Thursday, September 24, 2009

ఆత్మస్పర్శ

Thursday, September 24, 2009
పని వత్తిడి పెరుగుతున్నకొద్దీ అంతకంతకు మేష్టారి జ్ఞాపకం ఎక్కువైపోతుంది. ఈ రోజు ఒకసారి చూసిరావలనే తపన అధికమైంది. వెంటనే మాష్టారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకొని ఆఫీసు కుర్చీలోంచి లేచాను. ఇంతలో ఫోను వచ్చింది. “మన మాష్టారు చనిపోయారు... మేష్టారు...” ఏడుస్తూ ఏడుపుని ఆపుకుంటూ మిత్రుడు సతీష్ చెప్పాడు. మాష్టారి నవ్వుమొహం ఒక్కసారి నా మెదడులో మెరుపులా మెరసి మాయమయ్యింది. మెరుపు పోయిన తరవాత మిగిలే చీకటి నాచుట్టూ ఆవరించినట్లు తోచింది. ఫోనులోనే ఏడుస్తున్న మిత్రుణ్ణి ఊరడించి ఫోను పెట్టేసాను. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఉదయం నుండి మేష్టారి ఆలోచనలే. సాయంకాలానికి ఈ వార్త! కుప్పకూలిపోయాను.

తెల్లని పేంటు షర్టులో, ఎప్పుడూ నవ్వుమొహంతో కనిపించే ఆయన్ని చూసి ఆయన్ని తెలియని వాళ్ళు కూడా ఆయనే మాష్టరు అయ్యుంటారని అనుకొంటారు. మూడవ తరగతిలో మొదటిసారి మాష్టార్ని చూసాను. అర్థం కాకపోయినా విని తలూపడం రాదు నాకు. అర్థమయ్యేదాకా పదే పదే ప్రశ్నంచే వాడిని, ఇలా ఎందుకు? అలా ఎందుకు? అని ఇంట్లోనూ, బళ్లోనూ అడుగుతూ ఉండేవాడని, అలాంటి నన్ను ఒకరోజు ఈ మాష్టారు క్లాసులో నిలబెట్టి ‘క’ గుణింతం చెప్పరా అన్నారు. మూడో క్లాసువాడిని నన్ను ‘క’ గుణింతం అడుగుతారా అని నాకు చాలా నామోషిగా అనిపించింది. నాకు ‘క’ గుణింతం రాదని అనుమానమా?” అని అడిగాను.

“అదికాదురా నువ్వు చెప్తే వినాలని” బుజ్జగిస్తున్నట్లు అన్నారు.

“క. క కు కొమ్మిస్తే ‘కు’. కొమ్ము దీర్ఘమిస్తే ‘కూ’. కకు గుడి ఇస్తే ‘కి’ గుడి దీర్ఘమిస్తే ‘కీ’..” అంటూ గుణింతమంతా చెప్పాను.

“బావుంది. నీకు గుణింతమంతా వచ్చు. కాని ఇలానే ఎందుకు చెప్పాలి?” అని నన్నే ప్రశ్నించారు.

ఎప్పుడూ ఎందుకు? ఎందుకు? అని ప్రశ్నించే నన్నే మాష్టారు నిలబెట్టి ప్రశ్నించడం మిగిలిన పిల్లలందరికి చాలా వింతగాను సరదాగాను ఉంది.

“హల్లులకి అచ్చులు కలపడం గుణింతం...” అన్నాను. నాకూ ఇంకేమీ తెలియదన్నట్లు.

“ఇలాగే ఎందుకు చెప్పాలి ఇంకోలా ఎందుకు చెప్పకూడదు?” అన్నారు.

“నాకు తెలీదండీ” అన్నాను తలవంచుకొని.

“గుణింతాన్ని ఎన్నో రకాలుగా చెప్పొచ్చు” అన్నారు మాష్టారు.

క్లాసులో పిల్లలతో పాటు ఈమారు నేనూ ఆశ్చర్యపోయాను.

“వాసాతేజోమయీ! నీవు లేచి ‘క’ గుణింతం చెప్పు” అన్నారు కొత్తగా మా క్లాసులో చేరిన తేజోమయిని చూస్తూ.

“క క ర క, కకరా ‘కా’ కకరి కి కక రీ కీ....” అంటూ ఓ పాటలా క గుణింతం అప్పచెప్పింది.

ఇంతలో పిరియిడ్ అయిపోయిన బెల్లు వినిపించింది.

“అంచేత ఏదైనా, దేన్నైనా ఎన్నో రకాలుగా చెప్పొచ్చు. అలా ఆలోచించాలేకాని ఎందుకు అని అడిగేముందు మనం కొంత ఆలోచించాలి. మనకే సమాధానం దొరుకుతుంది. దొరకపోతే అప్పుడు నా దగ్గరకు రండి. లేదా అడగండి నాకు తెలిస్తే చెప్తాను. తెలియకపోతే తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నిస్తాను” అని ఒక గొప్ప పాఠం నేర్పారు ఆరోజు.

పదో తరగతి దాకా అదే మునిసిపల్ స్కూల్లొ చదివాను. మాష్టారు ప్రమోషన్ వచ్చో, పరీక్షలు పాస్ అయ్యో ప్రతీ ఏడాది ఏదో ఒక సబ్జెక్టు నేనున్న క్లాసుకు చెప్తు ఉండేవారు. మా అనుబంధం ఆ విధంగా చాలా గట్టిపడింది. ఆయన పదో తరగతిలో తెలుగు పాఠాలు చెప్పేరు. ఆయన స్కూల్లో తెలుగు మాష్టారు. ఊర్లో అందరికి అనేక విషయాలు చెప్పే మాష్టారు. నాకు జీవిత పాఠాలు నేర్పిన గురువు.

ఒక ఊయలపై ఊగి ఊగి పల్టీలు కొట్టి మరో ఊయల గాలిలో అందుకొనేటటువంటి విన్యాసాలు చేసే సర్కస్ వాళ్ళకి భద్రత ఇచ్చేది కిందనున్న వల. అలా నేను జీవితంలో చేసే విన్యాసాలకన్నింటికి ఆయన అండ కొండంత బలం. ఆయన ఏ కష్టకాలంలోనైనా ఆయన సలహ ఇవ్వకుండా నా చేతే ఆలోచింపజేసి తగిన మార్గాన్ని ఎన్నుకొనేలా చేసే ఆయన చాకచక్యం నన్ను పదేపదే ఆశ్చర్యపరుస్తుంది.

గబగబా మేష్టారు ఇంటికి చేరుకున్నాను. ఇల్లంతా రకరకాల మనుషులతో నిండిపోయింది. ఆయన భార్యని ఓదార్చేవారు కొందరైతే కొడుకులని ఓదారుస్తున్నారు కొందరు. ఎవరిమట్టుకు వారు పెద్దరికం తీసుకొని రకరకాల పనులు చేస్తున్నారు. వీధంతా హడావిడిగా ఉంది. వాకిట్లో పడుకోబెట్టిన ఆయన పాదాల దగ్గర కూర్చొని వంగి నమస్కరించాను. కదలాలనిపించలేదు. లేవాలనిపించలేదు. ఎంతసేపు అలా ఉన్నానో తెలీదు. ఎవరో వచ్చి తట్టిన స్పర్శ శరీరాన్ని కదలమంటున్నది. యాంత్రికంగా లేచి నిలబడి ఇంటిముందున్న రావిచెట్టు చుట్టూ కట్టిన సిమెంటు దిమ్మెపై కూర్చొన్నాను. మాష్టారితో మాట్లాడడానికి వచ్చినప్పుడల్లా ఏ స్ధలంలో కూర్చొనే వాడినో అక్కడే కూర్చొన్నాను. అలవాటు ప్రకారం తల ఎత్తి త్రిప్పి ప్రక్కకు చూసాను. అక్కడ మాష్టారు కనిపించాలి. కాని ఆయన ఇప్పుడు కనిపించలేదు. అప్పుడు నాకు మొదటిసారి వంటరితనం తెలిసివచ్చింది. ఒళ్ళంతా జలదరించింది. మెలుకువ వచ్చినట్లనిపించింది. మాష్టారు చనిపోయారు అని విన్నప్పటికంటే ఇప్పుడు చాలా బాధ కలిగింది. కన్నీరు రాలేదు. గుండె గమనంలో, గతిలో, శృతిలో మనసు ఆక్రోశం అనువదించబడింది.

ఈ చెట్టు క్రింద ఎన్నిసార్లు కలసి కూర్చొన్నాం? ఆయన స్థానం ఆయనది. నా స్థానం నాది. ఇవాళ ఆయన స్థానంలో శూన్యం. నా స్థానంలో దైన్యం. కళ్ళు మూసుకుంటే నాకే తెలిసేలా కనిపిస్తున్నాయి. ఆయన మాట, చూపు, నవ్వు అన్ని నా చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. పలకరిస్తున్నట్టే పదే పదే తలపుకు వస్తున్నాయి. ఒక్క స్పర్శ తప్ప. అది అనుభూతిగానే అనుభవించాలి ఇకనుంచి.

ఆయన నా భుజం మీద ఆప్పాయంగా చెయ్యివేసి నడిపించి తీసుకొచ్చి మొట్టమొదటిసారి ఈ రావిచెట్టు క్రింద కూర్చోబెట్టింది నిన్న మొన్న జరిగినట్లనిపించింది. అది ఇరవై ఏళ్ళ క్రిందట జరిగిన విషయం. నేను ఈ ఊర్లో చదువు పూర్తి చేసుకొని పట్నం వెళ్ళి డిగ్రీ కూడా పాస్ అయి బేంక్ లో ఆఫీసరుగా ఉద్యోగం సంపాదించుకొని ఇంటికొచ్చిన రోజు. ఇంట్లో అందరూ ఆనందించారు. స్నేహితులు అందరూ “సెభాష్” అన్నారు. నాలుగు రోజుల తరువాత హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఆరోజు సాయంత్రం మాష్టారికి చెప్పాలని వచ్చాను.

“బేంక్ లో ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది మాష్టారు” అన్నాను.

“సంతోషం నాయినా” అని ఆప్యాయంగా భుజం మీద చెయ్యివేసి నడిపించి తీసుకొచ్చి రావిచెట్టు క్రింద కూర్చోబెట్టారు. “ ఎంత పెద్దరోడ్డు ఎక్కితే అంత దూరం పోతామన్న ఆశతో పెద్ద పెద్ద చదువులు, ఉద్యోగాలు కోసం ప్రయత్నిస్తాం. సాధించిన తరవాత ఆ ఉత్సాహంలో చాలా దూరం పోతాం. నేటి పోటీ ప్రపంచంలో గమ్యం కంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు సాధించే విజయాలే గొప్పగా కనిపిస్తాయి. నీకు వచ్చిన ఉద్యోగం చిన్నది కాదు. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది ఇది నీ మనస్తత్వానికి సరిపడుతుందా? లేదా? అందరి గమ్యం ఒకటే. ఆనందంగా జీవించడానికి కావలసినన్ని సమకూర్చుకోవడమే. ఈ ఉద్యోగం నీకు గమ్యం చేరడానికి ఉపయోగపడుతున్నదా లేదా? అన్నదే ముఖ్యం.”

ఆయన చాలా ఆనందించి, వృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తారని అనుకొన్ననాకు ఆయన మాటలు అర్థం కాలేదు. నా చూపు గ్రహించినట్లు ఆయనే మళ్ళీ మొదలుపెట్టారు.

“నీ మనస్తత్వం ప్రతిదీ ప్రశ్నిస్తుంది. ఏ ఉద్యోగంలో అయినా ఉద్యోగి ప్రశ్నించడం అధికారులకు ఇష్టం ఉండదు. అందుచేత నువ్వు రాను రాను నీ మనస్తత్వానికి వ్యతిరేకంగా మసులుకుంటేనే నీ ఉద్యోగంలో ముందుకు వెళతావు” అని ఆగారు.
మేష్టారు అప్పుడే నన్ను స్కాన్ చేసి చెప్పిన విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. నలభై ఏళ్ళ క్రితం బేంక్ ఆఫీసర్ పోస్టు తక్కువదేమీ కాదు.

పట్టుమని నాలుగేండ్లు కూడా ఉద్యోగం చేయలేక పోయాను. ప్రతిరోజు ఏదో ఒక సమస్య. పాలసీ ఉంటే అమలు పరచడం కష్టం. అమలు చేయాలన్న విషయాలకు పాలసీ ఉండదు. ఎందుకు ఇన్ని లోపాలని, ప్రశ్నిస్తే పైవాడికో, కిందివాడికో నచ్చదు.

దసరా సెలవులకి ఊరు వెళ్ళినప్పుడు మేష్టారిని కలిశాను. నన్ను చూడగానే నా సమస్య తెలిసిపోయింది.

మనస్తత్వాన్ని బట్టి పని ఎన్నుకోవడం కష్టమే. వ్యక్తిత్వం ఉండేవారు ఒకరి కింద పని చేయలేరు. అందుకే నీ సొంతంగా, సొంత శక్తితో ఏదైనా ప్రారంభించడానికి ఆలోచించు అన్నారు.

అప్పుడే ఎలక్ట్రానిక్స్ చదివిన ఒక మిత్రుడు కలిశాడు. ఇద్దరం కలిసి ఒక సంస్థని ఏర్పాటుచేశాం. మా సంస్థద్వారా రకరకాల కంపెనీలకు కావలసిన పరికరాలు చేసి పెట్టాం. ఆ తరువాత కంప్యూటర్ రంగంలోకి దిగాం.

అలా ఓ సంస్థకి అధిపతినయ్యాను. ఇప్పుడు ఒక వందమందికి ఉపాధి కల్పిస్తున్నాను. వ్యాపారం బాగానే ఉంది. ఆదాయం బావుంది. తృప్తి, ఆనందం కూడా బాగానే ఉన్నాయి. ఇరవై ఏళ్ళ క్రిందట నేను ఎంచుకొన్న మార్గం నా ప్రవృత్తికి సరియైనదన్నది చక్కగా తెలుస్తున్నది. ఈ నిర్ణయం మాష్టారి వల్లే తీసుకోగలిగాను. అదే కాదు ఆ తరువాత వ్యాపార లావాదేవీలలో ఉద్యోగుల, కార్మికుల విషయాలలో వేటిలోనైనా నాకు చిక్కుముడులు వచ్చినా మాష్టారి దగ్గరికి రావడం ఆయినతో చర్చించడం. ఆచరణయోగమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతూనే ఉంది.

ప్రస్తుతం జానపద గిరిజన హస్తకళల కేంద్రం పెట్టాను. అవి తయారు చేసే కళాకారులకే లాభాలు చెందాలని మేష్టారు కోర్కె. పాత నమూనా స్థానే కొత్త రూపం డిజైన్ చేయాలికూడా.

స్థానికంగా వాటిని తయారు చేయడం సులభమే కాని వాటిని దేశవిదేశాలకి ఎగుమతి చేయడమే కష్టం. ఈ రంగానికి చెందిన ఒక నిపుణుడు మా కంపెనీకి కావాలి.

నా సంస్థలో కీలకమైన ఉద్యోగంలో ఉన్న ఒక వ్యక్తి అమెరికా వెళ్ళి ఇక తిరిగి రానని దరఖాస్తు పంపాడు. ఓ నెల రెండు నెలలు అతని పనిని మరొకరికి అప్పచెప్పి అర్హతలున్న మరో ఉద్యోగి కోసం వెతకాలి. ఇందులో చాలా చికాకులు ఉన్నాయి. అవి మాష్టారితో ఒకసారి మాట్లాడదాం అని అనుకొన్నాను. అంతేకాదు హస్తకళల సంస్థ అభివృద్ధికి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా మాట్లాడాలనుకున్నాను.

“అయన భౌతికంగా దూరం అయినా ఆయన ఆత్మ మన మధ్య ఉంటుంది. అది ఎక్కడికీ పోదు” సతీష్ గట్టిగా వాదిస్తున్నాడు వేరొకరితో.

“నాకు ఆత్మల సంగతి ఏమి తెలీదండి” అన్నాను మాష్టారితో ఒకసారి.

“నీకు తెలియిక పోయినా ఫరవాలేదు. నీ ఆత్మకి నా ఆత్మ సంగతి తెలుసు. నా ఆత్మకి నీ ఆత్మ సంగతి తెలుసు. అది చాలు” అన్నారు గట్టిగా నవ్వుతూ.

“నీకే కాదయ్యా నాకు పూర్తిగా అర్థంకాదది. మనం చూడలేకపోయినా అన్ని జీవులలో ఉండి అన్నింటిని ముందుకు నడిపించేదే ఆత్మ. నేను రేపు చనిపోయినా నేను అన్నది ఏదో నీలో నువ్వు చనిపోయేదాకా నీతో నీలో ఉంటుంది కదా. అదిగో నీలో ఉంచుకొని దానితో కలిసిమెలిసి ఉండేదేదో నీలో ఉన్నది అదే నాకు నీ ఆత్మ. అన్నీ మనకు ఇప్పుడే, ఇక్కడే తెలియాలని ఏంలేదు. ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. తెలిసిన తరువాత ఇంక దాన్ని గురించి ఆలోచన కాని వాదనకాని ఉండదు. జీవరాశిలో అన్ని జీవులకు అన్ని పంచేంద్రియాలు లేవు. అంత మాత్రాన అవి గ్రహించలేని విషయాలు లేవనలేము కదా! ఈ ఆత్మ అన్నది కూడా అంతే అనుకొంటాను నేను. ఎక్కడో నేపాల్ లో ఉన్న నా కొడుకు, ఎప్పుడో చనిపోయిన మా నాన్న, నాకింకా ఎప్పుడు, ఇక్కడే, ఇంకా ఉన్నట్టే అనిపిస్తుంది. ఏమంటావ్?” అన్నారు నాకెంత వరకు అర్థం అయ్యిందో తెలుసుకొందామని కాబోలు.

“అదంతా ఎందుకు మీరు నాకున్నారు. ఆత్మలదాకా పోనక్కరలేదు” అన్నాను.

“నేను పోయినా నీతో నీలో ఉండే నా అన్నదే నా ఆత్మ అనుకో” అన్నారు.

ఇలాంటి సంభాషణలు ఎన్నో, ఒకదాని తరువాత ఒకటి అప్పుడే జరిగినట్టో, జరుగుతున్నట్లో, గుర్తుకు వస్తున్నాయి. అలా మౌనంగా రావిచెట్టు క్రింద మాష్టారి తలపుల్లో ఉండిపోయాను.

నా ప్రక్కన మరోకాయన వచ్చి కూర్చొన్న అలికిడికి కళ్ళు తెరిచి చూసాను. ఓ యాభయ్యేళ్ళ మనిషి చాలా దిగులుతో కూర్చున్నాడు. నేనతని వైపు చూడగానే – ఈ సమయంలో దొరుకరేమో అనుకొన్నాను కాని ఇలా అవుతుందని అనుకోలేదండి” అన్నాడు నిస్తేజంగా.

ఆ మనిషికి ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది. గంభీరమైన ముఖం, తేజస్సు ఉట్టి పడుతోంది. నేను మాష్టారితో ఎప్పుడూ చూడలేదు.

“ఏ విషయంలో మాష్టారిని కలవాలని వచ్చారు?”

అతను కాస్త దగ్గరగా జరిగాడు.

బెంగళూరులో నేను పని చేసే కంపెనీలో పని పరిస్థితులు పాడయ్యాయి. ఒక రకంగా నేను ఇమడలేక పోతున్నాననే విషయం మేష్టారికి తెలిసింది.

ఆ మధ్య నాకు ఫోను చేసి ఆర్థికంగా ఆకర్షణీయం కాకున్నా కొత్త ఆలోచనలతో పని చేసే నీలాంటి వాడికి మంచి అవకాశం ఈ ఊళ్ళోనే ఉంది. వస్తావా? అన్నారు.

అప్పటికే వేరే దేశం వాళ్ళు కొన్ని అవకాశాలు ఇచ్చారు. కాని నాకెందుకో విదేశాలు వెళ్ళడానికి మనస్సు ఒప్పుకోలేదు. పైగా మేష్టారు ఊరికే చెప్పరు. ఓసారి మేష్టారిని చూసినట్లు అవుతుంది, విషయం తెలుసుకుంటున్నట్లు అవుతుందని వచ్చాను. వచ్చేసరికి ఇక్కడ ఇలా!

ఎలాంటి పరిస్థితుల్లో, ఎక్కడ ఉన్నా మేష్టారుని తలచుకుని సమస్య గురించి ఆలోచిస్తే పరిష్కారం దొరికేది నాకు అన్నాడు.

అతని పేరు, వివరాలు తెలుసుకున్నాను. జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో అతని గురించి నేను కొంత విని ఉన్నాను. స్థానికత, వనరులు, దేశీయ జ్ఞానం వంటి వాటిని వెలికితీస్తే భారతదేశ గౌరవం ఇనుమడిస్తుందని ఆయన చెబుతుంటారు.
అంతటివాడు మా సంస్థలో పనిచేస్తాడా అనే అపనమ్మకంతోనే కార్డు ఇచ్చి రేపు మాట్లాడుకుందాం రమ్మని చెప్పాను.
అతను నిస్తేజంగా తలూపాడు.

మేష్టారు చెప్పింది మీ కంపెనీ గురించేనా....... ఏదో అడగబోయాడు.

ఇంతలో మేష్టారి భార్య పడిపోయిందని సతీష్ అరిచాడు. అందరం గబగబా లేచాం ఆవిడని చూడ్డానికి లోనికి దారితీసాను.
మంచి మనిషి అంటే మనుషుల్ని అర్థం చేసుకోగలిగే ఉదాత్త హృదయం. ఎవరు ఎలాంటివారు అని తెలుసుకుని అందుకు తగిన విధంగా దోహదం చేయడమే మంచి పని.

అలాంటి మంచి పనులు చేయడానికి పంచభూతాల కలయికతో ఏర్పడిన దేహం, ఆ చైతన్యమే ఆత్మ. మంచి బుద్ధితో కూడిన మేష్టారి దేహమే ఆత్మ. ఆ దేహం లేకపోయినా ఆ బుద్ధికి సంబంధించిన మంచి ఆలోచనలే ఆత్మ.

గతంలో మేష్టారు కోసం వచ్చినప్పుడు ఆయన కనిపించినా కనుపించకపోయినా, ఇంట్లో ఆయన ఉన్నా లేకపోయినా ఆయన స్ఫూర్తితో కొన్ని మంచి పనులు జరిగాయి. పేరేదయితేనేం అది మేష్టారు వ్యక్తిత్వానికి సంకేతం.

మేష్టారు ఉద్యోగానికి పదవీవిరమణ ఉంటుందేమో కాని ఆయన వ్యక్తిత్వం తన విద్యార్థులకు నిరంతర కాంతిపుంజం.
ఆ వెలుగులో రేపు నేనో మంచి సహోద్యోగిని పొందబోతున్నాను. మేష్టారికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ?

అప్పటివరకు బిగపట్టిన కన్నీళ్ళు ఇక ఆగలేదు.

(ఈ ఆలోచనకి అవకాశం ఇచ్చిన కీ.శే. శ్రీ రావూరి వీరయ్య గారికి)
- కలశపూడి శ్రీనివాసరావు





1 వ్యాఖ్యలు:

Veeraji.pkm@gmail.com said...

chakkani telugu kammani syli vunnadandi meeku - Congrats
Veerajee