Thursday, May 14, 2009

అమెరికా ఆంధ్రుల ఆహ్వానం

Thursday, May 14, 2009
రకరకాల రంగాలలో
పలు రకాల ప్రశంసలు పొందిన
అమెరికా ఆంధ్రుల అతిధులారా
అందుకోండి ఆహ్వానం!

సిలికాన్ వేలీలో
సిరి తూగుటుయ్యాలలో
తలమునకలవుతున్న
తమ్ముళ్ళను, చెల్లెళ్ళను చూడండి

ఇందు గలడు అందు లేడన్న
సందేహం లేక అన్ని రాష్ట్రాలలో
పోటీలమీద పుట్టుకొస్తున్న
కోటి డాలర్ల కోవిదుళ్ళను దర్శించండి

‘ఆంధ్రభాషా పత్రిక’ నుండి
‘అమెరికా భారతి’ దాకా
‘తెలుగు వెలుగు’తో
‘తెలుగు జ్యోతి’గా
వెలిగే ‘తానా పత్రిక’
మా సాహితీ ఉత్సాహానికి ప్రతీకలు
పలుచోట్ల చిన్న చిన్న ప్రయత్నాల
గోరు వెన్నముద్దల రుచి చూడండి

అమెరికా వ్యాపారపుటెడారిలో
అక్కడక్కడ అప్పుడప్పుడు
కనిపించే, వినిపించే
సాహితీ సమావేశాలలో పాల్గొనండి

రకరకాల మ్యూజియంలు
వింత వింత సంతసాలు
పంచి ఇచ్చే మిషన్లు
ఆనందాశ్చర్యాలతో సందర్శించండి

వీకంతా ‘పీక్’, పీకు అని పనిచేసి
వీకెండు సదా ఎంజాయ్ చేసే
మీ హోష్టు ‘షెడ్యూల్’ రోలర్ కోష్టర్
ఒక్కసారి ఎక్కి చూడండి

మనసంత పెంచి పెద్ద చేసిన ఊరుతో
మేధంతా దాని అభివృద్ధి పనులతో
నింపుకున్న మనుషులు కనిపిస్తే
చేతులెత్తి నమస్కరించండి

‘డేన్’లైన ధనంజయులు
‘పేట్’లైన పతంజలులు
‘షేడ్’లైన పద్మలు
‘క్రిస్’లైన క్రిష్ణవేణీలు
తమకు తామే పరాయీలైన
సోదర సోదరీమణులు
త్రిశంకు స్వర్గ నివాసులు
వారి అభిప్రాయాల గనులు తవ్వకండి

అడ్డుగోడలు దాటి వచ్చినా
అంటుకున్న మట్టి వదలక గోడలు కట్టే
అన్నయ్యలకు అక్కయ్యలకు
ఆసరాగా తాపీ మేస్త్రులవకండి

భయంకర పరిస్థితులూహించుకోకండి
సునాయాసమైన జీవితమనుకోకండి
గ్రహించిన విషయాలను విశ్లేషించండి
అనవసరంగా శంఖంలో పోయకండి

స్వేచ్ఛా విగ్రహాన్ని
పూజిస్తూ దశమగ్రహమై పీడిస్తూ
అమెరికా మిమ్మల్ని బాధిస్తే
మీరు వంటరివారు కారు.
స్వేచ్ఛను ఆశకు
అమ్ముకొనే అంగళ్ళు
అన్ని దేశాలలో లాగే
అమెరికాలోనూ ఉన్నాయి

అన్న వస్త్రాలకై అమ్ముకొనే దుస్థితి
కొన్ని దేశాలకంటే ఇక్కడ తక్కువ
అందుకే వివిధ జాతులకు
ఈ గడ్డపై మక్కువ

నిద్రపోని నగరాలు
జనజీవన నయాగారాలు
సుదీర్ఘ రహదారులు
నిజానికి ఈ దేశ ధమనులు

వివిధ రీతుల, వివిధ జాతులు
కాలగతిలో కలిసిపోతూ
కొత్త జాతిని సృష్టించే ప్రయోగం
ఇక్కడి మహానగరాల ముఖ్య విశేషం

కొత్త మానవ ఆవిర్భావానికి
మనకి మనం వేసుకుంటున్న
చిన్న చిన్న పరిణామ సోపానాలను
పదిలంగా ఎక్కండి

ప్రపంచంలో పలుచోట్ల భవిష్యత్ కాలం
నేడిక్కడ వర్తమానం
నిదానంగా కలసుకోండి
అనుభూతులే ప్రధానంగా దాచుకోండి
నిర్మలమైన కెరటాల నీటితో
కడిగిన ఇసుక తిన్నలాంటి
మీ మనో ఫలకంపై,
ఈ ప్రవాహంలో
మీ కళ్ళు చూసే
మనిషి ఉన్నత శిఖరాలకి
అగాధాల గాధలకి
నకళ్ళు వ్రాయండి!

మేం వదలి వచ్చిన నేల ‘స్పర్శ’
మేం పొందలేని గాలి ‘శ్వాస’
మేం కోరుకొనే నీటి ‘తడి’
కొంత తీసుకురండి

అమెరికా భేతాళుడు
వెంటపడితే అదిరిపోకండి
డాక్టర్ సత్యం మందపాటిని
సెల్ ఫోన్ లో సంప్రదించండి

డాలర్ గాడ్పులకి సొమ్మసిల్లితే
టీవి మైకానికి తల తిరిగితే
వాటికి దూరంగా, జె.ఎఫ్.కె.కి దగ్గరగా
ఉన్న మా ఇంటికి రండి.

0 వ్యాఖ్యలు: