Friday, May 15, 2009

సంకల్పం

Friday, May 15, 2009
“ఇప్పుడు కాకపోతే, మరెప్పుడు? మనం కాకపోతే మరెవ్వరు?”

అమెరికా దేశంలో, మిషిగన్ రాష్ట్రంలో, గేంజస్ అన్న ఊరులో ఉన్న వివేకానంద మెనాష్టరీ ఆవరణలో ఆగష్టు నెల ఆఖరు వారం కలిసిన వంద మంది భారతీయులను రెండు రోజులుగా ఆలోచింపజేస్తున్న ప్రశ్నలవి.

బ్రిటీష్ పాలన నుండి రాజకీయ స్వాతంత్ర్యం సంపాదించుకొని 50 ఏళ్ళ పైబడ్డా, ఎన్నో రకాలుగా వెనకబడి, సుమారు సగానికి సగం జనం నిరక్ష్యరాస్యతతో, కులాల కుమ్ములాటలతో, అధికార దాహంలో ప్రజాసేవ పేరుతో పదవులెక్కుతున్న రాజకీయ నాయకులతో, దిక్కుతోచక నిస్పృహతో నిలబడి ఉన్న సామాన్యుడికి ఉత్తేజం కలిగించేలాంటి ఉద్యమం కావాలి. అది ఇప్పుడు కాకపోతే, మరెప్పుడు?

ఆ దేశంలో పుట్టి, ఆదేశంలో పెరిగి, ఆదేశంలోని ఉన్నత విద్యా సౌకర్యాలని పూర్తిగా ఉపయోగించుకుని, పట్టాలు పుచ్చుకుని, విదేశం వచ్చి వివిధ రంగాలలో నిలదొక్కుకొని, కొద్దొ గొప్పొ పేరు సంపాదించుకొని, ఆదేశానికి కావలసినది చెయ్యగల స్థితిలో ఉన్న మనం కాకపోతే మరెవ్వరు?

‘ఎన్నో వనరులతో, శతాబ్ధాలుగా స్వశక్తిపై ఆధారపడి, స్వంత బుద్ధితో, విద్యా, వ్యవసాయ వ్యాపార రంగాలలో ముఖ్యమైన దేశంగా నిలబడ్డ భారతదేశం ఈనాడు ఇంత వెనకబడ్డ దేశంగా ఉండనవసరం లేదు. బాధ్యతాయుతమైన భారతీయులుగా దేశం బాగుకై మీ మీ పరిధులలో, మీ మీ శక్తి కొద్ది, మీరు చెయ్యగలిగినది చెయ్యండి’ అన్న డాక్టర్ భాగవతుల పరమేశ్వర రావు గారి పిలుపునందుకొని సమావేశమైన వాళ్ళ సామూహిక ఆలోచనల సారమిది.

అషా, ఎ.ఐ.డ, ఐ.ల్.పి. వంటి సంస్థల సభ్యులు, అమెరికా దేశంలో వివిధ రాష్ట్రాలలో డాక్టర్ పరమేశ్వరరావు గారి సభలకి వచ్చిన వారి ప్రతిభతో ఆ ప్రదేశం నిండిపోయింది. దేశం బాగుకోసం అంతమంది కలవడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఎవరి మొహంలో చూసినా ఉత్సాహం పెల్లుబుతున్నాది. అందరికి అందరు సుమారుగా కొత్తవారే. ఒకరిని ఒకరు పలకరించుకొంటు, పరిచయాలు పెంచుకుంటున్నారు. చాలామంది వయసులో చిన్నవారే, కానీ అందరు పెద్ద పెద్ద చదువులు చదివిన వారే. గుంపులు గుంపులుగా, పచ్చిక మీద కూర్చోని, చెట్ల క్రింద నిలబడి రకరకాల విషయాలని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సరిగ్గా అటువంటి సమయంలో నా దృష్టి ఒంటరిగా, అందరికి దూరంగా ఉన్న ఒకతని మీద పడింది. అతన్ని నిన్న మధ్యాహ్నం భోజనాల దగ్గర కలిసాను. ‘పేట్’ అని పరిచయం చేసుకున్నాడు. అతని పూర్తి పేరు వాయువేగుల పతంజలిట. విష్ణుభొట్ల రామన్నగారితో కలిసి వచ్చాడుట. మద్రాసు ఐ.ఐ.టిలో ఇంజనీరింగ్, తరవాత స్టేన్ ఫోర్డ్ యూనివర్సిటీలో పిహెచ్.డి. గత ఏడాదిగా న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తున్నాడట. అమెరికా వచ్చి ఐదు ఏళ్ళే అయిందిట. ఎక్కువమందితో పరిచయం చేసుకున్నట్లు లేడు. అందుకే ఒంటరిగా ఉన్నాడని దగ్గరికి వెళ్ళి పలకరించాను.
“ఏమిటి ఇలా ఒక్కరు ఉన్నారు” అన్నాను.

“మా గ్రూపు వాళ్ళు లిటరసీ పెంచడంపై డిస్కస్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం లిటరసీ పెంచడం జరగని పని అని నా ఉద్దేశ్యం” అన్నాడు.

“మరి మీ ఆలోచన ఏమిటి?” అన్నాను

“లిటరసీ పెంచాలి. ప్రస్తుతం ఉన్న 52.11 శాతంతో భారతదేశం అభివృద్ధి సాధించడం జరగని పని. చిన్న చిన్న హెల్పుల వల్ల యూజ్ అట్టే ఉండదు. పెద్ద ఎత్తులో లిటరసీ టేకప్ చెయ్యాలి” అన్నాడు.

