Friday, May 15, 2009

పిలుపు

Friday, May 15, 2009
అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులను ఎంతో నిపుణతతో నివారించి చావు నిశ్చయం అని అనుకొన్న రోగుల రాతలు మార్చి చిర్నవ్వుతో బ్రతుకు అందించే గుండెజబ్బుల నిపుణుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన డాక్టర్ రావుకి సన్మాన సభ అది. ఆ రోజు షికాగొ మహానగరంలో ఎందరో ప్రముఖులు హాజరైన అతి ముఖ్యమైన విందు మరియు సన్మాన సభ అది. డాక్టర్ రావు వైద్యంతో ఐదేళ్ళకు పైగా హాయిగా జీవిస్తున్న ఒక వెయ్యిమంది ప్రపంచం నలుమూలల నుండి వచ్చి తలొక వెయ్యిడాలర్లు ఇచ్చి హాజరైన ఫండ్ రైజింగ్ డిన్నరు అది. డాక్టర్ రావుని వైద్యునిగా మరో ఉన్నత సోపానంపై నిలబెట్టే సభ అది.

అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నేన్సీ డికీ ముఖ్య అతిథి. భారతదేశ ప్రతినిథి, షికాగో నగర మేయర్, వివిధ రంగాలలో పేరు పొందిన వ్యక్తులు వక్తలుగా డాక్టర్ రావుని ప్రశంసించారు. పుష్పగుచ్ఛాలు అందించారు.

‘డాక్టర్ రావు రోగిపై పెట్టే ఖర్చుకు రెట్టింపు ఆరోగ్యాన్ని అందిస్తారు’ అని ఒక ఆరోగ్యభీమా పథకాలను అమలుపరిచే సంస్థ కొత్త నినాదాన్ని డాక్టర్ రావు గౌరవార్థం ఆరోజే తమ వ్యాపార ప్రకటనలో విడుదల చేసింది.

వృత్తిపరిమైన గౌరవాలను ఎన్నో అందుకున్న డాక్టర్ రావుకు ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజు. అమెరికాలో వైద్యపరమైన గౌరవాలలో ఆఖరి మెట్టు అని అనిపించే మెట్టు ఎక్కిన రోజు అది. విరాళాల రూపంలో వచ్చిన మిలియన్ (పదిలక్షలు) డాలర్లతో ఏర్పరచబోయే ‘కంప్యూటర్ కంట్రోల్డ్ కంప్లీట్ కార్డియాక్ కేర్ సెంటర్’ డైరెక్టర్ గా డాక్టర్ రావుని నియమించినట్లు ఆయన పనిచేస్తున్న మెడికల్ సెంటర్ ప్రసిడెంటు డాక్టర్ గార్బర్ ప్రకటించారు.

వేదిక మీద కూర్చొని ఉన్న ఆయన ఆలోచనలన్నీ ఏర్పరచబోయే ‘కంప్యూటర్ కంట్రోల్డ్ కంప్లీట్ కార్డియాక్ కేర్ సెంటర్’ మీదే ఉన్నాయి. రోగికి ఏ మందు ఇచ్చినా, ఆ ముందు దాని ముఖ్యమైన చర్యతో పాటు శరీరంలో జరిగే ఎన్నో జీవ రసాయనిక చర్యలపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావాలన్నింటి సామూహిక ఫలితమే రోగి పరిస్థితిని నిర్దేశిస్తుంది. మనిషి మనిషికి ఉండే సహజ జన్యుసంబంధ (జనెటిక్) భేదాల వలన మందు పనిచేసే వేగంలో, తీరులో మార్పులు ఉంటాయి. ప్రతి మందు యొక్క వివిధ చర్యలని, ఆ మందు తీసుకున్న రోగి యొక్క రక్త, శ్వాస పరీక్షల ద్వారా నిర్ణయించి, ప్రతీ గుండె జబ్బు రోగికి ఏ మందు ఏ మోతాదులో వాడాలి అన్న విషయాన్ని నిర్ణయించడంలో మానవ సంబంధమైన తప్పులు జరగని విధానంలో కంప్యూటర్ ద్వారా రోగులకు నిర్ణయించే పరిశోధన కేంద్రం అది కాబోతుంది. ఈ ఉద్దేశాలతో వివిధ రంగాలకు చెందిన నిపుణలతో కలిసి పనిచేసి గత కొద్ది సంవత్సరాలలో డాక్టర్ రావు గుండె జబ్బుల రోగుల వైద్యంలో గొప్ప ఫలితాలను పొందాడు. ఏళ్ళ తరబడి మందులు తీసుకోవలసిన కొన్ని రకాల గుండె జబ్బుల వాళ్ళకి, అప్పుడే గుండె జబ్బు వచ్చిన వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. తమ కార్డియాక్ కేర్ సెంటర్ ప్రపంచంలో అత్యంత అధునాతనమైన గుండె జబ్బుల నివారణ కేంద్రంగా రూపొందించాలన్నది ఆయన ధ్యేయం.

తన చుట్టూ ఉన్న వాతావరణంలో సంబంధం లేకుండా తన ధ్యేయం పైనే ప్రతి నిమిషాన్నీ వెచ్చించి ఫలితాలను పొందే ఏకాగ్రతే డాక్టర్ రావుని ఈ రోజు ఈ మెట్టుపై నిలబడేలా చేసింది.

* * *

డాక్టర్ రావు పుట్టుక వలన తెలుగువాడు. మొట్టమొదట తెలుగు పలుకులు పలికిన వాడు. తెలుగు నేలపై పెరిగినవాడు. పరుగెత్తిన వాడు. తెలుగు చదువుకున్నవాడు, అక్కడే తెలివి పెంచుకున్న వాడు. ఆంధ్రా మెడికల్ కాలేజ్ లో చదువుకున్నవాడు. తనకు తెలియకుండానే తాను పుట్టిన నాటినుండి తెలుగుతనాన్ని తన నిండా నింపుకున్నవాడు.
కాని, అమెరికా గడ్డపై అడుగు పెట్టినప్పటినుండో, అంతకు ముందు నుండో ఆయన అలా అనుకోలేదు. అయినా ఆయన అమెరికాలో ఉన్నత స్థానాలను అందుకుంటున్న ప్రతీ మారు, అమెరికాలో తెలుగువారు, ఆంధ్రాలో తెలుగువారు ఆయనను తెలుగువాడు అని అనుకున్నారు.

గత ముప్ఫై ఏళ్ళలో అప్పుడప్పుడు ఆంధ్రా వెళ్ళినప్పుడు, తెలుగుమాత్రమే వచ్చిన వాళ్ళు తారసపడి మాట్లాడక తప్పనప్పుడు, తల్లితో మాట్లాడేటప్పుడు మాత్రమే ఆయన తెలుగు మాట్లాడుతారు. అదీ ఎప్పుడో తెలుగు మరచిపోయిన వాడిలాగో, అప్పుడే తెలుగు నేర్చుకున్న వాడిలాగో మాత్రమే.

వివిధ దేశాలనుండి తన దగ్గరకు వైద్యానికి వచ్చే వారిని, వారి వారి మతృభాషలో ‘మీ పేరేమిటి?’ ‘ఎలా ఉన్నారు?’, ‘కుశలమా?’, వంటి చిన్న చిన్న ప్రశ్నలు వేయడానికి ఎంతో కృషి చేసాడు. ప్రస్తుతం వారు సుమారు ముప్ఫై ఐదు భాషలలో రోగులను పలుకరించగలరు. ఆయనకు జరిగిన సన్మాన సభలో ‘డాక్టర్ రావుకు శుభాకాంక్షలు’ అన్న పదాల తోరణాలు ఏభై రెండు భాషలలో, తెలుగులో తప్ప, ఆ సభ నాలుగు గోడలపైన అమర్చబడి ఉన్నట్లు గమనించి ఆయన చాలా సంతోషించారు.

* * *

సన్మానసభ, విందు పూర్తి అయి డాక్టర్ రావు ఇల్లు చేరేసరికి పదకొండు గంటలైంది. పర్వతాలు ఎక్కేవాళ్ళు, సముద్రాల లోతులు శోధించే వాళ్ళు, ఎడారులు దాటే వాళ్ళు గమ్యం చేరిన తరువాత తాము సాధించిన విజయానికి సంతోషపడడానికి కూడా శక్తి లేనంతగా శారీరకంగా అలసిపోతుంటారు. ఇప్పుడు డాక్టర్ రావు కూడా అంతే అలసిపోయారు. కాని శారీరకంగా కాదు, మానసికంగా.

పిల్లల్ని యూరోప్ వెకేషన్ కోసం ఎయిర్ పోర్టులో దింపడానికి వెళ్ళడం వల్ల సన్మాన సభకు రాలేకపోయిన ఆయన భార్య ఇల్లు చేరగానే ఎదురొచ్చింది. కొద్ది నిమిషాల ముందు ఇండియా నుండి ఫోను ద్వారా తెలుగులో వచ్చిన వార్తను ఇంగ్లీషులోకి అనువదించి చెప్పింది.

కొద్ది రోజులుగా జ్వరంతో మంచాన పడి ఉన్న డాక్టర్ రావుగారి తల్లి మరణవార్త అది. వినగానే పెనుగాలికి రెపరెపలాడే చిరు దీపంలా మనిషి అమాంతం ఊగిపోయి, ఆఖరి గొడ్డలి దెబ్బకి, పెద్ద చప్పుడుతో క్రింద పడే చెట్టులా “అమ్మా!” అంటూ క్రిందపడ్డాడు. అతని భార్య పట్టుకోబోయే వృధా ప్రయత్నం చేసింది. వెంటనే ఎమర్జన్సీ నెంబరు 911 కి ఫోను చేసింది. డాక్టర్ రావు స్పృహలో లేడు. ఐదు నిమిషాలలో వచ్చిన ఎంబులెన్సులో ఎమర్జన్సీ రూమ్ కు చేరింది భర్తతో. అక్కడ దిగగానే వచ్చీరాని స్పృహలో “అమ్మా... గంగమ్మా, గౌరమ్మా, అమ్మా...” అని పిలుపు అందుకున్న వాళ్ళని పిలిచినట్లు గట్టిగా పిలిచి మళ్ళీ స్పృహ తప్పిపోయాడు.

డాక్టర్ రావు, డాక్టర్ రావు అవ్వకముందు ‘బాబు’ అని ముద్దుగా అందరి చేత పిలవబడే వాడు. బాబు చూపులో చురుకుగా, చదువులో ముందుగా ఉండేవాడు. హైస్కూలు చదువు పూర్తి అయిన తరువాత జరిగిన పరీక్షలలో ప్రప్రథముడిగా ఉత్తీర్ణుడై ఇంటికి వచ్చిన రోజు అందరూ బాబు ఉజ్వలమైన భవిష్యత్తు కలవాడని, పై చదువులకు వెళ్ళాలని అనుకొన్నారు. ఆరోజు సాయంత్రం ఇంటి ముందర వసారాలో బాబు తండ్రి వాలు కుర్చీలో, తల్లి గడప దగ్గర తల్లికి ఆనుకుని బాబు, ఇంటికి వచ్చిన మాష్టర్లు ముగ్గురు కుర్చీలలో, తండ్రి ఆఫీసులో పనిచేసే తోటి ఉద్యోగస్తులు ఇద్దరు గోడకు ఆనుకుని ఉన్న బల్ల మీద కూర్చొన్నారు. ఆ ఇంటి పాలికాపు రావులు, పురుళ్ళ గంగమ్మ స్తంభానికి ఆనుకుని క్రింద కూర్చొని ఉన్నారు.

వాళ్ళందరు ఆలోచిస్తున్నది ఒకే విషయం – బాబుని ఏ పై చదువులో చేర్పించాలని.

ప్రతి ఏడాది ఆ ఏడాదికి కావలసిన పుస్తకాలను ముందుగా కొనిపించుకోవడం, కొన్ననాటి నుండి పెరటి వసారాలో కూర్చోని, మొదట పేజి నుండి చివరి పేజి దాకా గట్టిగా అందరికీ వినబడేలా చదవడం, స్కూలుకు సక్రమంగా వెళ్ళడం, తరగతిలో మాష్టర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినడం, పరీక్షలలో అన్ని ప్రశ్నలకి పూర్తిగా సమాధానాలు వ్రాయడం, తప్పకుండా క్లాసులో మొదటి మూడు స్థానాలలో మాత్రమే పాస్ అవుతు ఉండడం తప్ప, బాబు ఏ కోర్సు చదవాలి, భవిష్యత్తులో ఏ ఉద్యోగం చెయ్యాలిలాంటి విషయాలు ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించడం లేదు. కానీ అన్నీ వింటున్నాడు.

ఒకరు ఇంజనీర్ అని, మరొకరు డాక్టర్ అని, ఇంకొకరు టీచర్ అని, ఒకటేమిటి కలక్టర్ అవ్వాలని, మిలట్రీకి వెళితే బావుంటుందని, ఎవరికి తోచింది వారంటున్నారు. తండ్రి, లెక్కల మాష్టారు ఏది ఎందుకు మంచిదికాదో, ఎందుకు వీలుపడదో వివరిస్తున్నారు. ఈ చర్చలో వెనక్కీ ముందుకీ వెళుతున్నారు. మిగిలిన అన్ని రకాల చదువుల కంటే డాక్టరా? ఇంజనీరా? అన్న విషయంపై చర్చ ఎక్కువగా సాగింది.

“నాను నాలుగు పుష్కరాల నుండి పురుళ్ళు పోస్తన్నాను. నాకు తెలిసిన వోయిద్యం, నాటు వోయిద్యం అనండి మరోటనండి, నా అనుభవం అంతా తిరగదోడి సూస్తే, సచ్చిపోయిన పిల్లలంతా సరైన టయానికి సరైన వోయిద్యం అందకే సచ్చిపోయారని నా నమ్మకం. బాబు డాట్రీ సదవాల. మనూరు రావాల. ఈ గంగమ్మ సచ్చిపోయేలోగా నాను బతికించలేని పురిటి బిడ్డని బతికించాల. అప్పుడు నాను సుఖంగా సస్తాను. నేకుంటే, సచ్చేటప్పుడు కూడా ఈ బాధ నన్నొగ్గదు. ఏటంటారు?” అంది పురుళ్ళ గంగమ్మ. ఎవ్వరు ఏమనలేదు.

* * *

బాబు మెడిసిన్ లో చేరాడు.

మెడికల్ కాలేజిలో తెల్లకోటు వేసుకు తిరగడం, మానవ శరీరం గురించి ప్రొఫెసర్ లు చెప్పే పాఠాలు వినడం డాక్టరైపోయినట్లు ఊహించుకోవడం, కొత్త కొత్త స్నేహాలు బాబుని వేరే లోకాల్లో విహరింపజేసాయి. డాక్టర్ చదువే చాలా గొప్పది. తనకు తగినది అని అనుకున్నాడు. అటువంటప్పుడు బాబుకు గంగమ్మ గుర్తుకు వచ్చేది ఒక్క క్షణం పాటు. శలవలకు ఇంటికి వచ్చినప్పుడు, గంగమ్మ తనతో పాటు పురుళ్ళకు బాబుని రమ్మంది. కానీ తానింకా చాలా చదవాలని చెప్పాడు.

రెండవ సంవత్సరం దశరా శలవలకు బాబు ఇంటికి వచ్చాడని తెలిసి జ్వరంతో ఉన్న గంగమ్మ బాబుని చూడడానికి వచ్చింది. ముందు వసారా అరుగు మీద చతికిలపడి,

“బాబు” అని పిలిచింది. ఎంతో మంది పిల్లల ‘తొలి కేక’లను, వైద్య సహాయం అందక పసిపిల్లలు వేసే ‘ఆఖరి కేక’ లను విన్న పురుళ్ళ గంగమ్మ, తాను విన్న కేకలన్నింటిని ఈ ఒక్క కేకలోనే వినిపించిందా అని అనిపించేలా పిలిచింది. మరింక కదల లేమన్న ఎన్నో కళ్ళ చూపులకు సాక్షి అయిన గంగమ్మ పరుగెత్తుకుని వచ్చిన బాబుని చూసి, దగ్గరకు రమ్మని పిలిచి,

“చలి జ్వరం మూడోసారి వచ్చింది. మరో పాలొస్తే మరింక బతకను. కాని బాబు నువ్వు పెద్ద డాట్రై, ఒక్క సుట్టు బేగి రా బాబు, బేగి రా. మొదటె చలి జ్వరం రాకుండా చూసే మందు ఒట్టుకు రా బాబు. మనూరు రా బాబు”. అంది.
జ్వరంతో కాలిపోతున్న ఆమె చెయ్యిని విడిపించుకోగలిగేడే కాని ఆమె మాటలు అతని మెదడులో నాటుకు పోయాయి. అలా మాట తీసుకున్న గంగమ్మ ఎన్నో నెలలుగా వచ్చి పోతున్న మలేరియా జ్వరంతో చనిపోయింది. ఉత్తి మలేరియా జ్వరంతోనే చనిపోయింది అని తెలిసి చాలా ఆశ్చర్యపోయాడు బాబు.

మెడిసిన్ ప్రొఫెసర్ ని కలసి ఈ విషయం గురించి అడిగాడు.

“ఇదేమంత ఆశ్చర్యపడవలసిన విషయం కాదు, మనదేశంలో, మన దేశం వంటి బీద దేశాలలో ఉత్తి మలేరియా జ్వరంతోనే మనుషులు చనిపోవచ్చు” అన్నారు.

ఆయన అది అతి సామాన్యమైన విషయం అన్నట్లు.

“కానీ పుస్తకాలలో డాక్టర్ రోనాల్డ్ రాస్, మనదేశంలో పరిశోధనలు చేసి, మలేరియా క్రిమి జీవితచక్రం కనుగొన్నారని, ఈ క్రిమిని వ్యాపింపజేసే దోమలని డి.డి.టి ద్వారా నశింప చేయవచ్చని, శరీరంలో ప్రవేశించిన మలేరియాని క్లోరోక్విన్, ప్రైమాక్విన్ మాత్రలు తీసుకుంటే అరికట్టవచ్చునని చదివానే...”

“నిజమే. ఇంకా డాక్టర్ రాస్ పేరు మీద హైదరాబాదులో బేగంపేట్ విమానశ్రయం దగ్గర ఓ సంస్థ కూడా ఉంది. మనదేశంలో మలేరియా పరిశోధన సంస్థలు చాలా ఉన్నాయి. అయినా మనదేశంలో మలేరియా ఇంకా ఎక్కువగానే ఉంది.” అని వేదాంతిలా నవ్వి, ఇంక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్లు చూసారు.

“ప్రజల అశ్రద్ధ. మలేరియా జ్వరానికి కారణమైన క్రిములని వ్యాపింప జేసే దోమలు పెరగడానికి అనువైన మురికి నీటిని, మురికి నీటి కాలువలని ఇంట బయట శుభ్రపరచక అశ్రద్ధతో వదిలివేయడం. దీనికి ఎవరి ఖర్మ వారిదని అనుకోవాలి.
ప్రభుత్వాలు, బడుగు దేశాలలోని శాస్త్రజ్ఞులు చూపించే దారుణమైన నిర్లక్ష్యం అతి ముఖ్యమైన కారణం అని గుర్తుంచుకో.” నిష్కర్షగా అన్నారు. సామాజిక ఆరోగ్య విషయాలపై పాఠాలు చెప్పే యస్. పి. యమ్. ప్రొఫెసర్.

“మలేరియా క్రిమి రకరకాల బాహ్య స్థితులలో వేర్వేరు శరీర భాగాలలో నివాసం ఏర్పాటు చేసుకుంటూ, వివిధ రకాల బాహ్య కవచ ప్రొటీన్లని ఉత్పత్తి చేస్తూ, అందుబాటులో ఉన్న మందులకు, పరిశోధనలలో ఉన్న వేక్సిన్లకు లొంగకుండా జీవించగలగడం మనం మలేరియా అరికట్ట లేకపోవడానికి శాస్త్రీయ కారణాలు” అన్నారు బయోకెమిష్ట్రీ ప్రొఫెసర్ నిస్సహాయాన్ని వెలిబుచ్చుతూ.

ఎప్పుడు ప్రయోగశాలలో ఉంటూ వైద్య పరిశోధనలపై ఎక్కువ ఆశక్తి కనబరిచే ఫిజియాలజీ ప్రొఫెసర్ ని అడిగితే ముఖ్యమైన ఇంకో కారణం వివరించారు.

“ఎన్నో కారణాల వల్ల మలేరియా క్రిమి ప్రబలి పోతున్నది. బడుగు దేశాలలో లక్షల కొద్ది ప్రజలను ప్రతి ఏడాది చంపుతున్న ఏకైక ఏకకణ జీవి మలేరియా క్రిమి. నువ్వు రోజు లైబ్రరీలో మలేరియాపై, దోమల గురించి ఉన్న పుస్తకాలు చదువు. సులభంగా, అతి తక్కువ ఖర్చుతో మలేరియాని లేదా, మలేరియాని వ్యాపింపజేసే దోమలనే నివారించగల మార్గాలని అన్వేషించు.” అని సలహా ఇచ్చారు.

ఆ సలహా ప్రకారం బాబు రోజు ఒకటి, రెండు గంటలు మలేరియా గురించి శ్రద్ధగా చదివేవాడు. మలేరియా క్రిమి కంటికి కనిపించనంత చిన్నదైన ఏకకణ జీవి, అయినా కోటాను కోట్ల కణాలు కలిగిన మనిషి కంటే ఎక్కువ శక్తివంతమైనది ఎలా కాగలదు? కాలేదు. కాని ఈ క్రిమిని అరికట్ట లేకపోవడానికి కారణం మన అశ్రద్ధే అని అనుకొన్నాడు బాబు. చదివిన కొద్ది ఈ క్రిమిని అరికట్టడానికి కావలసిన ఎన్నో అవకాశాలు ఉన్నా, అరికట్ట లేకపోతున్నామంటే అది ప్రజల ప్రభుత్వం అశ్రద్ధ మాత్రమే అని అనుకొన్నాడు. రోగులు ఉన్న ఒకే ఒక్క శక్తివంతమైన మందు క్లోరోక్విన్ సవ్యంగా వాడక ఈ మందుకు లొంగని మలేరియా క్రిముల ఉత్పత్తికి దోహదం చేశారన్న విషయం గ్రహించి మరింత ఆందోళన, బాధపడ్డాడు. దోమలని అరికట్టడానికి, మరింత శక్తివంతంగా, సులభంగా పనిచేసే మందులు పరిశోధనల ద్వారా కనుక్కోవాలని అనుకొన్నాడు. ఈ సమయంలోనే రమణ అనే తోటి విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలసి చదవడం, చర్చించుకోవడం చేస్తుండేవారు.

తాము చదివినవి ప్రొఫెసర్లతో చర్చిస్తే, ముందు చదువు పూర్తి చేసి, వైద్య పరిశోధనలు జరిపే సంస్థలలో చేరి పరిశోధనలు చేయమని సలహా ఇచ్చారు. బాబుని మంచి విద్యార్థిగా అందరు గుర్తించారు.

* * *

సంవత్సరాలు గడిచాయి. మెడిసన్ పూర్తి అయ్యింది. హౌసర్జన్సీ చేస్తున్నప్పుడు రమణతో కలసి ఢిల్లీ వెళ్ళాడు. ఇద్దరు అక్కడ ఉన్న మలేరియా రిసెర్చి సెంటర్ కి వెళ్ళి డైరెక్టర్ డాక్టర్ శర్మను కలసి మాట్లాడారు. ఆయన వ్రాసిన పేపర్లు, పుస్తకాలు కొన్ని ఇచ్చి, ఇక్కడ ఇంతకన్నా ఇంకేం చెయ్యలేం, కానీ విదేశాలలో పరిశోధనలకు మంచి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి, ఒక మంచి టీ ఇప్పించి పంపించారు. తిరిగి వస్తున్నప్పుడు రైల్లో “అంత పెద్ద పరిశోధనా సంస్థ డైరెక్టరే ఇలా మాట్లాడితే మలేరియా తగ్గదు సరికదా, ఇంకా పెరుగుతుంది.” అన్నాడు బాబు రమణతో.

హౌసర్జన్సీ కూడా పూర్తి అయ్యింది. తనలాంటి చాలా మంది ప్రతిభావంతులైన వైద్యులవలే బాబు కూడా అమెరికా వచ్చాడు. రెసిడెన్సీ చేసాడు. మేధావిగా పరిగణించబడ్డాడు. ప్రముఖ వైద్య కేంద్రంలో ఆ రోజుల్లో అమెరికాలో అత్యంత ప్రాముఖ్యం ఉన్న గుండె జబ్బుల (కార్డియాలజి) విభాగంలో ప్రవేశించాడు. పాశ్చాత్య దేశాలలో అతి ఎక్కువ మరణాలకు మూలకారణమైన గుండె జబ్బుల పరిశోధన వైపు ఆకర్షించబడ్డాడు. అందులో పరిశోధనలు జరపడం ప్రారంభించాడు. లైబర్రీలో అప్పుడప్పుడు మలేరియా పరిశోధనలకు సంబంధించిన విశేషాలు తారసపడినప్పుడు చదివేవాడు. వీటిలో చాలా ఎక్కువ భాగం మలేరియా ఎక్కువగా లేని దేశాల పరిశోధకులవే అని గ్రహించి మలేరియా బాధ ఎక్కువగా ఉన్న దేశాల పరిశోధకులపై చికాకు పడుతూ ఉండేవాడు.

* * *

అమెరికా వచ్చిన దగ్గర నుండి పెద్దలందరు ఉత్తరాలు రాసి, రాసి, కోరగా పెళ్ళికి సిద్ధం అయి ఇండియా వచ్చాడు. పద్ధతి ప్రకారం పెళ్ళి చూపులు, ముహుర్తాలు అన్నీ సవ్యంగా జరిగాయి.

పెళ్ళిరోజు ముత్తైదువులు-తల్లి, పిన్నులు, అత్తయ్యలు తమ చేతులతో బాబు వంటికి నలుగు పెట్టి రుద్దుతు ఉంటే, బాబు మెదడు పొరలలో ఎక్కడో దాగి ఉన్న ఒక ‘స్పర్శ’ యొక్క జ్ఞాపకం ఉప్పెనలా బాబు వళ్ళంతా చుట్టుముట్టింది. బాబు వళ్ళంతా గగుర్పొడిచింది.

అర్థరాత్రి ఉన్నట్టుండి ఒక్కసారి సూర్యోదయం అయినట్టయింది.

కళ్ళు గట్టిగా మూసుకొని తెరిచాడు. ఎదురుగా తాను చూడాలనుకున్న ఆ ‘స్పర్శ’కు మానవ రూపం అయిన గౌరమ్మ కనపడలేదు. తల్లి, పిన్నులు, అత్తయ్యలు మాత్రమే కనపడ్డారు.

“అమ్మా గౌరమ్మ ఏది?” అని అడిగాడు.

ప్రస్తుత వాతావరణంతో, ఈ పెళ్ళితో, చుట్టు ఉన్న సంబంధాలతో సంబంధం లేని ప్రశ్న అది.

ఎన్నో ఏళ్ళ వెనుక, పురుళ్ళ గంగమ్మ అందించిన పురిటి పసికందును అందుకొని, ప్రతిరోజు వంటంతటికి తన అర చేతులతో నూనె రాసి, కావడం కాచి, నలుగు పెట్టి, వళ్లు రుద్ది, నీళ్ళు పోసే ఆ ఇంటి పనిమనిషి గౌరమ్మ. ఆ గౌరమ్మ చేతి స్పర్శ బాబుకు పదోఏటి దాకా అనుభవమే.

ఇటువంటి మంగళ సమయంలో, మంగళ స్నానం చేయించే ముందు బాబుకు గౌరమ్మ గుర్తుకు రావడం బాబు తల్లికి ముందు ఆశ్చర్యం కలిగించింది. వెంటనే చికాకు కలిగించింది. మరుక్షణంలో ముప్ఫై ఏళ్ళకు పైగా తమ ఇంటికి కనిపెట్టుకుని, ఇంటిలో భాగం అయిపోయి, ఇంటిల్లిపాదికి సేవలు చేసి ఏభైయో పడిలో తరచు వచ్చే మలేరియా జ్వరాలకు తట్టుకోలేక తనువు చాలించిన గౌరమ్మ జ్ఞాపకం ఆమెని కదిలించింది.

ఆమె మౌనంగా, నిశ్చేష్టురాలై నిలబడి ఉండిపోవడాన్ని గమనించిన మిగిలిన వాళ్ళు నలుగు పెడుతూనే ఉన్నారు.
“అమ్మా!” అని తల్లి నుండి సమాధానం ఎదురు చూస్తున్న బాబు పిలవడంతో ఆలోచనల నుండి బయటపడింది ఆమె.
“ఆమధ్య తరచు వచ్చే జ్వరాల వల్ల పోయిందిరా!” అని మౌనం మాట్లాడినట్లు మాట్లాడి, క్షణంలో మూగతనం వచ్చిన దానిలా కొడుకు మొహం చూస్తూ ఉండిపోయింది.

బాబులో మనిషి గౌరమ్మ మీద జాలి పడ్డాడు.

బాబులో డాక్టరు బాబు మీద కోపం తెచ్చుకున్నాడు.

బాబులో శాస్త్రజ్ఞుడు బాబు మీద అసహనం చూపించాడు.

బాబు మౌనంగా మిగిలి మంగళ స్నానం తంతు పూర్తి చేసుకుని, మంగళ వాయిద్యాల మధ్య, మంగళసూత్రం కట్టేడు పెళ్ళికూతురు అని పిలవబడుతున్న మంగళకి మర మనిషిలా మౌనంగా.

శోభనం గదిలో రాబోయే భార్యకోసం ఎదురుచూస్తూ, కిటికీ లోంచి పెరటిలోకి చూసాడు.

అంట్లు తోముతున్న గౌరమ్మ, అమెరికా ప్రయాణంకి సిద్ధం అవుతున్న బాబుని ‘బాబొక్కసారి పరిచ్చ చెయ్యవా? జోరంగా ఉంది.’ అని అడిగిన సంఘటన కళ్ళముందు జరిగినట్లు అనిపించింది. ఊర్లో ఉన్న తన స్నేహితుడైన డాక్టర్ని చూడమని చెపితె.

‘సరే, కాని బాబు, నువ్వు పెద్ద డాట్రవవుతావుట బాబు, ఈ పాలొచ్చినప్పుడు నాకు మంచి మందియ్యి బాబు, నువ్వే ఇయ్యాల, నిన్ను సిన్నప్పటినుండి సాకాను. నాను ముసిలైపోతున్నాను. ఈ జొరాలు రాకుండా మంచి మందిచ్చావంటే, నాలుగు కాలాలు బ్రతికి నీ పిల్లల్ని కూడా సాకుతా బాబు. మందొట్టుకుని బేగి తిరిగొచ్చీ బాబు అంది.

పెళ్ళికి వచ్చిన డాక్టర్ మిత్రులను మర్నాడు మలేరియా గురించి అడిగితే, డి.డి.టి వాడకం ఆపెయ్యడం వల్ల, ఉన్న మందులు పని చెయ్యకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల మలేరియా పెరిగిపోతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రస్తుతం ప్రభుత్వం ముందుకు వచ్చి పటిష్టమైన పథకంతో దోమలని నివారించాలి, శక్తివంతమైన మలేరియా మందులు అందించాలి ఈ రెండింటికి కావలసిన పరిశోధనలకు ప్రాముఖ్యం ఇవ్వాలి’ అన్నారు.

ఊరు వదలి పట్నం వైపు కొత్త పెళ్ళి కూతురుతో అమెరికా వెళ్ళడానికి విమానాశ్రయంవైపు కారులో వెళుతు ఉంటే, ఐదడుగుల ఎనిమిది అంగుళాల పొడవైన గౌరమ్మ, బక్కచిక్కిన శరీరంతో, కారు నల్లటి వంటిరంగుతో నెరిసీ నెరవని జుత్తుతో, మెరిసే కళ్ళతో, ముక్కుకి నత్తుతో, కాళ్ళకి వెండి కడియాలతో, ఎర్రంచు తెల్లచీరలో, ‘ఒక్క పాలి రా బాబు. బేగి రా. బేగొచ్చి నాకీ జొరం పోవడానికి మాతరొ, సూదిమందో వొట్టుకుని రా బాబు!’ అని దీనంగా అంటు వెంట వస్తున్నట్లు కిటికీ అద్దంలోంచి కనిపించింది.

అమెరికా చేరిన వెంటనే మలేరియా పరిశోధనల గురించి ఆలోచించాలని పదే పదే అనుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు.

* * *

ఏళ్ళు గడిచిపోయాయి. డాక్టర్ రావ్ కి బాబు గుర్తురావడం లేదు. డాక్టర్ రావ్ మాత్రమే డాక్టర్ రావ్ కి తెలసిన ‘తను’.
వలస వచ్చిన అమెరికా సమాజంలో వైద్యుడిగా ప్రతీ ఏడాదీ కొత్త మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. ఏ ప్రేరణల వల్ల వైద్య విద్యార్థి అయ్యాడో, ఏ ఉత్సాహం తనని చక్కనైన వైద్యుడిగా తీర్చి దిద్దిందో, ఏ మనుషులు అతడు గొప్ప వైద్యుడు కావాలని కోరుకొన్నారో, ఆ ప్రేరణలకు, పరిస్థితులకు, ఆ మనుషులకు అతన్ని రెట్టింపు దూరం చేసాయి అతను ఎక్కే ప్రతి మెట్టు.

ఏడాది నుండి తల్లికి జ్వరం వస్తు పోతున్నదని ఉత్తరాలు వస్తున్నాయి. ఫోను ద్వారా పరిస్థితి తెలుసుకుంటూ ఉన్నాడు. ‘ఒక్కసారి రా బాబు’ అన్న తల్లి మాటలు తానెప్పుడో మరచిపోయిన ‘బాబు’ని పిలిచినట్లు, తనని కాదన్నట్లు తన వృత్తిలో మునిగిపోయాడు.

వృత్తి, దాంతో వచ్చి సమాజంలోని మిగిలిన హంగులు, గౌరవాలు, ఆహ్వానాలు, డిన్నర్లు ఇక్కడ అక్కడ రాజకీయ నాయకులతో పరిచయాలు, మిత్రులకు, సన్నిహితులకు ఇండియాలో ప్రైవేటు, గవర్నమెంటు కాంట్రాక్టులు, కాంట్రాక్టులు ఏర్పాటు చేయ్యడానికి, వచ్చిపోయే కళాకారులకు, సినిమా నటులకు, ప్రముఖ వ్యాపారస్థులకు, రాజకీయ నాయకులకు విశాలమైన తన భవనంలో విందులు ఇవ్వడంలో గురించి మరిచిపోయాడు.

* * *

ఆగష్టు 27వ తారీఖు, 1998 ‘ఈనాడు’ దినపత్రికలో మలేరియా పై వచ్చిన వ్యాసాన్ని పంపిస్తూ ఉత్తరం రాసాడు ఇండియా నుండి మెడికల్ కాలేజి నాటి మిత్రుడు డాక్టర్ రమణ. తాను అప్పుడు రైలులో అన్నట్లు మలేరియా పెరిగి పోతున్నదని, ప్రభుత్వం వెంటనే గట్టి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి విషమించి రాష్ట్రం అంతటా కూడా మలేరియా వల్ల ఆరోగ్యపరమైన రెడ్ ఎలర్ట్ పెట్టవలసి వస్తుందని రాసాడు. కొద్ది రోజులలో తమ అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మీ ఊరికి వస్తున్నారని, వీలుచేసుకుని, ఆయన్ని కలసి ప్రముఖ వైద్యుడిగా మలేరియా తీవ్రత గురించి, అధునాతన పరిశోధనలలో మలేరియాని తగ్గించడానికి కాని, దోమలని అరికట్టే విధానాలని గురించి మాట్లాడమని దీని వలన ఏ చిన్న ఉపయోగకరమైన పని జరిగినా అది లక్షల మందికి ఉపయోగపడుతుందని ఆ ఉత్తరం సారాంశం.

మిత్రుడు రమణ రాసిన ఉత్తరం, ‘ఈనాడు’లోని వ్యాసం చదివి ప్రస్తుతం మలేరియా ఇంత ఎక్కువైపోయిందా అని ఆశ్చర్యపడ్డాడు.

మర్నాడు తన దగ్గర పనిచేసే డాక్టర్ మిల్లర్ని పిలిచి రెండు రోజులలో మలేరియా, దానికి సంబంధించిన ప్రస్తుత పరిశోధనలు గురించిన వివరాలు అన్నీ సేకరించి తనకు ఇమ్మని కోరాడు.

అతడు ఇచ్చిన వివరాలు చదివి, ప్రపంచం మొత్తంలో సుమారు 30-50 కోట్ల మంది మలేరియా పాలబడుతున్నారని, ఇండియా గురించిన సమాచారం పూర్తిగా అందకపోయినా, ఇండియాలో సుమారుగా కొన్ని కోట్ల మంది మలేరియా పాలబడుతున్నారని, మలేరియా వల్ల ప్రతీ ఏడాది సుమారు 15.27 లక్షల మంది మరణిస్తున్నారని, ఇందులో సగం మంది 5 ఏళ్ళలోపల పిల్లలే. ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1998లో ప్రకటించిన వివరాలు. ఏడాదిలో పది రోజుల పాటు జ్వరం వల్ల పని జరిగింది అని అనుకున్నా, జ్వరం వల్ల పని మానేసిన పెద్దల వల్ల ఎన్నో కోట్ల పని దినాల నష్టం. ఈ విధంగా ప్రతి ఏట దేశానికి ఎన్నో వేల కోట్ల రూపాయల నష్టం. మనిషి బ్రతుకుకు విలువ కట్టడం ప్రభుత్వాలకు రాకపోయినా, ఒకే ఒక్క కణజీవి వల్ల భారత దేశానికి మాత్రమే ప్రతి ఏడాదీ కోట్ల రూపాయల నష్టం. అంటే కొన్ని వందల మిలియన్ల డాలర్లు. ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చెయ్యగలదు ఈ లెఖ్ఖలకి ఫైలేరియా వంటి దోమల వలన వచ్చే ఇతర జబ్బులని కూడా చేరిస్తే అసలు దోమలని నశింపజేయడమే ముఖ్యం అనిపిస్తుంది.

అమెరికాలో, 1950లలో, 1992లో లిబియాలో స్క్రూవర్మ్ ఫ్లైని పూర్తిగా నశింపజేసిన పద్ధతిని కూడా చేర్చాడు. డాక్టర్ మిల్లర్ మలేరియా ఫైలులో, దానికి పెట్టిన ఖర్చు సుమారు 117 మిలియన్ డాలర్లు. డాలర్లలో భారతదేశం మాత్రమే ప్రతి ఏడాది నష్టపోతు ఉండవచ్చు. వందలకొద్ది మిలియన్ డాలర్లు అని ఆశ్చర్యపడి, ముఖ్యమంత్రిని కలసి ఈ విషయం వివరిస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటారని ఆ ఫైలు మొత్తాన్ని తన ముఖ్యమైన కాగితాలతో పాటు పెట్టుకున్నాడు.

డాక్టర్ రావు ముఖ్యమంత్రిని కలిశాడు. విందులకు వెళ్ళారు, కానీ మలేరియా గురించి మాట్లాడలేదు గత రెండు నెలలుగా కొద్దిమంది తెలుగు వైద్యులు కలిసి ఆంధ్రాలో పెట్టబోయే అధునాతన గుండెజబ్బుల కేంద్రానికి డాక్టర్ రావుని చీఫ్ ఎడ్వైజర్ గా ఉండమని కోరారు. ఆ కారణం వల్ల తాము పెట్టబోయే అధునాతన గుండె జబ్బుల కేంద్రం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రముఖ గుండె జబ్బుల నిపుణుడిగా మాట్లాడాడు. అది జరిగిన కొద్ది రోజులకే ఆంధ్రాలో పెట్టబోయే అధునాతన ‘కేన్సర్’ సంస్థలో ప్రముఖ సభ్యుడిగా కూడా ప్రకటింపబడ్డాడు.

వైద్యునిగా డాక్టర్ రావు తన దేశానికి ఎంతో సేవ చేస్తున్నాడని అమెరికాలో వెలువడే భారతీయ పత్రికలు, ఆంధ్రాలో వెలువడే తెలుగు పత్రికలు పొగుడుతూ వ్యాసాలు వ్రాసాయి.

‘ఒక్క సుట్టు బేగి రా బాబు, బేగి రా’ అని ఇప్పుడు పురుళ్ళ గంగమ్మ పిలుస్తున్నట్లు అనిపించింది షికాగో హస్పెటల్ బెడ్ పై వైద్యం అపస్మారక స్థితిలో ఉన్న డాక్టర్ రావుకు –

‘ఒక్క పాలి రా బాబు, ఒక్క పాలి రా’ అని గౌరమ్మ పిలుస్తున్నట్లు అనిపించింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అత్యంత అధునాతమైన వైద్య పరికరాల సహాయంతో ప్రముఖ వైద్య బృందం ప్రత్యేక పర్యవేక్షణలో వచ్చీరానీ స్పృహలో ఉన్న బాబుకు.

‘ఒక్కసారి రా బాబు’ అని తల్లి పిలుస్తున్నట్లు అనిపించింది. మగతగా ప్రక్కకు తిరిగిన డాక్టర్ రావుకు.

* * *

కళ్ళు తెరవాలని ప్రయత్నించాడు. తెరవలేక పోయాడు. వర్షంలో చూరు నుండి క్రింద పడి కాలవ కట్టి పారుతున్న నీటిలో చిన్నప్పుడు వేసిన కాగితపు పడవ, వీధి చివర పెద్దకాలువ చేరి, ప్రవాహ వేగానికి తట్టుకోలేక, తడిసి ముద్దై, ఒడలిపోయి గిరికీలు కొడుతున్నటువంటి మానసిక స్థితిలో ఉన్న బాబు పూర్తి మెలుకువ స్థితిలోకి వచ్చి,

“అమ్మా, గంగమ్మా, గౌరమ్మా...” అని గట్టిగా అరిచినట్టు పిలిచాడు.

చుట్టు చేరిన వైద్యులు, నర్సులు అర్థంకాని చూపులతో పరిస్థితి అర్థం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఒక్కగానొక్క కొడుకుగా వెంటనే ఇండియా వెళ్ళాలి.

కంప్యూటర్ కంట్రోల్డ్ కంప్లీట్ కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ గా బాధ్యత తీసుకోవాలి.

లక్షలకొద్దీ డాలర్లు తను తలచుకున్న వైద్య పరిశోధనలపై ఖర్చు పెట్టించి మంచి ఫలితాలను పొందగలిగిన శక్తి గల అతను ఎప్పటినుండో తనని బాధిస్తు, లక్షల మందిని వేధిస్తున్న మలేరియా గురించి ఆలోచించాలి.

‘ఒక్క సుట్టు’, ‘ఒక్కపాలి’, ‘ఒక్కసారి...’ అని పిలుస్తున్న పిలుపులకి సరియైన బదులు పలుకుతాడా? లేక, “అమ్మా, గంగమ్మా, గౌరమ్మా...” అంటూ పిచ్చి వాడైపోయి మానసిక ఆరోగ్య వైద్య కేంద్రంలో ఏ ప్రేరణల వల్ల వైద్య విద్యార్థి అయ్యాడో, ఏ ఉత్సాహం చక్కనైన వైద్యుడిగా తనని తీర్చి దిద్దిందో, ఆ రెండింటిని మరచి మాములు మనిషి అవ్వడానికి మందు తీసుకొంటాడా?

డాక్టర్ రావు ఏమౌతాడు?

* * *

ఈ ప్రశ్నలకు, ఆలోచనలకు అందుబాటులో ఉండి మన అందరి మధ్య ఉన్న వందలాది డాక్టర్ రావులు, అమెరికాలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, తమకి తాము ఈ ప్రశ్నలు వేసుకుని, ఆలోచనలకు తావిస్తే, తమలోని పిలుపుకు అవకాశమిచ్చి వినిపించుకోడానికి ప్రయత్నిస్తే, వారిలోని డాక్టర్ రావు ‘బాబు’ అయితీరుతాడు, లక్షలు సంపాదించ లేకపోయినా, లక్షల మందికి ఉపయోగపడే లక్షణమైన మనిషి అవుతాడు.





0 వ్యాఖ్యలు: