Friday, May 15, 2009

చెత్తకు కరువొచ్చింది

Friday, May 15, 2009
మా ఊరు సగటు ఊరు అన్న చిరునామాకు సరిపడే ఊరు. లెక్క పెట్టలేనన్ని అన్యాయాలు ఉన్న ఊరు. బడి దగ్గర నుండి గుడి దాకా, ఆస్పత్రి నుండి స్మశానం దాకా మిగిలిన చాలా వాటినుండి చాలా వాటిదాకా ఏదీ ‘మునుపటి’లా లేదు. అయితే మరి ఊరు ఎలా ఉంది? ‘లంచం’ అనే ఇంధనంతో ఆ ఊరి ‘యంత్రం’ నిక్షేపంగా ఉంది. అలాంటి ఊర్లో నిన్న జరిగిన మునిసిపాల్టీ ఎలక్షన్ల ఫలితాలు ఇవాళ ఉదయం తెలిసాయి. అర్థబలం, అంగబలం వ్యర్థం కాలేదు. గెలుపు వాటిదే, ఒక్క కోటీశ్వర్రావు విషయంలో తప్పించి. రెండు వర్గాల వారి నాయకులు వారి వారి వార్డులలో కౌన్సిలర్లుగా నెగ్గేరు. ఇక మిగిలింది ఛైర్మన్ పదవికి పోటి. ఇరువర్గాల వారు ఎన్ని ఎత్తులు వేసినా, గోడమీది పిల్లి (గోపి) లా ఉన్న కౌన్సిలర్ల వల్ల మెజారిటీ ఎవరిది అన్నది నిశ్చయించుకోలేక పోతున్నారు. ఈ గోపి కౌన్సిలర్ల రేటు గంట గంటకు పెరిగిపోతున్నది. ఇరు వర్గాల నాయకులకు ఒకరి మీద ఒకరికి కోపం తగ్గిపోతున్నాది. ఆ కోపం గోపి కౌన్సిలర్ల మీద పెరిగిపోతున్నాది. సాయంత్రానికి గోపి కౌన్సిలర్ల రేటు ఛైర్మన్ పదవీ కాలంలో ‘సంపాదన’ కంటే ఎక్కువైపోయింది. ఈ విషయం ఇరు వర్గాల నాయకులని కలవర పెట్టింది. రాత్రి అయ్యింది. ఇద్దరు నాయకులు విడివిడిగా ఒక నిర్ణయానికి వచ్చారు. అర్థరాత్రి కనకయ్య సారా కొట్టు వెనక గదిలో కలుసుకున్నారు. ‘బావా’ అంటే ‘బావా’ అనుకొన్నారు. గోపి కౌన్సిలర్లకు బాగా బుద్ధి చెప్పాలనుకున్నారు.

మర్నాడు కౌన్సిలర్ కోటీశ్వర్రావు పోటీ లేకుండానే ఛైర్మన్ అయ్యాడు. గోపి కౌన్సిలర్లు రాత్రి తాగిన పారిస్ మందు మత్తులో కన్న కలలన్నీ కరిగిపోయాయి. వాళ్లు గాలిలో కట్టిన మేడలన్నీ అక్కడక్కడే కూలిపోయాయి. అమెరికా వెళతాడనుకున్న కొడుకు అడ్డరోడ్డు దగ్గర బస్సు దిగిపోయి ఉసురుమంటు ఊర్లోకి నడిచి వచ్చినట్లుంది వాళ్లకి.

* * *

కోటీశ్వర్రావు తన ఊరి మీద అమితమైన ప్రేమతో, మితమైన మిలట్రీ పెన్షన్ తో ఆ ఊర్లో రెండేళ్ళ క్రితం వచ్చి స్థిరపడ్డాడు. ఒంటివాడు. బాదరా బందీలు, బరువు బాధ్యతలు లేనివాడు. సొంత ఇల్లు, ఎకరం పొలం, నెల నెల మిలట్రీ క్రమశిక్షణకి పదిహేనేళ్ళు అలవాటు పడ్డవాడు కాబట్టి సోమరపోతులా కూర్చొనేవాడు కాదు. తనుంటున్న వార్డులో తలలో నాలికలా అందరికి అన్ని పనులలో సహాయపడుతుంటాడు. రెండేళ్ళలో అతని సహాయం పొందని వాళ్ళు ఆ వార్డులో లేరు. కొద్దిమంది స్నేహితుల పట్టుదలని, ఉత్సాహాన్ని కాదనలేక కోటీశ్వర్రావు కౌన్సిలర్ పదవికి నామినేషను వేసాడు. ప్రజలే పైసా ఖర్చులేకుండా ప్రచారం చేసారు. పోటీ పడుతున్న పాత కౌన్సిలర్ లు ఒకరి మీద ఒకరికి ఉన్న అక్కసు కొద్ది, ఎదుటివాడు గెలవకుండా ఉండాలని, చాలా గట్టి ప్రయత్నాలు చేసారు. ఆ ప్రయత్నాలలో కోటీశ్వర్రావుని ముందు పట్టించుకోలేదు. తరవాత తమవి కాని ఓట్లని చీల్చడంలో కోటీశ్వర్రావు బాగా పనికివస్తాడని నమ్మడంవల్ల, కోటీశ్వర్రావుకు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడానికి తగిన విషయాలు ఏమీ లేకపోవడం వల్ల కూడా కోటీశ్వర్రావుని పట్టించుకోలేదు. ఒకర్ని ఒకరు ఓడించుకోవడంలో పాత కౌన్సిలర్లు పూర్తి ఫలితం పొందారు. వారిద్దరు ఓడిపోయారు. కోటీశ్వర్రావు కౌన్సిలర్ అయ్యాడు. పైసా పెట్టకుండా, పలుకు పలకకుండా, చెయ్యి కదపకుండా ఛైర్మన్ అయిపోయాడు కోటీశ్వర్రావు.

ఛైర్మన్ కుర్చీలో కూర్చోగానే ఆ ఊరికి ఉన్న శత కోటి దరిద్రాల(శకోద)కి అనంత కోటి ఉపాయాల(అకోఉ)ని ఆలోచించాడు. ఒక నెలరోజులు కష్టపడి ఆ మున్సిపాలిటీకి ఉన్న ‘శకోద’ల పట్టిక తయారుచేసాడు. మరో నెలరోజులు కష్టపడి కొన్ని ‘శకోద’ లకి తనకి తోచిన ‘అకోఉ’ ఆలోచించి ఒక పట్టిక తయారుచేశాడు. దానికి నకళ్ళు తయారుచేసి కమీషనర్ కు, కౌన్సిలర్లకు అందించమని మునిసిపల్ ఆఫీసులో ఉన్న ముఖ్యమైన గుమాస్తాని పిలిచి చెప్పాడు. ఆ ముఖ్యమైన మునిసిపల్ గుమస్తా అక్కడక్కడే ఒక ఐదునిముషాలలో ‘శకోద’ ‘అకోఉ’ చదివి, కళ్ళజోడు సర్దుకుని, కోటీశ్వర్రావుని అదోలా చూసి, మళ్ళీ ఆ పట్టికవైపు చూసి, “ఇవి జరగని పనులు. నా జరుగుబాటుకు ముఖ్యమైన పనులు అవతల చాలా ఉన్నాయి. జరిగే పనులేవైనా ఉంటే చెప్పండి. రేపో ఎప్పుడో వీలున్నప్పుడు చేసి పెడతాను”. అని చెప్పి, నోట్లో ఉన్న కారాకిల్లీని తుపుక్కుమని ఉమ్మేసి, అదే ఫోర్సుతో చేతిలో ఉన్న కాగితాలని టేబుల్ మీద కొట్టి, కళ్ళజోడు తీసిమడచి పెట్టి, కాళ్ళ జోళ్లు టకటకలాడించుకుంటూ ఆఫీసులోంచి బయటికి వెళ్ళిపోయాడు.

కోటీశ్వర్రావుకు అణగారిన గుమస్తా వర్గపు ‘పొజిషన్’ అర్థం అయ్యింది. కోటీశ్వర్రావు ఛైర్మన్ అయ్యనప్పటి నుండి పనిలో పడి ఊరు, ఉద్యోగస్తులు తన్ని ఎలా చూస్తున్నారో గ్రహించలేదు. కానీ అందరు కోటీశ్వర్రావుని అదో మాదిరిగా చూస్తున్నారు. ‘పాపం’ అని అనుకుంటున్నారు. పూర్వం అమెరికావాడు, రష్యావాడు ఆఫ్గనిస్తాన్ లో పరోక్షంగా కొట్టుకుంటూ ఉంటే, రెడ్ క్రాస్ వాడు అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నట్లుంది కోటీశ్వర్రావు పని.

తను తయారు చేసిన పట్టిక మరోసారి చూసుకున్నాడు. ఉన్నవన్నీ మంచి పనులే. అవన్నీ జరిగినట్లయితే ఆ ఊరు బాగుపడి పోతుందని చెప్పడానికి సందేహం ఏమీ లేదనిపించింది. కానీ ఈ పనులు చేస్తే తాము ‘బాగుపడాలని’, ‘నానా బాధలు’ పడి కౌన్సిలర్ లు అయ్యినవాళ్ళు, ‘చచ్చిచెడి’ పనిచేస్తున్న మునిసిపాలిటీ ఉద్యోగస్తులు తదితర సిబ్బంది. ‘బాగుపడరని’ గ్రహించిన గుమస్తా తానిచ్చిన కాగితాలని పక్కన పడేసి వెళ్ళిపోయాడని తాపీగా గ్రహించాడు.

ఆలోచించగా, ఆలోచించగా ఆ ఊరి అసలు సమస్యల విషయంలో తాను చెయ్యగలిగింది ఏమీ లేదని తెలుసుకున్నాడు. మిత్రులంతా ‘అనవసరమైన’ విషయాలలో కల్పించుకోకుండా పదవిలో పదిలంగా, పరువుగా ఉండమని సలహా ఇచ్చారు. కోటీశ్వర్రావుకు తనమీద తనకే జాలి వేసింది. మనిషి అదోలా అయిపోయాడు. సుమారు పిచ్చివాడిలా ఊరంతా తిరిగాడు. అలసిపోయి అర్థరాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు. కలలో అతనికి ఒక ఊరు కనిపించింది. అది అచ్ఛం తన ఊరిలా ఉంది. అయితే ఆ కలలో ఊరికి తన ఊరికి భేదం ఉంది. కలలో కనిపించిన ఊరిలో మచ్ఛుకైనా ఒక్క పిసరు చెత్త కనిపించలేదు. తల ఊరిలో మచ్ఛుకైనా చెత్తలేని జాగా కనిపించదు. అంతే భేదం!
* * *

మర్నాడు ఆఫీసుకు రాగానే రోడ్లు తుడిచే వాళ్ళ సూపర్ వైజర్ని పిలిపించాడు. రోడ్లని తుడవద్దన్నాడు. ఊరి చివర చెత్త పోసే జాగాలో ఎప్పటినుండో పడి ఉన్న చెత్త కుప్పలని, కాల్చి, చదును చేసి, నీరు పోసి కూరగాయ మొక్కలు నాటి, పండించి, అమ్మి వచ్చిన డబ్బులని అందరిని పంచుకోమన్నాడు. చెయ్యవలసిన పని చెయ్యకుండా, అతి తక్కువ పని చేసి, డబ్బులు సంపాదించి మునిసిపాలిటికి చెప్పకుండా పంచుకోమంటున్న ఛైర్మన్ ని ఆశ్చర్యంతో చూసి అప్రయత్నంగా ‘నిజమా?’ అన్నాడు.

‘నిజంగానే’ అన్నాడు కోటీశ్వర్రావు.
సూపర్ వైజర్ ‘సరే సార్’ అని వినయంగా వెళ్ళిపోతాడు.

తరవాత ప్యూన్ ని పిలిచి ఒక రిక్షాని తెమ్మని చెప్పాడు కోటీశ్వర్రావు. రిక్షాలో ఓ మైకు పెట్టించి, ప్యూన్ ని ఒక కాగితం ఇచ్చి “ఇందులో రాసింది రాసినట్లుగా ప్రతీ వీధిలో చదువు” అని చెప్పాడు.

“ఇందు మూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా, రేపటి నుంచి ప్రతీ రోజు ఉదయం ఊరికి ఉత్తరంగా ఉన్న సంత తోట ప్రక్కనున్న బంజరు దగ్గరకి బండెడు చెత్త తెచ్చి అప్పగించిన ప్రతీవారికి, బండి ఒక్కంటికి వంద రూపాయలు చొప్పున ఇప్పించబడును”.

ఆ ప్రకటన విన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. రాజకీయ నాయకులకి ఇదో పిచ్చి పనిలా అనిపించింది. అధికారులకి అంతరార్థం అర్థం కాలేదు. అందరు ఛైర్మన్ ‘నాలుగు డబ్బులు’ చేసుకోందికి పన్నిన పన్నాగం అని అనుకున్నారు. పోనీలే ‘కొత్తవాడు’ అని ఊరుకున్నారు.

మర్నాడు ఉదయం ఆరింటికి ఛైర్మన్ ఒక గుమస్తా ఊరికి ఉత్తరంగా ఉన్న సంత తోట ప్రక్కనున్న బంజరు దగ్గర బల్లా కుర్చీ వేసుకుని కూర్చున్నారు. చెత్త నింపుకుని వచ్చిన బళ్ళ వాళ్ళకి డబ్బులివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రోడ్లు తుడిచే వారు ఊర్లో వీధుల్లో ఉన్న టీ కొట్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి బదులు ఎప్పటినుండో పడి ఉన్న చెత్త కుప్పలని, కాల్చి, చదునుచేసి, నీరు పోసి తరవాత, కూరగాయ మొక్కలు నాటి, పండించే పనిలో ఉన్నారు.

చెత్త నింపుకుని వచ్చిన పాతిక బళ్ళు బారు తీరి ఉన్నాయి. ముందు ప్రకటించినట్లే డబ్బులిచ్చారు. ఒక నెల రోజులలో రోజు వచ్చే బళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఊరిలో చెత్త మచ్చుకైనా కనిపించదు. ప్రతి ఇంటివాళ్ళు చెత్త రోడ్డు మీద పొయ్యడం లేదు. ఇంట్లోనే ఓ డబ్బాలో పోసి, దాచి ఉంచి, ఆ డబ్బా నిండగానే డబ్బా ఒక్కంటికి రూపాయి ఇచ్చి మరీ చెత్త తీసుకువెళ్ళే బండివాడికి ఇస్తున్నారు. ఈ కొత్తరకం చెత్త వ్యాపారంతో కొద్దిమందికి జీవనోపాధి కలిగింది. ఆరునెలల తరవాత ఈ వ్యాపారం చెయ్యడానికి ముందుకు వచ్చినవాళ్ళకి ఆ ఊరిలో చెత్తకు కరువొచ్చింది.



1 వ్యాఖ్యలు:

Anonymous said...

vow very good solution! Perhaps it needs to be shared with Muncipal chairmen of diffenrent muncipalities. I wish there will be at least one chariman like koteswar rao....

ramadevi godugula