“పెద్ద ఎత్తున అంటే” – అన్నాను వివరంగా చెప్పమన్న భావంతో.

“నాకు ఒక 100,000 డాలర్లు సంపాదించి, ఇండియా వెళ్ళి అక్కడ ఉన్న ఒక ఆర్గనైజేషన్ తో కలసి కాని, లేదా ఒక ఆర్గనైజేషన్ పెట్టి వందలకొద్ది వలంటీర్స్ ని పెట్టి, వేల కొద్ది ఇల్లిటరేట్సుని లిటరేట్సుగా చెయ్యాలని ఉంది”. అన్నాడు ఆవేశంగా.

“అది మంచి ఉద్దేశ్యమే కానీ, ఇటువంటి విషయాలలో అంటే సంఘసేవలో డబ్బు కోసమో, ఎదుటి వారికోసమో ఎదురు చూడడం అనవసరం. పైగా ఆ డబ్బు కాని, మనుషులు కాని సమకూరేసరికి పని చెయ్యడానికి కావలసిన అనుభవం రావాలంటే ఊహ తోచిన నాటినుండి ఎంతలో వీలయితే అంతలో, పనిచేయడం మొదలు పెట్టాలి.

“కానీ రిజల్ట్సు?” అన్నాడు ప్రయోజనం ఉండదన్న భావంతో.

ఈ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటే, సమాధానం నాచేతిలోనే ఉందని తోచింది వెంటనే
“మీరు తెలుగు చదువుతారా?” అని అడిగాను

“షూర్” అన్నాడు.

“అయితే నా స్వంత అనుభవాన్ని ఒక కథ రూపంలో రాసాను. ఈ కథ చదవండి. మీ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు” అని నేను రాసిన కథ కాపి అతనికి ఇచ్చాను.

ఇంతలో డాక్టర్ రాణి చింతంగారు రమ్మంటున్నారని నాకు కబురు వచ్చింది. ఆమె ఇక్కడికి వచ్చిన వారందరికి కాఫీ, టీ, భోజనాలన్నింటిని అందించే బాధ్యత తీసుకున్నారు. ఆమెకు సహాయం అందించడానికి నాలాంటివారు కొద్దిమంది వాలంటీర్లు ఉన్నారు. ఏదో పని ఉండి పిలిచి ఉంటారు.

“ఒక అరగంట తరవాత వచ్చి కలుస్తాను” అన్నాను.

“చాలా థాంక్సండి ఇప్పుడే చదువుతాను” అని అతను అక్కడే కూర్చొని చదవడం మొదలుపెట్టాడు.
* * *
1998 జనవరి మొదటివారంలో భువనేశ్వరం వెళ్ళాం నేను, నా భార్య చిత్ర. చిన్నప్పడు నాతో కలిసి చదువుకుని, పాతికేళ్ళుగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న కిషోర్ అతని భార్య కమల ఉదయాన్నే రైల్వేస్టేషనుకు వచ్చి మమ్మల్ని ఆదరంగా వాళ్ళింటికి తీసుకుని వెళ్ళారు.

“కిషోర్ ఈ మాటు కోణార్క తప్పకుండా వెళ్ళాలిరా” అన్నాను కబుర్లలో.

“తప్పకుండా, కానీ మరీ రెండు రోజులే ఉంటానంటే ఎలారా?” అన్నాడు.

“రేపే వెళదాం. మీరిద్దరు కూడా రండి. అందరం కబుర్లు చెప్పుకుంటు హాయిగా గడపుదాం” అన్నాను.

“సరే. అయితే నాలుగు గంటలకి బయలుదేరితే సూర్యోదయానికల్లా కోణార్క చేరుకోవచ్చు. అప్పుడయితే, ప్రశాంతంగా ఆ గుడిని, గుడి వెనుకగా సూర్యోదయాన్ని చూడవచ్చు. ఆ తరవాత అయితే జనం ఎక్కువై అంతా గాభరా గాభరాగా ఉంటుంది. ఉదయాన్నే కాని, లేదా పౌర్ణమినాడు రాత్రి కాని ప్రాకారం చుట్టు ఉన్న చెట్లక్రిందో, నాట్య వేదికల మీదనో కూర్చొని చూస్తూ, ఆ అందాల్ని ఆస్వాదిస్తే కానీ కోణార్క గొప్పదనం అర్థం కాదు. ఆనందించలేము.” అన్నాడు కిషోర్ తన్మయత్వంతో.

“సరే, అలాగే” అన్నాను.

ఆ రోజంతా చిన్ననాటి కబుర్లు, అమెరికా విశేషాలు, పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్ లు, చెదిరిపోయిన మిత్రుల గురించి, చనిపోయిన ఉపాధ్యాయుల గురించి, ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం మధ్యాహ్నం భోజనాలు అయ్యేంత వరకు. తరవాత ఓ రెండు గంటలు నిద్రపోయి లేచాము. కమల అందించిన టీ త్రాగుతు ఉంటే,

“రేపు తెల్లవారు ఝామున చాలా చలిగా ఉంటుంది. నువ్వేమైనా స్వెట్టరు గట్రా తెచ్చావా” అని అడిగాడు కిషోర్.

“లేదే” అన్నాను.

“సర్లే. మావి ఇస్తాం” అన్నాడు.

“అసలు ఇండియాలోనే మంచి స్వెట్టర్లు దొరుకుతాయంటారు. ఇక్కడ కొని పట్టుకుని వెళితే బాగుంటుంది కదా” అంది చిత్ర.

“అవును అదీ మంచి అయిడియా” అని చిత్రాతో అని, “కిషోర్ సాయంత్రం అలా ఊరిలో తిరిగి వచ్చినట్లుంటుంది, ఏదైనా స్వెట్టర్లు అమ్మే షాపుకు తీసుకువెళ్ళు” అన్నాను.

“పరదేశీ బాబు అన్న పేరుతో ఒక పెద్ద బట్టల షాపు ఉంది. అందులో మంచి స్వెట్టర్లు దొరుకుతాయి.” అన్నాడు కిషోర్.

“అదేమిటి ఆ పేరు అలా ఉంది?”

“అవును కొంచం వింతపేరే. కానీ మంచి పేరున్న షాపు. ఇది వారి అతి ముఖ్యమైన కోరిక అనిపిస్తుంది. అక్కడ బేరాలు ఉండవు. మంచి నాణ్యమైన బట్టలు. పైగా షాపుకు వచ్చిన వాళ్ళందరిని వాళ్ళ అభిప్రాయాన్ని వ్రాసి సంతకం పెట్టమంటారు. అలా చేసినందుకు ఓ మంచి పెన్ను ఇస్తారు.”

ఆరు గంటలకల్లా అందరం తయారై ఊరిమీద పడ్డాం. ఇరవై ఏళ్ళ తరవాత మళ్ళీ ఈ ఊరు చూస్తున్నాను. ఇదివరకు విశాలంగా అనిపించిన రోడ్లు ఇప్పుడు, జనాభా పెరుగుదల వలన కాబోలు, ఇరుకుగా అనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మనుషులే, చిన్న చిన్న దుకాణాలే, ఇరుకు అన్న భావన మనసంతా ఆవరిస్తుంది.

ఒక రెండు గంటలు ఊరంతా తిరిగి, సుమారు ఎనిమిది గంటలకు పరదేశీ బాబు అన్న పేరు పెద్ద పెద్ద అక్షరాలతో, అధునాతన పద్ధతిలో అలంకరించబడి ఉన్న ఒక విశాలమైన షాపులో అడుగు పెట్టాం. అడుగు పెట్టీ పెట్టగానే ఒక అందమైన అమ్మాయి ఎదురు వచ్చి వినయంగా ఆహ్వానించింది. ఏ బట్టలు కొనడానికి వచ్చామో అడిగి వాటికోసం ఎటువైపు వెళ్ళాలో చూపించి, అవి కొనడం అయిన తరవాత షాపు అంతటిని చూడమని కోరింది. కేష్ కౌంటర్లకి ఒక 20 అడుగులకు ముందుగా ఉన్న ఒక టేబుల్ చూపించి, ఇక్కడ మా అభిప్రాయాలను షాపు విడిచి వెళ్ళే ముందు వ్రాసి సంతకం పెట్టమని ‘పరదేశీ బాబు’ తరఫున ప్రార్థిస్తున్నాను అని చక్కనైన ఇంగ్లీషు ఉచ్చారణతో భాషా దోషాలు లేకుండా చెప్పింది. అది విని ఆశ్చర్యపోయాను.

“ఇంత మంచి ఇంగ్లీషా!” అన్నాను ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ.

“ఈ షాపులో పనిచేసే వాళ్ళు ఒరియాతో పాటు రెండు మూడు భాషలు మాట్లాడుతారు. అందరు ఇంగ్లీషు మాట్లాడుతారు. అదీ చాలా చక్కగా” అన్నాడు కిషోర్ ప్రశంసాపూర్వకంగా.

కావలసిన స్వెట్టర్లు తీసుకుని, షాపంతా తిరిగి చూసి, బిల్లు చెల్లించడానికి కేష్ కౌంటర్ల వైపుకి కదిలాం. ఎదురుగా ‘ఈ షాపుపై మీ అభిప్రాయాలను తెలియజేయండి’ అని 12 భారతీయ భాషల్లో పెద్ద అక్షరాలతో వ్రాసి ఉన్న బోర్డు, దాని ప్రక్కనే ఒక టేబులు, టేబులు వెనక నవ్వు మొహంతో కూర్చొని ఉన్న అమ్మాయి కనిపించింది. ఆ టేబులు దగ్గరకు రాగానే,

“మీ అభిప్రాయం ఇక్కడ వ్రాసి సంతకం పెట్టండి” అని వినయంగా ఓ పుస్తకాన్ని అందిస్తు అడిగింది.

“అలాగే” అని ‘ఎక్సలెంట్’ అని వ్రాసి సంతకం పెట్టాను. నా సంతకం ప్రక్కనే చిత్రా కూడా సంతకం పెట్టింది. కిషోర్, కమల ఇంతకుముందే రాసాం అని చెప్పారు. ఆ అమ్మాయి వెంటనే రెండు పెన్నులు తీసి నాకు చిత్రాకి ఇచ్చింది. అవి తీసుకుని కేష్ కౌంటర్లవైపుకి వెళ్ళాం. అక్కడ మాకంటే ముందుగా వచ్చి నిలబడ్డవారి వెనుక క్యూలో నిలబడ్డాం. అలా నిలబడే షాపంతా కలయ చూసాను. షాపంతా చాలా అందంగా కూడా అమర్చారని అనిపించింది. అభిప్రాయ సేకరణ టేబుల్ దగ్గర కూర్చొన్న అమ్మాయి ఆమె చేతిలో ఉన్న కాగితంలోకి, అభిప్రాయం సేకరించిన పుస్తకంలోకి పదే పదే చూస్తున్నట్లు గమనించాను. ఉన్నట్టుండి ఆ అమ్మాయి ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచి, పరుగెట్టుకుంటూ షాపులో భాగంగా ఉన్న పై అంతస్తుకు చేరుకుంది. షాపులో ఉన్నవాళ్ళందరి దృష్టి పరిగెత్తుతున్న ఆమె మీద ఉంది. కొద్ది క్షణాలలో ఆమె పై అంతస్తులో ఆఫీస్ అని వ్రాసి ఉన్న తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. కొద్దిక్షణాలు గడిచాయి. ఎవరి పనులు వారు చెయ్యడం మొదలుపెట్టారు. మేం బిల్లు చెల్లించడానికి ముందుకి కదిలాం. కేషియర్ మేం అందించిన రసీదు తీసుకుని, చెల్లించవలసిన సొమ్ము చెప్పి టకటక వ్రాయడం ఏదోమొదలు పెట్టింది. నేను పర్సు తీసి డబ్బులు లెక్కపెడుతున్నాను. అప్పటిదాకా చకచక పనిచేస్తున్న కేషియర్ పని ఆపి, ఒక్క ఉదుటున లేచి నిలబడింది.

“ఏమైంది?” అని అడిగాను. “నేనిచ్చిన సొమ్ములో ఏదైనా పొరపాటు ఉందా?”

నా ప్రశ్న పట్టించుకోకుండానే తలూపి “మేడం” అంది.

నేను వెనక్కితిరిగి చిత్రా వైపు చూసేంతలో నా ప్రక్కగా నాలుగు అడుగుల దూరంలో ఏ భావం వ్యక్తం చెయ్యకుండా అన్ని భావాలను ఇముడ్చుకుందా అన్నట్లు అనిపించే విశాలమైన మొహంతో, యూనివర్సిటీ రోజులలో ఎస్.సి.సి. ఆఫీసర్ గా ఉన్న అంజలిని శర్మని గుర్తుకు తెప్పించే ఒక అమ్మాయి రెండు చేతులు జోడించి నిలబడి నన్ను చూసి “నమస్తే” అంది. ఆమె వెనుకగా అభిప్రాయాల కౌంటరు అమ్మాయి మేం అభిప్రాయం వ్రాసిన పుస్తకం పట్టుకుని వెనక నిలబడి ఉంది. నేను కొద్దిగా తడబడుచు ప్రతి నమస్కారం చేసాను.

“ఈ సంతకం మీదేనా?” అని ఆపుస్తకంలో ఉన్న నా సంతకం వైపు వేలు చూపిస్తూ అడిగింది. నా కోసం వాళ్ళు వెతుకుతున్నారన్న ఆలోచన కొద్దిగా ఆశ్చర్యంతో నన్ను కలవరపెట్టింది.

“అవును” అన్నాను మెల్లగా.

“మీరు 20 సంవత్సరాల క్రిందట భువనేశ్వర్ వచ్చారు కదూ” అని అడిగింది.

“ఆ, ఆ అవును సుమారుగా....”

“ఈ కాగితంపైన ఉన్న సంతకం కూడా మీదేనా?” అని పటం కట్టి ఉన్న నా సంతకం ఫోటో కాపి చేసి ఉన్న కాగితాన్ని చూపించి అడిగింది.

మొదటినుండి నా సంతకంలో అట్టే మార్పు లేదు. ఆ కాగితం మీదనున్నది నా సంతకమే. సులభంగానే గుర్తు పట్టాను. సంభాషణ అంతా ఇంగ్లీషులోనే సాగుతున్నాది.

“అవును” అన్నాను నిశ్చయంగా. మీరేనా బాబుజి.

“బాబుజీ” అని ఆ షాపు అంతా ప్రతిధ్వనించేలా ఒక్కసారి అరచి, చటుక్కున నా కాళ్ళపై పడి, తన చేతులతో నారెండు కాళ్ళని చుట్టేసింది. ఉద్వేగంగా ఏదేదో అంటున్నాది. అర్థమవడం లేదు.

నన్ను ఆశ్చర్యం, ఉద్వేగం ఒక్కసారి ఆవరించి గాభరా పెట్టాయి. ఆ స్థితిలోనే వంగుని, “లేవండి, లేవండి అలా కాళ్ళ మీద పడకూడదు. అసలు విషయమేమిటి? ఏం జరిగింది? నా కోసం ఎందుకోసం ఆరాటం? మీరెవరో నాకు తెలియదు” అన్నాను.

ఆమె నా కాళ్ళు వదలకుండానే “ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. లక్ష సంతకాల తరవాత మీ సంతకం కనిపించింది. మీరు దొరికారు. నేను మిమ్మల్ని వదలలేను. నా తనివి తీరా మనసులో ఇన్నేళ్ళుగా దాచుకున్న నా కృతజ్ఞతని మీకు తెలుపుకోవాలి బాబుజీ, బాబుజీ” అంటూ ఆవేశంగా పరిసరాలని మరిచి, ఒదిలితే ఎక్కడ జారిపోతాయో అన్నంత గట్టిగా నా కాళ్ళను పట్టుకుంది.

నేను నిస్సహాయంగా నిలబడి సహాయం కోసం మా ఆవిడ చిత్రా వైపు చూసాను. తనకీ విచిత్రంగా ఉన్న ఈ సన్నివేశంలో చిత్ర నా చూపుని అర్థం చేసుకున్న దానిలా ముందుకు వచ్చి వంగుని, నా కాళ్ళ దగ్గర ఉన్న ఆ అమ్మాయిని తన చేతులతో పట్టుకొని మీదకు లేపి నిలబెట్టింది. కానీ ఆ అమ్మాయి ఇంకా ఉద్వేగంలో చిత్రా భుజంపై వాలి ఉంది. షాపులో ఉన్న వాళ్ళంతా అప్పటికి మా చుట్టు మూగి ఉన్నారు.

ఆ సంతకం నిజానికి నా సంతకమేనా? నాసంతకానికి పఠం కట్టి ఉంచడమేమిటి? ఆ సంతకానికి ఆ అమ్మాయికి సంబంధం ఏమిటి? నాలో ఎడతెగని ప్రశ్నలు సాగాయి. ఇన్నేళ్ళుగా నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నది? నన్ను పట్టుకుందికేనా ఈ అభిప్రాయ సేకరణ. మనిషిని పోలిన మనిషి ఉంటారంటారు. సంతకాన్ని పోలిన సంతకం ఉండదా? ఇందులో ఏ పొరపాటు లేదుకదా? ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను.

ఇంతలో ఆ షాపు స్టాఫ్ తేరుకుని, చిత్రా భుజంపైన ఒరిగి ఉన్న ఆ అమ్మాయిని, మా నలుగురిని పై అంతస్తులో ఉన్న ఆఫీసుగదిలోకి తీసుకువెళ్ళారు. ఆ ఆఫీసు గది ముందు అనుపమ పట్నాయక్ ఎమ్.ఎ., మేనేజింగ్ డైరెక్టర్, అని రాసి ఉన్న బోర్డు ఉంది. లోపల కుర్చీలతో, సోఫాలతో అధునాతన పద్ధతిలో అమర్చిన విశాలమైన ఆఫీసు ఉంది. ఎడమవైపున్న సోఫాలో మమ్మల్ని కూర్చోమని సూచించారు. ఆ సోఫాకు ఎదురుగా ఉన్న సోఫాలో ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు. అంతలోనే మంచినీళ్ళు, వేడి వేడి టీలు వచ్చాయి. మంచినీళ్ళు, టీ అందరికి అందించారు. ఆమె ముందుగా కొంచెం మంచినీళ్ళు తాగి, తేరుకుని, స్టాఫ్ ఇచ్చిన తువ్వాలుతో ముఖం తుడుచుకుని, నా మొహంలోకి చూస్తూ,

“మీరు ఇరవై ఏళ్ళ క్రిందట భువనేశ్వర్ వచ్చారు గుర్తుందా?” అని నా జ్ఞాపకాలని గుర్తుచెయ్యడానికి ప్రయత్నిస్తున్నదానిలా అంది. “మీరు మా నాయన కూరల దుకాణానికి వచ్చారు...” ఏమేమో చెపుతున్నది. ఇరవై ఏళ్ళ క్రిందట భువనేశ్వర్ వచ్చినప్పుడు జరిగిన విశేషాలని గుర్తుకు తెచ్చుకుందికి ప్రయత్నిస్తున్నాను నేను.
నేను ఉద్యోగప్రయత్నం మీద ఇంటర్వ్యూకోసం భువనేశ్వర్ వచ్చాను. కోణార్క కూడా చూద్దామని అనుకున్నాను. కాని కోణార్క వెళ్ళడం జరగలేదు ఎందుచేత?....

అప్పుడు భువనేశ్వర్ ఇంత పెద్ద ఊరు కాదు. జనం బాగా తక్కువ. ఊరు విశాలంగా ఉన్నట్లు గుర్తు. కిషోర్ ఒక చిన్న గదిలో అద్దెకు ఉండేవాడు. నేను నాలుగు రోజులు ఉందామని కూడా వచ్చాను. అప్పుడు ‘మదరాసి’ హోటళ్ళు లేవు. కిషోర్ ఒరియా భోజనానికి అలవాటు పడ్డా, నా కోసం ఇంట్లోనే వంట చేసేవాడు. ఇంటర్వ్యూ అయిన నాటి రోజు సాయంత్రం సామానులు, కూరలు కొనడానికని బజారుకు వెళ్ళాము.

“బాబుజీ!” “వినండీ” గౌరవం, ఆప్యాయత మేళవించి పిలిచిన ఆ పిలుపుకు నా ఆలోచనలు తెగిపోయాయి. “చిన్న వయసులో, చింపిరి తలతో, చీమిడి ముక్కుతో, చిరిగిన బట్టలతో, మట్టి కొట్టుకుపోయిన వంటితో, చదవలేక, చదువురాక, చదువుకోమనే దెబ్బలతో, ఏడుపుతో, కన్నీళ్ళు నిండిన కళ్ళతో ఉన్న నేను గుర్తుకు వచ్చానా? అని తోరు దత్ పోయట్రీ లాంటి భాషలో ఇంగ్లీషులో అడిగింది. మెల్లి మెల్లిగా కూరగాయల తట్టల మధ్య కూర్చోని ఉన్న ఓ చిన్నపిల్ల నాకు గుర్తు రావడం మొదలయ్యింది. పూర్తిగా గుర్తుకు రాగానే ఎదురుగా కూర్చోని ఉన్న ఆమె కన్నీళ్ళు నిండిన కళ్ళల్లోకి చూసాను.
చక్కని సాంప్రదాయపు కేశాల కూర్పుతో, మిసమిసలాడుతున్న చెంపలమీద, మెరుస్తున్న కన్నీటి తడితో, పసుపు ఎరుపు రంగు మేలు మేళవింపుతో మగ్గాన నేసిన మంచి చీరలో, వయసు తెచ్చి ఇచ్చే వన్నె వెలుగుతో మెరుస్తున్న మేనుతో, ఈమె చాలా చదివిందేమో అని అనిపించే భాషాజ్ఞానంతో, భావోద్వేగాన్ని ప్రజ్వరిల్లిస్తున్న కళ్ళతో ఉన్న ఈమె ఆ పిల్లా? నాకళ్ళ ముందే అందమైన సీతాకోకచిలుక అప్పుడే రెక్కలు విచ్చుకున్న భ్రాంతి కలిగింది.

మసక వెలుతురులో 30-35 ఏళ్ళ వ్యక్తి, అతనికి ఎదురుగా ఒక 6-7 ఏళ్ళ అమ్మాయి, చుట్టూ కూరగాయల తట్టలు ఒకదాని తరవాత మరొకటి గుర్తుకు వస్తున్నాయి. పిల్ల ఏడుపు వినిపిస్తున్నది. ఏడుపు మధ్యలో ఏదేదో ఒరియాలో అంటున్నాది. అతను తండ్రి కాబోలు కొడుతున్నాడు. కొడుతూ అరుస్తున్నాడు. ఒరియా భాష రాకపోవడం వలన నాకు ఏమీ అర్థం కావడం లేదు. తెలుసుకోవాలని మాత్రం కుతూహలంగా ఉంది. కిషోర్ సామానులు కొనడం పూర్తయిన తరువాత ఆ ఏడుస్తున్న పిల్ల ఉన్న కూరల దుకాణానికి వెళ్ళాం. ఆ పిల్లని, తండ్రిని దగ్గరగా చూడడం కుదిరింది. మేం రాగానే అతను పిల్లను కొట్టడం ఆపి మావైపు తిరిగి కూరలు ఏరుకుందికి తట్ట అందిస్తూ, పిండి తీసుకుని మొహానికి రాసుకున్న తీరులో, నవ్వు తీసుకొని మొహానికి పులుముకున్నాడా అన్నట్లు నవ్వాడు ఒక్క క్షణం సేపు.
ఆ పిల్ల మేం దగ్గరకు రాగానే ఆపలేక ఆపలేక ఆపినట్లు ఏడుపు ఆపింది. అయినా మధ్య మధ్యలో బెక్కుతూనే ఒరియాలో ఏదో అప్పజెపుతున్నట్లు చెప్పుతున్నది. విరిగిపోయిన పలక, చిరిగిపోయిన పుస్తకం... ఆ అమ్మాయి ఇంత ముందు వర్ణించినట్లే ఉంది.

ఆ తండ్రి నలిగిన బట్టలో రేగిన జుత్తుతో, ముడతలు పడ్డ నుదురుతో, చాలా కాయకష్టం చేసి రాటుదేరిన చేతులతో, నిర్భాగ్యపు బ్రతుకుకు నకలుగా, నిరాశ ముద్దలలాంటి కళ్ళతో, మాసిన గడ్డంతో, బ్రతుకు మీదో, వ్యాపారం మీదో, పిల్లదాని చదువుమీదో, మనుషుల మీదో, లేక వీటన్నింటి మీదో, దీనిమీద అని నిర్దుష్టంగా చెప్పలేని కసి, కోపం అతని మొహమంతా మబ్బులా కమ్మేసింది.

కూరలు కొనడం అయిపోయిన తరవాత రూమ్ కు వస్తూ ఉంటే కిషోర్ ని అడిగాను ‘ఆ పిల్ల ఎందుకు ఏడుస్తున్నది? ఆ తండ్రి ఎందుకు కొడుతున్నాడు చదువుకోడం లేదా అనేదా?’

‘ఆ సుమారుగా అంతేలే. పుస్తకాలు కొనకుండా బడికి రావద్దన్నారని, తనకు అలాంటి బట్టలు కావాలని. ఆపిల్ల, ఎక్కాల పుస్తకం కొన్నా ఇంకా ఎక్కాలు రాలేదని, పుస్తకాలు కొనడానికే డబ్బులు చాలకపోతుంటే, ఇంక మంచి మంచి బట్టలు ఎక్కడనుండి తేగలనని ఆ తండ్రి అంటున్నాడు. నీకూ చదువబ్బదు, నాలాగే నీకూ ఈ కూరల తట్టలే గతి. మన ఇద్దరి బతుకు ఈ కూరల తట్టల మధ్యనే తెల్లవారుతాయి అని తిట్టుకుంటున్నాడు. ఆ కబుర్లలో రూమ్ కి వచ్చాం. రాత్రి ఆ పిల్ల ఏడుపు గుర్తుకు వచ్చి మెలుకువ వచ్చింది. ఆ తర్వాత నిద్ర రాలేదు. ఆ పిల్ల మొహం పదే పదే గుర్తుకు వచ్చింది. చదువంటే డబ్బులని స్కూల్లోనూ చదువంటే దెబ్బలని ఇంట్లోనూ ఒక దురభిప్రాయన్ని ఆ చిన్నారి మనసులో నాటబడుతుంటే నాకు చాలా బాధ కలిగింది. ఆ పిల్లకి ఎలాగైనా చదువుకోవాలనే ఆసక్తి కలిగించాలని అనిపించింది. ఆ ఊరిలో ఇంకా ఉండేది ఒక్కరోజు మాత్రమే. మర్నాడు కోణార్క వెళ్ళాలని అనుకున్నాను. నాకా ఆ పిల్లతో కాని వాళ్ళ నాన్నతో కాని మాట్లాడడానికి ఒరియా రాదు. ఏం చేసినా అది ప్రోత్సాహకరం అయ్యేదే కానీ ఆ పిల్ల చదువు బాధ్యత మొత్తం తీసుకోడానికి నేను ఆ ఊర్లో ఏలాగో ఉండను. నాకా ఉద్యోగం లేదు. మరేం చెయ్యాలి? ఇలా ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారఝామున నిద్రపోయాను.

మర్నాడు ఉదయం కిషోర్ నిద్రలేపాడు. కోణార్క వెళ్ళడానికి ఆలస్యం అయిపోతున్నదని.

‘కోణార్క వెళ్ళడం లేదు’ అన్నాను నేను లేచి.

‘అదేం అన్నాడు’ మరేం లేదు. నా దగ్గర 200 రూపాయలే ఉన్నాయి. కోణార్క అనుకొన్నాను కాని అవి పెట్టి ఆ పిల్లకి కావలసిన పుస్తకాలు బట్టలు కొనిఇచ్చి చక్కగా చదువుకోమని చెప్పాలనుకుంటున్నాను. అన్నాడు.

‘ఏ పిల్ల? ఆ కూరగాయల కొట్టతని పిల్ల?’

‘అవును’ అన్నట్టు బుర్ర ఊపాను.

‘మరి కోణార్క ప్రయాణం.....’ అన్నాడు కిషోర్.

‘ప్రయాణం అంత ముఖ్యం కాదు. విపరీతంగా వెనకబడి ఉన్న మనదేశానికి అక్షరాస్యత అత్యంత అవసరం. ఆడపిల్లలు చదువుకుంటే ఆమె పిల్లలు నిరక్షరాస్యులవరు. ఆ కుటుంబం నిరక్షరాస్యత నుండి బయటపడుతుంది. కాబట్టి నేను కోణార్క వెళ్ళడం కన్నా అదే డబ్బుతో ఆ పిల్ల చదువుకి ఉత్ప్రేరకంగా తోడ్పడడం మంచిదని ఈ నిర్ణయం తీసుకుంటున్నాను.’ అన్నాను.

కిషోర్ తెల్లబోయి చూస్తున్నాడు.

‘నువ్వు ఆఫీసుకు వెళ్ళే దారిలో ఉన్న ఏదైనా ఒక పుస్తకాల షాపులో నన్ను విడిచిపెట్టి వెళ్ళు. ఆ తరవాత అక్కడ దగ్గరలో ఉన్న బట్టల దుకాణానికి వెళ్ళి బట్టలు కూడా కొని సాయంత్రం ఆ పిల్లకు ఇచ్చివద్దాం’ అన్నాను.

సాయంత్రం మళ్ళీ ఆ కూరల దుకాణానికి వెళ్ళి ఉదయం కొన్న ఒరియా, ఇంగ్లీష్, పుస్తకాలు, పెన్సిళ్ళు, ఒక రెండు పెన్నులు, కొన్ని రబ్బర్లు, బట్టలు ఇచ్చి, ‘చదువుకో బాగా చదువుకో. చాలా పెద్దదానివి అవుతావు. నీకు కావల్సినవి అన్నీ దొరుకుతాయి’ అని ఒరియాలో కిషోర్ చేత ఆ పిల్లతో చెప్పించి, అవే మాటలని కిషోర్ చేత ఒరియాలో వ్రాయించి క్రింద నా సంతకం పెట్టి ఇచ్చాను. వాళ్ళు ఒరియాలో అన్నవాటిని, కృతజ్ఞతలని కిషోర్ నాకు తెలుగులో తరువాత చెప్పాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరి తెలీదు. ఆ పిల్లే ఈ పిల్లా అని ఆమె మొహంలోకి చూస్తూ “అవును అప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చినట్లు గుర్తు.” అన్నాను.

“బాబుజీ, ఇవిగో ఆ పుస్తకాలు” అని ఎదురుగా ఉన్న అందంగా నగిషీ చెక్కిన పెట్టెలోంచి కొన్ని పాత పుస్తకాలు తీసి కళ్ళకు అద్దుకొని నా ఎదుట పెట్టింది. “ఆ రోజు మీరిచ్చిన ఈ పుస్తకాలు నాకు వరాలు. అప్పటి నుండి శ్రద్ధగా చదువుకున్నాను. మా నాయన నా హైస్కూల్ చదువు పూర్తి కాగానే బట్టల వ్యాపారం మొదలు పెట్టించాడు. మీ మీది గురితో ఏర్పడ్డ చదువు మీద అభిమానం నన్ను వదలలేదు. ఉదయం వ్యాపారం, సాయత్రం చదువు. చదువుతున్నకొద్దీ చదువు ఇచ్చే ఆనందాన్ని ఆస్వాదించసాగేను. వ్యాపారంలో కూడా నా చదువు చాలా ఉపయోగపడడం చూసి మా నాయన నన్ను చదువుకోమని ప్రోత్సహిస్తూ ఉండేవాడు. అలా ఎమ్.ఎ. దాకా చదివాను.”

అని లేచి, గోడకు తగిలించి ఉన్న ఉత్కళ్ యూనివర్శటీ డిగ్రీ సర్టిఫికెట్ లను తెచ్చి చూపించింది.

“మ్మిమ్మల్ని లెఖ్క పెట్టలేనన్ని సార్లు తలుచుకుంటూనే ఉంటాను. పరీక్షలు పాస్ అయినప్పుడల్లా ఇదంతా మీ దయవలననే అని అనుకుంటూ ఉండేదాన్ని. మీ పట్ల నాకున్న కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలా అని చాలా రోజులు ఆలోచించి, ఆఖరుకు మీ కిష్టమైన పనే చేసాను. చూడండి.” అంటూ ఒక ఆల్బమ్ తెరిచి గత 10 ఏళ్ళుగా ఏడాది వారీగా అమర్చిన ఆడపిల్లల గ్రూప్ ఫోటోలని చూపించి ప్రతి ఏడాది సుమారు వంద మంది చదువుకోడానికి స్తోమత లేనివారిని మేము, మా షాపువారము చదివిస్తున్నాము. వాళ్ళని తిరిగి పెద్దవాళ్ళయ్యాక ప్రత్యుపకారంగా కనీసం పదిమందిని చదవించమని కోరుతున్నాం. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుందనుకుంటాను బాబుజీ”

“నిజంగానే మంచి పని. చాలా ఆనందంగా ఉంది.” అన్నాను. చెమర్చిన కళ్ళతో.

“బి.ఎ. పాస్ కాగానే మిమ్మల్ని కలవాలన్న కోరిక అతి గట్టిగా అనిపించింది. మీ సంతకం ఉందికానీ, మీ పేరు తెలియలేదు. ఒరియావాళ్ళు కాదని మాత్రం తెలుసు. మీరెవరో తెలియదు, ఎక్కడ ఉన్నారో తెలియదు. మిగిలిన ఆశ ఒక్కటే. మీరు మళ్ళీ భువనేశ్వర్ వచ్చి మా షాపుకు వచ్చినట్లయితే ఈ సంతకం ద్వారా మిమ్మల్ని కలవచ్చు అని తోచి అభిప్రాయాల సేకరణ ఈ సంతకాల పద్ధతి పెట్టాం. మా నాయన కూడా మిమ్మల్ని అడుగుతుండేవాడు. చనిపోయే ముందు కూడా మిమ్మల్ని గుర్తుచేసుకొని ఎప్పుడైనా కలిస్తే తన తరఫున కూడా మీకు పాదాభివందనం చెయ్యమన్నాడు.” అని ఉద్వేగంతో నా కాళ్ళకి మరోసారి నమస్కారం పెట్టింది.

నా నిలువెల్లా ఆనందాశ్చర్యాలతో ముంచెత్తబడుతున్న ప్రకంపనాలు పదే పదే ప్రవహిస్తున్నాయి. మాట్లాడాలని ఉందికాని గొంతునిండి మాటరావడం లేదు. గత 20 ఏళ్ళుగా విదేశాలలో పనిచేస్తు సంపాదించిన పురస్కారాలన్నింటి కంటే ఆమె చేసిన నమస్కారం అత్యున్నతమైనదిగా తోచింది. ఆ రోజు చేతిలో ఉన్న 200 రూపాయలు ఆ పిల్ల చదువుకు ఖర్చు చెయ్యడం కంటే మంచిపని నా జీవితంలో ఇంకేమీ లేదేమో అని అనిపించింది. అయితే ఆ అమ్మాయి తన జీవితంలో ఇంత ఎత్తు ఎదగడానికి కారణం నేనే అని ఆ గొప్పదనం నాకే ఆపాదించబడడం అంత సబవు అనిపించలేదు. అందుకే నోరు విప్పి-

“నీ పట్టుదల, కృషి, మేధస్సుతో, విశాల దృక్పథంతో ఈ స్థితికి వచ్చావు కాని నా పాత్ర ఇందులో ఉత్ప్రేరకంగా పని చెయ్యడం మాత్రమే. నువ్వు చాలా అభినందనీయురాలివి. ఎంతో మంది ఆడపిలల్లకి నువ్వు మార్గదర్శకురాలివి. అటువంటి నీ అభిమానానికి ఎంతో ఆనందిస్తున్నాను.” అన్నాను ప్రతీ పదాన్నీ నొక్కి పలుకుతు.

మేం ఇద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అంతా మమ్మల్నే చూస్తున్నారు అన్న ఊహ అప్పుడే కలిగింది.

“బాబుజీ మీరు మా ఇంటికి రావాలి. మాతోనే ఉండాలి. ఇన్నేళ్ళుగా నా మనసులో మీతో చెప్పుకుంటున్న మాటలన్నీ మీతో చెప్పాలి.”

“అలాగే” అన్నాను.

“మరి కోణార్క వెళ్ళడమో...” అన్నాడు కిషోర్.

“రేపు కోణార్క వెళ్ళాలనుకున్నారా రేపొక్కసారి మానుకుని మరోసారి వెళ్ళకూడదా?” అని ప్రశ్నలాంటి అభ్యర్థన చేసింది అనుపమ పట్నాయక్.

“అలా అయితే ఇది 20 ఏళ్ళ తరవాత మరోసారి అవుతుంది” అన్నాడు కిషోర్.

“అదేమిటి” అన్న ఆమె ప్రశ్నకు సమాధానంగా 20 ఏళ్ళ క్రిందట నేను కోణార్క వెళ్ళడం ఎందుకు అవ్వలేదో చెప్పాడు.

అది విని అనుపమ పట్నాయక్, మౌనంగా, నీళ్ళు నిండిన కళ్ళతో ద్విగుణీకృతమైన కృతజ్ఞతతో మరోసారి నావైపు చూసింది.

ఆ రాత్రి అందరం అనుపమ పట్నాయక్ కోరికపై ఆమె అతిథులమయ్యాం.

* * *

నేను వంటింటిలో చెయ్యవలసిన సహాయం చేసి వచ్చేసరికి పతంజలి నేనిచ్చిన కథ చదవడం పూర్తి చేసి నా కోసం “ఎదురు చూస్తున్నాను” అన్నాడు.

“ఇప్పుడేమంటారు” అన్నాను అతను అందిస్తున్న కాగితాలను అందుకుంటూ...

“సంకల్పం, ఆచరణ రెండూ ముఖ్యమే. ఒక్క సంకల్పమే కాదు ఆచరణలో పద్ధతులు కొన్ని ఉండాలి, కల్పించాలి.”
అన్నాను. “మరి నేను వెళ్ళి మా గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. థేంక్సు” అన్నాడు అతను. “మంచిది” అన్నాను తృప్తిగా.



0 వ్యాఖ్యలు: