Thursday, May 14, 2009

తెలుగు మాట్లాడడం, తెలుగు నేర్పడం

Thursday, May 14, 2009
పరాయి భాష మాట్లాడే ప్రాంతాలలో బ్రతుకుతున్నప్పుడు ఆ భాష నేర్చుకోకపోతే ఎంత బాధ పడతామో, అలాగే పుట్టుక నుండి పరాయి భాష నేర్చుకొనేదాకా మాట్లాడిన మాతృభాషను మాట్లాడలేకపోతే అంతే మానసిక వ్యధను చెందుతాం. కాని ఎన్నో మానసిక బాధలని, ఆవేదనలని అణచి వేసి, నలుగురితో కలిసిపోయినట్లే, ఈ వ్యధను కూడా మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ మరిచిపోతాం. ఇది నిత్యసత్యం. మొదటిది మనలో చాలామందికి ఎదురైన విషయం.

తెలుగు నేర్పడం

ఏఏ ఉద్దేశాలతో మనుషులు పిల్లల్ని కంటారో అటువంటి ఉద్దేశాలతోనే భాషను నేర్పడం కూడా చేయాలి. అమెరికా వచ్చిన తరువాతనైన డబ్బుతో అన్నీ కొనలేమని తెలుసుకోకుండా వుండలేము. ఎటువంటి ఉపయోగం లేదని తెలగు నేర్పడం మానివేయడం, మనిషి తెలివి తక్కువతనానికి ఒక ఉదాహరణ. మన పిల్లలు ఎలా అన్ని రంగాలలో ఉన్నతస్థానాలు పొందాలని ఆశిస్తున్నామో, మన భాషలో కూడా వారు అలా ఉన్నత స్థాయి చేరుకోవాలనే ఆలోచన మనకు ఉండాలి. ఉన్మాదంతో విధ్వంసక చర్యలకు పూనుకొనే మత, భాష, జాతి ఉన్మాదులు ఎంత చెడ్డవారో, అలసత్వంతో, అవివేకంతో, అజ్ఞానంతో, భాషని నిర్లక్ష్యం చేసేవారు కూడా అంతే.


కాలగమనంలో కొన్ని భాషలు మరుగుపడి, కొత్త భాషా రూపాలకి దోహదం చేస్తున్న విషయం, పరిణామ చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాం. ఏనాడో సమసిపోతుందన్న భయంతో, సజీవంగా ఉన్న భాషను నిర్లక్ష్యం చేయడం, చచ్చిపోతాం కదా అని అన్నీ వదులుకొని రాబోయే చావుకోసం ఇప్పుడే ఎదురు చూసేవారి తీరును గుర్తుకు తెస్తుంది.


భాషా వికాసం మానసిక వికాసాన్ని ప్రతిబింబిస్తుంది. మానవ చరిత్రలో భాషా వికాసాన్ని తెలపడానికి నేడు మనకు ఉన్నన్ని అవకాశాలు పూర్వం లేవు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా భాషను మర్చిపోవడం- సంతకొచ్చి తెచ్చిన ధాన్యాన్ని అమ్మక పారవేసి పోయే రైతును తలపింపచేస్తోంది.


అమెరికాలో తెలుగు నేర్పించడానికి తగిన ప్రోత్సాహం ఇస్తే తెలుగువారి పిల్లలే కాదు, అందరూ ముందుకొస్తారు. ఆ ప్రోత్సాహానికి కావలసినవి సమకూర్చడం కూడా మనం భాషని సజీవం చెయ్యడంలో భాగంగా చూడాలి.





0 వ్యాఖ్యలు: