Friday, May 15, 2009

అస్తిత్వం

Friday, May 15, 2009
స్వీడన్ ముఖ్యపట్నం అయిన స్టాక్ హోమ్ 14 ద్వీపాల నగరం. వాటిలో గమ్ల స్టేషన్ ఒక పురాతనమైన ద్వీపం. స్టోర్కిరస్ కారోనేషన్ చర్చికి తూర్పువైపునున్న సన్నటి వీధిలో ఎర్రని రంగు ఇల్లు సాధారణ స్వీడిష్ దేశీయుల మధ్యతరగతి జీవనానికి ప్రతీక. అటువంటి ఒక ఇంటి పెద్ద పెద్ద కిటికీల నుండి శీతాకాలపు తీవ్రమైన ఎండ గదిలో పడుతున్నాది. ఆ వెలుగుకు గదిలో ఉన్న ఆకుపచ్చని తివాసి మెరుస్తున్నది. ఆ వెలుగులో ఓ చిన్న కుర్రాడు ఆడుకుంటున్నాడు. ఆ కుర్రాడికి ప్రపంచం గురించి తెలిసింది చాలా తక్కువ. తాను చిన్నవాడిని, తాను పెద్దవాడిని అవుతానని తెలుసు. కాని పుట్టుక గురించి కాని, చావు గురించి కాని తెలియదు. తనకి నాలుగు సంవత్సరాలని, త్వరలో ఐదు సంవత్సరాలు వస్తాయని తెలుసు. కాని ‘సంవత్సరం’ అంటే ఏమిటో తెలియదు. ఆ కుర్రాడి కాలంలో మూడురోజులు ఉన్నాయి. నిన్న, నేడు, రేపు.

‘నాన్నా’ ఆడుతూ ఆడుతు మధ్యలో పిలిచాడు. తండ్రి అప్పుడే ఉదయపు ఫలహారం తిని, చుట్ట ముట్టించాడు. ఆ రోజుకి అతనికి అది మొదటి చుట్ట. అతను కాలాన్ని కాల్చిన చుట్టలతో కొలుస్తాడు.

‘నిన్న రాత్రి బోల్డు కలలొచ్చాయి నాకు, అన్ని కలల్లో ఈ గది. ఈ గదిలో కుర్చీలు, ఆకుపచ్చని తివాసి, అద్దాలు, కిటికీలు, గోడ గడియారం, గది తలుపులు, అలమర...’ అలా అంటున్నావాడు మాటలాపి, కిటికి దగ్గరికి వెళ్ళి పిల్లి మొగ్గలు వెయ్యడం మొదలుపెట్టాడు ఆనందంగా. ఆడుకోడానికి హాయిగా అనిపించే ఆ జాగా ఆ కుర్రాడికి చాలా ఇష్టం.
‘ఆహా...
అన్నాడు తండ్రి తన వార్తాపత్రిక అంచు నుండి కులాసాగా కొడుకువైపు ఆప్యాయంతో ఒక చూపు చూసి, ఆ కుర్రాడు తండ్రివైపు తిరిగి హాయిగా నవ్వాడు. నవ్వు ఇంకా సహజమైన ఆనందాన్ని మాత్రమే తెలిపే వయసు ఆ కుర్రాడిది. క్రిందటి రోజు కిటికి దగ్గర నిలబడి చంద్రుణ్ణి చూసి ఇలాగే నవ్వాడు. చంద్రుడు వింతగా ఉన్నాడని కాదు, వెలుగు విరజిమ్మే చంద్రబింబం ఆనందాన్ని కలిగించడం వల్ల.

‘అన్నింటికంటే ఈ బొమ్మ ఎన్నోసార్లు కలలో కనిపించింది.’ అని అన్నాడు. నవ్వడం అయిపోగానే, మోకాళ్ళమీద లేచి, గోడమీద ఉన్న చిత్రంవైపు వేలు చూపించి
ఆ చిత్రం ఒక ప్రముఖ డచ్ చిత్రకారుడు వేసిన చిత్రంకి ఫోటో అనుకరణ. దాని పేరు ఒక కాలిపోతున్న ఊరు.

‘ఆహా, దాని గురించి ఏం కలొచ్చింది?’ తండ్రి అడిగాడు.
‘నాకు తెలియదు’
‘ఉహు, గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించు’
‘ఉ... మంటలున్నాయి, నేనో కుక్క పిల్లని ముట్టుకున్నానుట”
‘కానీ నీకు కుక్కలంటే భయం కాదు?’
‘అవును, కానీ బొమ్మలో ఉన్న కుక్క పిల్లని కొంచెం ముట్టుకోగలను’
అలా అని తనలో తాను నవ్వుకుంటూ, గెంతుతూ గదంతా తిరుగుతున్నాడు.
అలా తిరుగుతూ తండ్రి దగ్గరికి వచ్చి, ఆగి, “నాన్నా ఆ బొమ్మ గోడమీద నుండి దించు. నిన్న చూపించావుగా అలా ఆ బొమ్మ మళ్ళీ చూపించవా?”

ఆ చిత్రం ఆ గదిలోకి కొత్తగా నిన్ననే వచ్చింది. అంతకు ముందున్న చుట్టాల ఫోటోలన్నీ ఆ కుర్రాడికి బాగా పరిచయం ఉన్నవే. వాటికంటే ‘ఓ కాలిపోతున్న ఊరు’ చిత్రం చాలా విశేషాలతో, జీవం ఉట్టిపడుతూ, ఆకర్షణీయంగా ఉంది. కుర్రాడు అడిగినట్లే తండ్రి ఆ చిత్రాన్ని క్రిందికి దించి కొడుకుతో కలసి చూస్తున్నాడు.

నదీ ముఖద్వారం సముద్రంలోకి కలిసే ప్రదేశం నిండా చాలా పడవలు, లాంచీలు ఉన్నాయి. అందంగా వంపు తిరిగి ఉన్న వంతెన రెండు ప్రక్కల బురుజులు. ఎడమ ఒడ్డున ఒక కాలిపోతున్న ఊరు. చిన్న చిన్న ఇళ్ళ వరుసలు, ఇళ్ళ మీద కొన్నింటికి పొట్టి, మరికొన్నింటిమీద పొడవైన ఇంటి కప్పులు, మంటలు, వాటి జ్వాలలు గాలిలో ఆకాశంవైపు ఎగురుతూ, వాటిని ఆవరిస్తూ సుళ్ళు తిరుగుతున్న దట్టమైన పొగమేఘాలు, గోడలకి వేయబడి ఉన్న నిచ్చెనలు, వాలిపోతున్న గుర్రపు బళ్ళు, మంటలనుండి ప్రాణరక్షణకై వంతెనవైపు పరుగెడుతున్న మనుషులు. రేవు గట్టున పీపాలు, సంచులు, రకరకాల కలప. నీటిలో మనుషులు ఎక్కువై మునిగిపోబోతున్న పడవ. వంతెన ముందు ఒకదానిని మరొకటి వాసన చూస్తున్న కుక్కపిల్లలు. వంతెనకి అవతలివైపు నది ముఖం విశాలమై సముద్రాన్ని కలిసేచోట ఎక్కడో ఎత్తులో ఆ క్షితిజానికి అతి దగ్గర అనిపించే లాంటి ప్రదేశంలో ఆ చిత్రానికి అతి ముఖ్యమైన స్థానంలో, ఒక పలుచని పొగ మేఘం వెనుక కాలిపోతున్న ఊరిని, అక్కడి వేదనని చూస్తూ కళ తప్పి, వెలుగు విరజిమ్మలేని చంద్రుడు.
‘నాన్నా, ఈ ఊరెందుకు కాలిపోతున్నాది?’
‘ఎవరో నిప్పుతో అజాగ్రత్తగా ఉండడంవల్ల’
‘ఎవరు?’
“ఉ... ఎవరన్నది చెప్పలేం, చాలాకాలం అయిపోయింది కదా”
“ఎంతకాలం అయింది?”
“కొన్ని వందల ఏళ్ళు అయి ఉంటుంది. ఆ ఊరు కాలిపోయి”

ఆ కుర్రాడికి ఈ సమాధానం కొత్తగా ఏదీ బోధపరచలేదు. ఈ విషయం ఆ తండ్రికి కూడా తెలుసు. కానీ ఏదో ఒక సమాధానం చెప్పాలని చెప్పేడు. నిశ్శబ్దంగా తనలో తాను ఆలోచించుకుంటూ కూర్చున్నాడు ఆ కుర్రాడు కొద్దిసేపు. కొత్తకొత్త ఆలోచనలు, రకరకాల భావాలు పాతవాటి చుట్టూ తిరుగుతూ, రాసుకుంటూ, తోసుకుంటూ, తమకో నిర్దిష్టమైన స్థానం కల్పించుకుంటూ ఆ కుర్రాడి మెదడులో తిరుగుతున్నాయి.

“సరే, కానీ ఈ ఊరు నిన్న కాలిపోతున్నాది, ఇవాళ కూడా కాలిపోతున్నాది? అవునా?” అని అన్నాడు ఆ చిత్రం వైపు వేలు పెట్టి చూపిస్తూ.

ఇది నిజమైన ఊరు కాదు, ఇది ఉత్తి బొమ్మే. నిజమైన ఊరు కాలిపోయి చాలాకాలం అయింది. చాలా చాలా కాలం క్రిందట కాలిపోయింది. అది ఇప్పుడు లేదు. అక్కడ పరిగెడుతున్న మనుషులు లేరు. వాళ్ళంతా చనిపోయారు. ఇప్పుడు లేరు. ఆ ఇళ్ళన్నీ కాలిపోయాయి. గంటల గోపురాలు పడిపోయాయి. ఆ వంతెన కూడా పోయింది.

“ఈ గంటల గోపురాలు కాలి పడిపోయాయా? విరిగి పడిపోయాయా?”
“అవి కాలి, విరిగి పడిపోయాయి”
“ఈ స్టీమర్లు వాళ్ళు కూడా చచ్చిపోయారా?”
“అవును. కానీ అవి స్టీమర్లు కావు, పడవలు, అప్పుడు స్టీమర్లు లేవు.”

కింది పెదవి విరిచి, నిశ్శబ్దంగా తనలో తాను ఆలోచించుకుంటూ, విచారంగా కూర్చొన్నాడు ఆ కుర్రాడు కొద్దిసేపు.

“కానీ నాకు స్టీమర్లు కనిపిస్తున్నాయి. నాన్నా ఈ స్టీమర్ పేరేంటి?”
ఆ కుర్రాడి బుద్ధికి ఎంతతోస్తే అంతే. వాడి తండ్రి వాడి ప్రశ్నలకి జవాబులు చెప్పి చెప్పి, ఇక చెప్పలేక విసిగిపోయాడు. కుర్రాడు ఆ బొమ్మలో ఉన్న డచ్ వ్యాపార పడవలపై వేలుపెట్టి చూపిస్తూ, ఇది బార్జ్, ఇది హిల్లరో, ఇది ప్రిన్స్ ఇంగర్బోగ్ అని తనలో తాను మాట్లాడుకుంటున్నాడు.
“నాన్నా ఈ చంద్రుడు కూడా పోయాడా?”
“లేదు, ఆ చంద్రుడు ఇంకా ఉన్నాడు. ఈ బొమ్మ అంతటికీ ఈ చంద్రుడొక్కడే ఇంకా ఉన్నాడు. ఇదే చంద్రుణ్ణి నిన్న నువ్వు నీ కిటికీలోంచి చూసావు.” అన్నాడు ఆ తండ్రి కొత్త ఉత్సాహంతో.

మళ్ళీ ఆ కుర్రాడు నిశ్శబ్దంగా తనలో తాను ఆలోచించుకుంటూ కూర్చున్నాడు కొద్దిసేపు అప్పుడు మరో ప్రశ్న వచ్చింది.

“నాన్నా, ఈ ఊరు కాలిపోయి చాలా కాలం అయిందా? మనం అంతా కలసి ప్రిన్స్ ఇంగర్బోగ్ స్టీమర్లో తాతగారి ఇంటికి వెళ్ళిన దానికంటా వెనకా?”

“అవును, ఇంకా, ఇంకా వెనక, ఆ ఊరు కాలిపోతున్నప్పుడు నువ్వు, నేను, మీ అమ్మ, అమ్మమ్మ ఎవ్వరం లేము.”
ఆ కుర్రాడి మొహం ఉన్నట్టుండి గంభీరంగా మారిపోయింది. చాలా విచారంగా ఉన్నాడు.
మళ్ళీ ఆ కుర్రాడు నిశ్శబ్దంగా తనలో తాను ఆలోచించుకుంటూ కూర్చొన్నాడు కొద్దిసేపు. రకరకాల ప్రశ్నలు, ఆలోచనలు వస్తూ పోతున్నాయి. వాటిని ఒక పద్ధతిలో పెట్టలేకపోతున్నాడు.
“నాన్నా, ఈ ఊరు కాలిపోతున్నప్పుడు, నువ్వు లేనేలేవు”
కింది పెదవి విరిచి, నిశ్శబ్దంగా ఉన్న ఆ మొహం ‘ఇది నేను ఒప్పుకోను’ అన్నట్లుంది. దాన్ని ధ్రువపరుస్తున్నట్లు.
“కానీ నేనెక్కడున్నాను అప్పుడు?” అని అడిగాడు గట్టిగా
‘నువ్వసలు లేనే లేవు’ అన్నాడు తండ్రి

ఆ కుర్రాడు తన కళ్ళు విశాలం చేసుకుని తండ్రిని చూసాడు. తన తండ్రి తనని ఆటపట్టించడానికి ఇలా అంటున్నాడని తోచింది. తనని ఆడించే ఆడపిల్లలు కూడా అప్పుడప్పుడు ఇలాగే నమ్మలేని కబుర్లు చెప్పి, నవ్వించి, తరవాత అది నిజం కాదు అంటారు తనని ఆటపట్టించడానికి. తండ్రి కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. లేకపోతే తను అప్పుడు లేకుండా ఇప్పుడు ఎలా వచ్చాడు. ఇప్పుడుంటే అప్పుడు లేకపోవడం ఏమిటి.

ఒక రాత్రి వేళ మెలుకువ వస్తే చుట్టూ చీకటి నాకు ఎలా కనిపిస్తుంది? అందుకే నేనున్నట్టే. ఒక్కసారిగా ఆ చిత్రం నుండి, తండ్రి నుండి దూరంగా జరిగి కిటికిలోంచి గదిలో ఆకుపచ్చని తివాసిపై పడుతున్న సూర్యకాంతిలో గెంతుతూ, గొంతెత్తి ఆనందంతో, ప్రపంచం అంతటికి తెలియచెప్పాలన్న ఉత్సాహంతో.

‘నేనున్నాను, నేనున్నాను, నిజం, నేనున్నాను’ అన్నాడు.

(ఆత్మపరంగా ఆలోచిస్తే ఆ పిల్లాడి ఆలోచన నిజమే అని అనిపిస్తుంది. జన్యుశాస్త్రపరంగా ఆలోచించినా – డిఎన్ఎ (జన్యు పదార్థం) అనువంశికత పరంగా చూస్తే పరిణామక్రమంలో ‘జీవం’ వందకోట్ల సంవత్సరాలు పైగా ఎడతెగని భౌతిక అభౌతిక అవిభాజ్య సంబంధం. తర్కానికి కూడా నిలిచి పిల్లాడి ఆలోచన నిజమే అని అనిపిస్తుంది.

ఆత్మ నిత్యత్వం గురించి కాని, జీవశాస్త్రపరంగా జన్యుపదార్థం గురించి కానీ ఏమీ తెలియని ఆ పిల్లవాడికి తన అస్తిత్వంపై ఎలా కలిగింది అంత ప్రగాఢమైన నమ్మకం? పుట్టిన ప్రతి జీవికి తన అస్తిత్వంపై అంతటి నమ్మకం ఉండడమే ఈ మానవజాతి మనుగడకి మూలాధారమా?)
- సుజన రంజని, 1 ఏప్రిల్ 2004





0 వ్యాఖ్యలు: