Friday, May 15, 2009

బొబ్బిలి - 1876

Friday, May 15, 2009
శుక్రవారం 22వ తారీఖు, డిసెంబరు 1876. నెలగంటు పెట్టి కొద్దిరోజులు అయ్యింది. వేణుగోపాలాచార్యులు బొబ్బిలి పురవీధుల్లో గుర్రపు బండిలో ప్రయాణిస్తున్నారు. నులివెచ్చని సూర్యకిరణాలు చెంపలని తాకి, తాను తీసుకువచ్చిన పూల పరిమళాలని నాసికాలకి అందించి పోయాయి.

వేణుగోపాలాచార్యులు ఇరవై ఐదేళ్ళ యువకుడు. మిస మిసలాడుతున్న వయసు. కొలనుపై పడ్డ ఉదయభానుడి కిరణాలు మెరిసి విరజిమ్మే కాంతిలో స్నానించాడా అన్నట్లనిపించే మేని ఛాయ. తగిన వ్యాయామం వల్ల రాణింపు పొందిన శరీరం, మెరుపుకాంతిలో ముంచి తియ్యబడ్డాయా అన్నటువంటి కళ్ళు, విశాలమైన ఫాలభాగం పాశ్చాత్య పద్ధతిలో దువ్వబడ్డ జుత్తు ఉన్నతాధికారి సుమా! అనిపించే వేషధారణ.

* * *

పాలకొండలో పుట్టారు వేణుగోపాలచార్యుల వారు. చెన్నపురి వెళ్ళి అక్కడ పట్టభద్రుడై, లండన్లో బారెట్లా పూర్తిచేసారు. లండన్లో ప్రముఖ న్యాయవాది సర్ కేస్ వెంట అమెరికా, యూరోపియనంలోని వివిధ దేశాలు నాణ్యములపై తిరిగి విశేషమైన అనుభవాలను, పరిజ్ఞానాన్ని సంపాదించారు. అతి చిన్న వయసులోనే వారు ప్రస్తుతం నిజాంవారి వ్యాజ్య వ్యవహారములో స్వదేశానికి వచ్చారు. హైదరాబాద్లో ఆ పని పూర్తిచేసుకుని తిరిగి లండన్ వెళ్ళే ముందుగా బంధువులను చూడాలని బొబ్బిలి రెండు రోజుల క్రింద వచ్చారు.

“మీ అమ్మ పెళ్ళిలో జరిగిన గొడవల వలన మీ బామ్మగారికి, మీ నాన్నగారికి మేమంటే కిట్టక మీ అమ్మని, మిమ్మల్ని పంపకపోయినా పెద్దవాడివి అయి మమ్ముల్ని చూడడానికి వచ్చావా నాయనా, మీ అమ్మని చూసినట్లే వుందిరా” అని కన్నీళ్లు పెట్టుకున్న అమ్మ ఇల్లు కదలనివ్వలేదు వేణుగోపాలాచార్యులని.

కచేరి సావిట్లో ఏర్పర్చిన కుర్చీలలో పెద్దలంతా కూర్చుని వున్నారు. వేణుగోపాలాచార్యులు అందరికీ నమస్కారం చేశారు. పెద్ద మేనమామ అక్కడున్న ఒక్కొక్కర్ని పరిచయం చేశారు. కుశల ప్రశ్నలైన తరవాత రాణీవారు రేపు ఉదయం కొత్తపేటలో వారితో సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. దయజేయ ప్రార్థన అని వచ్చిన పెద్దలు చెప్పారు.

ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయారు వేణుగోపాలాచార్యులు. ఆయన ఊరికి వచ్చినట్లు కోటలోని వారికి తెలియడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నాటికి బొబ్బిలి జనాభా సుమారు పదమూడువేలు. వేణుగోపాలాచార్యుల మేనమామలు వేదాంత, వైద్య విషయాలలో ఊరిలో అందరికీ తలమానికం. అందుచేత ‘ఎందుకు?’ ‘రాను’, ‘కుదరదు’ అనడానికి వీలులేదు. దేవిడీ నుండి రమ్మని కబురొచ్చిందంటే వెళ్లవలసిందే. తాను లెఖ్క చెయ్యకపోయినా తన మేనమామల వలన తప్పదు. ఏదో వ్యాజ్య సంబంధమైన విషయం అయ్యుంటుంది. ఒకవైపు నైజాము వ్యవహారాలలో తలదూర్చి, మరోవైపు జమీందార్ల విషయాలలో కలగజేసుకుంటే ఏమవుతుందో? ఇంటికి వచ్చి ఆహ్వానిస్తున్న వ్యక్తుల్ని ఇంకోలా పంపలేరుకదా. ‘సరే’ అని ఆ ఆహ్వానానికి సమ్మతి తెలిపారు, నిన్న సాయంత్రం వేణుగోపాలాచార్యులు.
* * *

గుర్రపు బండి ఆగిన కుదుపుకి బండిలో వున్న వేణుగోపాలాచార్యులు ఆ ఆలోచనలలోంచి తేరుకున్నారు. బండి ఆగింది.

“బాబు, ఇదే బొబ్బిలి కొత్తపేట” అని రౌతు లచ్చన్న అన్నాడు. అక్కడ దేవిడీ ముందున్న సేవకులు బండి ద్వారం తెరిచి వినయంగా నిలబడ్డారు.

“రాణీ చెల్లాయమ్మగారి మందిరానికి వెళ్ళాలికదా, ఇక్కడే ఆపేసేవేం?” అన్నారు వేణుగోపాలాచార్యులు. రౌతు లచ్చన్న సమాధానం ఇచ్చే లోపలే.

“శ్రీ వేణుగోపాలాచార్యుల వారికి వందనములు, మేము బొబ్బిలి ఆస్థానంలో దివాను పదవిలో వుండి రాణీ లక్ష్మీ చెల్లాయమ్మ బహదూర్ వారి సేవ చేసుకుంటున్న వారము” అని ఆరడుగుల పోతపోసిన పంచలోహ విగ్రహం వంటి దేహంతో, పట్టు వస్త్రాలంకృతుడై ఎత్తయిన తలపాగాతో, వజ్రం వంటి మెరుపున్న చూపుతో, పండు మీసాలతో, దండిగా కండపుష్టి ఉండేదన్నదానికి నిదర్శనంగా ఉన్న బలమైన బాహువులని ఎత్తి అరచేతులని దగ్గరికి చేర్చి గౌరవప్రదమైన రీతిలో నమస్కరిస్తూ ఎదురుగా నిలుచున్నారు దివాను రాజా ఇనుగంటి సీతారామస్వామి. వేణుగోపాలాచార్యులు ప్రతినమస్కారం చేశారు.

పరివారంలోని యువతులు వేణుగోపాలాచార్యులుపై పూలు జల్లారు. సమావేశానికని రప్పించి ఈ పూలు జల్లడమేమిటి అని కొంత ఆశ్చర్యం అనిపించింది. కించిత్తు ఆలోచనలో కూడా పడ్డారు వేణుగోపాలాచార్యులు. సరే ఎందుకు పిలిపించారో? ఏమంటారో? ఏం వినాలో? దీనంతటి పర్యవసానమేమిటో? అంతా అయోమయంగా వుంది వేణుగోపాలాచార్యుల వారికి. అదే సమయంలో ఖాసా అప్పారావు గోడమీద వున్న గడియారం వైపు తీక్షణంగా చూస్తున్నాడు. ఆ గడియారం ప్రస్తుతం రాణీగా వున్న లక్ష్మీ చెల్లాయమ్మగారి భర్త సీతారామకృష్ణ రాయడప్ప రంగారావు బహదూర్ వారికి ‘ఏజెంట్ టు ద గవర్నర్’ అయిన రియడ్ దొరవారు బహుమానంగా ఇచ్చినది. దాని ప్రకారమే ఊరంతటికీ వినబడేటట్లు గంటలు కొడతారు. సరిగ్గా పది అయింది. ఖాసా అప్పారావు పది గంటలు కొడుతున్నాడు. కదులుతున్న కాలాన్ని చూడ్డానికి అడిగినట్లు ఎవ్వరు కదలలేదు. గంటలు కొట్టడం పూర్తయింది.

“దయజేయండి” అంటూ దివాను వేణుగోపాలాచార్యులని దేవిడీలోంచి లోనికి తీసుకెళ్ళారు.

“దీనినే కొత్తకోట అంటారు. మహారాణీ వారే దీనిని 1872 లోనే నాలుగేళ్ళ క్రిందట కట్టించారు. దాన ధర్మాలతో, ప్రజారంజకంగా పాలిస్తున్నారు. దీనిని గుర్తించి ఈ సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం వారు వీరిని ‘రాణీ’గా గుర్తించారు. బొబ్బిలి 227 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 152 గ్రామాలు, 52 అగ్రహారాలు ఉన్న సంస్థానం..” అంటూ వివరాలు చెప్తున్నారు. ఈ సమావేశానికి గల ముఖ్య ఉద్దేశమేమిటి అన్న ఆలోచనలోనే వున్నారు వేణుగోపాలాచార్యులు.
* * *
“అయ్యా, ఇదే లక్ష్మీ చెల్లాయమ్మగారి ఆస్థాన కార్యాలయం. ఇటువైపు తిరిగితే వున్నది ప్రత్యేకాహ్వానితులకై కేటాయించిన సభా మందిరం” అన్న దివానుగారి మాటలతో ఆలోచనలో నుండి బయటపడి పరిసరాలను పరికించారు వేణుగోపాలాచార్యులు. విశాలమైన వసారా. ఎత్తయిన స్తంభాలు. చుట్టూ చిన్న చిన్న పూలమొక్కలు. మంచి పోషణ వలన కాబోలు చక్కగా పూశాయి తెల్లని నందివర్ధనం పూలు. అప్పుడే తెరిచిన చిన్న పిల్లల కళ్ళలా వున్నాయి. దేవకాంచనం పువ్వులు పొగడలు సిగ్గుతో సోలినట్లున్నాయి. అంగారు అదిమిన సుందరీమణుల సునయనాలపై నుండి కూడా దృష్టి తమవైపుకు తిప్పుకునే నుదిటిపై సింధూరంలా ఎర్రగా మందారాలు, సాయంత్రపు పడమర ఆకాశం ముక్కకోసి తీసుకొచ్చిన తివాచీగా పరిచినట్లు కనకాంబరం మొక్కలు పొదలు.

విశాలమైన భవంతి. ప్రతిద్వారం వద్ద పరిచారికలు. గంధ, చందన సువాసనలతో ఆ పరిసరాలు గుబాళిస్తున్నాయి. ప్రపంచంలోకెల్ల చెప్పుకోదగ్గ లండన్ లోని బకింగ్ హామ్ పాలన చూసినా, వేణుగోపాలాచార్యులకి బొబ్బిలి కోటలోని “పచ్చదనం”ముచ్చట నిపించింది. ఎంతైనా రాజవంశీయులు! ఈ కులీనుల కళాదృష్టి, విలాసం, సంపదని అనుభవించే తీరు పాశ్చాత్యులకి ఎన్ని వందల ఏళ్ళైనా అబ్బుతుందా అని అనిపించింది.

దివాన్ గారు వేణుగోపాలాచార్యులుని ఒక పెద్ద హాలులోకి తీసుకువెళ్ళి ఓ సోఫాలో కూర్చోబెట్టారు. ఇంతలో పురప్రముఖులు, అస్నా ఆంగ్ల అధ్యాపకులైన మిష్టరం మార్షు తదితరులు వచ్చి కూర్చున్నారు. పలకరింపులయ్యాయి. పరిచారికలు పెద్ద పళ్ళారంలో రకరకాల వెండి కుప్పెలలో ఏమేమో తెచ్చి ఎదురుగా ఉన్న మేజాపైన పెట్టారు.

“అయ్యా! మీరు పాశ్చాత్య పద్ధతిలో ఏదైనా తీసుకున్న ఎడల సమావేశానికి సిద్ధం అవ్వవచ్చు” అన్నారు దివాన్.

ఆ పళ్ళారాల వైపు చూసారు వేణుగోపాలాచార్యులు. వేడిపాలు, మూడు రకాల కాఫీ పానీయాలు, టీ పానీయము, బెల్లపుపొడి, అంతటా లభ్యం కాని ఖరీదైన చక్కెర వాటి ప్రక్కనే చైనా కుప్పెలు వున్నాయి.

“కొద్దిగా టీమాత్రం చాలు” అన్నారు వేణుగోపాలాచార్యులు.

ఒక పరిచారిక వెనువెంటనే టీ తయారుచేయగా, మరో పరిచారిక బహు వినయమైన భంగిమలో చైనా కుప్పెలో అందించింది.

వేణుగోపాలాచార్యులకి ఎదురుగా దూరంలో పది పదిహేను అడుగుల పొడవున్న అడ్డు తెరవున్నది. అది చెక్కతో సన్నజాజి తీగెలని చెక్కి అల్లి అందమైన అడ్డు తెర అమర్చిన విధంలో వున్నది. అది చందనంతో చేసిందని ఆ పరిసరాలకు అది అందించే చందనపు వాసన తెలుపుతున్నది. తెర వెనుక కలకలం మొదలయ్యింది.

“మహారాణి లక్ష్మీ చెల్లాయమ్మ బహదూర్ వారు విచ్చేస్తున్నారహో!” అన్న స్త్రీ కంఠ సముదాయంతో వాతావరణం నిండిపోయింది.

వేణుగోపాలాచార్యులు వారు లేచి నిలబడాలో కదలకుండా కూర్చోవాలో తెలియని స్థితిలో వుండగా దివాన్ గారు అందించిన చెయ్యిని పట్టుకుని లేచి నిలబడ్డారు. చందనపు తెర వెనుక సద్దు మణిగింది దివాన్ గారు పరిచయ వాక్యాలు పలికారు.
“శ్రీ వేణుగోపాలాచార్యుల వారికి వందనములు” తంత్రులు మీటగా వచ్చిన ఓ వాయిద్య విశేషం నుండి వెలువడ్డ స్వరాల సమూహంలా తోచాయి చందనపు చెక్క అడ్డు వెనుకనుండి వచ్చిన ఆ పదాలు వేణుగోపాలాచార్యుల చెవులకి.

“రాణి లక్ష్మీ చెల్లాయమ్మ బహదూర్ వారికి వందనములు” అన్నారు వేణుగోపాలాచార్యులు తేరుకొని.

“అతి తక్కువ వ్యవధిలో మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు కృతజ్ఞతలు” అన్నారు రాణి. ఆమె చందనపు చెక్క తెర చిన్న చిన్న సందులలోంచి కనిపించకూడదన్నట్లు దానిపై నేత వస్త్రం అటువైపు నుండి కప్పినట్లు తోస్తుంది. ఆమె గొంతు ఆనంద, కుతూహల సమ్మేళన రాగంలా మెల్లమెల్లగా మొదలయ్యింది. పిదప గంభీర అధికార స్వరంతో మేళవించినట్లు అనిపించింది వేణుగోపాలాచార్యులుకి. ఏమి మాట్లాడాలో తెలియక మౌనంగా వున్నారు వేణుగోపాలాచార్యులు. “మీరు పాలకొండవాసులని, లండన్లో బారెట్లా పూర్తిచేసారని, ప్రముఖ ఆంగ్ల న్యాయవాది సర్ కేన్ తో పనిచేస్తున్నారని విని చాలా ఆనందించాం. మీ ప్రతిభకు మేమెంతో గర్వపడుతున్నాం అని” ఆమె అన్నారు.

“మీ అభిమానానికి కృతజ్ఞతలు” అన్నారు వేణుగోపాలాచార్యులవారు.

“బొబ్బిలి సంస్థానంలో విద్య, వైజ్ఞానికాభివృద్ధికై ఉన్నత విద్యావంతులు, విశేష ప్రపంచానుభవజ్ఞులు అయిన మీ వంటివారి సలహాలని పొందడం ఈ సమావేశం ఏర్పాటు చెయ్యడంలో ముఖ్యోద్దేశం. బొబ్బిలి సంస్థానంలో దేనికి లోటు లేకపోయినా, వ్యవసాయ వాణిజ్య రంగాల్లో అభివృద్ధి తృప్తికరంగా ఉన్నా, విద్య, వైద్య, విజ్ఞాన రఁగాల్లో ప్రపంచంలోని అభివృద్ధిని మీ ద్వారా తెలుసుకోవాలని కోరుతున్నాం. వీలైతే బొబ్బిలి విద్యా వ్యవస్థని పటిష్టం చేసి ప్రపంచ మేధావివర్గంతో పోటీపడగల విద్యావంతులని తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నాం. ఇది మా ఆకాంక్షే కాదు, శ్రీశ్రీశ్రీ మహారాజశ్రీ సీతారామకృష్ణ రాయడప్ప రంగారావు బహదూర్...” గొంతు గద్గదమైపోయింది. తారస్థాయికి చేరబోతున్న ఒక కమ్మని రాగప్రవాహం ఒక్కసారి కందెన లేక ఆగిపోయిన బండి చక్రం రీతిలో ఆగిపోయింది నిశ్శబ్దం.

“స్వర్తస్థులైన... మా... మహారాజా... వారు” నీటితో నిండా నిండిన చేదతో లోతైన నూతిలో నుండి నీళ్ళు తోడుతున్నప్పుడు తుళ్ళిపడే లాంటి చిరు గర్వం తొణికిసలాడుతున్న కంఠంతో, భక్తిప్రవత్తులు, వాత్సల్యాభిమానాలు ఒకదానితో ఒకటి పోటీపడి పదాలను గొంతు పంపుతున్న రీతిలో దివాన్వారు చెప్పడం మొదలుపెట్టారు. “గొప్ప ఆశయాలతో సదుద్దేశాలతో బొబ్బిలి సంస్థాన పరిపాలన ప్రారంభించారు. అనతికాలంలోనే, జనవరి 11 తారీఖు 1857న బొబ్బిలి, విజయనగరాల మధ్య ఒక చక్కనైన ఒడంబడిక ఏర్పడింది.” అని ఆగి, “బొబ్బిలి యుద్ధం ఓ దుర్దినం. వంద ఏళ్ళ పిదప దానికి తగిన ముగింపు ఏర్పాటు చేశారు మా మహారాజావారు” అని మౌనంగా ఆగిపోయారు.

“అవును అది బొబ్బిలి జమీందారి చరిత్రలో ఆరోజు ఒక దుర్దినం” అన్నారు వేణుగోపాలాచార్యులు దివానుతో ఏకీభవిస్తూ నిశ్శబ్దం ఆవరించింది. లండన్లో తాను బొబ్బిలి సంస్థానంపై చదివిన పుస్తకాలలోని బొబ్బిలి యుద్ధం వివరాలను గుర్తుకుతెచ్చుకున్నారు వేణుగోపాలాచార్యులు.

గురువారం, 24 తారీఖు, జనవరి 1757 సూర్యోదయ సమయాన విజయనగరం జమీందారు విజయరామరాజు తమ పదకొండు వేలమంది సేనతో, ఫ్రెంచి సైనికాధికారి బుస్సీ ఆధ్వర్యంలోని ఏడువందల ఏభై సైన్యంతో, మర ఫిరంగులతో బొబ్బిలి కోటను ముట్టడించాడు. ఆ ముట్టడిలో కేవలం రెండు వందల ఏభైమంది సైనికులు మాత్రమే వున్న బొబ్బిలి జమీందారు గోపాలకృష్ణ రంగారావు బహదూర్ అతి పరాక్రమంతో శత్రువులను ఎదుర్కొన్నారు. ఘోరమైన పోరాటం జరిగింది. ఓడిపోతామని తెలిసి, చనిపోవడం తప్పదని తెలిసుకున్న వారై తమ ఆడవారిని, పిల్లలని శత్రుసేన బారి పడరాదని ఆలోచించి, వారిని చంపించమని ఆజ్ఞాపించారు. పారిపోతున్న వారిని, పసిపిల్లలని కూడా విడువలేదు. తామూ ఆత్మహత్య చేసుకున్నారు. జమీందారు మాట వినకుండా వారి కుమారుడు పసివాడైన వెంకట రంగారావుని రక్షించి, స్మశానమవుతున్న కోట దాటించ ప్రయత్నించాడు ఒక సేవకుడు. కానీ పిల్లాడితోసహా దొరికిపోయాడు. బుస్సీవద్దకు తీసుకురాబడ్డాడు. బుస్సీ ఆ పిల్లవాడిని తరవాత బొబ్బిలి జమీందారుగా నియమించాడు. ఆ పిదప మూడవరోజు రాత్రి చీకటిలో తన గుడారంలో నిద్రపోతున్న విజయరామరాజుని 32 కత్తిపోట్లతో తాండ్ర పాపారాయుడు, అతని అనుచరుడు చంపారు. శత్రువుని చంపిన ఆనందంతో వారు వేసిన కేకలకి గుమికూడిన సైనికులు వారిని కాల్చిచంపారు.
* * *

తేరుకున్న దివాన్ గారు మళ్ళీ మట్లాడం మొదలుపెట్టారు.
“మహారాజా శ్రీ సీతారామకృష్ణ రాయడప్ప రంగారావు బహదూర్ అత్యంత క్రమశిక్షణతో బొబ్బిలి జమిందారీ పరిపాలనలో స్వర్ణయుగం అనదగ్గదిగా 1802 నుండి 1830 వరకు పరిపాలనా కాలాన్ని పరిరక్షించుకు వచ్చారు. బొబ్బిలిలో ప్రప్రథమంగా ఆంగ్లేయ పద్ధతిలో ఒక పాఠశాల నెలకొల్పారు. బ్రిటిష్ వారిపై పితూరీలు లేవదీసిన కంబారా వెంకటరాయుడిని పట్టి బ్రిటిష్ ప్రత్యేక కమిషనర్ మిస్టర్ రస్సెల్కు అప్పగించారు. అది డబ్బుకోసం కాదు, బ్రిటిష్ సామ్రాజ్యంపై తమకున్న భక్తికి నిదర్శనం అని చెప్పారు. వారు ఎన్నో ఊర్లని కొని, వేలంలో సంపాదించి బొబ్బిలి సంస్థానాన్ని విస్తరింపజేశారు. ఎన్నో అగ్రహారాలను దానం చేశారు. చెరువులు తవ్వించారు. ఎంతో వ్యయంతో 1855లో ఫూల్ బాగ్ తోటని నిర్మించారు.

ఇంతేకాక చుట్టుపక్కల జమీందారులకు అప్పులు ఇచ్చి ఆదుకుని వారి వారి జమీందారీలను నిలబెట్టారు. పిల్లలు లేక పిఠాపురం జమీందారు సూర్యారావు బహదూర్ మూడవ కొడుకుని పెంచుకున్నారు. మా మహారాణీవారు ఆ సాంప్రదాయంలోనే బొబ్బిలి జమీందారీని నడిపించుకు వస్తున్నారు.” న్నారు దివాను.

“అవును విన్నాను. బెంగాల్ కరువులో తమ జమిందారీ నుండి 40 వేల బస్తాల ధాన్యం పంపారని కూడా విన్నాను. క్రిందటి సంవత్సరం ఘనత వహించిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మద్రాస్ వచ్చినపుడు వీరిని పొగిడారని, మెడల్ ఆఫ్ ఆనర్ ఇచ్చారని లండన్ పత్రికలో చదివాను.” రాణివారున్నవైపు చేయి చూపిస్తూ “వీరికి రాణీ అన్న బిరుదు అని కూడా తెలుసు. విదేశాలలో ఉన్నా కూడా మన ప్రాంతపు వార్తలని తప్పకుండా చదువుతాను. రాణీవారు అందరి జమిందారులవలె కాక బహు గొప్ప మనసుతో ప్రజోపకరమైన ఎన్నో మంచి పనులు చేస్తున్నందకుకు వీరిపై నాకు ఎనలేని గౌరవం” అని అన్నారు వేణుగోపాలాచార్యుల వారు.

“మీ గౌరవానికి సంతోషం. వివిధ దేశాలు తిరిగి వివిధ రీతులు గమనించిన మీరు మా కుమారులు, బొబ్బిలి సంస్థానపు పదిహేనవరాజు, త్వరలో ఈ రాజ్య పరిపాలనను చేపట్టబోతున్న కుమార రాజాశ్వేతాచలపతి వేంకట రంగారావు బహదూర్ తన హయాంలో ఏఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తే బావుంటుందో సూచించే మీ అభిప్రాయాలను కోరుతున్నాం” అన్నారు రాణీగారు తెరవెనుక నుండి.

“నేను మహారాజావారి కాలం నుండి వీరి సేవలో వున్నవాడిని. ముదుసలిని అయ్యాను. కాలంలో మార్పు వస్తున్నాది మీ వంటి యువకులు, ప్రపంచానుభవం వున్నవాళ్లు తగిన ప్రణాళికలను సూచించాలి” అన్నారు దివాన్ గారు.

“విద్య అన్ని రంగాలకు కేంద్రం. అందుచేత విద్యకై విశాఖపట్నం వెళుతున్న ఇక్కడి విద్యార్థులకు కనీసం మిడిల్ స్కూల్ వరకైనా బొబ్బిలిలో వుండాలి. ఇప్పుడున్న పాఠశాలను ఆ మేరకు అభివృద్ధి చేయండి. ఉత్తర అమెరికా ఖండంలో వలే భరతఖండంలో కూడా బ్రిటిషువారి పాలన ఎంతో కాలం వుండదు. మీవంటి జమీందార్లందరు ముక్తకంఠంతో ‘వెళ్లిపోండి’ అంటే వారు వేళ్లిపోవలసిందే?” అన్నారు వేణుగోపాలాచార్యులు.

పిడుగు వదిలి వెళ్ళే నిశ్శబ్దం ఆవరించింది బయట గాలికి కదిలిన ఆకులు చప్పుడు మాత్రమే వినిపిస్తున్నది.

బ్రిటిషువారి పాలన ఎంతో కాలం వుండదు అన్నమాట శ్రోతలందరిని భయభ్రాంతులను కలగజేసింది. ముఖాలు పాలిపోయి తళుకులేని తదియ చంద్రునిలా విలవిల్లాడుతున్నాయి. తెరవెనుక రాణిగారి హావభావాలు తెలియవు. కానీ వున్నట్టుండి ఏర్పడ్డ నిశ్శబ్దం వేణుగోపాలాచార్యులుని చకితుడిని చేసింది.

బ్రిటీషు వారికి దాసోహం అని, వారి మోచేతి నీరు త్రాగడానికి కూడా సిద్ధపడే సంస్థానంలో అటువంటి మాటలనడం మరణశిక్షని కోరడమే. పూర్తిగా వికసించిన మా నవ మేధకు, మనిషి తన ఆంతరంగిక ఆధ్యాత్మిక అవసరాలకు సృష్టించుకున్న దేవుడు అనవసరం అన్నంత దానికంటే ప్రమాదకరమైన విషయం. ఇది గ్రహించిన వేణుగోపాలాచార్యులు వెంటనే-

“ఇది రాజద్రోహపు దృష్టితో అన్నమాట కాదు. లండన్ సభలలో అక్కడక్కడ వినబడుతున్నదే. అదేవిధంగా, మీరు కూడా మీ సంస్థానంలోని మేధావులను పిలిపించి, తమ, సామాజిక, శాస్త్ర సభలను జరిపించి, విషయ మీమాంస చేయించమని కోరుతున్నాను” అన్నారు. ఈ వాక్యం శ్రోతలందరికి నీట మునుగుతున్న వాడికి ఒక చిన్న ఆసరా దొరికినట్లయింది.

“మీరేమంటారు మిస్టర్ రస్సెల్?” అన్నారు ఆయనవైపు తిరిగి వేణుగోపాలాచార్యులు. వేణుగోపాలాచార్యులు మిడిల్ స్కూల్ పెట్టమని రాణీరావారికి సూచించగానే, మిడిల్ స్కూల్ వస్తే తాను హెడ్ మాస్టర్ అవ్వచ్చునని, స్థిరమైన జీవనోపాధి లభిస్తుందని, ఆర్థిక స్తోమత వస్తుందని దానివలన తాను మనసుపడ్డ వారితో వివాహానికి, తన తండ్రిని ఒప్పించగలనని ఊహలలో తేలిన 23 ఏళ్ళ మిష్టర్ రస్సెల్ అవకాశాన్ని జారవిడుచుకోకుండా,

“అవును, ఘనత వహించిన బ్రిటిష్ చక్రవర్తిణి విక్టోరియా రాణీవారు, తమ రాజ్యంలో ప్రజల ఉన్నతి కోరుతారు. భారతీయులను విద్యావంతులుగా, విజ్ఞానవంతులుగా చేయడానికే ఎన్నో కష్ట నష్టాలకోర్చి ఈ దేశం వచ్చినాము. ఆ లక్ష్యంలో భాగమే అవుతుంది మిడిల్ స్కూలు పెట్టడం” అని సంభాషణను మళ్లించారు.

వేణుగోపాలాచార్యులవారు మిష్టర్ రస్సెల్ ను ఖండించనూ లేదూ, సమర్థించనూ లేదు.
“మీ ఆలోచనలు మాకు వింతగానూ, ఆకర్షణీయంగానూ ఉన్నాయి” అన్నారు రాణిగారు.
“వీరు ప్రముఖ న్యాయవాది సర్ కేన్ శిష్యులు, సర్ కేన్, గ్రేట్ బ్రిటన్ రాజకీయాలలో ముఖ్యులైన బెంజమన్ డిస్రయిలీగారి మిత్రులు కూడాను. అందువలన లండన్ మహానగర ప్రముఖుల సాంగత్యం, అమెరికా దేశస్తుల పరిచయం, వాటివలన వీరి ఆలోచనా సరళి క్రొత్త రీతులలో సాగడం సహజమే మరి” అన్నారు దివానుగారు.

“వీటితోపాటు మీరు ఆధునిక విజ్ఞానశాస్త్రానికి కూడా తగిన స్థానాన్ని కల్పించాలి. మీ సంస్థానంలో కులవిద్య చాలు అనుకుంటున్న వివిధ కులాలవారు, తాము అధికులమని భావించి, మీరు పెట్టిన పాఠశాలలకు వచ్చే మిగలిన కులస్థులతో చదవరాదనుకుని విద్యా విహీనులవుతున్న వెలమలు, మీ సంస్థాన అభివృద్ధి పథకాలకు కళంకం తెస్తున్నారని నా ఉద్దేశ్యం. ఈ విషయంలో రాణీవారు శ్రద్ధ తీసుకోవాలి అని నా మనవి” అన్నారు వేణుగోపాలాచార్యులు.

“అవును ఈ విషయం మాకూ చింత కలిగిస్తున్నాది. దివానుగారు ఈ విషయంపై సమగ్రమైన ఆలోచన గావించి, తగిన ఉత్తర్వులను జారీ చేయడానికి సిద్ధం చేయించండి” అన్నారు రాణిగారు.
“చిత్తం మహారాణీ” అన్నారు దివాను.
“వేణుగోపాలాచార్యులవారు, మా ప్రజల ఆరోగ్యం కూడా మాకు చాలా ముఖ్యం. ఈ విషయంలో మీ సలహా ఏదైనా ఉంటే వినాలని కోరుతున్నా” అన్నారు రాణి.

“తప్పకుండా మనవి చేస్తాను మహారాణీ. ప్రముఖ వైద్యురాలు డాక్టరం సోఫియా జక్స్ బ్లాక్ రెండు సంవత్సరాల క్రిందట స్త్రీలపై ప్రత్యేక వైద్య కళాశాల ‘లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ విమెన్’ పేరిట స్థాపించారు. మీ సంస్థానం నుంచి కూడా ఒకరిని అటువంటి విద్యకు పంపి ప్రోత్సాహమిస్తే మీకు, మీ ప్రజలకు మహోపకారం జరుతుంది కూడాను” అన్నారు వేణుగోపాలాచార్యుల వారు.
“నిజమే, అనుభవజ్ఞురాలైన మంత్రసాని పురుళ్ళ గంగమ్మ మన సంస్థానంలో చాలా కాలంపాటు పనిచేస్తున్నా, ఆధునిక వైద్య విజ్ఞానం ఉన్న ఒక వైద్యురాలి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దివాన్ గారు మన సంస్థానం ఈ విషయంలో ఏం చెయ్యగలదో” అన్న ప్రశ్నకు “చిత్తం మహారాణీ తప్పక చర్యలు చేపడతాం” అన్నారు దివాన్ గారు.

ఈ సమావేశం బొబ్బిలిలో రాబోవు కాలంలోని అభ్యుదయానికి నాందిగా భావిస్తున్నాం. మీ సూచనలను మా సంస్థానం ఎప్పుడు ఆనందంగా ఆహ్వానిస్తుంది. మీరు విద్యా, వృత్తి వ్యవహారాలలోనేకాక వైవాహిక విషయంలో కూడా కొన్ని తరాల ముందుగా వున్నారని తెలిసింది. మీ ఆధునికతకు అభినందనలు” అన్నారు రాణీగారు ఆనందాన్ని, అభిమానాన్ని మేళవించిన గొంతుతో.
“అంటే.. ” తడబడుతూ అన్నారు వేణుగోపాలాచార్యులవారు.

“వచ్చే నెల 16వ తారీఖునాడు మీరు హైదరాబాద్ నగరంలో నిజాంవారి ఆస్థాన పర్షియన్ కవి కుమార్తె నహిత్ ను వివాహమాడబోతున్నారని తెలుసు. ఆ వివాహ మహోత్సవానికి రావలసిందిగా కోరుతున్న నిజాం వారి ఆహ్వానం పాలకొండ జమీందారుతోసహా మాకు అందింది శుభాకాంక్షలు.” అన్నారు రాణి.

ఈ వార్త ఇంతవరకు చేరింది అని నిశ్చేష్టులైనారు వేణుగోపాలాచార్యులు. ఇంతలో ఇద్దరు యువతులు ఒక వెండి పళ్ళెరంలో రెండు ముఖమల్ సంచులతో ముందు నిలుచున్నారు.

“మీ వివాహానికి మా తరఫున ఒక ప్రతినిధి హాజరవుతారు. మీకు మీ కాబోయే సతీమణికి మా వ్యక్తిగత బహుమానంగా ఈ బంగారు ఆభరణాలని స్వీకరించండి. ఆమెకు మా ఆస్థాన ఆహ్వానాన్ని అందించండి.” అన్నారు రాణీగారు.

“అలాగే మహారాణీ, అలాగే మహారాణీ,...” అంటూ సగౌరవంగా కానుకలు స్వీకరించి, సెలవు తీసుకున్నారు వేణుగోపాలాచార్యులు.
* * *
- ఆంధ్రభూమి, 25 జనవరి 2001.





0 వ్యాఖ్యలు: