Friday, May 15, 2009

డెత్ సర్టిఫికెట్

Friday, May 15, 2009
ఇంటిల్లిపాది ఒక్కసారి భోరుమని ఏడ్చారు. ఆ ఇంటి నుండి అప్పుడే ఒక ఆత్మ ఆనంద, అమృత, అనిర్వచనీయ లోకాలకు పయనించింది. అప్పటిదాకా రాగ ద్వేషాలకి, నవరసాలకి అనుక్షణం స్పందించే కోటానుకోట్ల కణాల నిరంతర కార్యక్రమాల కర్మాగారం నిర్జీవమై, కట్టై ‘శవం’ అయిపోయింది ఆ ఇంట. డాక్టర్ వేదాంతిలా వేరే కేసుకి వెళ్లిపోయాడు. చుట్టుప్రక్కల ఇళ్ళల్లో మనుషులు ఏడుపు విని పరుగెత్తుకు వచ్చారు. పెరటి సాలలో ఉన్న ఆవు ‘అంబా’ అని అనువదించలేని భాషలో అరచింది పదే పదే. కన్నీళ్ళు కారుతున్నాయి కళ్ళనుండి. చావు మబ్బు మెల్లగా కమ్ముకుంటున్నది ఆ ఇంటిపైన.

“కావల్సింది కానియ్యండి”
“మహానుభావుడు మరికలేడు. ”
“గొప్ప మనసున్న మనిషి”
“అయినవాళ్ళకి అన్యాయం చేసిపోయాడు. ”
“గొప్ప భోగి, మారాజు”
“ఛ! గొప్ప యోగండి”
ఇటువంటి అనాలోచిత, అసందర్భ, అవ్వాకులు, చెవ్వాకులతో కాలం ముల్లుని ఆగిపోకుండా అరవడానికా అన్నట్లు అడప తడప మాటలు వినిపిస్తున్నాయి అప్పుడప్పుడు.

“చెయ్యాల్సిన పనులను కానియ్యండి” ఏ పనీ చేయకూడదని నిశ్చయించుకున్న వాళ్ళు అప్పుడప్పుడు అంటూనే ఉన్నారు. చెయ్యవలసిన పనులు చెయ్యాలని తెలిసిన వాళ్లందరకు ఆ పనులు చెయ్యడానికి డబ్బులవుతాయని తెలుసు. అది చాలా అవుతుందని కూడా తెలుసు. ఆ ఖర్చే మిగిలిన వాళ్ళని చెయ్యమని ప్రోత్సహించడానికి కారణం. ఎవరు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళకి సలహా ఇవ్వడానికి, సహాయం చెయ్యడానికి అందరు సిద్ధపడుతున్నారు. ఇటువంటి సమయాల్లో ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చే ఒక్క మనిషి అందరి ముందు శవంగా పడుకుని ఉన్నాడు. ఖర్చు పెట్టవలసిన బాధ్యత ఉన్న ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు పట్నంలో ఉన్నాడు. రెండవవాడు నిరుద్యోగి, ఏడుస్తూ తల్లితో పాటు శవం ప్రక్కనే ఉన్నాడు. తండ్రి పోయిన బాధతో కూతురు, ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో అన్న భయంతో పొరుగూరిలో తాలూకాఫీసులో గుమస్తాగా ఉన్న అల్లుడు అక్కడే ఉన్నారు.

జీవులు ఖర్చు లేకుండా పుట్టి, ఖర్చు లేకుండా చనిపోవడం ప్రకృతిలో సహజం. అటువంటి సహజమైన కార్యక్రమాన్ని నేటి నాగరిక సమాజంలో మనిషి తన తెలివితేటలతో ఖర్చు తప్పని కార్యక్రమాన్ని నేటి నాగరిక సమాజంలో మనిషి తన తెలివితేటలతో ఖర్చు తప్పని కార్యక్రమంగా మార్చాడు. ఖర్చు ఉన్న చోట లాభం కూడా ఉంటుంది. ఇలాంటి ఖర్చులో లాభం పొందే వ్యక్తి లింగమూర్తి. ఏవిధంగా తెలుసుకుంటాడో కాని, ఆ చుట్టుప్రక్కల ఊర్లలో ఏ వ్యక్తి చనిపోయినా, ప్రాణం పోయిన గంటలోపే శవం ఉన్న ఇంటిముందు వాలతాడు. పరిస్థితి గమనించి రంగంలోకి దూకుతాడు. అటువంటి లింగమూర్తి స్కూటర్ చప్పుడు ఆ ఇంటిముందు ఆగగానే అక్కడ ఉన్నవాళ్ళు ‘అమ్మయ్యా’ అన్న మాట నోటితో అనకపోయినా కళ్ళలో కనిపించింది.

లింగమూర్తి సరాసరి శవం దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసాడు. చనిపోయిన ఆయన భార్యని గుర్తించి ఆమెతో “అమ్మా, మహానుభావులు ఆయన. ఏ పుణ్యలోకాలకో పయనం అయ్యారు. అంత్యక్రియలని అశ్రద్ధ చేయరాదు. ఆ పూచీ నాది” అని ఆమె అంగీకారం కోసం అడిగినట్లు కాకుండా అడిగి, ఆమె అంగీకారపు చూపులని వెతికి పట్టి అంత్యక్రియల బాధ్యతని అవలీలగా భుజం మీద వేసుకున్నాడు లింగమూర్తి.

వెంటనే రెండో కొడుకుని లేపి బయటకు తీసుకెళ్ళి పెద్ద కొడుకు, మిగిలిన చుట్టాలందరి ఎడ్రస్ లు తీసుకున్నాడు. వారందరికి రమ్మనమని టెలిగ్రాములు ఇమ్మని ఒక అసిస్టెంటుని పిలిచి పురమాయించాడు. ఇంకో అసిస్టెంటుని పిలిచి ఇక్కడే ఉండి ఆ ఇంట్లో వాళ్ళకి, ఆ ఇంటికి వచ్చిన వాళ్ళకి కావలసిన కాఫీ, టీ అవసరాలని చూడమని ఆర్డరు వేసాడు. వాళ్ళకి కావలసిన డబ్బులు ఇచ్చి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు.

* * *

ఐదురోడ్ల జెంక్షన్లో టీ కొట్లో ఒక డబుల్ స్పెషల్ టీకి ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు లింగమూర్తి. అక్కడే చెల్లా చెదురుగా ఉన్న లింగమూర్తి మరికొందరు అసిస్టెంట్లు అతని చుట్టూ చేరారు. ఒకడివైపు చూసి,
“ఒరేయ్ బంద వీధిలో ఒక శవానికి సాయంత్రం నాలిగింటికి శవ దహనం. కావలసిన సామాను, ఏర్పాట్లు చూడు. కాంట్రాక్టు మాట్లాడ్డం అవ్వలేదు కాని పని మొదలు పెట్టాల. అంతా అరువులా ఉంది చూడబోతే. జాగ్రత్త” మరొకడివైపు చూసి “ఎక్కడున్నా సరే విఏఓని వెతికి పట్టుకో. డెత్ సర్టిఫికెట్ ఫారం నింపించి, సంతకాలు పెట్టించి మునిసిపాలిటీ ఆఫీసులో స్వయంగా ఇచ్చి మరీ నా దగ్గరకు మూడు మూడున్నర మధ్య రమ్మను. ” అన్నాడు. అప్పుడే వచ్చిన వేడి టీ తాగుతు, ఆ టీకొట్టునే ఆఫీసు చేసుకుని, చెయ్యాల్సిన పనులు పురమాయిస్తూ, రావల్సిన డబ్బులు లెక్కపెట్టుకుంటూ, ఒక రెండు గంటలపాటు తన వ్యాపారాన్ని కొనసాగించాడు లింగమూర్తి. తరవాత తద్దినం భోజనానికి ఇంకో ఇంటికి వెళ్ళాడు. అక్కడ సుష్టుగా భోజనం చేసి పనులెలా జరుగుతున్నాయో చూడడానికి ఉదయం పనులు పురమాయించిన బందవీధి ఇంటికి వచ్చాడు.

* * *

మధ్యాహ్నం అయ్యింది. అప్పటికి ఆ ఇంట్లో శవం ఉందని ఆ వీధి మొదలులోనే తెలిసేలా వచ్చేపోయే జనం, ఏడ్పులు, అంత్యక్రియకై శవాన్ని తీసుకుపోవడానికి చెయ్యబడుతున్న పాడె ఏర్పాటులతో ఆ వీధికి చావుకళ వచ్చేసింది. అప్పటికే విఎఓ వినయంగా ఒక పెద్ద కాగితాన్ని నింపించి, శవం అయి వాకిట్లో పడుకుని ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి అని చెప్పబడుతున్న వ్యక్తేనని, నిజంగానే చనిపోయాడని పూర్తిగా నిశ్చయించుకొని సంతకాలు తీసుకొని వెళ్ళాడు.

పై ఊర్ల నుండి రావలసిన చుట్టాలు ఒక్కొక్కరే వస్తున్నారు. సరిగ్గా మూడుగంటలకి పెద్దకొడుకు, భార్యా పిల్లలిద్దరితో వచ్చాడు. కొద్దిసేపు అతన్ని కుటుంబ సభ్యులతో గడపనిచ్చి, లింగమూర్తి అతన్ని వ్యవహారం మాట్లాడటానికి ప్రక్కకు తీసుకువెళ్ళాడు. జరగవలసిన కార్యక్రమం, ఖర్చు వివరాలు తెలిపాడు. అంత్యక్రియలకెంత, మొదటి మాసికందాకా ఎంత, మొదటి తద్దినందాకా అయితే ఎంత, ఇంతే కాక ఈ పనులన్నీ ఏ తరహాలో చేస్తే ఎంతవుతుందో, రాజమండ్రీ వెళితే ఎంతవుతుంది. కాశీదాకా అయితే ఎంత ఆధరలు, కార్యక్రమం వివరాలు విని పెద్దకొడుకు “ఇంత ఖర్చా? ఇంత పనా?” ఆశ్చర్యం. బాధా, ఖర్చు వలస వచ్చిన భయం కలిసిన గొంతుతో అన్నాడు.
“మీరేం కంగారు పడవద్దు. ఈ ఖర్చంతా అన్నదమ్ములిద్దరు పంచుకోవాలి” అన్నాడు లింగమూర్తి.

“మా తమ్ముడికి ఇంకా ఉద్యొగం లేదు. నా దగ్గర అంత డబ్బు లేదు. ” అన్నాడు పెద్ద కొడుకు.

“మరేం ఫరవాలేదు. ఈ ఇల్లు మీదే కదా? మీ నాన్నగారి పెన్షను, బేంక్ అకౌంట్లు ఉన్నాయికదా. మీరు ఊ అనండి చాలు నేను అంతా చూసుకుంటాను. ఈ ఊర్లోనే జరిపించేద్దాం. పెద్ద కొడుకుగా మీరు నిలబడితే చాలు. డబ్బు విషయంలో ఇబ్బంది ఏమీ రాకుండా, చెడ్డపేరు రాకుండా, భేష్ పెద్దకొడుకు చెయ్యవలసినదంతా శాస్త్ర ప్రకారం జరిపించాడన్న పేరొచ్చేలా నడిపించే బాధ్యత నాది. ” అని ఈ వృత్తిలోని తన అనుభవాన్ని అంతా ప్రదర్శించి ధైర్యం చెప్పి చివరగా “ఏమంటారు?” అని అడిగాడు లింగమూర్తి పెద్దకొడుకుని. “సరే, అలాగే కానీయండి” అన్నాడు పెద్ద కొడుకు.

ఆరోజు కార్యక్రమం అంతా లింగమూర్తి పద్ధతి ప్రకారం జరిపించాడు. సాయంత్రం వెళ్ళిపోయేముందు ఎంతో కొంత డబ్బు ఇమ్మని అడిగాడు. కట్టు బట్టలతో రైలు ఛార్జిలతో మాత్రమే బయలుదేరానని, పెద్దకొడుకు, ఇంట్లో ఎంత ఉందో తెలీదని రెండో కొడుకు మొత్తం మీద తమ దగ్గర డబ్బులేదని, తండ్రి బతికి ఉన్నవాళ్ళు ఇలాంటి ఖర్చులు పెట్టకూడదు కాబట్టి సహాయం చెయ్యడం లేదని అల్లుడు, మిగిలిన దగ్గర బంధువులు చెప్పారు.

మరేం ఫరవాలేదు. తరవాత చూసుకొందాం అని లింగమూర్తి వెళ్ళిపోయాడు.

* * *

ఆ రాత్రి నుండే ఆర్థిక పరమైన ఆలోచనలు, లెక్కలు అందరి బుర్రల్లో చోటు చేసుకున్నాయి. మర్నాడు తల్లి చెప్పగా అందరు సమష్టిగా తెలుసుకున్నది ఏమిటంటే గత ఏడాదిగా ఆ ఇంట్లో తండ్రి జబ్బే కానీ, నిలవ డబ్బేమీ లేదని ఆఖరి 500 రూపాయలు కూడా నిన్న తెల్లవారు ఝామునుండి ఆయన వైద్యం ఖర్చుతో తండ్రి ప్రాణంతో పాటు ఇల్లు విడిచి పెట్టిపోయాయని, అయితే ఆస్తి మాటేమిటి? పింఛన్ మాటేమిటి? బేంక్ ఎకౌంట్ల సంగతేమిటి?
ఆయనకున్న డబ్బంతా ఆయన పింఛన్ ఎకౌంటు. ఒక ఫిక్సుడు ఎకౌంటు. ఇవి కాక ఇల్లు. అంతే. అప్పుల సంగతి ఏమీ తెలీదు అప్పుడే. నికరంగా వీటినుండి వచ్చే డబ్బెంత అన్నది అంచనా వెయ్యడంలో అందరి బుర్రలు పని చేస్తున్నాయి. మర్నాడు ఉదయాన్నే లింగమూర్తి వచ్చి విషయం తెలుసుకుని బాంక్ పనులు ఎలా చెయ్యాలో వివరంగా చెప్పాడు. ఇంట్లో కావలసిన వస్తువులు ఉన్నాయోలేవో కనుక్కున్నాడు. ఇంట్లో మనుషులు చాలామంది ఉన్నా విస్తర్ల దగ్గర కూర్చోడానికే కానీ వండి వడ్డించడానికి ఎవ్వరు ముందుకు రారని, వంటమనిషిని కూడా ఏర్పాటు చేసి వెళ్ళాడు.

* * *

వివరాలు కనుక్కోడానికి పదో గంటకల్లా కొడుకులిద్దరు బేంక్కి వెళ్లారు. ‘అయ్యో’ ఆయన పోయారా. అయితే ఆ ఎకౌంట్లు కూడా డెడ్డే. రెండుమూడు నెలల నుండి కనిపించకపోతే ఊరు వెళ్ళారనుకున్నాం. ఆయనపేరన ఉన్న పింఛన్, ఫిక్సుడ్ ఎకౌంట్లలో నుండి డబ్బులు తీసి ఆ ఎకౌంట్లు క్లోజ్ చెయ్యాలంటే, ముందు ఆయన ‘డెత్ సర్టిఫికెట్’ మునిసిపల్ ఆఫీసునుండి, మీ అమ్మగారి పేరగానీ, మీలో ఎవరి పేరగానీ ‘లీగల్ హెర్ సర్టిఫికెట్’ మండలాఫీసునుండి తీసుకొచ్చి కొన్ని కాగితాలు నింపాలి. అవి మీరు ఎంత త్వరగా తీసుకురాగలిగితే ఆ ఎకౌంట్లకు అంత త్వరగా జీవం పోసిన వారవుతారు. అని చెప్తూ ఆయన ఎకౌంటున్న లెడ్జర్ పుస్తకాన్ని తెరిచి చూసి, “బాలెన్సు పదివేలు దాటిపోయిందే. అయితే ఫైలుపై ఆఫీసుకు పంపాలి. అంటే కనీసం మరో పదిరోజులవుతుంది ఆ బాలన్సు మీ కందేసరికి. ఇది కాక, మీ అమ్మగారికి రావల్సిన పెన్షన్ ఏర్పాట్లకి ఆ తరవాత మరో నెల, రెండు నెలలు పడుతుంది. మరి మీ ప్రయత్నాలు మీరు చేసి ఆ సర్టిఫికెట్లతో రండి. ” అని సానుభూతితో చెప్పారు బాంక్ వాళ్ళు.

అన్నదమ్ములిద్దరు ఆలోచనలో పడ్డారు. అంతా కలిపి ఐదు వందల కంటే ఎక్కువలేదు చేతిలో, అదీ తిరుగు ప్రయాణపు ఖర్చులకు గట్రా అని రైలెక్కే ముందు తోటి గుమస్తా దగ్గర చేబదులు తీసుకువచ్చింది. కర్మ చెయ్యాలి. కర్మ ఖర్చుతో కూడుకొన్నది. అదికాక ఇంటినిండా జనం. వాళ్ళందరికి వంటలు గట్రా. చాలా ఖర్చే. బాంక్లో పదివేలకి పైనే ఉందికాని అది ఎప్పుడు వస్తుంది? మరిప్పుడెలాగ?
* * *

ఎలా అన్న ప్రశ్నకి సమాధానం మర్నాడు లింగమూర్తి ఇచ్చాడు.

“కర్మకి పన్నెండు వేలు. మీ పై ఖర్చుకి ఒక మూడువేలు. మొత్తం పదిహేను వేలు. తక్షణం మీకు నూటికి నెలకి మూడు రూపాయల వడ్డీతో హామీపత్రం లేకుండానే ఇప్పిస్తాను. మీ డబ్బులు రాగానే వడ్డీతో సహా వెంఠనే తీర్చెయ్యండి. ఎంత తొందరగా తీరిస్తే మీకు అంత వడ్డీ మిగులు. ఆ తరవాత ప్రతి నెల మాసికానికి ఐదు వందలు ఇవ్వండి. ఆఖరిగా మొదటి తద్దినానికి అప్పటి ఖర్చుకు మూడువేలు జాగ్రత్త చేసి ఉంచండి. ప్రాణం చెప్పా పెట్టకుండా ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు కానీ తద్దినం మాత్రం ఎప్పుడు వచ్చేది ఏడాది ముందు నుండే తెలుస్తుంది. అప్పు ఏర్పాటుకి మీరు సరే అంటే సరి. అన్ని ఏర్పాట్లు, దక్షిణతో సహా నేను చూసుకుంటాను. కాదు అంటారు. మీరు భారం వహించి డబ్బు ఏర్పాటు చేసుకోండి, నేను నిలబడి పని నడిపిస్తాను. ఏ విషయం ఆలోచించుకుని రేపుదయానికల్లా నిశ్చయం చేయండి” అని లింగమూర్తి చెప్పాడు.

అంతా విని ఏమీ మాట్లాడని వాళ్ల మొహంలో పెట్టి “కాదంటారు, లేదా ఇంతకన్నా తక్కువలో కానిచ్చేద్దాం అంటారు. అది ఎంతో చెప్పండి. దానికి తగ్గట్టుల ఎలా చెయ్యాలో చెప్తాను. రెండు కాదంటారు మరొకర్ని చూసుకోండి నిన్నటి ఖర్చు ఫీజు మొత్తం మూడు వేలు ఇప్పించండి. నేను వెంఠనే వెళ్ళాలి. వెలంవారి వీధిలో క్రిందికి దించ మీదను పెట్ట అన్నట్లు కేసొకటుందని కబురొచ్చింది.” అని పఖ్ఖా వ్యాపారపరంగా చెప్పాడు.

మరోలా చెయ్యడానికి ముందుగా రాలేదు ఎవ్వరు. ఆ ఖర్చులకు సరిపడ డబ్బు ఎవ్వరి దగ్గర లేదు. అన్ని ఖర్చులు పెట్టుకుంటానంటున్నాడు. పైగా ఇంటి ఖర్చుకు డబ్బు ఇస్తానంటున్నాడు. ఇంకేం కావాలి బేంకులోని డబ్బు తొందరలోనే వస్తే, పెద్దగా వడ్డీ కూడా అవ్వదు. ప్రస్తుతం పని జరుగుతుంది. చేతిలో డబ్బు పడుతుంది. అని అందరు ప్రోత్సహించడంతో అన్నదమ్ములిద్దరు “సరే” అన్నారు.

అన్నట్టు డెత్ సర్టిఫికెట్కి అప్లికేషను విఎఓ గారిచేత నింపించాను. అది ఇప్పుడు మునిసిపల్ ఆఫీసులో ఉంది దాన్ని కదిలించే ప్రయత్నాలు చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు లింగమూర్తి.
* * *
వడ్డీ రేటు చాలా ఎక్కువే. ఆ సర్టిఫికెట్లు వెంటనే తెస్తే ఎక్కువ వడ్డీ కట్టుకోనఖ్కర్లేదు. బాంక్లో డబ్బులు బయటికి వస్తే ఈ ఖర్చులతో పాటు మన రైలు ఛార్జీలు కూడా తీసుకోవచ్చు అని సలహా ఇచ్చాడో మేనమామ. అదే సరైనదని నాలుగుసార్లు అనుకుని ఓ నిశ్చయానికి వచ్చారు.

అలా మొదలయ్యింది ‘డెత్ సర్టిఫికెట్’ వేట. అప్పుడు మునిసిపల్ ఆఫీసుకు వెళ్ళారు. పద్ధతి తెలుసుకున్నారు. విఎఓ నింపి ఇచ్చిన ‘ఫారం 10’లోని వివరాలను నిర్ధారణ పరచి, ఆ ఫారంలోని నమోదు చెయ్యబడ్డ వ్యక్తి నిజంగానే మరణించాడని ధ్రువపరచి జనన మరణ రికార్డులో నమోదు చేసి, ఫలానా వ్యక్తి చనిపోయాడని అన్ని ఆధారాల ద్వారా ధ్రువపరచడమైనదని ఒక సర్టిఫికెట్ తయారుచేసి దాన్ని మరో మునిసిపల్ ఉద్యోగి చేత కంపేర్ చేయించి, కమీషనర్ వారి దివ్య సుముఖాన పెట్టి, దానిపై వారి సంతకం పెట్టించి, రబ్బరు స్టాంపు, సీలు వేస్తేకాని అది ‘డెత్ సర్టిఫికెట్’ అవ్వదు. అప్పుడు పార్టీ పెట్టుకున్న వారికి అందిస్తారు.

అలా సంపాదించుకొన్న ‘డెత్ సర్టిఫికెట్’తో పాటు చనిపోయిన వ్యక్తి ఆస్తి వారసత్వానికి చనిపోయిన వ్యక్తి కుటుంబంలో ఎవరి పేరన ‘లీగల్ హెర్ సర్టిఫికెట్’ కావాలో నిర్ణయించుకుని, అట్టివారి పేరన ఆ సర్టిఫికెట్ ఇమ్మని కోరుతు మైనార్టి తీరిన కుటుంబ సభ్యులంతా సంతకాలు పెట్టి ఎమ్మార్వో గారి ఆఫీసులో దరఖాస్తు పెట్టుకోవాలి. ఎమ్మార్వో చనిపోయిన వ్యక్తి ఆస్తి వివరాలన్నీ వెలికితీసి, పరిశీలించి, ఆ ఆస్తులన్నింటికి ఈ దిగువన వ్రాయబడ్డ వ్యక్తి లేదా వ్యక్తులు లీగల్ హెర్ లు అని మరో సర్టిఫికెట్ ఇస్తారు. ఈ పనులు అవ్వడానికి ఎవరో ఒకరు ప్రతిరోజు చుట్టూ తిరగాలి. ఈ విషయం అర్థం కావడానికే వాళ్ళకి వారం రోజులు పట్టింది.

కర్మ అంతా అయిపోయిన నాటి సాయంత్రం ఆ ఊరిలోని వడ్డీ వ్యాపారి ఇంటికి వచ్చి,
“బాబు, తవరి నాన్నగారు ఈ ఇంటిని నాకు తనకా పెట్టి తమ సెల్లి పెళ్ళికి చేసిన అప్పు విషయం తమకు గుర్తుందనుకుంటాను” అన్నాడు.

“అవును తెలుసు” అన్నాడు పెద్ద కొడుకు.
“కానీ ఆ అప్పు తీరలేదని తెలుసనుకుంటాను”
“తెలీదండీ. అంతా నాన్నగారే చూసుకుంటూ ఉండే వారు కదా”

“నిజమే. పెద్ద మనిషి. మాటంటే మాటే. ప్రతినెలా సొమ్ము తెచ్చి మరీ ఇచ్చేవారు. ఆరోగ్యం బాగాలేక ఆరు మాసాలుగా వడ్డీ కూడా కట్టలేదు నేను నాలుగు సుట్లు వొచ్చి చూసాను. డబ్బులు అడగనేక ఎళ్ళిపోయాను. ఇంతలో ఇలా అయిపోనాది. డబ్బుతో యవ్వారం కదా. పైగా వడ్డీ కూడా రావడం లేదు మరి మీరు ఈ అప్పు చెల్లు పెట్టాలనుకుంటున్నారో నేదో తెలీదు. మీకా ఇప్పుడు చాలా డబ్బు ఖర్చై ఉంటది. అవసరం కూడా ఉంటది. నాకా నాలుగేళ్ళ నుండి నా డబ్బు ఈ ఇంటిలో ఇరుక్కుపోనాది. అంచేత అందరి అవసరాలు తీరతా ఈ ఇల్లు వేలాం వేసేసి వచ్చిన డబ్బులో నా వడ్డీ అసలు పోగా మిగిలినది మీరు తీసుకుంటే బాగుంటది. మీరేటంటారు? ” అని ఆగాడు.

వడ్డీ వ్యాపారి ఎంత సాధారణంగా అన్నా, ఈ మాటలు వడగళ్ళ వానలా కురిసాయి. బాధ ఎక్కువైపోయినప్పుడు భాష తక్కువైపోయిలోని ఘోషంతా ఒకటి రెండక్షరాలలో మాత్రమే వెలికి వస్తుంది కాబోలు.

“ఆ... ” అని మాత్రమే ఆగిపోయాడు పెద్దకొడుకు.

“గాభరానేదు. నేను రేపే వేలం వేస్తాననడం లేదు. తమరు మళ్ళీ మాసికాలకి ఎలాగో రావాలికదా. అంచేత మాసికం అయినతరువాతే ఆపని కానిద్దాం” అన్నాడు వడ్డీ వ్యాపారి.

“పెద్దకొడుకు తేరుకుని, అమ్మతో మాట్లాడి చెప్తాను” అన్నాడు.

వరద ఇంటిని ముంచెయ్యడానికి వస్తున్నప్పుడు చేతులడ్డు పెట్టి ఆపలేనని తెలుసుకున్న వాడిలా ‘అమ్మా’ భయంతో వణికిపోతున్న గొంతుతో పిలుస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. తల్లికి విషయం వివరించాడు. ‘వేలాం’ పదం విన్న వెంటనే.

“నా కవేం తెలీదురా. నా కవేం తెలీదురా. ఈ ఇల్లు నిలపరా” ఈ ఇంట్లోనే నన్ను కూడా పోనీరా నాయనా. ” అంటూ తండ్రి పోయినప్పుడు కూడా ఏడవనంత గట్టిగా బావురుమంది.

బొటా బొటి జీతంలో ఇద్దరు పిల్లలు భార్యతో పట్నంలో గొర్రె తోకలాంటి గుమస్తాగిరితో, చిన్న వాటాలో అద్దెకుంటూ దారిద్ర్య రేఖ త్రాటి మీద గారడీ వాడిలా అడుగు అడుగు వేస్తున్న ఆ ఇంటి పెద్దకొడుకు ఈ పరిస్థితులలో ఏమని ఓదార్చగలడు. ఆ ఇంటి వాటాలో సగం తనకి కూడా ఉందన్న ఆశతో పడుకున్నప్పుడు చంద్రుణ్ణి చూడడానికి చిన్నది చుక్కల్ని చూడడానికి పెద్దది అయిన పెంకుటింటి కన్నాలలో కనబడే నక్షత్రం లాంటి ఆశ ఉల్కలా తెగి పడినప్పుడు పట్టుకుంటే చెయ్యి కాలుతుందన్న జ్ఞానం ముందుకి వెళ్ళనీయకుండా, కోల్పోతున్నానన్న ఊహ నిలవనియ్యని పరిస్థితిలో ఉండి, తనని తానే ఓదార్చుకో లేనివాడు మరొకర్ని ఎలా ఓదార్చగలడు.

తల్లి ఏడుపు విని పక్కింటిలో ఉన్న లెఖ్కల మేష్టారు “ఏమైంది ఏమైంది” అని పరిగెట్టుకుంటూ వచ్చి వాకిటిలో వడ్డీ వ్యాపారిని చూడగానే విషయం అర్థమైంది కాబోలు ఆ ప్రశ్న ఆపేసారు. ఇంట్లోకి వెళ్ళి పెద్దకొడుకుని వివరాలు అడిగి తెలుసుకన్నారు. నోటి లెఖ్ఖలు వేసారు. నిట్టూర్చారు. ఒక కొద్దిసేపు ఆలోచించీ “చూడవోయ్, ఇక ఈ ఇంట్లో ఉండవలసింది మీ తమ్ముడు మీ అమ్మగారే కదా. అంచేత ఒక గది, వరండా అద్దెకు ఇస్తే ఆ సొమ్ము, మీ నాన్నగారి వల్ల వచ్చే పింఛన్ తో మీ తమ్ముడికి ఒక ఉద్యోగం వచ్చేదాకా వడ్డీ కట్టడానికి సరిపోతుంది. ఆ తరవాత ఒక పద్ధతి ప్రకారం మొత్తం అప్పే తీర్చెయ్యవచ్చు. ఇలా అయితే ఇల్లు దక్కుతుంది.” అన్నారు.

ఈ మాటలతో తల్లికి, కొడుకుకి కొంత ఊరట కలిగింది.

లెఖ్ఖల మాష్టారు, పెద్ద కొడుకు వడ్డీ వ్యాపారికి ఈ విషయం చెప్పి వేలం వెయ్యవద్దని కోరారు. అంతా విని “మాష్టారు ఇన్ని లంకెలతో యాపారం సాగదండి. ఈ ఖాతాలో ఇప్పటికే సానా డబ్బు ఇరుక్కుపోయిందండి. నెలరోజులలో కొంత మొత్తం చేతిలో పడాలి. ఆపై ప్రతీ నెలా వడ్డీతోపాటు అసలులో కనీసం ఐదు వందలైనా కట్టాలి. అది మీకు కుదరకపోతే నెలరోజులలో ఈ ఇల్లు వేలం వెయ్యక తప్పదు. మరి మీరే ఆలోచించుకుని చెప్పండి.” ఇదే ఆఖరి మాట అన్నట్లు అని వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి చాలాసేపు మాష్టారితో అన్నదమ్ములిద్దరు ఆలోచించారు. మాసికం నాటికి లింగమూర్తికి, వడ్డీ వ్యాపారికి డబ్బు ఇవ్వాలి. బేంక్ ఎకౌంటులలో ఉన్న డబ్బంతా చేతికి వస్తే కానీ ఇల్లు నిలబడదు. ఆ డబ్బు చేతికి అందాలి అంటే ”డెత్ సర్టిఫికెట్” లీగల్ హెర్ సర్టిఫికెట్ రావాలి.
* * *
ఈ తిరుగుడు పని నిరుద్యోగి అయిన రెండో కొడుక్కి అప్పజెప్పిఅందరు వెళ్ళిపోయారు.

‘డెత్ సర్టిఫికెట్ కోసమా, కన్సర్నడ్ క్లర్కు సీట్లో లేరండి.’
‘ఎప్పుడోస్తారో? తెలీదండి. రేపు ట్రై చెయ్యండి.’
‘మీరొస్తారాని ఆయన మరే పనులు పెట్టుకోకుండా మీకోసం ఎదురు చూడమన్నారు కాదు. ఇంకాను?’

‘పదిగంటలకి వస్తారేమో అంటే, పదిగంటలకే వచ్చేస్తారా? ఏ ఊరుసార్ మన్ది’

‘చాలాసార్లు వచ్చాను. వచ్చాను అని చెప్పుకుందికి, అదేమైనా పెద్ద క్వాలిఫికేషనా అంట?’
‘చూసారా ఇక్కడెన్ని ఫైల్సున్నాయో, మరి పని చేస్తున్నామా?’

‘ఎప్పుడిస్తామా? మీ ఫైలు పని పూర్తి అయిన వెంటనే పువ్వుల్లో పెట్టి మీ డెత్ సర్టిఫికెట్ మీకిచ్చేస్తాం.’

‘ఇక వెళ్ళండి. మీరిలా వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే మరి మేం పనిచేసేది ఎట్టాంట!’
‘ఒక వారం రోజులలో రండి.’
‘నేను చెయ్యవలసింది అయిపోయింది కమీషనర్ గారు కేంపుకెళ్ళారు. రేపు రండి.’
‘బేడ్ లక్కండి. వచ్చారు కానీ ఇప్పుడే బయటకు వెళ్ళారు. ‘
‘రేపు రండి. నేను సంతకాలు చేయించేస్తాను.’
‘రమ్మంటే చేతులూపుకొని వచ్చేస్తారు. మీకు పనులెలా జరిపించుకోవాలో తెలీదు.’

ఇలాంటి జవాబులు విని విని విసిగిన రెండో కొడుకు ఇంక ఆవేశం ఆపుకోలేక ఒకరోజు, “నాకు తెలుసండి నాకు చాలా విషయాలు తెలుసు. ఎన్ని రోజులు ఇలా తిరిగినా మా నాన్నగారి డెత్ సర్టిఫికెట్ మామూలుగా రాదు. ఇక్కడ డబ్బు ఇవ్వందే ఏ పనీ జరగదు. కానీ ఇవ్వడానికావలసిన డబ్బులేదు. ఊర్లో ఇక అప్పు పుట్టడం లేదు. అందుకే ఇలా మీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాను. ఇంకో రెండు రోజులలో మీరిచ్చే డెత్ సర్టిఫికెట్ వస్తే కానీ మా ఇల్లు నిలబడదు. ఆపై మాకు రోజు కూడా గడవదండి. ” అన్నాడు.

ఆఫీసులో చుట్టూ ఉన్న అందరు నోటమాట రాక వారి వారి సీట్లలో కదలలేక అతుక్కుపోయినట్లు కూర్చోన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన మునిసిపాలిటి కౌన్సిలర్ గుమ్మంలోనే ఆగిపోయాడు.

“మీరివ్వవలసిన ఓ కాగితం పై రేపటి మా బ్రతుకు రెపరెపలాడుతూ రోడ్డు ప్రక్క విస్తరాకులా పడి ఉందని మీకు తెలుసా? రోజు ఆఫీసుకొచ్చి మీరు కదపని ఈ కాగితాలతో మనుషుల బ్రతుకులు ఆధారపడి ఉన్నాయండి. మీరు మునుషలమని అనుకుంటే దయచేసి వాటితో ఆడుకోకండి.” అని అందరివైపు ఒక్కసారి చూసి, నిరాశతో వెనక్కి తిరిగి నడిచి వెళ్ళిపోయాడు.

* * *

రెండోనాడు ఉదయం పెద్దకొడుకు కొద్దిమంది దగ్గరవాళ్ళు మాసికానికి వచ్చారు. రావలసిన డెత్ సర్టిఫికెట్ రాలేదు. కానీ ఇవ్వవలసిన డబ్బుకి పెట్టిన గడువు రేపటితో తీరిపోతుంది. ఇక ఎల్లుండి ఇల్లు వేలాం వెయ్యక తప్పదన్న విషయం అందరికి అర్థం అయ్యింది. మాసిక జరుగుతున్నాది. ఇల్లు శ్మశానంలా ఉంది. తల్లి రెండో కొడుకుల గుండెలు ఎంతకీ రాని వర్షానికి ఎదురు చూసి ఎదురుచూసి ఎండిపోయాయి, బీటలు వారడానికి...
- ఆంధ్రజ్యోతి, 20 జూన్ 2000


1 వ్యాఖ్యలు:

Anonymous said...

Gradual change is visible in your stories from this story to auto-rickshaw...from stereo typed cynical no solution stories to a more useful and suggestive stories.

Ramadevi godugula