
తల్లి కడుపులోనుండి బయటపడ్డాక ఇల్లు, ఇంట్లోంచి బయటపడ్డాక ఊరు మనిషిని ఆహ్వానిస్తుంది. అలా నన్ను ఆహ్వానించిన ఊరు ‘బొబ్బిలి’ (విజయనగరం జిల్లా). నోరు విప్పి పిలవలేని నేల, మారు పలకలేని గుడి, గుడి మంటపాలు, ఆకలికి అన్నం ఎలాగో మనిషి అభివృద్ధికి చదువు అలాంటిదని అప్పటి వయస్సుకీ అర్థం అయ్యేలా బోధపరచి చదువు చెప్పిన బడి, బడిలోని గురువులు, ఆకలిని మరిపింపచేసి ఆడించే రంగం వాళ్ళింట్లోని బాలవిహార్, ఊడుపులప్పుడు మిలమిల మెరిసే సూర్యకాంతితో పోటీగా పచ్చని వారు పరుచుకున్న పొలాలు, పంటకొచ్చిన వరికోతలు, కుప్ప నూర్పిళ్ళూ, ధాన్యం బస్తాలమీద ఎక్కి ఇంటికి రావడం, సంక్రాంతి పండుగలకి ముస్తాబయ్యే మా ఊరు. కొన్ని లక్షల క్షణాల జ్ఞాపకాలను నా మస్తిష్కంలో నిక్షిప్తం చేసిన ఊరంటే నా కిష్టం.
మా ఊరు ఊరించి అందించిన ఆనందాలు చిన్న చిన్నవే... మంచి రుచిగల సీమ చింతకాయలు కోయడం, మగ్గిన రేగిపళ్ళు దూయడం, పచ్చని రాచ ఉసిరి కొరకడం... వెచ్చగా నందివర్థనం కొమ్మపైకెక్కి కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, తొలివెలుగులతో లేచి తోటంతా తిరిగి రకరకాల పూలు పూజకోసం ఏరడం, వేసవి సాయంకాలంలో వాకిట్లో మంచాలు వేసుకుని కథలు వింటూ కళ్ళనిండా నక్షత్రాలను నింపుకుని నిద్రపోవడం. ఇలా ఎన్నో, ఎన్నెన్నో అన్ని ఇంద్రియాలకు సమపాళ్ళలో ఆనందం అందించింది మా ఊరు.
జీవితంలో ప్రప్రథమంగా పోటీ అంటే ఏమిటో తెలియజేసిన అనుభవం అందించినది కొత్తా సూర్యప్రకాశ్ (రాజా)తో బడిగంట కొట్టడానికి జరిగిన పోటీ.
చదును చేసిన మట్టినేల మీద చిన్న చిన్న చెక్కపీటల మీద కూర్చొని కంఠోపాఠం చెయ్యకుండా వచ్చినా సరే, ఎక్కాలు వెయ్యవలసి వచ్చినప్పుడు కూడికల సహాయంతో అన్ని ఎక్కాలూ వేయడం గమనించి నన్ను మెచ్చుకున్న బండారు సూర్యనారాయణరావు మాష్టారి చూపులు నేను ఇప్పటి వరకు పొందిన బహుమతులన్నింటిని మించినది.
రైతు గురువులు రెండెడ్లబండి మీద 4 వరుసల ధాన్యం బస్తాలు వేసి దాని మీద కూర్చోపెట్టి పొలం నుండి ఇంటికి తీసుకురావడం విమానం ఎక్కినా మరిచిపోలేని అనుభవం. అప్పుడే పున్నమి చంద్రుడికి దగ్గరగా ఉన్నావన్న అనుభూతి 30,000 అడుగుల ఎత్తున విమానం కిటికీ నుండి చంద్రుణ్ణి చూసినా కలగలేదు.
ఉగాది పచ్చడిలా అన్ని అనుభవాలతో పాటు చేదు అనుభవాన్ని కూడా తొలిసారిగా చవిచూపించింది కూడా బొబ్బిలే.. ఆరో తరగతిలోకి కొత్త పుస్తకాలతో అడుగు పెడుతుంటే పేరు తెలియని కుర్రాళ్ళొచ్చి నా పుస్తకాలు లాక్కుని పారిపోయిన నిస్సహాయత నన్నింకా వెంటాడుతూనే ఉంది.
వేణుగోపాలస్వామి కోవెలలో గర్భగుడిలో విగ్రహం ముందు నిలబడి కళ్ళుమూసుకుని ఉన్నా కనిపించే పూజారి అబ్బి గారి పవిత్రతని అదించింది మా ఊరే.
ఈ విశాల ప్రపంచాన్ని చూడ్డానికి కన్నుగా వ్యవహరించిన మా ఊరునన్ను నన్నుగా పెంచిన మా ఊరు, పేరిస్, న్యూయార్క్ వంటి మహానగరాలలో తిరిగినా చిన్నప్పుడు మా ఊరి వీధులలో తిరిగిన అనుభూతే మనసంతా ఆవరించి ఉండడం... మా ఊరు నాకు తెలియకుండానే నాకెంత ఇష్టమో మీకు తెలిసిందనుకుంటాను.
- సుజనరంజని, జూన్ 2004.
4 వ్యాఖ్యలు:
Perfect., a great Eulogy. Everyone has his own set of feelings, you wrote on behalf of everyone. Yes, as I read it made me recollect the treasured momnets again.
సొంతూరు అనే అభిమానమో ఏమో, ఎన్ని ఊళ్ళు తిరిగినా బొబ్బిలి లో ఉన్నంత ఆనందం దొరకదు
బండారు సూర్యనారాయణరావు మాష్టారు, పేరు విన్నట్టుంది. మనిషి ఎలా ఉంటారో చెప్పగలరా?
చిన్నప్పటి తీపి జ్ఞాపకాలను చాలా బాగా గుర్తు చేసినందుకు ధన్యవాదములు/ Simply superb and never forget the child hood days in Bobbili
Post a Comment