Saturday, May 16, 2009

జీవధారలో తడుస్తూ.... (సంపాదకీయం)

Saturday, May 16, 2009
కలశపూడి శ్రీనివాసరావు గారి రచనలు చదివిన వారికి దూరానవున్నదేదో దగ్గరవుతున్నదన్న భావన కలుగుతుంది. బహుశా దూరతీరాల వెంట తిరుగాడే వారికి గాలి, నీరు, వెలుగు, వెన్నెల వంటి ప్రకృతి శక్తులన్నీ తమ వాహికలో, మాధ్యమాలో అనిపిస్తాయేమో! ఫలితంగా కాళిదాసుకు ఒక మేఘం, జాషువాకు ఒక గబ్బిలం రాయబారాలు చేస్తే, ప్రవాస భారతీయులకు ప్రకృతి శక్తులన్నీ సొంతనేలవైపు సాగిపోతున్న దూతలై, తిరుగు ప్రయాణంలో అక్కడి అనుభవాలు మోసుకొస్తున్న గాధలౌతాయి. దేశానికి దూరాలలో వుండే వారికి ఒక ఎడబాటు భావన వుంటుంది. అందునా కవి హృదయం వున్న వారిలో మరికొంత ఎక్కువ ఉంటుంది. దీన్ని దూరం చేసుకునే యత్నాలలో ఆత్మీయులతో భావాలు పంచుకోవటం ఒకటైతే, ఆ భావనకు అక్షర రూపం ఇచ్చి అజ్ఞాత మిత్రులతో కూడా కరచాలనానికి చొరవ తీసుకోవటం మరొకటి.

కలశపూడి శ్రీనివాసరావు గారి రచనలతో కథానికలు, గల్పికలు,వ్యాసాలు, వచన కవితలు వున్నాయి. ఈ అన్ని ప్రక్రియల్లోని రచనల్లో మనకు కనిపించేది తన దేశంపట్ల, తన వూరిపట్ల రచయితకున్న నిసర్గమైన అభిమానం. ఇది సంఘసంస్కరణ భావాల రూపంలో కూడా మనకు దర్శనమిస్తుంది. ఈ సంస్కరణ భావాలు కేవలం భావాలు కావు. ఒక దూరదృష్టి వున్న మేధావి రచించిన పథకాలు. ఇవి సమస్యా పరిష్కారానికి కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలు మనముందుంచుతాయి. అంటే Theory తో పాటు application ను కూడా వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆచరణాత్మకతకు ఆమడదూరంలో వుండే ఆదర్శాలతో శ్రీనివాసరావు గారికి పని లేదు. ఉదహరణకు ‘ఆటోమీటర్ – ఆటోమేటిక్’ అన్న మొదటి కథ చూడండి. హైదరాబాదులో వినియోగదారుడు ఆటోలో ప్రయాణం చెయ్యాలంటే, మీటర్ చూపించే డబ్బుమీద కొంత అదనంగా ఇవ్వాలి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే వుద్దేశంలో విశ్వం అన్న స్టాటిస్టిక్స్ లెక్చరర్ శాస్త్రీయ అవగాహనతో, తన విద్యార్థుల సహాయంతో ఒక ప్రాజెక్టు చేపడతాడు. దీనిలో మీటర్ ప్రకారం డబ్బు తీసుకున్న ఆటోడ్రైవర్లు, దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన డ్రైవర్లకన్నా ఎక్కువ సంపాదించారని తేలుతుంది. ఈ కథకు కథానాయకుడి నాయకత్వ లక్షణం జీవశక్తి. దీన్ని వెలికితీయటంలో రచయిత కృతార్థుడైనాడని చెప్పవచ్చు.

సమాజంలో పురుషాధిక్యత ఘనీభవించి వున్న కాలంలో భర్త భార్యను దండించటం ఒక సాధారణ అంశంగా వుండేది. ఆధునిక యుగంలో విద్యావ్యాప్తి, సంస్కరణ భావాల ప్రచారం జరిగిన తర్వాత కూడా భారతదేశంలో భార్యభర్తల సంబంధాలలో సమానత్వం రాలేదు. ‘స్త్రీవాదం’ అన్నది తెలుగునాట ఒక ఉద్యమంగా వచ్చిందంటే, చదువుకున్న వర్గాలలో కూడా ఎంత వివక్ష వుందో అర్థం చేసుకోవచ్చు. ‘మీ ఆవిడను కొట్టారా?’ అన్న కథ రెండు తరాల స్త్రీల దైన్యాన్ని కథనం చేస్తుంది. జానకమ్మ, ఆమె కోడలు కోమల ఇద్దరూ తమతమ భర్తల మూలంగా మాటలపరంగా, మానసికంగా, దైహికంగా హింసను – మరొకమాటలో నిత్య హింసను అనుభవించిన వాళ్ళే. తరాల అంతరం అన్నదానికి అక్కడ అంతగా తేడా కనిపించదు. ఇది వంశపారంపర్యంగా సంక్రమించే జబ్బని, తన భర్తకు వున్న దుర్గుణాలే, తన కొడుక్కు సంక్రమించాయని జానకమ్మ నమ్మకం.

ఒక ఆటవికమైన ధోరణి, సంస్కారరహితమైన ప్రవర్తన సున్నితమైన మానసిక స్థితి వున్నవారిని వేటాడుతుంది. అతడు కథకుడు కావచ్చు, పాఠకుడూ కావచ్చు. ఈ కథలో జరిగింది అదే. అందుకే, భార్యలమీద జరుగుతున్న పీడనను కొంత తక్కువ స్థాయిలోనే జానకమ్మ కథనం చేస్తున్నా, భావుకుడైన రచయిత దాన్ని తీవ్రమైన విషయంగానే పరిగణిస్తాడు. అతనిలోని ఈ ప్రతిచర్యను గమనించిన జానకమ్మ అతని కాళ్ళమీద పడి తన ‘కొడుక్కు బదులు తనను జైల్లో పెట్టించమని కోరుతుంది! ఇట్లాంటి ఫలితం రాబట్టటం కథకుడుగా శ్రీనివాసరావు గారు సాధించిన సాఫల్యం. ‘మీ ఆవిడను కొట్టరా?’ అన్న ప్రశ్నకు సంబంధించి తనలో చెలరేగుతున్న కల్లోలాన్ని రచయిత మనలోకి బదలాయిస్తారు. దీంతో కథ ముగిసినా, దాని ప్రభావం పాఠకుల మీద పనిచేస్తూనే వుంటుంది.

‘తైలవర్ణ చిత్రం’ అన్న కథానికను విదేశాల్లో వున్న వర్ణ వివక్షను ఒక ఆఫ్రో-అమెరికన్ తాను వేసిన వర్ణచిత్రంతో జయించిన ఉదంతంగా చెప్పుకోవచ్చు. ఇది పైకి సరదాగా అనిపిస్తూనే కళకు వున్న శక్తిని నిరూపించే కథానిక, కథకుని కుటుంబం అతనికి ఆ రాత్రి ఆశ్రయం ఇవ్వటం సంస్కారానికి సంబంధించిన అంశం కాగా, కళాకారుడు వాళ్ళకోసం ఒక వర్ణచిత్రం గీసి బహూకరించటం కృతజ్ఞతా సూచకం. వేలంపాటలో ఆ కళాకృతిని అమ్మటంలో డబ్బు వ్యవహారం వున్నా, ఆ కళను మరింత బాగా అర్థం చేసుకుని ప్రేరణ పొందేవారికి అది సంక్రమించటం మంచిదే. అందునా, కొన్న వ్యక్తి తెల్లవాడైవుంటే, ఆ ప్రయోజనం మరింత బలంగా నెరవేరినట్లే! దీన్నే ‘ధ్వని’ అంటారు. చిన్నకథలో ఒక ప్రధాన సంఘటన, ఒక ముఖ్యమైన అంశం, పరిమితమైన పాత్రలు వుండాలని విమర్శకులు చెప్తారు. ఎంత చిన్న కథ అయినా, అది పూర్తయిన తర్వాత మరేమీ చెప్పవలసింది మిగలలేదన్న భావన పాఠకులకు కలగాలంటారు. దీన్నే సమగ్రత అనీ అనవచ్చు. వీటన్నింటి ఫలితంగా అనుభూతి కూడా కలిగితే అది మరింత మంచికథ అవుతుంది. పై కథలలో ఇవన్నీ కొద్దిపాటి తేడాలతో వున్నాయి.

ఈ కథానికల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది, ‘బొబ్బిలి 1876’. అన్ని చారిత్రకమైన జాగ్రత్తలు రచయిత తీసుకున్నారు. ఈ కథానికలో 1876 నాటికి బారెట్లా ఉత్తీర్ణుడై ఇంగ్లాండులో ఒక ప్రముఖ న్యాయవాది సహచరుడుగా పని చేస్తున్న వేణుగోపాలాచార్యుల వారు, విద్యావైద్య రంగాల మీద, వాటిని ప్రజల అందుబాటులోకి తెచ్చే ప్రణాళికల మీద బొబ్బిలి రాణి వారి సమక్షంలో జరిగిన చర్చలో పాల్గొని తన ప్రత్యేకతను చాటుకుంటారు. మతాతీత దృష్టితో ఒక పర్షియన్ కవి కుమార్తెను వివాహమాడడానికి నిర్ణయించుకుంటారు. కథానిక ఇలాగే సాగుతుందని భావిస్తున్న పాఠకులు – ఇది కేవలం రచయిత కల అని తెలుసుకోవటంతో, ఒక చారిత్రక ఘట్టం నుంచి వాస్తవికతలోకి – బలవంతంగా – వస్తారు. నిజానికి దీన్ని ఆద్యంతం చారిత్రక కథానిక గానే మలిచివుంటే బాగుండేది.

శ్రీనివాసరావు గారు రాసిన వ్యాసాలలో ఒక తడి వుంటుంది. దీంతో Matter of Fact ను చెప్పవలసిన వ్యాసం కూడా సజీవమైన భావాలను కలిగి ఉంటుంది. దీంతో పాఠకుడు కూడా వ్యాసకర్తతో పాటుగా సహచరిస్తాడు. చిన్నప్పటి జ్ఞాపకాల తోరణంగా కదలాడే ‘మాఊరంటే నాకిష్టం’ రచన ఇందుకు మంచి ఉదాహరణ. ఇది చదివిన పాఠకుడు రెండు ప్రయాణాలు చేస్తాడు. ఒకటి తన ఊరివైపు, రెండు తన బాల్యంలోకి!

అమెరికాలో తెలుగు వారి అస్తిత్వానికి సంబంధించిన వ్యాసాలు కూడా వీరు రాశారు. భౌతికమైన అస్తిత్వం అన్నది పెద్ద సమస్య. కాని విదేశాల్లో, భాషాపరమైన, సంస్కృతిపరమైన అస్తిత్వాల కోసం పడే సంఘర్షణ ఎప్పుడూ చర్చనీయాంశంగానే వుంటుంది. అమెరికా తెలుగువారు, ఆ మాటకొస్తే ఏ దేశంలో వున్న ప్రవాసాంధ్రులైనా రెండు భాషల మధ్య, రెండు సంస్కృతుల మధ్య నలిగిపోతారు. వారికి అక్కడ పుట్టిన తమ పిల్లల విషయమై అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే, అక్కడి మహా యాంత్రికతకు తలొగ్గి జీవించే వాళ్ళకు ఇవేవీ సమస్యలు కాకపోవచ్చు. కాని, తాను ‘పుట్టి పెరిగిన దేశం సంస్కృతిని, పూర్వీకుల నుండి సంక్రమించిన మాతృభాషను రక్షించుకుందాం, వారసులకు మనమిచ్చే నిజమైన సిరసంపదలు ఇవే’ అని సున్నిత మానసిక సంస్కారంతో, అభిమానంతో ఆరాటపడి పోరాటాలు చేసే వారు కొందరుంటారు. శ్రీనివాసరావుగారు ఈ కోవకు చెందినవారన్నది వారి అన్ని వ్యాసాలు నిరూపిస్తాయి. ‘పెరుగుతున్న సంఘాలు – తరుగుతున్న భాష’ అన్న పెద్ద వ్యాసం ఇందుకు నిదర్శనం. ‘తానా’, ‘ఆటా’ – వంటి అంతర్జాతీయ స్థాయి వున్న సంఘాలు ఈ రంగాలలో చేస్తున్న కృషిని ప్రశంసిస్తూనే, చేయవలసింది ఎంతో వుందని చెప్తున్నారు. అందుకు నిర్మాణాత్మకమైన సూచనలు కూడా చేస్తున్నారు. ఇదిగో, ఇక్కడే శ్రీనివాసరావు గారి ప్రత్యేకత కూడా వుంది. ముఖ్యంగా – ఈ సంఘాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా చేపట్టవలసిన కార్యక్రమాలెన్నో వున్నాయంటారు. ఇది సత్యాధికం. భారత రాజకీయ నాయకుల ప్రసంగాలతో అన్ని రంగాలు బీడువారిన స్థితిలో వున్నప్పుడు, భూలోక స్వర్గం నుంచి జీవగంగ ప్రవహించి రావలసి వుంది.

కవిత్వంలో కూడా తెలుగు భాషాభిమానాన్ని ప్రకటించే కవితలున్నాయి. వరకట్న సమస్య మీద రాసిన ‘వసుంధరా’ కవితలో గురజాడ అప్పారావు, గుడిపాటి వెంకటచలం గారల ప్రస్తావనలున్నాయి. వీళ్ళిద్దరూ స్త్రీపురుష సమానత్వం గూర్చి కలలు కని వారికి కలాలను అంకితం చేసినవారే.

‘మనిషిని మనిషిగా
చూడని వాళ్ళు
మళ్ళీమళ్ళీ
దళితులను సృష్టిస్తుంటారు’ (‘ఎదురుచూస్తూ’)

ఈ కవితాపంక్తులు శ్రీనివాసరావు గారి తాత్వికమైన లోతును ప్రదర్శిస్తున్నాయి, అదీ కవితాత్మకంగా. అన్ని దేశాల్లో ఏదో ఒక స్థానిక నామంతో ‘దళితులు’న్నారు. ఇది సంస్కృతీ నాగరికతలను ప్రశ్నార్థకం చేస్తున్న అంశం. ఇది కుల సమస్య మాత్రమే కాదు. సంస్కారానికి ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కూడా. ఎదుటివాణ్ణి మనిషిగా చూడనివాడు – ముందు – తాను మానసికంగా, తాత్త్వికంగా పతనమై పోతున్నాడు. అంటే కులపరంగా తక్కువగా చూడబడుతున్న దళితుడే పతనావస్థలో వున్న అసలు దళితుని కన్నా ఉన్నతుడు. ఫలితంగా పతిత దళితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది.

‘ప్రేమ’ అన్న కవిత ముగింపు చూడండి-
‘ప్రేమ స్వార్థానికి పరాకాష్ఠ
తన్నితాను ప్రేమించుకునే మనిషి
అంతర్భాగంగా సమాజాన్ని ప్రేమిస్తే రుషి’

ప్రేమకు ఉన్న అన్ని షేడ్స్ ను ఈ కవితలో ప్రదర్శించారు కవి. చివర సారాంశంలో మనిషి తనను తాను ప్రేమించుకునే ఆదిమ దశలోనే వున్నాడంటున్నారు. మరి సమస్యల పరిష్కారం సంగతి? సమాజాన్ని కూడా ప్రేమిస్తే – మనిషి రుషిగా పరిణామం చెందుతాడన్నది కవి గాఢ విశ్వాసం.

‘నా నృషి కురుతే కావ్యం’ అన్నారు ఆలంకారికులు. అంటే రుషి కానివాడు కావ్యం రాయలేడన్నది వాళ్ళ విశ్వాసం. రుషికానివాడు సమసమాజ కావ్యాన్ని రచించలేడన్నది శ్రీనివాసరావు గారి విశ్వాసం. విశ్వాసం మాత్రమే కాదు, ఆదర్శ ఆచరణలను ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా పీలుస్తూ జీవిస్తున్న శ్రీనివాసరావుగారి సంకల్పం కూడా అదే. సంకల్పబలం వున్నవారు సాధించే పనులే కల్పాంతం దాకా నిలుస్తాయి. అందుకే ఉద్యమకారుల బాటలో నడుస్తూ శ్రీనివాసరావుగారు మరెన్నో సత్ఫలితాలు సాధించాలని ఆశిస్తున్నాను.


డా. అమ్మంగి వేణుగోపాల్
11-7-2008
11-9-130/3, లక్ష్మీనగర్, వీధి సంఖ్య 4,
కొత్తపేట, హైదరాబాద్ – 500 035.
ఫోన్ 9441054637, 040-24040276





0 వ్యాఖ్యలు: