Thursday, May 14, 2009

మాటలు, చూపులు, చేతలు

Thursday, May 14, 2009
కొన్ని మాటలు, చూపులు, చేతలు
నన్ను మంచులా గడ్డకట్టించేస్తాయి
నిరుపయోగ నీచానికి నకలుగా చేస్తాయి

కొన్ని మాటలు, చూపులు, చేతలు
నన్ను కరిగించి నదిలా ప్రవహింపజేస్తాయి
మానవత్వపు మంచితనంతో ముంచెత్తేస్తాయి

కొన్ని మాటలు, చూపులు, చేతలు
నన్ను ఆవేశపరచి ఆవిరిగా మారుస్తాయి
దానవత్వపు దావానలంతో దహించేస్తాయి

నా మాటలు, చూపులు చేతలే
నా స్థితిని అనువదిస్తాయి
నా స్థితిని నిర్దేశిస్తాయి

ఆ మాటలు చూపులు చేతలే కదా
నీ ప్రపంచంలో నా చిరునామాకు దారి
నీ ప్రతి చర్యకు ఊపిరి
ఏ మాటలు, చూపులు చేతలు
నన్ను మనిషిగా నిలబెడతాయో
మనుషులకు దగ్గరగా చేస్తాయో

ఆ మాటలు నన్ను అననీ
ఆ చూపులు నన్ను చూడనీ
ఆ చేతలు నన్ను చెయ్యనీ




0 వ్యాఖ్యలు: