‘అవునే అమ్మమ్మా, నాకు శీతగా ఉందే’ అప్పారావు ఫోనులో అన్న మాటలు విన్న సరిత ఆశ్చర్యపోయింది.
తరవాత భర్త మాటలేవీ వినిపించలేదామెకు. బెడ్ రూమ్లో కూర్చున్నది ఉన్నట్టుండి లేచి లివింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆలోచిస్తున్నకొద్ది బాధ కలిగింది. బాధ కొద్దిసేపటికి దుఖంగా మారింది. దుఖం మరింత సేపటికి సన్నని ఏడుపుగా మారింది. సన్నని ఏడుపు, బయట పెట్టలేని బాధ ఒక్కసారిగా కట్టలు తెంచుకోగా బావురుమంది. అది అప్పారావుకి వినిపించింది.
“సరితా!” అంటూ పరుగులాంటి నడకతో సరిత దగ్గరికి వచ్చాడు. ప్రక్కనే ఆగి చేతుల్లో మొహం పెట్టుకుని ఏడుస్తున్న సరిత తలమీద చెయ్యివేసాడు.
“ఏమయ్యింది సరితా?”అంటూ, గాభరాగా అడిగాడు. సరిత ఏడుపు ఆపలేదు, తగ్గించలేదు, కనీసం అప్పారావు వచ్చాడన్న విషయాన్ని గుర్తించలేదు. సరితకి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోగలవని, అసలు ఎలాంటి కష్టాలు రానివ్వనని, జీవితమంతా సరితని సుఖపెట్టేస్తానన్న అతి గాఢ నమ్మకంతో నెలరోజుల క్రిందట న్యూయార్క్ మహానగరంలో కొత్త కాపురం మొదలుపెట్టాడు అప్పారావు. క్షణం ఖాళీ దొరికితే చాలు.. పెళ్లిచూపులు, వెంటనే సరితతో పెళ్ళి, హనీమూన్, పదహారు రోజుల పండగ, ఒక జీవితానికి మించి చేసుకున్న బాసలు గుర్తుకువస్తూనే ఉన్నాయి. ఇంకా ఇంకా క్షణం ఖాళీ లేకుండా గడిపిన మూడు వారాల ఇండియా ప్రయాణం, గాలిలో –నిజంగానే తేలిపోతూ, వెళ్లినప్పటి కంటే అతి తేలికగా కొత్త పెళ్ళికూతురితో న్యూయార్క్ లో దిగడం... లాంటివి కమ్ముకొచ్చే శ్రావణ మేఘాలలా అప్పారావుని ఉబ్బి తబ్బిబ్బు చేస్తున్నాయి.
సరిత ఏడవడం, ఏడుస్తున్నప్పుడు తను దగ్గరకు వస్తే సినిమాలలోలా కాకపోయినా కనీసం తనకి తోచిన విధంగా ‘అప్పారావూ అనో మరో ముద్దు పేరుతోనో, లేకపోతే నాకో కష్టం వచ్చిందిరా!” అని అల్ట్రా మోడ్రన్ గానైనా అని ఉంటే అప్పారావుకి అసలేమీ కష్టం అనిపించకపోయుండేది. అలాంటిదేమీ కాక, అసలే విషయం తెలియక గాభరా పడుతున్న అప్పారావు ఉనికిని కూడా గుర్తించకపోవడం అప్పారావుకి ఆశ్చర్యం, బాధ, అవమానం అన్నీ ఒక్కసారిగా ముసురుకొచ్చాయి.
“ఏమయ్యింది సరితా?” “ఏమయ్యింది సరితా?” అని యాంత్రికంగా అడిగాడు, బుర్రలోని ఆలోచనలకు సంబంధం లేనట్టు.
‘నన్ను ఎందుకు పెళ్ళి చేసుకున్నారు?’ అంది సరిత చివాలున తలెత్తి, అప్పారావు మొహంలోకి సూటిగా చూస్తూ.
ఎన్నో వందల వందల ప్రశ్నలకి చాలా ఏళ్ళుగా చక్కనైన సమాధానాలు చెప్పి, చెప్పి, వ్రాసి వ్రాసి, అన్ని పరీక్షలలో ఉత్తమ స్థానాన్ని పొంది, ఐఐటి, ఐఐమ్, యమ్ఐటీల డిగ్రీలను చేజిక్కించుకొని ఐబిఎమ్ లో అతి మంచి ఉద్యోగంలో ఉన్నాడు అప్పారావు. పెళ్లికి పెట్టించుకున్న మెహందీ ఇంకా పోని భార్య, తాను అమితంగా ప్రేమిస్తున్న భార్య అడిగిన అతి చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. తనకున్న క్వాలిఫికేషన్లన్నీ మరిచిపోయి పద్యం మరిచిపోయిన బడి పిల్లాడిలా, స్టేజ్ మీద డైలాగు, యాక్షన్ రెండూ మరచిపోయిన ఎన్నారై నటుడిలా సరితముందు నిలబడ్డాడు. సరిత చివాలున తలెత్తినప్పుడు, ఆమె తలమీద నుండి జారిపోయిన చెయ్యి తనది కాదన్నట్లు దానికి మరే పని చెప్పక పోవడంవల్ల అది అప్పారావు కుడిభుజం నుండి వ్రేలాడుతున్నాది.
“అవును ఎందుకు పెళ్ళి చేసుకున్నాను?”అని తనలో తాను అనుకున్నాడు. అందరూ పెళ్ళి చేసుకుంటున్నారు. అమ్మా, నాన్నా చేసుకోమన్నారు. రూమ్మేట్లందరూ పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయారు. పెళ్లికంటేనే బాస్ నెలరోజులు సెలవిచ్చారు. పెళ్ళి చేసుకోకుండా వెనక్కి ఎలా వెళతాను? అసలు మనుషులు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ఇలాంటి ప్రశ్నలు బుర్రలోకి వస్తున్నాయి. కానీ అప్పారావు చదువుకున్న చదువుకానీ, పెరిగిన వాతావరణం కానీ, పనికిరాని పైపైన మాటలు, సినిమా కబుర్లు, క్రికెట్ స్కోరులు మాత్రమే మాటలాడకునే స్నేహితులు కానీ, లెక్ఖలేనన్ని పుస్తకాల సాంకేతిక పుస్తకాల పరిజ్ఞానం కానీ, ఈ ప్రశ్నలకి కావలసిన సమాధానాలు ఇవ్వలేకపోయాయి. సమాధానం కాదుకదా, కనీసం, నువ్వు ఆలోచిస్తే సమాధానాలు ఇవ్వగలవు సుమా అన్న ధైర్యాన్ని కూడా ఇవ్వలేకపోయాయి.
తెలుగు పరీక్షకి వెళితే తెలియని భాషలోని ప్రశ్నాపత్రం అందుకున్న కుర్రాడిలా బిక్కమొహంతో గత పది నిముషాలుగా ఉన్నచోటే అలా నిలబడి ఉన్నాడు. కాళ్ళుపీకుడు మొదలయింది. సరిత సోఫాలో కూర్చొని ఉంది. కాబట్టి ఎంతసేపయినా అలా ఉండగలదన్న విషయం తోచింది అప్పారావుకి. దానితో మరింత నీరసం వచ్చి అక్కడికక్కడే సరిగ్గా సరిత కాళ్ళ దగ్గిర కూలబడిపోయాడు. అది సరితకి నచ్చలేదు. లేచివెళ్ళిపోవాలనుకుంది. కానీ లేవాలంటే కాళ్ళదగ్గరే కూర్చున్న అప్పారావుకి కాళ్ళు తగలకుండా లేవడాన్కి కుదరదని అలానే కూర్చుంది. ఆడదాని కాలితో మొగవాడిని తల దగ్గరైనా తన్నవచ్చునని, ఇంకా చెప్పాలంటే అది తెలుగువారి సంప్రదాయమని సరితకు తెలీదు. సత్యభామవంటి పురాణ పతివ్రతల గురించి వినడం కానీ, చదవడం కానీ చెయ్యలేదు. స్త్రీవాదాలు, సమానహక్కుల గురించి కూడా ఏమీ చదివిందికాదు. కానీ ‘నా మొగుడు నా స్వంతం’ అన్నది మాత్రం బాగా తెలుసుకున్నాది. అది వాళ్ళ నాయినమ్మ పెళ్ళినాటి సాయంత్రం శోభనానికి ముందు బాగా నూరిపోసిన విషయం.
సరిత కూడా అప్పారావులాగే బాగా చదువుకుంది. ఉద్యోగం చేసే ఉద్దేశ్యం కూడా ఉన్నదే. వాళ్ళిద్దరు చదివిన చదువు ఏమాత్రం వారి ప్రస్తుత పరిస్థితులో వారికి ఉపయోగం లేకుండా పోయింది.
“ఆ సీతనే వెళ్ళి చేసుకోక, నన్నెందుకు పెళ్ళి చేసుకున్నారు?” అని రెట్టించి మరీ అడిగింది. తను అడిగిన ప్రశ్నకి అప్పారావు సమాధానం చెప్పలేకపోవడంతో ఉన్నట్టుండి మళ్ళీ ఉక్రోషం వచ్చి ఇక ఆపుకోలేక.
అసలే ముందడిగిన ప్రశ్నకే జవాబు ఇవ్వలేకపోయి, మెదడంతా ఏ ఆలోచనాలేక, నాని ముద్దైన కర్ర మొద్దులా ఉన్న అప్పారావుకి ఈ ప్రశ్న మరింత ఆశ్చర్యాన్నీ, ఆందోళననీ కలిగించింది. కొద్దిగా కదలి, వెనక్కి వంగి, సరిత మొహం వైపు బెరుకుగా చూస్తూ.
‘సీతెవరు?’ అన్నాడు.
‘అవునే అమ్మమ్మా నాకు సీతగా ఉందే’ అని అప్పారావు గొంతుని అనుసరిస్తూ తనలోని బాధని దిగమింగుకొంటూ ఒక వింత అనుకరణతో వెక్కిరింత, కోపం, అసహనం కలబోసి ఆ ఐదు పదాలని ఐదు బాణాలలా అప్పారావు పైకి వదిలింది.
అది వినగానే సరిత అలక, కోపానికి కారణం తెలిసిపోయింది అప్పారావుకి. సెకండ్లలో అప్పారావు మొహం ఒక్కసారి మబ్బు వీడిన ఆకాశంలా, రిమోట్ నొక్కితే వెలిగిన టీవీలా, భళ్ళుమని తెల్లవారిన ఉదయంలా, తెలుగు మొహం, మాటకోసం వాచిపోయిన తొలి తెలుగు ఎన్నారైకి మరో తెలుగువాడు కనిపించినప్పటి మొహంలా వెలిగిపోయింది. కానీ సరిత మొహం వీధిలో తెలుగువాడు ఉన్నచోట ఒక తెలుగువాడికి మరో తెలుగువాడు కనబడితే అటు ఇటు చూసినట్లు అప్పారావు మొహంవైపు కాక వేరే వైపుకు మొహం తిప్పుకొంది. సమస్య తేలిపోయిన ఆనందాతిరేకాన, అప్పారావు తనలో తాను మురిసిపోయి నవ్వుకుంటూ,
“ఓస్సంతేనా సరితా! మరి చెప్పవేమి, నల్లగా అవుపించినవన్నీ నీళ్ళు, తెల్లగా అవుపించినవన్నీ పాలు కావు సరితా. మావైపు శీతగా ఉంది అంటే, చలవ అంటే చల్లగా అలాగే కొంచం వంట్లో బాగుండకపోవడం. నువ్వనుకుంటూ అపోహ పడ్డట్టు ‘సీత’ కాదు. జాగ్రత్తగా వినాలి. నలతగా ఉన్నదానికంటే కొంచెం తక్కువగా ఉంటే శీత చేసింది అంటాం. అయినా, హైదరాబాదులో పుట్టి పెరిగిన నీకు ఇలాంటి మాటలు తెలీవు కదా. గొంతేవిటిరా అలా ఉంది అని అమ్మమ్మ అడిగితే ‘శీత చేసింద’ని చెప్పాను. ఆవిడకి అలా చెపితేనే అర్థం అవుతుంది. ఏవీలేదని చెపితే ఊరుకోదు. ఏదో దాచానని అనుకుంటుంది. ఇంకా చెప్పాలంటే దీని అపోజిట్టేంటంటే ‘కాక’ చెయ్యడం. అంటే వేడి చేయడం...” అంటూ ఆనందంగా చెప్పుకు పోతున్నాడు.
“ఐనో తెలుగు. మా సెంటేన్స్ లో తెలుగు ఫస్టు. ఎట్లయినా కాకమ్మ కబుర్లు చెప్పి నన్ను ఫూల్ చెయ్యలేరు” అంది, రోషంగా.
‘అది కాదు సరితా, విను మావైపు భాషలో కొన్ని నీకు తెలియని పదాలు ఉంటూ ఉంటాయి. కొన్ని పదాలు వాడుక వేరుగా ఉంటుంది. అంత సులభంగా పట్టుబడవు. తెలుగు తెలిసినా..’
“పట్టుపడ్డ వాళ్ళు ఇలాంటి కట్టు కథలే చెప్పారు...”
“కథలు కాదు. నిజం. నిజం. కావాలంటే ఎవరినైనా అడుగు. నామాట మీద నమ్మకం లేకపోతే...” అంటూ ఫోను అందించాడు. ఫోను మెమరీలో ఉన్న మొదటి నెంబరుకి ఫోను చేసి, కోపం అంతా ఆపుకొని గొంతు సవరించుకొని చాలా సౌమ్యంగా
“హల్లో, అనుపమా ఎలా ఉన్నారు.”
“అచ్ఛా, బహుతచ్ఛా... మీరు...”
“తెలుగులో ఒక డౌట్, మీకు శీతగా ఉంది అంటే మీనింగ్ తెలుసా.”
“సీతగా ఉండడం, రాముడుగా ఉండడం ఏమిటి?”
“అయితే మీకు తెలీదా?” అప్పారావు చెప్పింది నిజమేనేమోనని క్షణకాలం పాటు నమ్మిన సరితకి ఆ సమాధానంతో ఒక్కసారిగా నీరసం ఆవరించింది.
ఫోను పక్కనే పడేసి, బెడ్ రూమ్ కి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది. అప్పారావు ఫోను తీసుకొని డయల్చెయ్యడం మొదలుపెట్టాడు. ఒకరి తరువాత మరొకరు తమకి తెలియదు అని చెప్పారు. రాత్రి పదకొండు గంటలయింది. ఇంక ఫోను చెయ్యడం ఆపేసాడు. అమెరికాలో ప్రచురించబడే, తెలుగుజ్యోతి, తానా పత్రిక, అమెరికా భారతి లాంటి తెలుగు పత్రికలవాళ్ళకి ఈమైల్ పంపించాడు. మర్నాటి ఉదయం లేవగానే సరితకు చూపించి మళ్ళీ మామూలు దానిగా చేసుకోగలనని అనుకుంటూ హాలులో సోఫాలోనే నిద్రపోయాడు.
తెలుగుభాషమీద కానీ, తెలుగు పత్రికల మీద కానీ ఏమాత్రం అభిమానంకానీ, అవగాహనకానీ లేని సగటు తెలుగువాడికి ఇవాళ వాటి సహాయంతో తన కాపురంలో లేచిన గొడవలకి పరిష్కారం దొరుకుతుందని ఆశించవలసిన పరిస్థితి రావడం ఎంత విచిత్రం.

* * *
అన్నిరోజులలాగే ఆరోజూ తెల్లవారింది. రాత్రంతా పరిపరి విధాల ఆలోచించిన సరిత నిరాశతో నిద్రలేచింది. రాత్రంతా రకరకాల ఆలోచనలు. అమెరికా సంబంధం కావాలని అమ్మా నాన్న పడ్డ ఆరాటం, నిజంగా వచ్చి, తనకు నచ్చి, తనని నచ్చుకున్నారని చెప్పినప్పటి ఆనందం పదే పదే గుర్తు వచ్చాయి.
‘జాగ్రత్త మోసపోగలరు’ అని వీళ్ళకి ఇలా అయ్యింది వాళ్ళకి అలా అయ్యింది అని మోసపోయిన వాళ్ళ వివరాలు పూసగుచ్చినట్టు చెప్పిన వాళ్ళ మాటలు గుర్తుకువచ్చాయి. మా ఫ్రెండు వాళ్ళ ఫ్రెండువాళ్ళ తోటల్లుడి రెండో అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చింది. అమెరికా సంబంధం వచ్చింది. అమెరికా సంబంధం అని ఎగిరి ఎగిరి మరీ పెళ్ళి చేసేరు. ఏమయ్యిందీ, తీరా చూస్తే ఆ పెళ్ళి కొడుకు ప్రబుద్ధుడికి వేరే పెళ్ళి ఎప్పుడో అయిపోయి అమెరికాలో పెళ్ళాం ఉందిట. ‘నాకు జాలీ అంతకరణ ఉన్నాయి కాబట్టి, నీకు అమెరికాలో స్థిరపడడానికి కావలసి ఏర్పాట్లేవో చేస్తాను’ అని హనీమూన్ అయిన తరువాత చెప్పాడుట... ఇలాంటివి విన్నప్పుడు సగం నిజం సగం కల్పితం, చెప్పిన వాళ్ళు చూసారా అని అనుకుంది.
అప్పారావు అలాంటి వాడు కాదని మొదటి చూపులోనే మొదటి పరిచయంలోనే తనకున్న పరిశీలనా శక్తి అంతటితో పరిశీలించానని అనుకుని తనని తాను నమ్మింది. కానీ ఇప్పుడు ఇలా ఎవరో సీతతో అప్పారావుకి సంబంధం ఉందని తెలిసి అప్పారావు తనని మోసం చేసాడని రాత్రంతా బాధపడింది. అందరూ చెప్తున్నా వినకుండా జాగ్రత్తగా ఆలోచించకుండా అప్పారావు మంచివాడని, తనని తానే మోసం చేసుకున్నానని పదే పదే అనుకుంది. ఇక తన జీవితం తను చూసుకోవాలి. మోసపోయి, కాంప్రమైజ్ అయిపోయి జీవితాంతం బ్రతక్కూడదు. తనకున్న డిగ్రీలకు మంచి ఉద్యోగమే వస్తుంది. ఇండియా వెళ్ళిపోయి విడాకులు తీసుకోవాలని సరిత ఒక నిశ్చయానికి వచ్చింది.
* * *
నిన్న రాత్రి తమ వైపు వాడెలాంటి మాటలకి అర్థం తెలియక తనకెవరో సీతతో సంబంధం ఉందని తెలుగు తెలియక చాలా అనుమానాలకి పోయింది. ఇవాళ ఎవరో ఒకరు ఈమెయిల్లో ‘శీతచెయ్యడం’ గురించి వివరంగా వ్రాసి పంపుతారు. అది చదివి తప్పని తెలుసుకున్న సినిమాలలో హీరోయిన్లలా వెనక్కి వచ్చి ‘అప్రావ్’ అని తనని కౌగలించుకుంటుంది. అమ్మమ్మ ఈ విషయం వింటే ‘వెర్రి నాగమ్మ’ అని ముద్దుగా అంటుందని సరితకు చెప్పాలి. ఈ నాగమ్మ ఎవని అంటుందేమో, సీతకోసం ఒక రాత్రంతా తగువైపోయింది. అమ్మో.. మరోసారి ఇలా వద్దు. అసలు సరితకి తెలుగు లాంగ్వేజ్ బాగా నేర్పాలి. అప్పుడే ఇలాంటివి చెప్పాలి. లేకపోతే ఎంజాయ్ చెయ్యలేదు సరికదా అనుమానాలు పెరిగిపోతాయి.
ఇవాళ సరితని బాగా తిప్పాలి, చాలా దూరం కొత్తకారులో తీసుకెళ్ళాలి. సరితకి ఐస్క్రీం అంటే చాలా ఇష్టం కదా. మంచి మంచి ఐస్క్రీం తినిపించాలి. అసలు సీత ఎప్పుడూ తినని లాంటి ‘జింజర్ ఐస్క్రీం’ తినిపించాలి. ముందు అసలు పేరు చెప్పకూడదు. చెపితే అల్లం ఐస్క్రీమా అంటూ తిననే తినదు. కానీ తిన్న తరువాత ‘ఎంత బావుందో’ అని అన్న తరువాత చెపితే ఎంత ఆశ్చర్యపోతుందో అని అనుకుంటూ ఆశతో మేలుకున్నాడు.
కళ్లు తెరవగానే ఎదురుగా సరిత నిలబడి ఉంది. ఆనందంగా ‘సరితా’ అని అంటూ లేవబోయాడు.
‘నాకు ఏమీ చెప్పవద్దు. నా జీవితం నేను చూసుకొంటాను. మోసపోయి, కాంప్రమైజ్ అయిపోయి బతకను. నాకున్న డిగ్రీలకు మంచి ఉద్యోగమే వస్తుంది. ఇండియా వెళ్ళిపోతాను. విడాకులు తీసుకొంటాను’ అని పురోహితుడి వెనక పెళ్ళి మంత్రాలు చెప్పినట్లు తనలో తాను అనుకొన్న మాటలని తాపీగా చెప్పింది.
నోటమాటరాక ఉత్సాహంతో లేవబోతున్న వాడు కాస్తా అలా కదలిక లేకుండా ఉండిపోయాడు.
‘నేను కేబ్ తీసుకుని గుడికి వెళ్ళి వస్తాను. నాకు ఇండియా వెళ్ళడానికి టిక్కెట్టుకొను,”అని గిరుక్కున తిరిగి బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.
సరిత మాటలు విని ఒక్కసారి మళ్ళీ సోఫాలోకి ఒరిగిపోయాడు.
* * *
గుడిలో సరిత పదే పదే ప్రదక్షిణాలు చేసింది. మంత్రాలు వింటున్నాది కానీ, ప్రార్థన చెయ్యడానికి శ్లోకాలు కానీ, పద్యాలు కానీ రావు. దేవుడా, దేవుడా నేను మోసపోయాను, నన్ను రక్షించు అని పదే పదే అనుకోవడం తప్పించి మరేమీ చెయ్యాలో తోచలేదు సరితకు. చివరకు గుడిలో ఒక స్తంభానికి అనుకుని కూర్చొంది. ఎదురుగా ఒక వయసు మళ్ళినావిడ గట్టిగా ప్రార్థన చేసుకుంటున్నాది. రాత్రంతా నిద్రలేకపోవడం వల్ల సరితకి మగతగా ఉంది. పూజార్ల మంత్రాలు, గుడి గంటలు, భక్తుల ప్రార్థనలు అన్నీ కలిసిపోయి, వినిపించడం తాపీగా తగ్గిపోయాయి.
* * *
‘అమ్మ, అమ్మా...’ అని కుదుపుతూ, ఎవరో లేపుతూంటే కళ్ళు తెరచి చూసిన సరితకు ఎదురుగా ఇద్దరు ముగ్గురు మనుషులు కనిపించారు. ఇంతకుముందు చూసిన వయసు మళ్ళినావిడ రెండు చేతులతో పొదిని లేపుతన్నాది. ఎవరో మంచినీళ్ళు అందించారు.
‘పరవాలేదా?’, ‘మంచిగానే ఉందా?’, ‘బిడ్డకి భుకారైందా?’ అని రకరకాలుగా గుడికి వచ్చిన భక్తులు అడుగుతున్నారు. ఇంకెవరో వేడి కాఫీ తెచ్చారు. సరితని స్తంభానికి ఆనుకుని కూర్చోపెట్టారు.
“పరవాలేదు, నేను చూసుకుంటాను’ అని చుట్టూ ఉన్నవాళ్ళకి చెప్పి ‘ఏమ్మా, శీతగా ఉందా?’ అని అడిగింది ఆ వయసు మళ్ళినావిడ.
అర్థరాత్రి కారుమబ్బులు కమ్మిన ఆకాశంలో మెరుపు విరిసి, అది ఫెళ్ళున విరిగి, నేలపైకి దూకి, తనను తాకిన భావన కలిగింది ఆ మాటలు నిన్న సరితకు జవాబు ఇవ్వకుండా ఆమెనే అలా చూస్తూ ఉండిపోయింది.
“నీళ్ళోసుకున్నావా అమ్మా” అని ఆమె మళ్ళీ అడిగింది. సరితకు అర్థం కాలేదు.
“తెలుగొచ్చా...” అని సంశయంగా అడిగింది.
తేరుకుంటున్న సరిత ‘వచ్చు’ అన్నట్లు తలూపింది.
‘మీ ఆయన వచ్చారామ్మా?’ అంది కాఫీ గ్లాసు అందిస్తూ, రాలేదు అన్నట్టు తల ఊపింది. కొద్దిగా కాఫీ తాగింది. కొద్దిగా తేరుకుంది.
“శీతగా ఉందా అంటే ఏమిటండి?” అని అడిగింది మెల్లిగా
“మరేంలేదమ్మా, వంట్లో కాసింత బాగుండగక పోతే మావైపు అలా అంటాం. అంతే అంది ఆమె.
“నిజమా” అని తనలో తాను అనుకున్నట్టు అంది పైకి.
“అంతేనమ్మా, మా విజయనగరం వైపు అలాగే అంటాం” మెడలో ఉన్న మంగళసూత్రం వైపు చూస్తూ, కొత్తగా పెళ్ళైనట్టుంది కదా, నీళ్ళోసుకుంటే కొత్తలో ఇలానే ఉంటుంది. మరేం గాభరా పడక్కర్లేదు. మంచిదే. తొమ్మిదినెలల్లో పండంటి పాపాయి పుడుతుంది. నీళ్ళోసుకుని పుట్టింటికెళ్ళాలి. మరిమీకు ఈ పద్ధతులెలా అవుతాయి. మీవాళ్ళెవరూ లేకపోతే నేనున్నానమ్మా. మొహమాటపడకు..” అంటూ చెప్పుకుపోతున్నాది.
అప్పారావుని సరిగా అర్థం చేసుకోనందుకు, పైగా ఎన్నో మాటలు అన్నందుకు సరిత పశ్చాత్తాపంతో బాధపడింది. అప్పారావు ఎలా ఉన్నాడో? వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించింది. అప్పారావుని కౌగలించుకుని, సారీ చెప్పాలనుకుంది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
“మా అబ్బాయి వస్తాడు, మా కార్లో మీ ఇంటి దగ్గర దింపమంటాను. వాడికి మీ ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పమ్మా” అన్నది ఆవిడ.
సరితకు ఎగిరి అప్పారావు ముందు వాలాలని ఉంది. యాంత్రికంగా కాఫీ తాగింది. లేచి నిలబడింది. ఆమెతో కలసి బయటికి వచ్చి వాళ్ళ కారెక్కి ఎలా వెళ్ళాలో చెప్పింది. పెద్దావిడ ఏవో మాటలాడుతూనే ఉంది. సరిత ఆ ఉ అని సమాధానాలు ఇస్తూనే ఉంది. కానీ మనసంతా అప్పారావు మీదే ఉంది. ఎలా సారీ చెప్పాలో అని ఆలోచిస్తున్నాది. అలా కాదు, ఇలా, ఇలా కాదు, అలా అని పదే పదే అనుకుంటూ ఇల్లు చేరింది. ఎడ్రస్లు, ఫోను నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు.
తాళం తీసుకుని ఇంటిలో అడుగు పెట్టింది. సోఫాలో విచారంగా కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న అప్పారావు దగ్గరకు వెళ్ళింది. నుదిట మీద చెయ్యివేసింది. దిగ్గున అప్పారావు లేచి కూర్చోబోయాడు.
“శీతగా ఉందా?” అని ప్రేమగా అడిగింది.
అప్పారావు అయోమయంగా సరితవైపు చూసాడు. లాలనగా రెండు చేతులలోకి అప్పారావు మొహం తీసుకుంది.
“సారీ” అంది ముద్దుగా అప్పారావు మొహాన్ని దగ్గరకు తీసుకుంటూ.
“అయితే నువ్వు వెళ్ళిపోవడం లేదా, సరితా!” అన్నాడు ఆశ్చర్యం ఆనందం ఒక్కసారి ముంచెత్తెస్తూంటే.
“వెళతాను” అంది నిశ్చయమైన గొంతుతో.
“సరితా” అన్నాడు మళ్ళీ ఆశ్చర్యం బాధ కలసిన గొంతుతో.
“వెళతాను, నీళ్ళోసుకున్న తరువాత” అంది గోముగా.
అందమైన పదాల పొత్తులోని తియ్యనైన భావనలా ఒకరిలో ఒకరు కలిసిపోయారు.
* * *
(కృతజ్ఞతలు : ప్రేరణ-శ్రీమతి గరకపాటి సీత, ఉత్ప్రేరణ – శ్రీ చెరుకుపల్లి నెహ్రూ)
- తెలుగు వెలుగు, ఏప్రిల్ 2004, రచన జూలై 2004
0 వ్యాఖ్యలు:
Post a Comment