాయి. నాకు బొత్తిగా తోచక కాసేపు అయిదోక్లాసులో కూచుని మళ్ళీ వచ్చా ఎందుకొచ్చిన డబుల్ ప్రమోషనూ! ఇంట్లోనా చిన్నారితోటే విరోధం వచ్చేసింది స్కూల్లో అయితే ఒక్క పిల్ల మొఖమూ తెలిసినట్లు లేదు.

మొదటిరోజు కదాని అందర్నీ అన్నాలబెల్లు కొట్టగానే ఇంటికెళ్లి పొమ్మన్నారు. ఇంతలోకి మా పాత రిక్షావాడు కనిపించి ఇంటి దగ్గర దింపేశాడు. ‘అమ్మాయి గారూ తమరు కారు కొనుక్కున్నారేటండి’ అని అడిగాడు. సువర్ణేం మాట్లాడలేదు. గానీ నేను మాత్రం “అవును! బడికెళ్లడానికి వీలుగా వుంటుందనీ” అని చెప్పా. అప్పుడప్పుడూ నా రిచ్చాలో కూడా ఎలిపోయొచ్చాల అంటే అలాగేలే అని వాడికి చెప్పి ఇంట్లోకొచ్చా.

చూస్తే ఏవుంది. చిన్నారికి చదువా? చట్టుబండలా? ఇందునీ బుజ్జినీ ముందేసుకుని కేరమ్సాడుతోంది. అయ్యో చదువు మానేశానే అని గానీ, కారెక్కలేకపోయానే అనిగానీ దానికింత బాధ కూడా వున్నట్లు అనిపించలా. తలెత్తి కూడా నాకేసి చూడలా. నన్ను చూడగానే ఏదో పనున్న దానిలా లేచి వెళ్లిపోయి ఒక పాత బాలమిత్ర పుచ్చుకుని కూచుంది.

అన్నం తింటూ అమ్మతో చెప్పా “అమ్మా ఫస్టుఫారం అంటే అంత పెద్దక్లాసని నాకు ఇన్నాళ్లు తెలియదమ్మా. ఇదివరకు మాకు నేలమీదే కూచుని చేతి బల్లల మీద రాసుకోవాల్సి వచ్చేదికదా. ఇపుడు ఎవరి బెంచీ వాళ్లకే! ఎవరి కుర్చీ వాళ్లకే. కుర్చీ బల్ల కలిసి ఉంటాయి. పది పుస్తకాలు పెట్టుకునేంత డ్రాయరు కూడా వుంది. ఇంకొలికి పోకుండా ఇంకు సీసా నిలబడేందుకు ప్రతి బల్ల మీదా గుండ్రంగా బిళ్లలాగా కూడా వుంది తెలుసా” అని అమ్మకి నేను మా స్కూల్లో ఫస్టుఫారం క్లాసు కబుర్లు చెప్తున్నాను. ఏదన్నా చెప్తేనే కదా తెలిసేది? అమ్మసలు బడికే రాదు కదా. ఏవీ చెప్పకపోతే ఎంతకని ఊహించుకుంటుందీ?

చిన్నారి పాపం తలెత్తకుండా విననట్లుగా నటిస్తోంది. దాన్ని చూస్తే నాకే జాలేసింది. ఎంతయినా సొంత చెల్లెలు కదా. రెండోక్లాసులో చదువాపేస్తోందంటే నాకు మాత్రం బాధగా వుండదూ? నాకన్నా మూడు క్లాసులు తక్కువయి పోయాననే కదా ఏకంగా బళ్లోకే వెళ్లనని పంతం పట్టింది. ఫస్టు రానంత మాత్రాన మరీ ఇంత పనిష్మెంటా?

“అమ్మా వారం రోజులలోపు ఫీజు కట్టకపోతే పేరు కొట్టేస్తారుట. ఈ శనివారం లోపల దీని తిక్క తగ్గకపోతే ఆ మూడో క్లాసు చదువు కూడా ఉండదు” అన్నా.

“నానీ! నీ విషయం నువ్వు చూసుకో దాని చదువు సంగతి నీకెందుకు? మళ్లీ ఏవన్నా అంటే రోజున్నర ఏడుస్తావు. నువ్వేమయినా దాని గార్డియన్ వా?” అని నన్నే కేకలేసింది. అమ్మెప్పుడూ దాని పక్షమే. అమ్మంతా వూరికే పనున్నప్పుడే నాతో బాగా మాట్లాడుతుంది.

“నేను ఏ చెత్త బళ్లోనూ చేరనని ఎప్పుడో చెప్పేశాగా! చెప్పమ్మా అమ్మా నేను కొత్త బళ్లో చేరానని!”

“ఏవిటి? కొత్త బళ్లోనా! ఏ బడి? చెప్పవేమే అమ్మా? దాన్ని ఎంచక్కా కొత్తబళ్లో చేర్పించి నన్నా వెధవ పాత బళ్లోనే చదివిస్తున్నావా? ఎంత న్యాయం!”

“ఛ నోర్ముయ్. తేగంటే తేగలాటి కడుకు కావాలంటావు! కొత్త బడంటే కొత్త బట్టలనుకుంటున్నావా? రోజు రోజుకీ కావాలనడానికి దానికంటే బుద్ధిలేదు. పెద్దదానివి నీ బుద్ధి ఏమవుతోంది?” మళ్లీ నన్నే తిట్టడం.

“అమ్మా! చెప్పమ్మా! ఏ బళ్లో చేరిందో?”

“మన వెంకాయమ్మగారి మనవడు చదువుతున్నాడే వీధి చివర బడి అందులో రెండు రూపాయలు జీతం కట్టి వచ్చింది” అమ్మ చెప్పింది.

“ఛీ ఛీ ఛీ! వీధి బళ్లో చేరావా నా తల్లీ ఇంకా కొత్త బడంటే ఏవిటో అనుకున్నాను. వీళ్లన్నా నిన్ను నాలుగో క్లాసులో చేర్చుకున్నారా పాపం ఇంతా కష్టపడ్డావు?”

“లేదు! అలా కుదరదన్నారు.”

“అయ్యో పాపం. స్కూలు మారీ ఏం లాభం. నాలుగులో చేర్చుకోపోతే!”

“నీ కెందుకే నా బాధ – నాలుగు కాకపోతే అయిదులో చేరతా! నీకెందుకూ నావూసు!”

“అమ్మ బాబోయ్! అయిదో క్లాసా! ఏకంగా మూడు లేదు నాలుగూ లేదూ! అయిదో క్లాసా! నాకన్నా ఒక్కక్లాసే తక్కువా?” నాకయితే గుండాగినంత పనయింది.

“ఆ! నీకన్నా ఒక్క క్లాసే తక్కువ. నువ్వుగానీ ఎప్పుడన్నా ఒక్కసారి పరీక్ష తప్పితే నీ క్లాస్ మేటునయిపోతా. చూస్తుండు. మళ్లీ ఏడు కాన్వెంట్లో ఫస్టుఫారం చేరే పిల్లల కోసం పరీక్ష పెడతారు కదా! అందులో పాసయి కాన్వెంట్లో వచ్చే ఏడు చేరకపోతే నా పేరు చిన్నారే కాదు!” ఇదన్నంత పనీ చేస్తుందని నాకు తెలుసు.

నే ఇందాకట్నించీ దాని చేతిలో ఉన్నది బాలమిత్ర అనుకున్నా కాదు సువర్ణ వాళ్ల తమ్ముడు సాయి లేడూ! అతనిది మూడోక్లాసు భూగోళం పుస్తకం. ఒక పదిరోజుల్లో మూడోక్లాసు (నావి పాతవి) చదివేస్తుందిట. లెక్కలేమో నాన్న దగ్గిర నేర్చుకుంటుందిట. వెధవ ఒక్కోక్లాసు చదవడానికి ఏడాదెందుకూ! దండగ! అని టక్కులు పోయింది.

నిజంగానే అది అన్నమాట సాధించి మళ్లీ ఏడాది మా కాన్వెంటు లోనె ఫస్టుఫారంలో చేరి ప్రతి పరీక్షల ముందరా నేతప్పితే నా క్లాసుమేటవుతావని బెదిరించబట్టే కదా నేనింత బాగా చదువుకుని ఇంత దాన్నయిందీ! జీవితంలో ఏదయినా భరించేదాన్నేమో గానీ అది నా క్లాసులో నా పక్కనో ముందో కూచుంటె అసలు నేననే మనిషినుండే దాన్నేనా!
- ఆంధ్రజ్యోతి, 7 ఫిబ్రవరి 2000


0 వ్యాఖ్యలు

చెత్తకు కరువొచ్చింది

మా ఊరు సగటు ఊరు అన్న చిరునామాకు సరిపడే ఊరు. లెక్క పెట్టలేనన్ని అన్యాయాలు ఉన్న ఊరు. బడి దగ్గర నుండి గుడి దాకా, ఆస్పత్రి నుండి స్మశానం దాకా మిగిలిన చాలా వాటినుండి చాలా వాటిదాకా ఏదీ ‘మునుపటి’లా లేదు. అయితే మరి ఊరు ఎలా ఉంది? ‘లంచం’ అనే ఇంధనంతో ఆ ఊరి ‘యంత్రం’ నిక్షేపంగా ఉంది. అలాంటి ఊర్లో నిన్న జరిగిన మునిసిపాల్టీ ఎలక్షన్ల ఫలితాలు ఇవాళ ఉదయం తెలిసాయి. అర్థబలం, అంగబలం వ్యర్థం కాలేదు. గెలుపు వాటిదే, ఒక్క కోటీశ్వర్రావు విషయంలో తప్పించి. రెండు వర్గాల వారి నాయకులు వారి వారి వార్డులలో కౌన్సిలర్లుగా నెగ్గేరు. ఇక మిగిలింది ఛైర్మన్ పదవికి పోటి. ఇరువర్గాల వారు ఎన్ని ఎత్తులు వేసినా, గోడమీది పిల్లి (గోపి) లా ఉన్న కౌన్సిలర్ల వల్ల మెజారిటీ ఎవరిది అన్నది నిశ్చయించుకోలేక పోతున్నారు. ఈ గోపి కౌన్సిలర్ల రేటు గంట గంటకు పెరిగిపోతున్నది. ఇరు వర్గాల నాయకులకు ఒకరి మీద ఒకరికి కోపం తగ్గిపోతున్నాది. ఆ కోపం గోపి కౌన్సిలర్ల మీద పెరిగిపోతున్నాది. సాయంత్రానికి గోపి కౌన్సిలర్ల రేటు ఛైర్మన్ పదవీ కాలంలో ‘సంపాదన’ కంటే ఎక్కువైపోయింది. ఈ విషయం ఇరు వర్గాల నాయకులని కలవర పెట్టింది. రాత్రి అయ్యింది. ఇద్దరు నాయకులు విడివిడిగా ఒక నిర్ణయానికి వచ్చారు. అర్థరాత్రి కనకయ్య సారా కొట్టు వెనక గదిలో కలుసుకున్నారు. ‘బావా’ అంటే ‘బావా’ అనుకొన్నారు. గోపి కౌన్సిలర్లకు బాగా బుద్ధి చెప్పాలనుకున్నారు.

మర్నాడు కౌన్సిలర్ కోటీశ్వర్రావు పోటీ లేకుండానే ఛైర్మన్ అయ్యాడు. గోపి కౌన్సిలర్లు రాత్రి తాగిన పారిస్ మందు మత్తులో కన్న కలలన్నీ కరిగిపోయాయి. వాళ్లు గాలిలో కట్టిన మేడలన్నీ అక్కడక్కడే కూలిపోయాయి. అమెరికా వెళతాడనుకున్న కొడుకు అడ్డరోడ్డు దగ్గర బస్సు దిగిపోయి ఉసురుమంటు ఊర్లోకి నడిచి వచ్చినట్లుంది వాళ్లకి.

* * *

కోటీశ్వర్రావు తన ఊరి మీద అమితమైన ప్రేమతో, మితమైన మిలట్రీ పెన్షన్ తో ఆ ఊర్లో రెండేళ్ళ క్రితం వచ్చి స్థిరపడ్డాడు. ఒంటివాడు. బాదరా బందీలు, బరువు బాధ్యతలు లేనివాడు. సొంత ఇల్లు, ఎకరం పొలం, నెల నెల మిలట్రీ క్రమశిక్షణకి పదిహేనేళ్ళు అలవాటు పడ్డవాడు కాబట్టి సోమరపోతులా కూర్చొనేవాడు కాదు. తనుంటున్న వార్డులో తలలో నాలికలా అందరికి అన్ని పనులలో సహాయపడుతుంటాడు. రెండేళ్ళలో అతని సహాయం పొందని వాళ్ళు ఆ వార్డులో లేరు. కొద్దిమంది స్నేహితుల పట్టుదలని, ఉత్సాహాన్ని కాదనలేక కోటీశ్వర్రావు కౌన్సిలర్ పదవికి నామినేషను వేసాడు. ప్రజలే పైసా ఖర్చులేకుండా ప్రచారం చేసారు. పోటీ పడుతున్న పాత కౌన్సిలర్ లు ఒకరి మీద ఒకరికి ఉన్న అక్కసు కొద్ది, ఎదుటివాడు గెలవకుండా ఉండాలని, చాలా గట్టి ప్రయత్నాలు చేసారు. ఆ ప్రయత్నాలలో కోటీశ్వర్రావుని ముందు పట్టించుకోలేదు. తరవాత తమవి కాని ఓట్లని చీల్చడంలో కోటీశ్వర్రావు బాగా పనికివస్తాడని నమ్మడంవల్ల, కోటీశ్వర్రావుకు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడానికి తగిన విషయాలు ఏమీ లేకపోవడం వల్ల కూడా కోటీశ్వర్రావుని పట్టించుకోలేదు. ఒకర్ని ఒకరు ఓడించుకోవడంలో పాత కౌన్సిలర్లు పూర్తి ఫలితం పొందారు. వారిద్దరు ఓడిపోయారు. కోటీశ్వర్రావు కౌన్సిలర్ అయ్యాడు. పైసా పెట్టకుండా, పలుకు పలకకుండా, చెయ్యి కదపకుండా ఛైర్మన్ అయిపోయాడు కోటీశ్వర్రావు.

ఛైర్మన్ కుర్చీలో కూర్చోగానే ఆ ఊరికి ఉన్న శత కోటి దరిద్రాల(శకోద)కి అనంత కోటి ఉపాయాల(అకోఉ)ని ఆలోచించాడు. ఒక నెలరోజులు కష్టపడి ఆ మున్సిపాలిటీకి ఉన్న ‘శకోద’ల పట్టిక తయారుచేసాడు. మరో నెలరోజులు కష్టపడి కొన్ని ‘శకోద’ లకి తనకి తోచిన ‘అకోఉ’ ఆలోచించి ఒక పట్టిక తయారుచేశాడు. దానికి నకళ్ళు తయారుచేసి కమీషనర్ కు, కౌన్సిలర్లకు అందించమని మునిసిపల్ ఆఫీసులో ఉన్న ముఖ్యమైన గుమాస్తాని పిలిచి చెప్పాడు. ఆ ముఖ్యమైన మునిసిపల్ గుమస్తా అక్కడక్కడే ఒక ఐదునిముషాలలో ‘శకోద’ ‘అకోఉ’ చదివి, కళ్ళజోడు సర్దుకుని, కోటీశ్వర్రావుని అదోలా చూసి, మళ్ళీ ఆ పట్టికవైపు చూసి, “ఇవి జరగని పనులు. నా జరుగుబాటుకు ముఖ్యమైన పనులు అవతల చాలా ఉన్నాయి. జరిగే పనులేవైనా ఉంటే చెప్పండి. రేపో ఎప్పుడో వీలున్నప్పుడు చేసి పెడతాను”. అని చెప్పి, నోట్లో ఉన్న కారాకిల్లీని తుపుక్కుమని ఉమ్మేసి, అదే ఫోర్సుతో చేతిలో ఉన్న కాగితాలని టేబుల్ మీద కొట్టి, కళ్ళజోడు తీసిమడచి పెట్టి, కాళ్ళ జోళ్లు టకటకలాడించుకుంటూ ఆఫీసులోంచి బయటికి వెళ్ళిపోయాడు.

కోటీశ్వర్రావుకు అణగారిన గుమస్తా వర్గపు ‘పొజిషన్’ అర్థం అయ్యింది. కోటీశ్వర్రావు ఛైర్మన్ అయ్యనప్పటి నుండి పనిలో పడి ఊరు, ఉద్యోగస్తులు తన్ని ఎలా చూస్తున్నారో గ్రహించలేదు. కానీ అందరు కోటీశ్వర్రావుని అదో మాదిరిగా చూస్తున్నారు. ‘పాపం’ అని అనుకుంటున్నారు. పూర్వం అమెరికావాడు, రష్యావాడు ఆఫ్గనిస్తాన్ లో పరోక్షంగా కొట్టుకుంటూ ఉంటే, రెడ్ క్రాస్ వాడు అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నట్లుంది కోటీశ్వర్రావు పని.

తను తయారు చేసిన పట్టిక మరోసారి చూసుకున్నాడు. ఉన్నవన్నీ మంచి పనులే. అవన్నీ జరిగినట్లయితే ఆ ఊరు బాగుపడి పోతుందని చెప్పడానికి సందేహం ఏమీ లేదనిపించింది. కానీ ఈ పనులు చేస్తే తాము ‘బాగుపడాలని’, ‘నానా బాధలు’ పడి కౌన్సిలర్ లు అయ్యినవాళ్ళు, ‘చచ్చిచెడి’ పనిచేస్తున్న మునిసిపాలిటీ ఉద్యోగస్తులు తదితర సిబ్బంది. ‘బాగుపడరని’ గ్రహించిన గుమస్తా తానిచ్చిన కాగితాలని పక్కన పడేసి వెళ్ళిపోయాడని తాపీగా గ్రహించాడు.

ఆలోచించగా, ఆలోచించగా ఆ ఊరి అసలు సమస్యల విషయంలో తాను చెయ్యగలిగింది ఏమీ లేదని తెలుసుకున్నాడు. మిత్రులంతా ‘అనవసరమైన’ విషయాలలో కల్పించుకోకుండా పదవిలో పదిలంగా, పరువుగా ఉండమని సలహా ఇచ్చారు. కోటీశ్వర్రావుకు తనమీద తనకే జాలి వేసింది. మనిషి అదోలా అయిపోయాడు. సుమారు పిచ్చివాడిలా ఊరంతా తిరిగాడు. అలసిపోయి అర్థరాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు. కలలో అతనికి ఒక ఊరు కనిపించింది. అది అచ్ఛం తన ఊరిలా ఉంది. అయితే ఆ కలలో ఊరికి తన ఊరికి భేదం ఉంది. కలలో కనిపించిన ఊరిలో మచ్ఛుకైనా ఒక్క పిసరు చెత్త కనిపించలేదు. తల ఊరిలో మచ్ఛుకైనా చెత్తలేని జాగా కనిపించదు. అంతే భేదం!
* * *

మర్నాడు ఆఫీసుకు రాగానే రోడ్లు తుడిచే వాళ్ళ సూపర్ వైజర్ని పిలిపించాడు. రోడ్లని తుడవద్దన్నాడు. ఊరి చివర చెత్త పోసే జాగాలో ఎప్పటినుండో పడి ఉన్న చెత్త కుప్పలని, కాల్చి, చదును చేసి, నీరు పోసి కూరగాయ మొక్కలు నాటి, పండించి, అమ్మి వచ్చిన డబ్బులని అందరిని పంచుకోమన్నాడు. చెయ్యవలసిన పని చెయ్యకుండా, అతి తక్కువ పని చేసి, డబ్బులు సంపాదించి మునిసిపాలిటికి చెప్పకుండా పంచుకోమంటున్న ఛైర్మన్ ని ఆశ్చర్యంతో చూసి అప్రయత్నంగా ‘నిజమా?’ అన్నాడు.

‘నిజంగానే’ అన్నాడు కోటీశ్వర్రావు.
సూపర్ వైజర్ ‘సరే సార్’ అని వినయంగా వెళ్ళిపోతాడు.

తరవాత ప్యూన్ ని పిలిచి ఒక రిక్షాని తెమ్మని చెప్పాడు కోటీశ్వర్రావు. రిక్షాలో ఓ మైకు పెట్టించి, ప్యూన్ ని ఒక కాగితం ఇచ్చి “ఇందులో రాసింది రాసినట్లుగా ప్రతీ వీధిలో చదువు” అని చెప్పాడు.

“ఇందు మూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా, రేపటి నుంచి ప్రతీ రోజు ఉదయం ఊరికి ఉత్తరంగా ఉన్న సంత తోట ప్రక్కనున్న బంజరు దగ్గరకి బండెడు చెత్త తెచ్చి అప్పగించిన ప్రతీవారికి, బండి ఒక్కంటికి వంద రూపాయలు చొప్పున ఇప్పించబడును”.

ఆ ప్రకటన విన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. రాజకీయ నాయకులకి ఇదో పిచ్చి పనిలా అనిపించింది. అధికారులకి అంతరార్థం అర్థం కాలేదు. అందరు ఛైర్మన్ ‘నాలుగు డబ్బులు’ చేసుకోందికి పన్నిన పన్నాగం అని అనుకున్నారు. పోనీలే ‘కొత్తవాడు’ అని ఊరుకున్నారు.

మర్నాడు ఉదయం ఆరింటికి ఛైర్మన్ ఒక గుమస్తా ఊరికి ఉత్తరంగా ఉన్న సంత తోట ప్రక్కనున్న బంజరు దగ్గర బల్లా కుర్చీ వేసుకుని కూర్చున్నారు. చెత్త నింపుకుని వచ్చిన బళ్ళ వాళ్ళకి డబ్బులివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రోడ్లు తుడిచే వారు ఊర్లో వీధుల్లో ఉన్న టీ కొట్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి బదులు ఎప్పటినుండో పడి ఉన్న చెత్త కుప్పలని, కాల్చి, చదునుచేసి, నీరు పోసి తరవాత, కూరగాయ మొక్కలు నాటి, పండించే పనిలో ఉన్నారు.

చెత్త నింపుకుని వచ్చిన పాతిక బళ్ళు బారు తీరి ఉన్నాయి. ముందు ప్రకటించినట్లే డబ్బులిచ్చారు. ఒక నెల రోజులలో రోజు వచ్చే బళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఊరిలో చెత్త మచ్చుకైనా కనిపించదు. ప్రతి ఇంటివాళ్ళు చెత్త రోడ్డు మీద పొయ్యడం లేదు. ఇంట్లోనే ఓ డబ్బాలో పోసి, దాచి ఉంచి, ఆ డబ్బా నిండగానే డబ్బా ఒక్కంటికి రూపాయి ఇచ్చి మరీ చెత్త తీసుకువెళ్ళే బండివాడికి ఇస్తున్నారు. ఈ కొత్తరకం చెత్త వ్యాపారంతో కొద్దిమందికి జీవనోపాధి కలిగింది. ఆరునెలల తరవాత ఈ వ్యాపారం చెయ్యడానికి ముందుకు వచ్చినవాళ్ళకి ఆ ఊరిలో చెత్తకు కరువొచ్చింది.



1 వ్యాఖ్యలు

పిలుపు

అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులను ఎంతో నిపుణతతో నివారించి చావు నిశ్చయం అని అనుకొన్న రోగుల రాతలు మార్చి చిర్నవ్వుతో బ్రతుకు అందించే గుండెజబ్బుల నిపుణుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన డాక్టర్ రావుకి సన్మాన సభ అది. ఆ రోజు షికాగొ మహానగరంలో ఎందరో ప్రముఖులు హాజరైన అతి ముఖ్యమైన విందు మరియు సన్మాన సభ అది. డాక్టర్ రావు వైద్యంతో ఐదేళ్ళకు పైగా హాయిగా జీవిస్తున్న ఒక వెయ్యిమంది ప్రపంచం నలుమూలల నుండి వచ్చి తలొక వెయ్యిడాలర్లు ఇచ్చి హాజరైన ఫండ్ రైజింగ్ డిన్నరు అది. డాక్టర్ రావుని వైద్యునిగా మరో ఉన్నత సోపానంపై నిలబెట్టే సభ అది.

అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నేన్సీ డికీ ముఖ్య అతిథి. భారతదేశ ప్రతినిథి, షికాగో నగర మేయర్, వివిధ రంగాలలో పేరు పొందిన వ్యక్తులు వక్తలుగా డాక్టర్ రావుని ప్రశంసించారు. పుష్పగుచ్ఛాలు అందించారు.

‘డాక్టర్ రావు రోగిపై పెట్టే ఖర్చుకు రెట్టింపు ఆరోగ్యాన్ని అందిస్తారు’ అని ఒక ఆరోగ్యభీమా పథకాలను అమలుపరిచే సంస్థ కొత్త నినాదాన్ని డాక్టర్ రావు గౌరవార్థం ఆరోజే తమ వ్యాపార ప్రకటనలో విడుదల చేసింది.

వృత్తిపరిమైన గౌరవాలను ఎన్నో అందుకున్న డాక్టర్ రావుకు ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజు. అమెరికాలో వైద్యపరమైన గౌరవాలలో ఆఖరి మెట్టు అని అనిపించే మెట్టు ఎక్కిన రోజు అది. విరాళాల రూపంలో వచ్చిన మిలియన్ (పదిలక్షలు) డాలర్లతో ఏర్పరచబోయే ‘కంప్యూటర్ కంట్రోల్డ్ కంప్లీట్ కార్డియాక్ కేర్ సెంటర్’ డైరెక్టర్ గా డాక్టర్ రావుని నియమించినట్లు ఆయన పనిచేస్తున్న మెడికల్ సెంటర్ ప్రసిడెంటు డాక్టర్ గార్బర్ ప్రకటించారు.

వేదిక మీద కూర్చొని ఉన్న ఆయన ఆలోచనలన్నీ ఏర్పరచబోయే ‘కంప్యూటర్ కంట్రోల్డ్ కంప్లీట్ కార్డియాక్ కేర్ సెంటర్’ మీదే ఉన్నాయి. రోగికి ఏ మందు ఇచ్చినా, ఆ ముందు దాని ముఖ్యమైన చర్యతో పాటు శరీరంలో జరిగే ఎన్నో జీవ రసాయనిక చర్యలపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావాలన్నింటి సామూహిక ఫలితమే రోగి పరిస్థితిని నిర్దేశిస్తుంది. మనిషి మనిషికి ఉండే సహజ జన్యుసంబంధ (జనెటిక్) భేదాల వలన మందు పనిచేసే వేగంలో, తీరులో మార్పులు ఉంటాయి. ప్రతి మందు యొక్క వివిధ చర్యలని, ఆ మందు తీసుకున్న రోగి యొక్క రక్త, శ్వాస పరీక్షల ద్వారా నిర్ణయించి, ప్రతీ గుండె జబ్బు రోగికి ఏ మందు ఏ మోతాదులో వాడాలి అన్న విషయాన్ని నిర్ణయించడంలో మానవ సంబంధమైన తప్పులు జరగని విధానంలో కంప్యూటర్ ద్వారా రోగులకు నిర్ణయించే పరిశోధన కేంద్రం అది కాబోతుంది. ఈ ఉద్దేశాలతో వివిధ రంగాలకు చెందిన నిపుణలతో కలిసి పనిచేసి గత కొద్ది సంవత్సరాలలో డాక్టర్ రావు గుండె జబ్బుల రోగుల వైద్యంలో గొప్ప ఫలితాలను పొందాడు. ఏళ్ళ తరబడి మందులు తీసుకోవలసిన కొన్ని రకాల గుండె జబ్బుల వాళ్ళకి, అప్పుడే గుండె జబ్బు వచ్చిన వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. తమ కార్డియాక్ కేర్ సెంటర్ ప్రపంచంలో అత్యంత అధునాతనమైన గుండె జబ్బుల నివారణ కేంద్రంగా రూపొందించాలన్నది ఆయన ధ్యేయం.

తన చుట్టూ ఉన్న వాతావరణంలో సంబంధం లేకుండా తన ధ్యేయం పైనే ప్రతి నిమిషాన్నీ వెచ్చించి ఫలితాలను పొందే ఏకాగ్రతే డాక్టర్ రావుని ఈ రోజు ఈ మెట్టుపై నిలబడేలా చేసింది.

* * *

డాక్టర్ రావు పుట్టుక వలన తెలుగువాడు. మొట్టమొదట తెలుగు పలుకులు పలికిన వాడు. తెలుగు నేలపై పెరిగినవాడు. పరుగెత్తిన వాడు. తెలుగు చదువుకున్నవాడు, అక్కడే తెలివి పెంచుకున్న వాడు. ఆంధ్రా మెడికల్ కాలేజ్ లో చదువుకున్నవాడు. తనకు తెలియకుండానే తాను పుట్టిన నాటినుండి తెలుగుతనాన్ని తన నిండా నింపుకున్నవాడు.
కాని, అమెరికా గడ్డపై అడుగు పెట్టినప్పటినుండో, అంతకు ముందు నుండో ఆయన అలా అనుకోలేదు. అయినా ఆయన అమెరికాలో ఉన్నత స్థానాలను అందుకుంటున్న ప్రతీ మారు, అమెరికాలో తెలుగువారు, ఆంధ్రాలో తెలుగువారు ఆయనను తెలుగువాడు అని అనుకున్నారు.

గత ముప్ఫై ఏళ్ళలో అప్పుడప్పుడు ఆంధ్రా వెళ్ళినప్పుడు, తెలుగుమాత్రమే వచ్చిన వాళ్ళు తారసపడి మాట్లాడక తప్పనప్పుడు, తల్లితో మాట్లాడేటప్పుడు మాత్రమే ఆయన తెలుగు మాట్లాడుతారు. అదీ ఎప్పుడో తెలుగు మరచిపోయిన వాడిలాగో, అప్పుడే తెలుగు నేర్చుకున్న వాడిలాగో మాత్రమే.

వివిధ దేశాలనుండి తన దగ్గరకు వైద్యానికి వచ్చే వారిని, వారి వారి మతృభాషలో ‘మీ పేరేమిటి?’ ‘ఎలా ఉన్నారు?’, ‘కుశలమా?’, వంటి చిన్న చిన్న ప్రశ్నలు వేయడానికి ఎంతో కృషి చేసాడు. ప్రస్తుతం వారు సుమారు ముప్ఫై ఐదు భాషలలో రోగులను పలుకరించగలరు. ఆయనకు జరిగిన సన్మాన సభలో ‘డాక్టర్ రావుకు శుభాకాంక్షలు’ అన్న పదాల తోరణాలు ఏభై రెండు భాషలలో, తెలుగులో తప్ప, ఆ సభ నాలుగు గోడలపైన అమర్చబడి ఉన్నట్లు గమనించి ఆయన చాలా సంతోషించారు.

* * *

సన్మానసభ, విందు పూర్తి అయి డాక్టర్ రావు ఇల్లు చేరేసరికి పదకొండు గంటలైంది. పర్వతాలు ఎక్కేవాళ్ళు, సముద్రాల లోతులు శోధించే వాళ్ళు, ఎడారులు దాటే వాళ్ళు గమ్యం చేరిన తరువాత తాము సాధించిన విజయానికి సంతోషపడడానికి కూడా శక్తి లేనంతగా శారీరకంగా అలసిపోతుంటారు. ఇప్పుడు డాక్టర్ రావు కూడా అంతే అలసిపోయారు. కాని శారీరకంగా కాదు, మానసికంగా.

పిల్లల్ని యూరోప్ వెకేషన్ కోసం ఎయిర్ పోర్టులో దింపడానికి వెళ్ళడం వల్ల సన్మాన సభకు రాలేకపోయిన ఆయన భార్య ఇల్లు చేరగానే ఎదురొచ్చింది. కొద్ది నిమిషాల ముందు ఇండియా నుండి ఫోను ద్వారా తెలుగులో వచ్చిన వార్తను ఇంగ్లీషులోకి అనువదించి చెప్పింది.

కొద్ది రోజులుగా జ్వరంతో మంచాన పడి ఉన్న డాక్టర్ రావుగారి తల్లి మరణవార్త అది. వినగానే పెనుగాలికి రెపరెపలాడే చిరు దీపంలా మనిషి అమాంతం ఊగిపోయి, ఆఖరి గొడ్డలి దెబ్బకి, పెద్ద చప్పుడుతో క్రింద పడే చెట్టులా “అమ్మా!” అంటూ క్రిందపడ్డాడు. అతని భార్య పట్టుకోబోయే వృధా ప్రయత్నం చేసింది. వెంటనే ఎమర్జన్సీ నెంబరు 911 కి ఫోను చేసింది. డాక్టర్ రావు స్పృహలో లేడు. ఐదు నిమిషాలలో వచ్చిన ఎంబులెన్సులో ఎమర్జన్సీ రూమ్ కు చేరింది భర్తతో. అక్కడ దిగగానే వచ్చీరాని స్పృహలో “అమ్మా... గంగమ్మా, గౌరమ్మా, అమ్మా...” అని పిలుపు అందుకున్న వాళ్ళని పిలిచినట్లు గట్టిగా పిలిచి మళ్ళీ స్పృహ తప్పిపోయాడు.

డాక్టర్ రావు, డాక్టర్ రావు అవ్వకముందు ‘బాబు’ అని ముద్దుగా అందరి చేత పిలవబడే వాడు. బాబు చూపులో చురుకుగా, చదువులో ముందుగా ఉండేవాడు. హైస్కూలు చదువు పూర్తి అయిన తరువాత జరిగిన పరీక్షలలో ప్రప్రథముడిగా ఉత్తీర్ణుడై ఇంటికి వచ్చిన రోజు అందరూ బాబు ఉజ్వలమైన భవిష్యత్తు కలవాడని, పై చదువులకు వెళ్ళాలని అనుకొన్నారు. ఆరోజు సాయంత్రం ఇంటి ముందర వసారాలో బాబు తండ్రి వాలు కుర్చీలో, తల్లి గడప దగ్గర తల్లికి ఆనుకుని బాబు, ఇంటికి వచ్చిన మాష్టర్లు ముగ్గురు కుర్చీలలో, తండ్రి ఆఫీసులో పనిచేసే తోటి ఉద్యోగస్తులు ఇద్దరు గోడకు ఆనుకుని ఉన్న బల్ల మీద కూర్చొన్నారు. ఆ ఇంటి పాలికాపు రావులు, పురుళ్ళ గంగమ్మ స్తంభానికి ఆనుకుని క్రింద కూర్చొని ఉన్నారు.

వాళ్ళందరు ఆలోచిస్తున్నది ఒకే విషయం – బాబుని ఏ పై చదువులో చేర్పించాలని.

ప్రతి ఏడాది ఆ ఏడాదికి కావలసిన పుస్తకాలను ముందుగా కొనిపించుకోవడం, కొన్ననాటి నుండి పెరటి వసారాలో కూర్చోని, మొదట పేజి నుండి చివరి పేజి దాకా గట్టిగా అందరికీ వినబడేలా చదవడం, స్కూలుకు సక్రమంగా వెళ్ళడం, తరగతిలో మాష్టర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినడం, పరీక్షలలో అన్ని ప్రశ్నలకి పూర్తిగా సమాధానాలు వ్రాయడం, తప్పకుండా క్లాసులో మొదటి మూడు స్థానాలలో మాత్రమే పాస్ అవుతు ఉండడం తప్ప, బాబు ఏ కోర్సు చదవాలి, భవిష్యత్తులో ఏ ఉద్యోగం చెయ్యాలిలాంటి విషయాలు ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించడం లేదు. కానీ అన్నీ వింటున్నాడు.

ఒకరు ఇంజనీర్ అని, మరొకరు డాక్టర్ అని, ఇంకొకరు టీచర్ అని, ఒకటేమిటి కలక్టర్ అవ్వాలని, మిలట్రీకి వెళితే బావుంటుందని, ఎవరికి తోచింది వారంటున్నారు. తండ్రి, లెక్కల మాష్టారు ఏది ఎందుకు మంచిదికాదో, ఎందుకు వీలుపడదో వివరిస్తున్నారు. ఈ చర్చలో వెనక్కీ ముందుకీ వెళుతున్నారు. మిగిలిన అన్ని రకాల చదువుల కంటే డాక్టరా? ఇంజనీరా? అన్న విషయంపై చర్చ ఎక్కువగా సాగింది.

“నాను నాలుగు పుష్కరాల నుండి పురుళ్ళు పోస్తన్నాను. నాకు తెలిసిన వోయిద్యం, నాటు వోయిద్యం అనండి మరోటనండి, నా అనుభవం అంతా తిరగదోడి సూస్తే, సచ్చిపోయిన పిల్లలంతా సరైన టయానికి సరైన వోయిద్యం అందకే సచ్చిపోయారని నా నమ్మకం. బాబు డాట్రీ సదవాల. మనూరు రావాల. ఈ గంగమ్మ సచ్చిపోయేలోగా నాను బతికించలేని పురిటి బిడ్డని బతికించాల. అప్పుడు నాను సుఖంగా సస్తాను. నేకుంటే, సచ్చేటప్పుడు కూడా ఈ బాధ నన్నొగ్గదు. ఏటంటారు?” అంది పురుళ్ళ గంగమ్మ. ఎవ్వరు ఏమనలేదు.

* * *

బాబు మెడిసిన్ లో చేరాడు.

మెడికల్ కాలేజిలో తెల్లకోటు వేసుకు తిరగడం, మానవ శరీరం గురించి ప్రొఫెసర్ లు చెప్పే పాఠాలు వినడం డాక్టరైపోయినట్లు ఊహించుకోవడం, కొత్త కొత్త స్నేహాలు బాబుని వేరే లోకాల్లో విహరింపజేసాయి. డాక్టర్ చదువే చాలా గొప్పది. తనకు తగినది అని అనుకున్నాడు. అటువంటప్పుడు బాబుకు గంగమ్మ గుర్తుకు వచ్చేది ఒక్క క్షణం పాటు. శలవలకు ఇంటికి వచ్చినప్పుడు, గంగమ్మ తనతో పాటు పురుళ్ళకు బాబుని రమ్మంది. కానీ తానింకా చాలా చదవాలని చెప్పాడు.

రెండవ సంవత్సరం దశరా శలవలకు బాబు ఇంటికి వచ్చాడని తెలిసి జ్వరంతో ఉన్న గంగమ్మ బాబుని చూడడానికి వచ్చింది. ముందు వసారా అరుగు మీద చతికిలపడి,

“బాబు” అని పిలిచింది. ఎంతో మంది పిల్లల ‘తొలి కేక’లను, వైద్య సహాయం అందక పసిపిల్లలు వేసే ‘ఆఖరి కేక’ లను విన్న పురుళ్ళ గంగమ్మ, తాను విన్న కేకలన్నింటిని ఈ ఒక్క కేకలోనే వినిపించిందా అని అనిపించేలా పిలిచింది. మరింక కదల లేమన్న ఎన్నో కళ్ళ చూపులకు సాక్షి అయిన గంగమ్మ పరుగెత్తుకుని వచ్చిన బాబుని చూసి, దగ్గరకు రమ్మని పిలిచి,

“చలి జ్వరం మూడోసారి వచ్చింది. మరో పాలొస్తే మరింక బతకను. కాని బాబు నువ్వు పెద్ద డాట్రై, ఒక్క సుట్టు బేగి రా బాబు, బేగి రా. మొదటె చలి జ్వరం రాకుండా చూసే మందు ఒట్టుకు రా బాబు. మనూరు రా బాబు”. అంది.
జ్వరంతో కాలిపోతున్న ఆమె చెయ్యిని విడిపించుకోగలిగేడే కాని ఆమె మాటలు అతని మెదడులో నాటుకు పోయాయి. అలా మాట తీసుకున్న గంగమ్మ ఎన్నో నెలలుగా వచ్చి పోతున్న మలేరియా జ్వరంతో చనిపోయింది. ఉత్తి మలేరియా జ్వరంతోనే చనిపోయింది అని తెలిసి చాలా ఆశ్చర్యపోయాడు బాబు.

మెడిసిన్ ప్రొఫెసర్ ని కలసి ఈ విషయం గురించి అడిగాడు.

“ఇదేమంత ఆశ్చర్యపడవలసిన విషయం కాదు, మనదేశంలో, మన దేశం వంటి బీద దేశాలలో ఉత్తి మలేరియా జ్వరంతోనే మనుషులు చనిపోవచ్చు” అన్నారు.

ఆయన అది అతి సామాన్యమైన విషయం అన్నట్లు.

“కానీ పుస్తకాలలో డాక్టర్ రోనాల్డ్ రాస్, మనదేశంలో పరిశోధనలు చేసి, మలేరియా క్రిమి జీవితచక్రం కనుగొన్నారని, ఈ క్రిమిని వ్యాపింపజేసే దోమలని డి.డి.టి ద్వారా నశింప చేయవచ్చని, శరీరంలో ప్రవేశించిన మలేరియాని క్లోరోక్విన్, ప్రైమాక్విన్ మాత్రలు తీసుకుంటే అరికట్టవచ్చునని చదివానే...”

“నిజమే. ఇంకా డాక్టర్ రాస్ పేరు మీద హైదరాబాదులో బేగంపేట్ విమానశ్రయం దగ్గర ఓ సంస్థ కూడా ఉంది. మనదేశంలో మలేరియా పరిశోధన సంస్థలు చాలా ఉన్నాయి. అయినా మనదేశంలో మలేరియా ఇంకా ఎక్కువగానే ఉంది.” అని వేదాంతిలా నవ్వి, ఇంక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్లు చూసారు.

“ప్రజల అశ్రద్ధ. మలేరియా జ్వరానికి కారణమైన క్రిములని వ్యాపింప జేసే దోమలు పెరగడానికి అనువైన మురికి నీటిని, మురికి నీటి కాలువలని ఇంట బయట శుభ్రపరచక అశ్రద్ధతో వదిలివేయడం. దీనికి ఎవరి ఖర్మ వారిదని అనుకోవాలి.
ప్రభుత్వాలు, బడుగు దేశాలలోని శాస్త్రజ్ఞులు చూపించే దారుణమైన నిర్లక్ష్యం అతి ముఖ్యమైన కారణం అని గుర్తుంచుకో.” నిష్కర్షగా అన్నారు. సామాజిక ఆరోగ్య విషయాలపై పాఠాలు చెప్పే యస్. పి. యమ్. ప్రొఫెసర్.

“మలేరియా క్రిమి రకరకాల బాహ్య స్థితులలో వేర్వేరు శరీర భాగాలలో నివాసం ఏర్పాటు చేసుకుంటూ, వివిధ రకాల బాహ్య కవచ ప్రొటీన్లని ఉత్పత్తి చేస్తూ, అందుబాటులో ఉన్న మందులకు, పరిశోధనలలో ఉన్న వేక్సిన్లకు లొంగకుండా జీవించగలగడం మనం మలేరియా అరికట్ట లేకపోవడానికి శాస్త్రీయ కారణాలు” అన్నారు బయోకెమిష్ట్రీ ప్రొఫెసర్ నిస్సహాయాన్ని వెలిబుచ్చుతూ.

ఎప్పుడు ప్రయోగశాలలో ఉంటూ వైద్య పరిశోధనలపై ఎక్కువ ఆశక్తి కనబరిచే ఫిజియాలజీ ప్రొఫెసర్ ని అడిగితే ముఖ్యమైన ఇంకో కారణం వివరించారు.

“ఎన్నో కారణాల వల్ల మలేరియా క్రిమి ప్రబలి పోతున్నది. బడుగు దేశాలలో లక్షల కొద్ది ప్రజలను ప్రతి ఏడాది చంపుతున్న ఏకైక ఏకకణ జీవి మలేరియా క్రిమి. నువ్వు రోజు లైబ్రరీలో మలేరియాపై, దోమల గురించి ఉన్న పుస్తకాలు చదువు. సులభంగా, అతి తక్కువ ఖర్చుతో మలేరియాని లేదా, మలేరియాని వ్యాపింపజేసే దోమలనే నివారించగల మార్గాలని అన్వేషించు.” అని సలహా ఇచ్చారు.

ఆ సలహా ప్రకారం బాబు రోజు ఒకటి, రెండు గంటలు మలేరియా గురించి శ్రద్ధగా చదివేవాడు. మలేరియా క్రిమి కంటికి కనిపించనంత చిన్నదైన ఏకకణ జీవి, అయినా కోటాను కోట్ల కణాలు కలిగిన మనిషి కంటే ఎక్కువ శక్తివంతమైనది ఎలా కాగలదు? కాలేదు. కాని ఈ క్రిమిని అరికట్ట లేకపోవడానికి కారణం మన అశ్రద్ధే అని అనుకొన్నాడు బాబు. చదివిన కొద్ది ఈ క్రిమిని అరికట్టడానికి కావలసిన ఎన్నో అవకాశాలు ఉన్నా, అరికట్ట లేకపోతున్నామంటే అది ప్రజల ప్రభుత్వం అశ్రద్ధ మాత్రమే అని అనుకొన్నాడు. రోగులు ఉన్న ఒకే ఒక్క శక్తివంతమైన మందు క్లోరోక్విన్ సవ్యంగా వాడక ఈ మందుకు లొంగని మలేరియా క్రిముల ఉత్పత్తికి దోహదం చేశారన్న విషయం గ్రహించి మరింత ఆందోళన, బాధపడ్డాడు. దోమలని అరికట్టడానికి, మరింత శక్తివంతంగా, సులభంగా పనిచేసే మందులు పరిశోధనల ద్వారా కనుక్కోవాలని అనుకొన్నాడు. ఈ సమయంలోనే రమణ అనే తోటి విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలసి చదవడం, చర్చించుకోవడం చేస్తుండేవారు.

తాము చదివినవి ప్రొఫెసర్లతో చర్చిస్తే, ముందు చదువు పూర్తి చేసి, వైద్య పరిశోధనలు జరిపే సంస్థలలో చేరి పరిశోధనలు చేయమని సలహా ఇచ్చారు. బాబుని మంచి విద్యార్థిగా అందరు గుర్తించారు.

* * *

సంవత్సరాలు గడిచాయి. మెడిసన్ పూర్తి అయ్యింది. హౌసర్జన్సీ చేస్తున్నప్పుడు రమణతో కలసి ఢిల్లీ వెళ్ళాడు. ఇద్దరు అక్కడ ఉన్న మలేరియా రిసెర్చి సెంటర్ కి వెళ్ళి డైరెక్టర్ డాక్టర్ శర్మను కలసి మాట్లాడారు. ఆయన వ్రాసిన పేపర్లు, పుస్తకాలు కొన్ని ఇచ్చి, ఇక్కడ ఇంతకన్నా ఇంకేం చెయ్యలేం, కానీ విదేశాలలో పరిశోధనలకు మంచి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి, ఒక మంచి టీ ఇప్పించి పంపించారు. తిరిగి వస్తున్నప్పుడు రైల్లో “అంత పెద్ద పరిశోధనా సంస్థ డైరెక్టరే ఇలా మాట్లాడితే మలేరియా తగ్గదు సరికదా, ఇంకా పెరుగుతుంది.” అన్నాడు బాబు రమణతో.

హౌసర్జన్సీ కూడా పూర్తి అయ్యింది. తనలాంటి చాలా మంది ప్రతిభావంతులైన వైద్యులవలే బాబు కూడా అమెరికా వచ్చాడు. రెసిడెన్సీ చేసాడు. మేధావిగా పరిగణించబడ్డాడు. ప్రముఖ వైద్య కేంద్రంలో ఆ రోజుల్లో అమెరికాలో అత్యంత ప్రాముఖ్యం ఉన్న గుండె జబ్బుల (కార్డియాలజి) విభాగంలో ప్రవేశించాడు. పాశ్చాత్య దేశాలలో అతి ఎక్కువ మరణాలకు మూలకారణమైన గుండె జబ్బుల పరిశోధన వైపు ఆకర్షించబడ్డాడు. అందులో పరిశోధనలు జరపడం ప్రారంభించాడు. లైబర్రీలో అప్పుడప్పుడు మలేరియా పరిశోధనలకు సంబంధించిన విశేషాలు తారసపడినప్పుడు చదివేవాడు. వీటిలో చాలా ఎక్కువ భాగం మలేరియా ఎక్కువగా లేని దేశాల పరిశోధకులవే అని గ్రహించి మలేరియా బాధ ఎక్కువగా ఉన్న దేశాల పరిశోధకులపై చికాకు పడుతూ ఉండేవాడు.

* * *

అమెరికా వచ్చిన దగ్గర నుండి పెద్దలందరు ఉత్తరాలు రాసి, రాసి, కోరగా పెళ్ళికి సిద్ధం అయి ఇండియా వచ్చాడు. పద్ధతి ప్రకారం పెళ్ళి చూపులు, ముహుర్తాలు అన్నీ సవ్యంగా జరిగాయి.

పెళ్ళిరోజు ముత్తైదువులు-తల్లి, పిన్నులు, అత్తయ్యలు తమ చేతులతో బాబు వంటికి నలుగు పెట్టి రుద్దుతు ఉంటే, బాబు మెదడు పొరలలో ఎక్కడో దాగి ఉన్న ఒక ‘స్పర్శ’ యొక్క జ్ఞాపకం ఉప్పెనలా బాబు వళ్ళంతా చుట్టుముట్టింది. బాబు వళ్ళంతా గగుర్పొడిచింది.

అర్థరాత్రి ఉన్నట్టుండి ఒక్కసారి సూర్యోదయం అయినట్టయింది.

కళ్ళు గట్టిగా మూసుకొని తెరిచాడు. ఎదురుగా తాను చూడాలనుకున్న ఆ ‘స్పర్శ’కు మానవ రూపం అయిన గౌరమ్మ కనపడలేదు. తల్లి, పిన్నులు, అత్తయ్యలు మాత్రమే కనపడ్డారు.

“అమ్మా గౌరమ్మ ఏది?” అని అడిగాడు.

ప్రస్తుత వాతావరణంతో, ఈ పెళ్ళితో, చుట్టు ఉన్న సంబంధాలతో సంబంధం లేని ప్రశ్న అది.

ఎన్నో ఏళ్ళ వెనుక, పురుళ్ళ గంగమ్మ అందించిన పురిటి పసికందును అందుకొని, ప్రతిరోజు వంటంతటికి తన అర చేతులతో నూనె రాసి, కావడం కాచి, నలుగు పెట్టి, వళ్లు రుద్ది, నీళ్ళు పోసే ఆ ఇంటి పనిమనిషి గౌరమ్మ. ఆ గౌరమ్మ చేతి స్పర్శ బాబుకు పదోఏటి దాకా అనుభవమే.

ఇటువంటి మంగళ సమయంలో, మంగళ స్నానం చేయించే ముందు బాబుకు గౌరమ్మ గుర్తుకు రావడం బాబు తల్లికి ముందు ఆశ్చర్యం కలిగించింది. వెంటనే చికాకు కలిగించింది. మరుక్షణంలో ముప్ఫై ఏళ్ళకు పైగా తమ ఇంటికి కనిపెట్టుకుని, ఇంటిలో భాగం అయిపోయి, ఇంటిల్లిపాదికి సేవలు చేసి ఏభైయో పడిలో తరచు వచ్చే మలేరియా జ్వరాలకు తట్టుకోలేక తనువు చాలించిన గౌరమ్మ జ్ఞాపకం ఆమెని కదిలించింది.

ఆమె మౌనంగా, నిశ్చేష్టురాలై నిలబడి ఉండిపోవడాన్ని గమనించిన మిగిలిన వాళ్ళు నలుగు పెడుతూనే ఉన్నారు.
“అమ్మా!” అని తల్లి నుండి సమాధానం ఎదురు చూస్తున్న బాబు పిలవడంతో ఆలోచనల నుండి బయటపడింది ఆమె.
“ఆమధ్య తరచు వచ్చే జ్వరాల వల్ల పోయిందిరా!” అని మౌనం మాట్లాడినట్లు మాట్లాడి, క్షణంలో మూగతనం వచ్చిన దానిలా కొడుకు మొహం చూస్తూ ఉండిపోయింది.

బాబులో మనిషి గౌరమ్మ మీద జాలి పడ్డాడు.

బాబులో డాక్టరు బాబు మీద కోపం తెచ్చుకున్నాడు.

బాబులో శాస్త్రజ్ఞుడు బాబు మీద అసహనం చూపించాడు.

బాబు మౌనంగా మిగిలి మంగళ స్నానం తంతు పూర్తి చేసుకుని, మంగళ వాయిద్యాల మధ్య, మంగళసూత్రం కట్టేడు పెళ్ళికూతురు అని పిలవబడుతున్న మంగళకి మర మనిషిలా మౌనంగా.

శోభనం గదిలో రాబోయే భార్యకోసం ఎదురుచూస్తూ, కిటికీ లోంచి పెరటిలోకి చూసాడు.

అంట్లు తోముతున్న గౌరమ్మ, అమెరికా ప్రయాణంకి సిద్ధం అవుతున్న బాబుని ‘బాబొక్కసారి పరిచ్చ చెయ్యవా? జోరంగా ఉంది.’ అని అడిగిన సంఘటన కళ్ళముందు జరిగినట్లు అనిపించింది. ఊర్లో ఉన్న తన స్నేహితుడైన డాక్టర్ని చూడమని చెపితె.

‘సరే, కాని బాబు, నువ్వు పెద్ద డాట్రవవుతావుట బాబు, ఈ పాలొచ్చినప్పుడు నాకు మంచి మందియ్యి బాబు, నువ్వే ఇయ్యాల, నిన్ను సిన్నప్పటినుండి సాకాను. నాను ముసిలైపోతున్నాను. ఈ జొరాలు రాకుండా మంచి మందిచ్చావంటే, నాలుగు కాలాలు బ్రతికి నీ పిల్లల్ని కూడా సాకుతా బాబు. మందొట్టుకుని బేగి తిరిగొచ్చీ బాబు అంది.

పెళ్ళికి వచ్చిన డాక్టర్ మిత్రులను మర్నాడు మలేరియా గురించి అడిగితే, డి.డి.టి వాడకం ఆపెయ్యడం వల్ల, ఉన్న మందులు పని చెయ్యకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల మలేరియా పెరిగిపోతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రస్తుతం ప్రభుత్వం ముందుకు వచ్చి పటిష్టమైన పథకంతో దోమలని నివారించాలి, శక్తివంతమైన మలేరియా మందులు అందించాలి ఈ రెండింటికి కావలసిన పరిశోధనలకు ప్రాముఖ్యం ఇవ్వాలి’ అన్నారు.

ఊరు వదలి పట్నం వైపు కొత్త పెళ్ళి కూతురుతో అమెరికా వెళ్ళడానికి విమానాశ్రయంవైపు కారులో వెళుతు ఉంటే, ఐదడుగుల ఎనిమిది అంగుళాల పొడవైన గౌరమ్మ, బక్కచిక్కిన శరీరంతో, కారు నల్లటి వంటిరంగుతో నెరిసీ నెరవని జుత్తుతో, మెరిసే కళ్ళతో, ముక్కుకి నత్తుతో, కాళ్ళకి వెండి కడియాలతో, ఎర్రంచు తెల్లచీరలో, ‘ఒక్క పాలి రా బాబు. బేగి రా. బేగొచ్చి నాకీ జొరం పోవడానికి మాతరొ, సూదిమందో వొట్టుకుని రా బాబు!’ అని దీనంగా అంటు వెంట వస్తున్నట్లు కిటికీ అద్దంలోంచి కనిపించింది.

అమెరికా చేరిన వెంటనే మలేరియా పరిశోధనల గురించి ఆలోచించాలని పదే పదే అనుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు.

* * *

ఏళ్ళు గడిచిపోయాయి. డాక్టర్ రావ్ కి బాబు గుర్తురావడం లేదు. డాక్టర్ రావ్ మాత్రమే డాక్టర్ రావ్ కి తెలసిన ‘తను’.
వలస వచ్చిన అమెరికా సమాజంలో వైద్యుడిగా ప్రతీ ఏడాదీ కొత్త మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. ఏ ప్రేరణల వల్ల వైద్య విద్యార్థి అయ్యాడో, ఏ ఉత్సాహం తనని చక్కనైన వైద్యుడిగా తీర్చి దిద్దిందో, ఏ మనుషులు అతడు గొప్ప వైద్యుడు కావాలని కోరుకొన్నారో, ఆ ప్రేరణలకు, పరిస్థితులకు, ఆ మనుషులకు అతన్ని రెట్టింపు దూరం చేసాయి అతను ఎక్కే ప్రతి మెట్టు.

ఏడాది నుండి తల్లికి జ్వరం వస్తు పోతున్నదని ఉత్తరాలు వస్తున్నాయి. ఫోను ద్వారా పరిస్థితి తెలుసుకుంటూ ఉన్నాడు. ‘ఒక్కసారి రా బాబు’ అన్న తల్లి మాటలు తానెప్పుడో మరచిపోయిన ‘బాబు’ని పిలిచినట్లు, తనని కాదన్నట్లు తన వృత్తిలో మునిగిపోయాడు.

వృత్తి, దాంతో వచ్చి సమాజంలోని మిగిలిన హంగులు, గౌరవాలు, ఆహ్వానాలు, డిన్నర్లు ఇక్కడ అక్కడ రాజకీయ నాయకులతో పరిచయాలు, మిత్రులకు, సన్నిహితులకు ఇండియాలో ప్రైవేటు, గవర్నమెంటు కాంట్రాక్టులు, కాంట్రాక్టులు ఏర్పాటు చేయ్యడానికి, వచ్చిపోయే కళాకారులకు, సినిమా నటులకు, ప్రముఖ వ్యాపారస్థులకు, రాజకీయ నాయకులకు విశాలమైన తన భవనంలో విందులు ఇవ్వడంలో గురించి మరిచిపోయాడు.

* * *

ఆగష్టు 27వ తారీఖు, 1998 ‘ఈనాడు’ దినపత్రికలో మలేరియా పై వచ్చిన వ్యాసాన్ని పంపిస్తూ ఉత్తరం రాసాడు ఇండియా నుండి మెడికల్ కాలేజి నాటి మిత్రుడు డాక్టర్ రమణ. తాను అప్పుడు రైలులో అన్నట్లు మలేరియా పెరిగి పోతున్నదని, ప్రభుత్వం వెంటనే గట్టి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి విషమించి రాష్ట్రం అంతటా కూడా మలేరియా వల్ల ఆరోగ్యపరమైన రెడ్ ఎలర్ట్ పెట్టవలసి వస్తుందని రాసాడు. కొద్ది రోజులలో తమ అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మీ ఊరికి వస్తున్నారని, వీలుచేసుకుని, ఆయన్ని కలసి ప్రముఖ వైద్యుడిగా మలేరియా తీవ్రత గురించి, అధునాతన పరిశోధనలలో మలేరియాని తగ్గించడానికి కాని, దోమలని అరికట్టే విధానాలని గురించి మాట్లాడమని దీని వలన ఏ చిన్న ఉపయోగకరమైన పని జరిగినా అది లక్షల మందికి ఉపయోగపడుతుందని ఆ ఉత్తరం సారాంశం.

మిత్రుడు రమణ రాసిన ఉత్తరం, ‘ఈనాడు’లోని వ్యాసం చదివి ప్రస్తుతం మలేరియా ఇంత ఎక్కువైపోయిందా అని ఆశ్చర్యపడ్డాడు.

మర్నాడు తన దగ్గర పనిచేసే డాక్టర్ మిల్లర్ని పిలిచి రెండు రోజులలో మలేరియా, దానికి సంబంధించిన ప్రస్తుత పరిశోధనలు గురించిన వివరాలు అన్నీ సేకరించి తనకు ఇమ్మని కోరాడు.

అతడు ఇచ్చిన వివరాలు చదివి, ప్రపంచం మొత్తంలో సుమారు 30-50 కోట్ల మంది మలేరియా పాలబడుతున్నారని, ఇండియా గురించిన సమాచారం పూర్తిగా అందకపోయినా, ఇండియాలో సుమారుగా కొన్ని కోట్ల మంది మలేరియా పాలబడుతున్నారని, మలేరియా వల్ల ప్రతీ ఏడాది సుమారు 15.27 లక్షల మంది మరణిస్తున్నారని, ఇందులో సగం మంది 5 ఏళ్ళలోపల పిల్లలే. ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1998లో ప్రకటించిన వివరాలు. ఏడాదిలో పది రోజుల పాటు జ్వరం వల్ల పని జరిగింది అని అనుకున్నా, జ్వరం వల్ల పని మానేసిన పెద్దల వల్ల ఎన్నో కోట్ల పని దినాల నష్టం. ఈ విధంగా ప్రతి ఏట దేశానికి ఎన్నో వేల కోట్ల రూపాయల నష్టం. మనిషి బ్రతుకుకు విలువ కట్టడం ప్రభుత్వాలకు రాకపోయినా, ఒకే ఒక్క కణజీవి వల్ల భారత దేశానికి మాత్రమే ప్రతి ఏడాదీ కోట్ల రూపాయల నష్టం. అంటే కొన్ని వందల మిలియన్ల డాలర్లు. ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చెయ్యగలదు ఈ లెఖ్ఖలకి ఫైలేరియా వంటి దోమల వలన వచ్చే ఇతర జబ్బులని కూడా చేరిస్తే అసలు దోమలని నశింపజేయడమే ముఖ్యం అనిపిస్తుంది.

అమెరికాలో, 1950లలో, 1992లో లిబియాలో స్క్రూవర్మ్ ఫ్లైని పూర్తిగా నశింపజేసిన పద్ధతిని కూడా చేర్చాడు. డాక్టర్ మిల్లర్ మలేరియా ఫైలులో, దానికి పెట్టిన ఖర్చు సుమారు 117 మిలియన్ డాలర్లు. డాలర్లలో భారతదేశం మాత్రమే ప్రతి ఏడాది నష్టపోతు ఉండవచ్చు. వందలకొద్ది మిలియన్ డాలర్లు అని ఆశ్చర్యపడి, ముఖ్యమంత్రిని కలసి ఈ విషయం వివరిస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటారని ఆ ఫైలు మొత్తాన్ని తన ముఖ్యమైన కాగితాలతో పాటు పెట్టుకున్నాడు.

డాక్టర్ రావు ముఖ్యమంత్రిని కలిశాడు. విందులకు వెళ్ళారు, కానీ మలేరియా గురించి మాట్లాడలేదు గత రెండు నెలలుగా కొద్దిమంది తెలుగు వైద్యులు కలిసి ఆంధ్రాలో పెట్టబోయే అధునాతన గుండెజబ్బుల కేంద్రానికి డాక్టర్ రావుని చీఫ్ ఎడ్వైజర్ గా ఉండమని కోరారు. ఆ కారణం వల్ల తాము పెట్టబోయే అధునాతన గుండె జబ్బుల కేంద్రం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రముఖ గుండె జబ్బుల నిపుణుడిగా మాట్లాడాడు. అది జరిగిన కొద్ది రోజులకే ఆంధ్రాలో పెట్టబోయే అధునాతన ‘కేన్సర్’ సంస్థలో ప్రముఖ సభ్యుడిగా కూడా ప్రకటింపబడ్డాడు.

వైద్యునిగా డాక్టర్ రావు తన దేశానికి ఎంతో సేవ చేస్తున్నాడని అమెరికాలో వెలువడే భారతీయ పత్రికలు, ఆంధ్రాలో వెలువడే తెలుగు పత్రికలు పొగుడుతూ వ్యాసాలు వ్రాసాయి.

‘ఒక్క సుట్టు బేగి రా బాబు, బేగి రా’ అని ఇప్పుడు పురుళ్ళ గంగమ్మ పిలుస్తున్నట్లు అనిపించింది షికాగో హస్పెటల్ బెడ్ పై వైద్యం అపస్మారక స్థితిలో ఉన్న డాక్టర్ రావుకు –

‘ఒక్క పాలి రా బాబు, ఒక్క పాలి రా’ అని గౌరమ్మ పిలుస్తున్నట్లు అనిపించింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అత్యంత అధునాతమైన వైద్య పరికరాల సహాయంతో ప్రముఖ వైద్య బృందం ప్రత్యేక పర్యవేక్షణలో వచ్చీరానీ స్పృహలో ఉన్న బాబుకు.

‘ఒక్కసారి రా బాబు’ అని తల్లి పిలుస్తున్నట్లు అనిపించింది. మగతగా ప్రక్కకు తిరిగిన డాక్టర్ రావుకు.

* * *

కళ్ళు తెరవాలని ప్రయత్నించాడు. తెరవలేక పోయాడు. వర్షంలో చూరు నుండి క్రింద పడి కాలవ కట్టి పారుతున్న నీటిలో చిన్నప్పుడు వేసిన కాగితపు పడవ, వీధి చివర పెద్దకాలువ చేరి, ప్రవాహ వేగానికి తట్టుకోలేక, తడిసి ముద్దై, ఒడలిపోయి గిరికీలు కొడుతున్నటువంటి మానసిక స్థితిలో ఉన్న బాబు పూర్తి మెలుకువ స్థితిలోకి వచ్చి,

“అమ్మా, గంగమ్మా, గౌరమ్మా...” అని గట్టిగా అరిచినట్టు పిలిచాడు.

చుట్టు చేరిన వైద్యులు, నర్సులు అర్థంకాని చూపులతో పరిస్థితి అర్థం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఒక్కగానొక్క కొడుకుగా వెంటనే ఇండియా వెళ్ళాలి.

కంప్యూటర్ కంట్రోల్డ్ కంప్లీట్ కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ గా బాధ్యత తీసుకోవాలి.

లక్షలకొద్దీ డాలర్లు తను తలచుకున్న వైద్య పరిశోధనలపై ఖర్చు పెట్టించి మంచి ఫలితాలను పొందగలిగిన శక్తి గల అతను ఎప్పటినుండో తనని బాధిస్తు, లక్షల మందిని వేధిస్తున్న మలేరియా గురించి ఆలోచించాలి.

‘ఒక్క సుట్టు’, ‘ఒక్కపాలి’, ‘ఒక్కసారి...’ అని పిలుస్తున్న పిలుపులకి సరియైన బదులు పలుకుతాడా? లేక, “అమ్మా, గంగమ్మా, గౌరమ్మా...” అంటూ పిచ్చి వాడైపోయి మానసిక ఆరోగ్య వైద్య కేంద్రంలో ఏ ప్రేరణల వల్ల వైద్య విద్యార్థి అయ్యాడో, ఏ ఉత్సాహం చక్కనైన వైద్యుడిగా తనని తీర్చి దిద్దిందో, ఆ రెండింటిని మరచి మాములు మనిషి అవ్వడానికి మందు తీసుకొంటాడా?

డాక్టర్ రావు ఏమౌతాడు?

* * *

ఈ ప్రశ్నలకు, ఆలోచనలకు అందుబాటులో ఉండి మన అందరి మధ్య ఉన్న వందలాది డాక్టర్ రావులు, అమెరికాలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, తమకి తాము ఈ ప్రశ్నలు వేసుకుని, ఆలోచనలకు తావిస్తే, తమలోని పిలుపుకు అవకాశమిచ్చి వినిపించుకోడానికి ప్రయత్నిస్తే, వారిలోని డాక్టర్ రావు ‘బాబు’ అయితీరుతాడు, లక్షలు సంపాదించ లేకపోయినా, లక్షల మందికి ఉపయోగపడే లక్షణమైన మనిషి అవుతాడు.





0 వ్యాఖ్యలు

సంకల్పం

“ఇప్పుడు కాకపోతే, మరెప్పుడు? మనం కాకపోతే మరెవ్వరు?”

అమెరికా దేశంలో, మిషిగన్ రాష్ట్రంలో, గేంజస్ అన్న ఊరులో ఉన్న వివేకానంద మెనాష్టరీ ఆవరణలో ఆగష్టు నెల ఆఖరు వారం కలిసిన వంద మంది భారతీయులను రెండు రోజులుగా ఆలోచింపజేస్తున్న ప్రశ్నలవి.

బ్రిటీష్ పాలన నుండి రాజకీయ స్వాతంత్ర్యం సంపాదించుకొని 50 ఏళ్ళ పైబడ్డా, ఎన్నో రకాలుగా వెనకబడి, సుమారు సగానికి సగం జనం నిరక్ష్యరాస్యతతో, కులాల కుమ్ములాటలతో, అధికార దాహంలో ప్రజాసేవ పేరుతో పదవులెక్కుతున్న రాజకీయ నాయకులతో, దిక్కుతోచక నిస్పృహతో నిలబడి ఉన్న సామాన్యుడికి ఉత్తేజం కలిగించేలాంటి ఉద్యమం కావాలి. అది ఇప్పుడు కాకపోతే, మరెప్పుడు?

ఆ దేశంలో పుట్టి, ఆదేశంలో పెరిగి, ఆదేశంలోని ఉన్నత విద్యా సౌకర్యాలని పూర్తిగా ఉపయోగించుకుని, పట్టాలు పుచ్చుకుని, విదేశం వచ్చి వివిధ రంగాలలో నిలదొక్కుకొని, కొద్దొ గొప్పొ పేరు సంపాదించుకొని, ఆదేశానికి కావలసినది చెయ్యగల స్థితిలో ఉన్న మనం కాకపోతే మరెవ్వరు?

‘ఎన్నో వనరులతో, శతాబ్ధాలుగా స్వశక్తిపై ఆధారపడి, స్వంత బుద్ధితో, విద్యా, వ్యవసాయ వ్యాపార రంగాలలో ముఖ్యమైన దేశంగా నిలబడ్డ భారతదేశం ఈనాడు ఇంత వెనకబడ్డ దేశంగా ఉండనవసరం లేదు. బాధ్యతాయుతమైన భారతీయులుగా దేశం బాగుకై మీ మీ పరిధులలో, మీ మీ శక్తి కొద్ది, మీరు చెయ్యగలిగినది చెయ్యండి’ అన్న డాక్టర్ భాగవతుల పరమేశ్వర రావు గారి పిలుపునందుకొని సమావేశమైన వాళ్ళ సామూహిక ఆలోచనల సారమిది.

అషా, ఎ.ఐ.డ, ఐ.ల్.పి. వంటి సంస్థల సభ్యులు, అమెరికా దేశంలో వివిధ రాష్ట్రాలలో డాక్టర్ పరమేశ్వరరావు గారి సభలకి వచ్చిన వారి ప్రతిభతో ఆ ప్రదేశం నిండిపోయింది. దేశం బాగుకోసం అంతమంది కలవడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఎవరి మొహంలో చూసినా ఉత్సాహం పెల్లుబుతున్నాది. అందరికి అందరు సుమారుగా కొత్తవారే. ఒకరిని ఒకరు పలకరించుకొంటు, పరిచయాలు పెంచుకుంటున్నారు. చాలామంది వయసులో చిన్నవారే, కానీ అందరు పెద్ద పెద్ద చదువులు చదివిన వారే. గుంపులు గుంపులుగా, పచ్చిక మీద కూర్చోని, చెట్ల క్రింద నిలబడి రకరకాల విషయాలని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సరిగ్గా అటువంటి సమయంలో నా దృష్టి ఒంటరిగా, అందరికి దూరంగా ఉన్న ఒకతని మీద పడింది. అతన్ని నిన్న మధ్యాహ్నం భోజనాల దగ్గర కలిసాను. ‘పేట్’ అని పరిచయం చేసుకున్నాడు. అతని పూర్తి పేరు వాయువేగుల పతంజలిట. విష్ణుభొట్ల రామన్నగారితో కలిసి వచ్చాడుట. మద్రాసు ఐ.ఐ.టిలో ఇంజనీరింగ్, తరవాత స్టేన్ ఫోర్డ్ యూనివర్సిటీలో పిహెచ్.డి. గత ఏడాదిగా న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తున్నాడట. అమెరికా వచ్చి ఐదు ఏళ్ళే అయిందిట. ఎక్కువమందితో పరిచయం చేసుకున్నట్లు లేడు. అందుకే ఒంటరిగా ఉన్నాడని దగ్గరికి వెళ్ళి పలకరించాను.
“ఏమిటి ఇలా ఒక్కరు ఉన్నారు” అన్నాను.

“మా గ్రూపు వాళ్ళు లిటరసీ పెంచడంపై డిస్కస్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం లిటరసీ పెంచడం జరగని పని అని నా ఉద్దేశ్యం” అన్నాడు.

“మరి మీ ఆలోచన ఏమిటి?” అన్నాను

“లిటరసీ పెంచాలి. ప్రస్తుతం ఉన్న 52.11 శాతంతో భారతదేశం అభివృద్ధి సాధించడం జరగని పని. చిన్న చిన్న హెల్పుల వల్ల యూజ్ అట్టే ఉండదు. పెద్ద ఎత్తులో లిటరసీ టేకప్ చెయ్యాలి” అన్నాడు.

“పెద్ద ఎత్తున అంటే” – అన్నాను వివరంగా చెప్పమన్న భావంతో.

“నాకు ఒక 100,000 డాలర్లు సంపాదించి, ఇండియా వెళ్ళి అక్కడ ఉన్న ఒక ఆర్గనైజేషన్ తో కలసి కాని, లేదా ఒక ఆర్గనైజేషన్ పెట్టి వందలకొద్ది వలంటీర్స్ ని పెట్టి, వేల కొద్ది ఇల్లిటరేట్సుని లిటరేట్సుగా చెయ్యాలని ఉంది”. అన్నాడు ఆవేశంగా.

“అది మంచి ఉద్దేశ్యమే కానీ, ఇటువంటి విషయాలలో అంటే సంఘసేవలో డబ్బు కోసమో, ఎదుటి వారికోసమో ఎదురు చూడడం అనవసరం. పైగా ఆ డబ్బు కాని, మనుషులు కాని సమకూరేసరికి పని చెయ్యడానికి కావలసిన అనుభవం రావాలంటే ఊహ తోచిన నాటినుండి ఎంతలో వీలయితే అంతలో, పనిచేయడం మొదలు పెట్టాలి.

“కానీ రిజల్ట్సు?” అన్నాడు ప్రయోజనం ఉండదన్న భావంతో.

ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటే, సమాధానం నాచేతిలోనే ఉందని తోచింది వెంటనే
“మీరు తెలుగు చదువుతారా?” అని అడిగాను

“షూర్” అన్నాడు.

“అయితే నా స్వంత అనుభవాన్ని ఒక కథ రూపంలో రాసాను. ఈ కథ చదవండి. మీ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు” అని నేను రాసిన కథ కాపి అతనికి ఇచ్చాను.

ఇంతలో డాక్టర్ రాణి చింతంగారు రమ్మంటున్నారని నాకు కబురు వచ్చింది. ఆమె ఇక్కడికి వచ్చిన వారందరికి కాఫీ, టీ, భోజనాలన్నింటిని అందించే బాధ్యత తీసుకున్నారు. ఆమెకు సహాయం అందించడానికి నాలాంటివారు కొద్దిమంది వాలంటీర్లు ఉన్నారు. ఏదో పని ఉండి పిలిచి ఉంటారు.

“ఒక అరగంట తరవాత వచ్చి కలుస్తాను” అన్నాను.

“చాలా థాంక్సండి ఇప్పుడే చదువుతాను” అని అతను అక్కడే కూర్చొని చదవడం మొదలుపెట్టాడు.
* * *
1998 జనవరి మొదటివారంలో భువనేశ్వరం వెళ్ళాం నేను, నా భార్య చిత్ర. చిన్నప్పడు నాతో కలిసి చదువుకుని, పాతికేళ్ళుగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న కిషోర్ అతని భార్య కమల ఉదయాన్నే రైల్వేస్టేషనుకు వచ్చి మమ్మల్ని ఆదరంగా వాళ్ళింటికి తీసుకుని వెళ్ళారు.

“కిషోర్ ఈ మాటు కోణార్క తప్పకుండా వెళ్ళాలిరా” అన్నాను కబుర్లలో.

“తప్పకుండా, కానీ మరీ రెండు రోజులే ఉంటానంటే ఎలారా?” అన్నాడు.

“రేపే వెళదాం. మీరిద్దరు కూడా రండి. అందరం కబుర్లు చెప్పుకుంటు హాయిగా గడపుదాం” అన్నాను.

“సరే. అయితే నాలుగు గంటలకి బయలుదేరితే సూర్యోదయానికల్లా కోణార్క చేరుకోవచ్చు. అప్పుడయితే, ప్రశాంతంగా ఆ గుడిని, గుడి వెనుకగా సూర్యోదయాన్ని చూడవచ్చు. ఆ తరవాత అయితే జనం ఎక్కువై అంతా గాభరా గాభరాగా ఉంటుంది. ఉదయాన్నే కాని, లేదా పౌర్ణమినాడు రాత్రి కాని ప్రాకారం చుట్టు ఉన్న చెట్లక్రిందో, నాట్య వేదికల మీదనో కూర్చొని చూస్తూ, ఆ అందాల్ని ఆస్వాదిస్తే కానీ కోణార్క గొప్పదనం అర్థం కాదు. ఆనందించలేము.” అన్నాడు కిషోర్ తన్మయత్వంతో.

“సరే, అలాగే” అన్నాను.

ఆ రోజంతా చిన్ననాటి కబుర్లు, అమెరికా విశేషాలు, పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్ లు, చెదిరిపోయిన మిత్రుల గురించి, చనిపోయిన ఉపాధ్యాయుల గురించి, ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం మధ్యాహ్నం భోజనాలు అయ్యేంత వరకు. తరవాత ఓ రెండు గంటలు నిద్రపోయి లేచాము. కమల అందించిన టీ త్రాగుతు ఉంటే,

“రేపు తెల్లవారు ఝామున చాలా చలిగా ఉంటుంది. నువ్వేమైనా స్వెట్టరు గట్రా తెచ్చావా” అని అడిగాడు కిషోర్.

“లేదే” అన్నాను.

“సర్లే. మావి ఇస్తాం” అన్నాడు.

“అసలు ఇండియాలోనే మంచి స్వెట్టర్లు దొరుకుతాయంటారు. ఇక్కడ కొని పట్టుకుని వెళితే బాగుంటుంది కదా” అంది చిత్ర.

“అవును అదీ మంచి అయిడియా” అని చిత్రాతో అని, “కిషోర్ సాయంత్రం అలా ఊరిలో తిరిగి వచ్చినట్లుంటుంది, ఏదైనా స్వెట్టర్లు అమ్మే షాపుకు తీసుకువెళ్ళు” అన్నాను.

“పరదేశీ బాబు అన్న పేరుతో ఒక పెద్ద బట్టల షాపు ఉంది. అందులో మంచి స్వెట్టర్లు దొరుకుతాయి.” అన్నాడు కిషోర్.

“అదేమిటి ఆ పేరు అలా ఉంది?”

“అవును కొంచం వింతపేరే. కానీ మంచి పేరున్న షాపు. ఇది వారి అతి ముఖ్యమైన కోరిక అనిపిస్తుంది. అక్కడ బేరాలు ఉండవు. మంచి నాణ్యమైన బట్టలు. పైగా షాపుకు వచ్చిన వాళ్ళందరిని వాళ్ళ అభిప్రాయాన్ని వ్రాసి సంతకం పెట్టమంటారు. అలా చేసినందుకు ఓ మంచి పెన్ను ఇస్తారు.”

ఆరు గంటలకల్లా అందరం తయారై ఊరిమీద పడ్డాం. ఇరవై ఏళ్ళ తరవాత మళ్ళీ ఈ ఊరు చూస్తున్నాను. ఇదివరకు విశాలంగా అనిపించిన రోడ్లు ఇప్పుడు, జనాభా పెరుగుదల వలన కాబోలు, ఇరుకుగా అనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనుషులే, చిన్న చిన్న దుకాణాలే, ఇరుకు అన్న భావన మనసంతా ఆవరిస్తుంది.

ఒక రెండు గంటలు ఊరంతా తిరిగి, సుమారు ఎనిమిది గంటలకు పరదేశీ బాబు అన్న పేరు పెద్ద పెద్ద అక్షరాలతో, అధునాతన పద్ధతిలో అలంకరించబడి ఉన్న ఒక విశాలమైన షాపులో అడుగు పెట్టాం. అడుగు పెట్టీ పెట్టగానే ఒక అందమైన అమ్మాయి ఎదురు వచ్చి వినయంగా ఆహ్వానించింది. ఏ బట్టలు కొనడానికి వచ్చామో అడిగి వాటికోసం ఎటువైపు వెళ్ళాలో చూపించి, అవి కొనడం అయిన తరవాత షాపు అంతటిని చూడమని కోరింది. కేష్ కౌంటర్లకి ఒక 20 అడుగులకు ముందుగా ఉన్న ఒక టేబుల్ చూపించి, ఇక్కడ మా అభిప్రాయాలను షాపు విడిచి వెళ్ళే ముందు వ్రాసి సంతకం పెట్టమని ‘పరదేశీ బాబు’ తరఫున ప్రార్థిస్తున్నాను అని చక్కనైన ఇంగ్లీషు ఉచ్చారణతో భాషా దోషాలు లేకుండా చెప్పింది. అది విని ఆశ్చర్యపోయాను.

“ఇంత మంచి ఇంగ్లీషా!” అన్నాను ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ.

“ఈ షాపులో పనిచేసే వాళ్ళు ఒరియాతో పాటు రెండు మూడు భాషలు మాట్లాడుతారు. అందరు ఇంగ్లీషు మాట్లాడుతారు. అదీ చాలా చక్కగా” అన్నాడు కిషోర్ ప్రశంసాపూర్వకంగా.

కావలసిన స్వెట్టర్లు తీసుకుని, షాపంతా తిరిగి చూసి, బిల్లు చెల్లించడానికి కేష్ కౌంటర్ల వైపుకి కదిలాం. ఎదురుగా ‘ఈ షాపుపై మీ అభిప్రాయాలను తెలియజేయండి’ అని 12 భారతీయ భాషల్లో పెద్ద అక్షరాలతో వ్రాసి ఉన్న బోర్డు, దాని ప్రక్కనే ఒక టేబులు, టేబులు వెనక నవ్వు మొహంతో కూర్చొని ఉన్న అమ్మాయి కనిపించింది. ఆ టేబులు దగ్గరకు రాగానే,

“మీ అభిప్రాయం ఇక్కడ వ్రాసి సంతకం పెట్టండి” అని వినయంగా ఓ పుస్తకాన్ని అందిస్తు అడిగింది.

“అలాగే” అని ‘ఎక్సలెంట్’ అని వ్రాసి సంతకం పెట్టాను. నా సంతకం ప్రక్కనే చిత్రా కూడా సంతకం పెట్టింది. కిషోర్, కమల ఇంతకుముందే రాసాం అని చెప్పారు. ఆ అమ్మాయి వెంటనే రెండు పెన్నులు తీసి నాకు చిత్రాకి ఇచ్చింది. అవి తీసుకుని కేష్ కౌంటర్లవైపుకి వెళ్ళాం. అక్కడ మాకంటే ముందుగా వచ్చి నిలబడ్డవారి వెనుక క్యూలో నిలబడ్డాం. అలా నిలబడే షాపంతా కలయ చూసాను. షాపంతా చాలా అందంగా కూడా అమర్చారని అనిపించింది. అభిప్రాయ సేకరణ టేబుల్ దగ్గర కూర్చొన్న అమ్మాయి ఆమె చేతిలో ఉన్న కాగితంలోకి, అభిప్రాయం సేకరించిన పుస్తకంలోకి పదే పదే చూస్తున్నట్లు గమనించాను. ఉన్నట్టుండి ఆ అమ్మాయి ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచి, పరుగెట్టుకుంటూ షాపులో భాగంగా ఉన్న పై అంతస్తుకు చేరుకుంది. షాపులో ఉన్నవాళ్ళందరి దృష్టి పరిగెత్తుతున్న ఆమె మీద ఉంది. కొద్ది క్షణాలలో ఆమె పై అంతస్తులో ఆఫీస్ అని వ్రాసి ఉన్న తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. కొద్దిక్షణాలు గడిచాయి. ఎవరి పనులు వారు చెయ్యడం మొదలుపెట్టారు. మేం బిల్లు చెల్లించడానికి ముందుకి కదిలాం. కేషియర్ మేం అందించిన రసీదు తీసుకుని, చెల్లించవలసిన సొమ్ము చెప్పి టకటక వ్రాయడం ఏదోమొదలు పెట్టింది. నేను పర్సు తీసి డబ్బులు లెక్కపెడుతున్నాను. అప్పటిదాకా చకచక పనిచేస్తున్న కేషియర్ పని ఆపి, ఒక్క ఉదుటున లేచి నిలబడింది.

“ఏమైంది?” అని అడిగాను. “నేనిచ్చిన సొమ్ములో ఏదైనా పొరపాటు ఉందా?”

నా ప్రశ్న పట్టించుకోకుండానే తలూపి “మేడం” అంది.

నేను వెనక్కితిరిగి చిత్రా వైపు చూసేంతలో నా ప్రక్కగా నాలుగు అడుగుల దూరంలో ఏ భావం వ్యక్తం చెయ్యకుండా అన్ని భావాలను ఇముడ్చుకుందా అన్నట్లు అనిపించే విశాలమైన మొహంతో, యూనివర్సిటీ రోజులలో ఎస్.సి.సి. ఆఫీసర్ గా ఉన్న అంజలిని శర్మని గుర్తుకు తెప్పించే ఒక అమ్మాయి రెండు చేతులు జోడించి నిలబడి నన్ను చూసి “నమస్తే” అంది. ఆమె వెనుకగా అభిప్రాయాల కౌంటరు అమ్మాయి మేం అభిప్రాయం వ్రాసిన పుస్తకం పట్టుకుని వెనక నిలబడి ఉంది. నేను కొద్దిగా తడబడుచు ప్రతి నమస్కారం చేసాను.

“ఈ సంతకం మీదేనా?” అని ఆపుస్తకంలో ఉన్న నా సంతకం వైపు వేలు చూపిస్తూ అడిగింది. నా కోసం వాళ్ళు వెతుకుతున్నారన్న ఆలోచన కొద్దిగా ఆశ్చర్యంతో నన్ను కలవరపెట్టింది.

“అవును” అన్నాను మెల్లగా.

“మీరు 20 సంవత్సరాల క్రిందట భువనేశ్వర్ వచ్చారు కదూ” అని అడిగింది.

“ఆ, ఆ అవును సుమారుగా....”

“ఈ కాగితంపైన ఉన్న సంతకం కూడా మీదేనా?” అని పటం కట్టి ఉన్న నా సంతకం ఫోటో కాపి చేసి ఉన్న కాగితాన్ని చూపించి అడిగింది.

మొదటినుండి నా సంతకంలో అట్టే మార్పు లేదు. ఆ కాగితం మీదనున్నది నా సంతకమే. సులభంగానే గుర్తు పట్టాను. సంభాషణ అంతా ఇంగ్లీషులోనే సాగుతున్నాది.

“అవును” అన్నాను నిశ్చయంగా. మీరేనా బాబుజి.

“బాబుజీ” అని ఆ షాపు అంతా ప్రతిధ్వనించేలా ఒక్కసారి అరచి, చటుక్కున నా కాళ్ళపై పడి, తన చేతులతో నారెండు కాళ్ళని చుట్టేసింది. ఉద్వేగంగా ఏదేదో అంటున్నాది. అర్థమవడం లేదు.

నన్ను ఆశ్చర్యం, ఉద్వేగం ఒక్కసారి ఆవరించి గాభరా పెట్టాయి. ఆ స్థితిలోనే వంగుని, “లేవండి, లేవండి అలా కాళ్ళ మీద పడకూడదు. అసలు విషయమేమిటి? ఏం జరిగింది? నా కోసం ఎందుకోసం ఆరాటం? మీరెవరో నాకు తెలియదు” అన్నాను.

ఆమె నా కాళ్ళు వదలకుండానే “ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. లక్ష సంతకాల తరవాత మీ సంతకం కనిపించింది. మీరు దొరికారు. నేను మిమ్మల్ని వదలలేను. నా తనివి తీరా మనసులో ఇన్నేళ్ళుగా దాచుకున్న నా కృతజ్ఞతని మీకు తెలుపుకోవాలి బాబుజీ, బాబుజీ” అంటూ ఆవేశంగా పరిసరాలని మరిచి, ఒదిలితే ఎక్కడ జారిపోతాయో అన్నంత గట్టిగా నా కాళ్ళను పట్టుకుంది.

నేను నిస్సహాయంగా నిలబడి సహాయం కోసం మా ఆవిడ చిత్రా వైపు చూసాను. తనకీ విచిత్రంగా ఉన్న ఈ సన్నివేశంలో చిత్ర నా చూపుని అర్థం చేసుకున్న దానిలా ముందుకు వచ్చి వంగుని, నా కాళ్ళ దగ్గర ఉన్న ఆ అమ్మాయిని తన చేతులతో పట్టుకొని మీదకు లేపి నిలబెట్టింది. కానీ ఆ అమ్మాయి ఇంకా ఉద్వేగంలో చిత్రా భుజంపై వాలి ఉంది. షాపులో ఉన్న వాళ్ళంతా అప్పటికి మా చుట్టు మూగి ఉన్నారు.

ఆ సంతకం నిజానికి నా సంతకమేనా? నాసంతకానికి పఠం కట్టి ఉంచడమేమిటి? ఆ సంతకానికి ఆ అమ్మాయికి సంబంధం ఏమిటి? నాలో ఎడతెగని ప్రశ్నలు సాగాయి. ఇన్నేళ్ళుగా నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నది? నన్ను పట్టుకుందికేనా ఈ అభిప్రాయ సేకరణ. మనిషిని పోలిన మనిషి ఉంటారంటారు. సంతకాన్ని పోలిన సంతకం ఉండదా? ఇందులో ఏ పొరపాటు లేదుకదా? ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను.

ఇంతలో ఆ షాపు స్టాఫ్ తేరుకుని, చిత్రా భుజంపైన ఒరిగి ఉన్న ఆ అమ్మాయిని, మా నలుగురిని పై అంతస్తులో ఉన్న ఆఫీసుగదిలోకి తీసుకువెళ్ళారు. ఆ ఆఫీసు గది ముందు అనుపమ పట్నాయక్ ఎమ్.ఎ., మేనేజింగ్ డైరెక్టర్, అని రాసి ఉన్న బోర్డు ఉంది. లోపల కుర్చీలతో, సోఫాలతో అధునాతన పద్ధతిలో అమర్చిన విశాలమైన ఆఫీసు ఉంది. ఎడమవైపున్న సోఫాలో మమ్మల్ని కూర్చోమని సూచించారు. ఆ సోఫాకు ఎదురుగా ఉన్న సోఫాలో ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు. అంతలోనే మంచినీళ్ళు, వేడి వేడి టీలు వచ్చాయి. మంచినీళ్ళు, టీ అందరికి అందించారు. ఆమె ముందుగా కొంచెం మంచినీళ్ళు తాగి, తేరుకుని, స్టాఫ్ ఇచ్చిన తువ్వాలుతో ముఖం తుడుచుకుని, నా మొహంలోకి చూస్తూ,

“మీరు ఇరవై ఏళ్ళ క్రిందట భువనేశ్వర్ వచ్చారు గుర్తుందా?” అని నా జ్ఞాపకాలని గుర్తుచెయ్యడానికి ప్రయత్నిస్తున్నదానిలా అంది. “మీరు మా నాయన కూరల దుకాణానికి వచ్చారు...” ఏమేమో చెపుతున్నది. ఇరవై ఏళ్ళ క్రిందట భువనేశ్వర్ వచ్చినప్పుడు జరిగిన విశేషాలని గుర్తుకు తెచ్చుకుందికి ప్రయత్నిస్తున్నాను నేను.
నేను ఉద్యోగప్రయత్నం మీద ఇంటర్వ్యూకోసం భువనేశ్వర్ వచ్చాను. కోణార్క కూడా చూద్దామని అనుకున్నాను. కాని కోణార్క వెళ్ళడం జరగలేదు ఎందుచేత?....

అప్పుడు భువనేశ్వర్ ఇంత పెద్ద ఊరు కాదు. జనం బాగా తక్కువ. ఊరు విశాలంగా ఉన్నట్లు గుర్తు. కిషోర్ ఒక చిన్న గదిలో అద్దెకు ఉండేవాడు. నేను నాలుగు రోజులు ఉందామని కూడా వచ్చాను. అప్పుడు ‘మదరాసి’ హోటళ్ళు లేవు. కిషోర్ ఒరియా భోజనానికి అలవాటు పడ్డా, నా కోసం ఇంట్లోనే వంట చేసేవాడు. ఇంటర్వ్యూ అయిన నాటి రోజు సాయంత్రం సామానులు, కూరలు కొనడానికని బజారుకు వెళ్ళాము.

“బాబుజీ!” “వినండీ” గౌరవం, ఆప్యాయత మేళవించి పిలిచిన ఆ పిలుపుకు నా ఆలోచనలు తెగిపోయాయి. “చిన్న వయసులో, చింపిరి తలతో, చీమిడి ముక్కుతో, చిరిగిన బట్టలతో, మట్టి కొట్టుకుపోయిన వంటితో, చదవలేక, చదువురాక, చదువుకోమనే దెబ్బలతో, ఏడుపుతో, కన్నీళ్ళు నిండిన కళ్ళతో ఉన్న నేను గుర్తుకు వచ్చానా? అని తోరు దత్ పోయట్రీ లాంటి భాషలో ఇంగ్లీషులో అడిగింది. మెల్లి మెల్లిగా కూరగాయల తట్టల మధ్య కూర్చోని ఉన్న ఓ చిన్నపిల్ల నాకు గుర్తు రావడం మొదలయ్యింది. పూర్తిగా గుర్తుకు రాగానే ఎదురుగా కూర్చోని ఉన్న ఆమె కన్నీళ్ళు నిండిన కళ్ళల్లోకి చూసాను.
చక్కని సాంప్రదాయపు కేశాల కూర్పుతో, మిసమిసలాడుతున్న చెంపలమీద, మెరుస్తున్న కన్నీటి తడితో, పసుపు ఎరుపు రంగు మేలు మేళవింపుతో మగ్గాన నేసిన మంచి చీరలో, వయసు తెచ్చి ఇచ్చే వన్నె వెలుగుతో మెరుస్తున్న మేనుతో, ఈమె చాలా చదివిందేమో అని అనిపించే భాషాజ్ఞానంతో, భావోద్వేగాన్ని ప్రజ్వరిల్లిస్తున్న కళ్ళతో ఉన్న ఈమె ఆ పిల్లా? నాకళ్ళ ముందే అందమైన సీతాకోకచిలుక అప్పుడే రెక్కలు విచ్చుకున్న భ్రాంతి కలిగింది.

మసక వెలుతురులో 30-35 ఏళ్ళ వ్యక్తి, అతనికి ఎదురుగా ఒక 6-7 ఏళ్ళ అమ్మాయి, చుట్టూ కూరగాయల తట్టలు ఒకదాని తరవాత మరొకటి గుర్తుకు వస్తున్నాయి. పిల్ల ఏడుపు వినిపిస్తున్నది. ఏడుపు మధ్యలో ఏదేదో ఒరియాలో అంటున్నాది. అతను తండ్రి కాబోలు కొడుతున్నాడు. కొడుతూ అరుస్తున్నాడు. ఒరియా భాష రాకపోవడం వలన నాకు ఏమీ అర్థం కావడం లేదు. తెలుసుకోవాలని మాత్రం కుతూహలంగా ఉంది. కిషోర్ సామానులు కొనడం పూర్తయిన తరువాత ఆ ఏడుస్తున్న పిల్ల ఉన్న కూరల దుకాణానికి వెళ్ళాం. ఆ పిల్లని, తండ్రిని దగ్గరగా చూడడం కుదిరింది. మేం రాగానే అతను పిల్లను కొట్టడం ఆపి మావైపు తిరిగి కూరలు ఏరుకుందికి తట్ట అందిస్తూ, పిండి తీసుకుని మొహానికి రాసుకున్న తీరులో, నవ్వు తీసుకొని మొహానికి పులుముకున్నాడా అన్నట్లు నవ్వాడు ఒక్క క్షణం సేపు.
ఆ పిల్ల మేం దగ్గరకు రాగానే ఆపలేక ఆపలేక ఆపినట్లు ఏడుపు ఆపింది. అయినా మధ్య మధ్యలో బెక్కుతూనే ఒరియాలో ఏదో అప్పజెపుతున్నట్లు చెప్పుతున్నది. విరిగిపోయిన పలక, చిరిగిపోయిన పుస్తకం... ఆ అమ్మాయి ఇంత ముందు వర్ణించినట్లే ఉంది.

ఆ తండ్రి నలిగిన బట్టలో రేగిన జుత్తుతో, ముడతలు పడ్డ నుదురుతో, చాలా కాయకష్టం చేసి రాటుదేరిన చేతులతో, నిర్భాగ్యపు బ్రతుకుకు నకలుగా, నిరాశ ముద్దలలాంటి కళ్ళతో, మాసిన గడ్డంతో, బ్రతుకు మీదో, వ్యాపారం మీదో, పిల్లదాని చదువుమీదో, మనుషుల మీదో, లేక వీటన్నింటి మీదో, దీనిమీద అని నిర్దుష్టంగా చెప్పలేని కసి, కోపం అతని మొహమంతా మబ్బులా కమ్మేసింది.

కూరలు కొనడం అయిపోయిన తరవాత రూమ్ కు వస్తూ ఉంటే కిషోర్ ని అడిగాను ‘ఆ పిల్ల ఎందుకు ఏడుస్తున్నది? ఆ తండ్రి ఎందుకు కొడుతున్నాడు చదువుకోడం లేదా అనేదా?’

‘ఆ సుమారుగా అంతేలే. పుస్తకాలు కొనకుండా బడికి రావద్దన్నారని, తనకు అలాంటి బట్టలు కావాలని. ఆపిల్ల, ఎక్కాల పుస్తకం కొన్నా ఇంకా ఎక్కాలు రాలేదని, పుస్తకాలు కొనడానికే డబ్బులు చాలకపోతుంటే, ఇంక మంచి మంచి బట్టలు ఎక్కడనుండి తేగలనని ఆ తండ్రి అంటున్నాడు. నీకూ చదువబ్బదు, నాలాగే నీకూ ఈ కూరల తట్టలే గతి. మన ఇద్దరి బతుకు ఈ కూరల తట్టల మధ్యనే తెల్లవారుతాయి అని తిట్టుకుంటున్నాడు. ఆ కబుర్లలో రూమ్ కి వచ్చాం. రాత్రి ఆ పిల్ల ఏడుపు గుర్తుకు వచ్చి మెలుకువ వచ్చింది. ఆ తర్వాత నిద్ర రాలేదు. ఆ పిల్ల మొహం పదే పదే గుర్తుకు వచ్చింది. చదువంటే డబ్బులని స్కూల్లోనూ చదువంటే దెబ్బలని ఇంట్లోనూ ఒక దురభిప్రాయన్ని ఆ చిన్నారి మనసులో నాటబడుతుంటే నాకు చాలా బాధ కలిగింది. ఆ పిల్లకి ఎలాగైనా చదువుకోవాలనే ఆసక్తి కలిగించాలని అనిపించింది. ఆ ఊరిలో ఇంకా ఉండేది ఒక్కరోజు మాత్రమే. మర్నాడు కోణార్క వెళ్ళాలని అనుకున్నాను. నాకా ఆ పిల్లతో కాని వాళ్ళ నాన్నతో కాని మాట్లాడడానికి ఒరియా రాదు. ఏం చేసినా అది ప్రోత్సాహకరం అయ్యేదే కానీ ఆ పిల్ల చదువు బాధ్యత మొత్తం తీసుకోడానికి నేను ఆ ఊర్లో ఏలాగో ఉండను. నాకా ఉద్యోగం లేదు. మరేం చెయ్యాలి? ఇలా ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారఝామున నిద్రపోయాను.

మర్నాడు ఉదయం కిషోర్ నిద్రలేపాడు. కోణార్క వెళ్ళడానికి ఆలస్యం అయిపోతున్నదని.

‘కోణార్క వెళ్ళడం లేదు’ అన్నాను నేను లేచి.

‘అదేం అన్నాడు’ మరేం లేదు. నా దగ్గర 200 రూపాయలే ఉన్నాయి. కోణార్క అనుకొన్నాను కాని అవి పెట్టి ఆ పిల్లకి కావలసిన పుస్తకాలు బట్టలు కొనిఇచ్చి చక్కగా చదువుకోమని చెప్పాలనుకుంటున్నాను. అన్నాడు.

‘ఏ పిల్ల? ఆ కూరగాయల కొట్టతని పిల్ల?’

‘అవును’ అన్నట్టు బుర్ర ఊపాను.

‘మరి కోణార్క ప్రయాణం.....’ అన్నాడు కిషోర్.

‘ప్రయాణం అంత ముఖ్యం కాదు. విపరీతంగా వెనకబడి ఉన్న మనదేశానికి అక్షరాస్యత అత్యంత అవసరం. ఆడపిల్లలు చదువుకుంటే ఆమె పిల్లలు నిరక్షరాస్యులవరు. ఆ కుటుంబం నిరక్షరాస్యత నుండి బయటపడుతుంది. కాబట్టి నేను కోణార్క వెళ్ళడం కన్నా అదే డబ్బుతో ఆ పిల్ల చదువుకి ఉత్ప్రేరకంగా తోడ్పడడం మంచిదని ఈ నిర్ణయం తీసుకుంటున్నాను.’ అన్నాను.

కిషోర్ తెల్లబోయి చూస్తున్నాడు.

‘నువ్వు ఆఫీసుకు వెళ్ళే దారిలో ఉన్న ఏదైనా ఒక పుస్తకాల షాపులో నన్ను విడిచిపెట్టి వెళ్ళు. ఆ తరవాత అక్కడ దగ్గరలో ఉన్న బట్టల దుకాణానికి వెళ్ళి బట్టలు కూడా కొని సాయంత్రం ఆ పిల్లకు ఇచ్చివద్దాం’ అన్నాను.

సాయంత్రం మళ్ళీ ఆ కూరల దుకాణానికి వెళ్ళి ఉదయం కొన్న ఒరియా, ఇంగ్లీష్, పుస్తకాలు, పెన్సిళ్ళు, ఒక రెండు పెన్నులు, కొన్ని రబ్బర్లు, బట్టలు ఇచ్చి, ‘చదువుకో బాగా చదువుకో. చాలా పెద్దదానివి అవుతావు. నీకు కావల్సినవి అన్నీ దొరుకుతాయి’ అని ఒరియాలో కిషోర్ చేత ఆ పిల్లతో చెప్పించి, అవే మాటలని కిషోర్ చేత ఒరియాలో వ్రాయించి క్రింద నా సంతకం పెట్టి ఇచ్చాను. వాళ్ళు ఒరియాలో అన్నవాటిని, కృతజ్ఞతలని కిషోర్ నాకు తెలుగులో తరువాత చెప్పాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరి తెలీదు. ఆ పిల్లే ఈ పిల్లా అని ఆమె మొహంలోకి చూస్తూ “అవును అప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చినట్లు గుర్తు.” అన్నాను.

“బాబుజీ, ఇవిగో ఆ పుస్తకాలు” అని ఎదురుగా ఉన్న అందంగా నగిషీ చెక్కిన పెట్టెలోంచి కొన్ని పాత పుస్తకాలు తీసి కళ్ళకు అద్దుకొని నా ఎదుట పెట్టింది. “ఆ రోజు మీరిచ్చిన ఈ పుస్తకాలు నాకు వరాలు. అప్పటి నుండి శ్రద్ధగా చదువుకున్నాను. మా నాయన నా హైస్కూల్ చదువు పూర్తి కాగానే బట్టల వ్యాపారం మొదలు పెట్టించాడు. మీ మీది గురితో ఏర్పడ్డ చదువు మీద అభిమానం నన్ను వదలలేదు. ఉదయం వ్యాపారం, సాయత్రం చదువు. చదువుతున్నకొద్దీ చదువు ఇచ్చే ఆనందాన్ని ఆస్వాదించసాగేను. వ్యాపారంలో కూడా నా చదువు చాలా ఉపయోగపడడం చూసి మా నాయన నన్ను చదువుకోమని ప్రోత్సహిస్తూ ఉండేవాడు. అలా ఎమ్.ఎ. దాకా చదివాను.”

అని లేచి, గోడకు తగిలించి ఉన్న ఉత్కళ్ యూనివర్శటీ డిగ్రీ సర్టిఫికెట్ లను తెచ్చి చూపించింది.

“మ్మిమ్మల్ని లెఖ్క పెట్టలేనన్ని సార్లు తలుచుకుంటూనే ఉంటాను. పరీక్షలు పాస్ అయినప్పుడల్లా ఇదంతా మీ దయవలననే అని అనుకుంటూ ఉండేదాన్ని. మీ పట్ల నాకున్న కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలా అని చాలా రోజులు ఆలోచించి, ఆఖరుకు మీ కిష్టమైన పనే చేసాను. చూడండి.” అంటూ ఒక ఆల్బమ్ తెరిచి గత 10 ఏళ్ళుగా ఏడాది వారీగా అమర్చిన ఆడపిల్లల గ్రూప్ ఫోటోలని చూపించి ప్రతి ఏడాది సుమారు వంద మంది చదువుకోడానికి స్తోమత లేనివారిని మేము, మా షాపువారము చదివిస్తున్నాము. వాళ్ళని తిరిగి పెద్దవాళ్ళయ్యాక ప్రత్యుపకారంగా కనీసం పదిమందిని చదవించమని కోరుతున్నాం. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుందనుకుంటాను బాబుజీ”

“నిజంగానే మంచి పని. చాలా ఆనందంగా ఉంది.” అన్నాను. చెమర్చిన కళ్ళతో.

“బి.ఎ. పాస్ కాగానే మిమ్మల్ని కలవాలన్న కోరిక అతి గట్టిగా అనిపించింది. మీ సంతకం ఉందికానీ, మీ పేరు తెలియలేదు. ఒరియావాళ్ళు కాదని మాత్రం తెలుసు. మీరెవరో తెలియదు, ఎక్కడ ఉన్నారో తెలియదు. మిగిలిన ఆశ ఒక్కటే. మీరు మళ్ళీ భువనేశ్వర్ వచ్చి మా షాపుకు వచ్చినట్లయితే ఈ సంతకం ద్వారా మిమ్మల్ని కలవచ్చు అని తోచి అభిప్రాయాల సేకరణ ఈ సంతకాల పద్ధతి పెట్టాం. మా నాయన కూడా మిమ్మల్ని అడుగుతుండేవాడు. చనిపోయే ముందు కూడా మిమ్మల్ని గుర్తుచేసుకొని ఎప్పుడైనా కలిస్తే తన తరఫున కూడా మీకు పాదాభివందనం చెయ్యమన్నాడు.” అని ఉద్వేగంతో నా కాళ్ళకి మరోసారి నమస్కారం పెట్టింది.

నా నిలువెల్లా ఆనందాశ్చర్యాలతో ముంచెత్తబడుతున్న ప్రకంపనాలు పదే పదే ప్రవహిస్తున్నాయి. మాట్లాడాలని ఉందికాని గొంతునిండి మాటరావడం లేదు. గత 20 ఏళ్ళుగా విదేశాలలో పనిచేస్తు సంపాదించిన పురస్కారాలన్నింటి కంటే ఆమె చేసిన నమస్కారం అత్యున్నతమైనదిగా తోచింది. ఆ రోజు చేతిలో ఉన్న 200 రూపాయలు ఆ పిల్ల చదువుకు ఖర్చు చెయ్యడం కంటే మంచిపని నా జీవితంలో ఇంకేమీ లేదేమో అని అనిపించింది. అయితే ఆ అమ్మాయి తన జీవితంలో ఇంత ఎత్తు ఎదగడానికి కారణం నేనే అని ఆ గొప్పదనం నాకే ఆపాదించబడడం అంత సబవు అనిపించలేదు. అందుకే నోరు విప్పి-

“నీ పట్టుదల, కృషి, మేధస్సుతో, విశాల దృక్పథంతో ఈ స్థితికి వచ్చావు కాని నా పాత్ర ఇందులో ఉత్ప్రేరకంగా పని చెయ్యడం మాత్రమే. నువ్వు చాలా అభినందనీయురాలివి. ఎంతో మంది ఆడపిలల్లకి నువ్వు మార్గదర్శకురాలివి. అటువంటి నీ అభిమానానికి ఎంతో ఆనందిస్తున్నాను.” అన్నాను ప్రతీ పదాన్నీ నొక్కి పలుకుతు.

మేం ఇద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అంతా మమ్మల్నే చూస్తున్నారు అన్న ఊహ అప్పుడే కలిగింది.

“బాబుజీ మీరు మా ఇంటికి రావాలి. మాతోనే ఉండాలి. ఇన్నేళ్ళుగా నా మనసులో మీతో చెప్పుకుంటున్న మాటలన్నీ మీతో చెప్పాలి.”

“అలాగే” అన్నాను.

“మరి కోణార్క వెళ్ళడమో...” అన్నాడు కిషోర్.

“రేపు కోణార్క వెళ్ళాలనుకున్నారా రేపొక్కసారి మానుకుని మరోసారి వెళ్ళకూడదా?” అని ప్రశ్నలాంటి అభ్యర్థన చేసింది అనుపమ పట్నాయక్.

“అలా అయితే ఇది 20 ఏళ్ళ తరవాత మరోసారి అవుతుంది” అన్నాడు కిషోర్.

“అదేమిటి” అన్న ఆమె ప్రశ్నకు సమాధానంగా 20 ఏళ్ళ క్రిందట నేను కోణార్క వెళ్ళడం ఎందుకు అవ్వలేదో చెప్పాడు.

అది విని అనుపమ పట్నాయక్, మౌనంగా, నీళ్ళు నిండిన కళ్ళతో ద్విగుణీకృతమైన కృతజ్ఞతతో మరోసారి నావైపు చూసింది.

ఆ రాత్రి అందరం అనుపమ పట్నాయక్ కోరికపై ఆమె అతిథులమయ్యాం.

* * *

నేను వంటింటిలో చెయ్యవలసిన సహాయం చేసి వచ్చేసరికి పతంజలి నేనిచ్చిన కథ చదవడం పూర్తి చేసి నా కోసం “ఎదురు చూస్తున్నాను” అన్నాడు.

“ఇప్పుడేమంటారు” అన్నాను అతను అందిస్తున్న కాగితాలను అందుకుంటూ...

“సంకల్పం, ఆచరణ రెండూ ముఖ్యమే. ఒక్క సంకల్పమే కాదు ఆచరణలో పద్ధతులు కొన్ని ఉండాలి, కల్పించాలి.”
అన్నాను. “మరి నేను వెళ్ళి మా గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. థేంక్సు” అన్నాడు అతను. “మంచిది” అన్నాను తృప్తిగా.



0 వ్యాఖ్యలు