Wednesday, August 19, 2009

చెట్టు చెప్పిన పాఠం

Wednesday, August 19, 2009
మామిడితోటల మధ్య మా కాలేజి గురుకులాన్ని గుర్తు తెస్తుంది. ఊరికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉన్న కాలేజి కాంపస్ లోకి అడుగు పెడితే వేరే లోకంలో ఉన్నట్లు ఉండేది. కొందరు కాలినడకనగాని, మరికొందరు సైకిల్ మీద కాని కాలేజీకి వెళ్ళే వాళ్ళు. ఒక్క ప్రిన్సిపాల్ గారు మాత్రం ఒక పాతకారులో వచ్చేవారు. ఎపుడు నవ్వుతూ ఆనందంగా ఉండేవారు. తన చుట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉంచేవారు. అటువంటి వారిని సాధువు అని అంటారు. ఆ లెక్కన మా ప్రిన్సిపాల్ గారు కూడా సాధువే. కాని ఆయన రూల్సు మనిషి. ఆయన పెట్టిన రూల్సుని ఎవ్వరూ తప్పకూడదు. ఆయన కూడా. చిన్న చిన్న తప్పులకు శిక్ష విధించేవారు. జరిమానా రూపంలో ఉండేది. దాన్ని తప్పకుండా కట్టాల్సిందే. అది పూర్ బాయిస్ ఫండ్ కి వెళుతుంది. దానితో ఫీజు డబ్బులు కట్టలేని అర్హులైన విద్యార్థులందరికి జీతం కట్టేవారు. ఆయన చేసిన తప్పులకి అపుడపుడు ఆయన కూడా ఈ పూర్ బాయిస్ ఫండ్ కి డబ్బులు కట్టేవారు. ఎప్పుడు పడితే అప్పుడు మామిడి తోటలో విద్యార్థులు కాయలు కోయకూడదు. అది ఆయన పెట్టిన రూల్సులో ఒకటి. దాన్ని ఎదిరించిన వాళ్ళు ఇప్పటిదాకా ఎవ్వరూ లేరు.

మా కాలేజీ అంతటికి అతి పెద్ద హీరో బి.ఏ మూడవసంవత్సరంలో ఉన్న కిషోర్. వంశపారంపర్యంగా వచ్చిన అహంకారం అతనికి పెద్ద అలంకారం. అంత పొడవైన వాడు కాడు. అందుచేత ఎత్తు మడమల బూట్లు వేసుకొస్తాడు. అంత అందమైన వాడు కాడు. అందుచేత జుత్తు రకరకాల స్టైల్సులో దువ్వుకొని వస్తాడు. అంత మంచి మాటకారి కూడా కాడు. అందుచేత అందరిని చూపులతోనే బెదిరిస్తాడు. కాదంటే నోటికి వచ్చినట్లు అరుస్తాడు. రోజూ మోటర్ బైక్ మీద వస్తాడు. నలుగురిని తనతో తిప్పుకుంటాడు. కేంటీన్లో నలుగురిని పోగేసి గప్పాలు కొడుతుంటాడు. తనతో ఉన్న వాళ్ళందరికి టీలు పోయిస్తాడు. నీ అంతటివాడు ఈ కాలేజీలోనే లేడని అనిపించుకొంటాడు, తన మిత్రబృందంతో. ఈ ఏడాదే రాజధాని నుండి వచ్చి ఈ కాలేజిలో చేరాడు. అతనికి ఉన్న అతి ముఖ్యమైన క్వాలిఫికేషన్ వాళ్ళ నాన్న ఈ కాలేజి కరస్పాండెంట్ అవ్వడమే. అందుచేత అతన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరన్న భావన అతనికి అతని మిత్రబృందానికి ఉంది, చాలా గట్టిగా.
అయితే అనుకోకుండా, జరిగిన సంఘటన వల్ల ఆభావనకి కొద్దిగా నమ్మకం సడలింది. కిశోర్ కేంటీన్లో మిత్రబృందంతో సమావేశమై టీ తాగుతుండగా ప్రిన్సిపాల్ ఫైన్ల మీదకి మళ్ళాయి వాళ్ళ మాటలు. ఈ కాలేజిలో ప్రిన్సిపాల్ వేసే ఫైన్లని ఎవ్వరూ ఎదిరించలేరని కట్టవల్సిందేనని మిగిలినవాళ్ళు అన్నారు. “కట్టకపోతే?” అన్నాడు కిషోర్ పొగరుగా. “ఇన్నేళ్ళలో కట్టని వాళ్ళు ఒకళ్ళు కూడా లేరని” అన్నారు మిగిలిన వాళ్ళు. “సరే నేనే ఓ రూలు బ్రేక్ చేస్తాను. ఫైన్ వేసినా కట్టను. బెట్!” ఏంచేస్తాడేం ఈ ప్రిన్సిపాల్? వెళ్ళి మానాన్నకి చెప్పుకుంటాడా? అని వెటకారంగా నవ్వాడు కిషోర్.
“అవున్రా! నువ్వు ఫైన్ కట్టకపోతే ఇక ఈ రూల్సు, ఫైన్స్ పోతాయి. నువ్వు మన స్టూడెంట్లందరికి గొప్ప సాయం చేసినవాడవవుతావు అని రకరకాలుగా చెప్పి అతని చేత ఏదైనా ఒక రూల్ బ్రేక్ చేయించి తమాషా చూద్దామని అందరూ అతడిని ప్రోత్సాహించారు. కాలేజి మామిడితోటలోని మామిడికాయలు కోయకూడదన్న రూలు అందరికి చాలా కష్టం కలిగించేది. ఈ రూల్ నే ఎదిరిస్తే అన్న ఆలోచన వచ్చింది కిషోర్ కి.

కిషోర్ని ఓ మామిడిచెట్టు ఎక్కి కాయలు కోయమన్నారు. కిషోర్ సరేనన్నాడు. చెట్టు ఎక్కి కాయలు కోయడం మొదలుపెట్టాడు. “నాకొకటి రా నాకొకటిరా....” అంటూ మిత్రులంతా కాయలు కోయించుకొంటున్నారు. తోటమాలి వచ్చి కేకలు వేసాడు. కిందనున్న కుర్రాళ్ళంతా పారిపోయారు. కిషోర్ చెట్టుమీదనే ఉండిపోయాడు. తను ప్రిన్సిపాల్ కి కాయలుకోస్తూ దొరకాలి. ఫైను వేయించుకోవాలి. ఫైను కట్టనని చెప్పాలి. అందుచేత కిషోర్ చెట్టు దిగే ప్రయత్నం చెయ్యలేదు. అదే విషయం తోటమాలికి చెప్పాడు. తోటమాలి వెళ్ళి ప్యూన్ కు చెప్పాడు. ప్యూన్ వెళ్ళి ప్రిన్సిపాల్ కి చెప్పాడు. ప్రిన్సిపాల్ నడుచుకుంటూ వచ్చి చెట్టు క్రింద నిలబడి చెట్టు దిగవోయ్ అన్నారు తలఎత్తి చెట్టు మీదనున్నకిషోర్ని చూస్తూ.

“మీరు ఫైన్ వెయ్యనంటే దిగుతాను” అన్నాడు కిషోర్.

“ఎందుకెయ్యను ఫైన్ వెయ్యడానికే వచ్చాను.”

“నేనెవరో తెలుసా?” అన్నాడు కిషోర్ గర్వంగా.

“దిగొచ్చాక అవన్నీ చెప్పు” అన్నారు ప్రిన్సిపాల్ నువ్వెరైతే నాకేంటి అన్నట్లు.

“మీరు ఫైన్ వెయ్యలేరు.”

“ఎందుకు వెయ్యలేను?”

“నేను కరస్పాండెంట్ గారి కొడుకుని”

ఓరి, నువ్వ ట్రా! “అయితే ఫైన్ డబుల్ వెయ్యాలి” అన్నారు ప్రిన్సిపాల్

“మా నాన్నకి తెలిస్తే మిమ్మల్నేం చేస్తారో తెలుసా?”

“ఆయన పెట్టిన కాలేజీని బాగా నడుపుతున్నానని గర్విస్తాడు.”

“కాదు. ఎంత పొగరు నీకు? నా కొడుకుకే ఫైన్ వేస్తావా అని వార్నింగ్ ఇస్తారు. ఆయన తల్చుకుంటే మీ ఉద్యోగం తీసేయగలుగుతారు” అన్నాడు కిషోర్ చెట్టుమీద నుండి క్రిందకు చూస్తూ.

“ఓరేయ్ వెధవేషాలు మానేసి కిందకి దిగు. ఫైన్ కట్టి ఇంటికి ఫో.” అన్నారు ప్రిన్సిపాల్ నవ్వుతూ.

“టూమచ్ చేస్తున్నావ్. తరువాత బాధపడతావ్! ”

“తప్పు చేసినప్పుడు అప్పటికప్పుడే అనుభవించేస్తే సరి లేకపోతే నిజంగానే నువ్వన్నట్టు టూమచ్ అవుతుంది. చాలాకాలం బాధ పడవల్సి వస్తుంది” అన్నారు ప్రిన్సిపాల్ గారు చెట్టుమీద వున్న కిషోర్ ని సూటిగా చూస్తూ.

అప్పటికే చాలామంది స్టూడెంటులు, రోడ్డు మీద పోయే వాళ్ళు, కొంతమంది లెక్చరర్లు అక్కడకి చేరారు.

“నువ్వు దిగుతావా? దిగనంటే చెప్పు నేను కుర్చీ తెప్పించుకుంటాను” అన్నారు ప్రిన్సిపాల్ గారు.

“నేను దిగను” అన్నాడు కిషోర్ పంతంగా

“ఓరేయ్ సోములు నాకు కుర్చి, టేబుల్ తీసుకురా! ఈ చెట్టు క్రిందే వెయ్యి,” అని ప్యూన్ కి చెప్పి తలెత్తి చెట్టు మీదనున్న కిషోర్ని చూసి నేనిక్కడున్నా నాపని ఏదీ ఆగిపోదు. అని అపుడే అక్కడేం జరుగుతున్నదో అని చూడడానికి వచ్చి ఆగుంపులో చేరిన కాలేజి క్లర్కుని చూసి “మీరు ఇవాళిటి ఫైళ్ళు తీసుకొని రండి” అని చెప్పారు.

“అలాగే సార్” అని క్లర్క్, ప్యూన్ కదిలారు.

“వస్తున్నప్పుడు నాకు కాఫీ తీసుకని రండి” అని గట్టిగా అరిచినట్లు చెప్పారు. వెళ్ళిపోతున్న వాళ్ళిద్దరూ వినాలని అంత కన్నా ముఖ్యంగా చెట్టుమీదనున్న కిషోర్ వినాలని.

ప్రిన్సిపాల్ గారు మిగిలిన వాళ్ళతో ఏవేవో కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు. టేబుల్, కుర్చి, ఫైళ్ళు, కాఫీ వచ్చాయి. అయితే చెట్టుమీద ఉన్న కిషోర్కి కనిపించేలా చెట్టు కింద టేబుల్, కుర్చి వేయించుకుని కూర్చొని కాఫీ తాగుతూ ఫైళ్ళు చూడడం మొదలుపెట్టారు

దూరంగా కారు హారన్ వినిపించింది. గుంపు అంతా అటు తిరిగి చూసారు. నీలిరంగు ఎంబాసిడర్ కారు. అది ఆ ఊర్లో ఉన్న అందరికి తెలిసిన కారే. కాలేజి కరస్పాండెంట్ గా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ యజమాని కారు. కిషోర్ వాళ్ళ నాన్న కారు. కొడుకు కాలేజిలో ఏదో గొడవ పడుతున్నాడని తెలిసి ఆయన ప్రిన్సిపల్ కి ఫోను చేసాడు. ప్రిన్సిపల్ ఇక్కడ చెట్టుకింద ఉన్న విషయం తెలుసుకొని వెంఠనే బయలుదేరి వచ్చారు. కారు ఆగింది. కిషోర్ వాళ్ళ నాన్న దిగారు. ప్రిన్సిపల్ గారు లేచి నిలబడి

“నమస్కారమండి” అన్నారు.

“నమస్కారం ఏమిటి మా కిషోర్ ఎక్కడ?” అన్నాడు ఆతృతగా

“ఇక్కడ నాన్నా చెట్టు మీద. ఈ ప్రిన్సిపాల్ నన్ను దిగనివ్వడం లేదు” అన్నాడు సగం ఏడుపుగొంతుతో.

“ఏంటయ్యింది ప్రిన్సిపాల్ గారు?” అన్నాడు కిషోర్ వాళ్ల నాన్న అధికారం నిండిన గొంతుతో.

ప్రిన్సిపాల్ గారు జరిగిందంతా వివరించారు క్లుప్తంగా. “అంటే మీవాడు చెట్టుదిగి 25 రూపాయలు ఫైన్ కట్టి ఇంటికి వెళ్లాలి మన కళాశాల రూల్సు ప్రకారం.” అని ఆగారు ప్రిన్సిపల్ గారు.

“నాన్న ఇది మన కాలేజి. ఆయనకి ఉద్యోగం ఇచ్చింది నువ్వు. మనకి రూల్సు పెట్టడానికి ఆయనెవరు. ఆయన్ని ఉద్యోగంలోంచి తీసెయ్యి” అని పౌరుషంగా అన్నాడు చెట్టుమీద కిషోర్.

కిషోర్ తండ్రి ఏమీ మాట్లాడలేదు. కొడుకువైపు, ప్రిన్సిపల్ వైపు మార్చి మార్చి చూసాడు. చుట్టూఉన్న మనుషులని కూడా చూసాడు. సుమారు వందమంది ఉన్నారు ఇక్కడేం జరిగినా, ఏమన్నా ఊరందరికి తెలుస్తుంది. జరగబోయేదాని మీద తన పరువు, కుటుంబం పరువు, కాలేజి పరువు అన్నీ ఆధారపడి ఉన్నాయి. అందుచేత అతను ఏమీ అనలేకపోయాడు. “అయ్య మీరొక్కసారి ప్రక్కకి వస్తారా?” అన్నారు ప్రిన్సిపాల్ గారు కరస్పాండెంట్ ని. గుంపు అవతలకి, చెట్టుకు దూరంగా వెళ్లదామని చేత్తో సూచిస్తూ, ముందు తాను నడిచారు. ప్రిన్సిపాల్ వైపు కరస్పాండెంట్ వెళ్లారు. వాళ్లు మాట్లాడినవి గుంపుకు వినపడనంత దూరం చేరాక కాసేపాగి ప్రిన్సిపల్ కరస్పాండెంటు గారివైపు తిరిగి, “మీ కుర్రాడు బెదిరించినట్లు నన్ను మీరు ప్రిన్సిపాల్ ఉద్యోగంలోంచి తీసివేయవచ్చు. కాని పెట్టిన రూల్సు తనకిమాత్రం తీసేస్తే ఇకముందు తను ఏదైనా చెయ్యగలననుకొంటాడు. ఈ చిన్న తప్పునుండి పెద్ద పెద్ద తప్పులు చెయ్యడానికి వెనుకాడడు. సంఘం కట్టుబాట్లు దాటి చెడ్డ తోవలో పడతాడు. ఆఖరికి ఒకరోజు మిమ్మల్ని కూడా లెఖ్ఖ చెయ్యడు. మిమ్మల్ని కూడా తండ్రి హోదానుండి తీసేస్తాడు. మీరు నా ఉద్యోగం తీసేసినా నాకు కలిగే కష్టం, నష్టం ఏమీలేదు. ఏదో ఒక కాలేజీలో ఉద్యోగం దొరక్కపోదు” మౌనంగా వింటున్న కరస్పాండెంట్ తో అన్నారు.

కరస్పాండెంట్ కి ముందు కోపం వచ్చింది. తన క్రింద పనిచేసే ప్రిన్సిపాల్ ఇంత సూటిగా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఆలోచించిన మీదట ప్రిన్సిపల్ మాటలలో ఉన్న నిజం కొంత అర్థమయ్యింది. ఇవాళ అహంకారంతో ప్రిన్సిపాల్ ని ఫైన్ వెయ్యకుండా చేసినా, ఏదో ఒకరోజు తన కొడుకు ఇదే అహంకారంతో తన అధికారాన్ని కూడా ఎదిరించి తనని ఎందుకూ పనికిరానివాడిగా చేస్తాడు. ఇక తాను అప్పుడేమీ చెయ్యలేడు. ఏమైనా చేస్తే ఇప్పుడే చెయ్యాలి అని అనుకున్నాడు మనసులో ఏదో ఒక నిశ్చయానికి వచ్చి వెనుతిరిగి చెట్టు కిందకి వెళ్లాడు. “కిషోర్ కిందకి దిగి వచ్చి ప్రిన్సిపల్ గారికి క్షమాపణ చెప్పి ఫైన్ కట్టి ఇంటికి వెళ్లు” అని శాసించినట్లు చెప్పి, మౌనంగా ప్రిన్సిపల్ గారికి నమస్కారం పెట్టి కారెక్కి వెళ్ళిపోయాడు.

ఆ చెట్టుమీద నేను చాలాసేపు కదలిక లేకుండా ఉండిపోయాను.

చెట్టుకింద ప్రిన్సిపాల్ అలాగే కూర్చున్నారు.

ఈ సంఘటన జరిగి ఇరవై ఏళ్ళు కావస్తున్నది.

మళ్ళీ చెప్పడం ప్రారంభించాను. దేశ విదేశాల నుండి వచ్చిన మిత్రులు ఆసక్తిగా వింటున్నాం. అకస్మాత్తుగా నేను చెట్టు దునికి ఎటో పారిపోయాను. రిజిగ్నేషన్ లెటర్ పడేసి తెల్లారే ప్రిన్సిపాల్ గారు ఊరు విడిచి వెళ్ళిపోయారు. తప్పుచేసిన వాడిని శిక్షించలేకపోయినందుకు గాను తానే వంద రూపాయలు పూర్ బాయ్స్ ఫండ్ కి జరిమాన కట్టారు వెళ్ళేముందు.
ఇది జరిగిన తరువాత మెల్లిమెల్లిగా మామిడితోట పాడుపడింది. ఆ చెట్లకి ఇక కాయలు కాయలేదు. ఎంత బాగుచేద్దామని ప్రయత్నించినా ఏ ప్రిన్సిపాల్ విజయం సాధించలేకపోయారు. నాన్నగారు అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు.
నాలుగేళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చాను. చాలారోజులు స్తబ్దంగా ఉండిపోయాను.

మెల్లిగా మళ్లీ మామిడి తోట వేశాను. పూత పూసింది. పిందెలు వేసింది. కాయలు కూడా కాచాయి. ప్రిన్సిపాల్ గారు కూచున్న చోటే నేను వేదిక నిర్మంచి అక్కడే కూచున్నాను. ఇప్పుడు నేను కూచున్న చోటు అదే.

ఇప్పుడు మీరున్నది ఆనాటి కళాశాల. ఈనాడు పేద విద్యార్థుల ఆశ్రమ పాఠశాల. నాలో మార్పు రావాలని మా నాన్న చివరికోర్కె.

కాని ఆ మార్పుకి దోహదం చేసింది ప్రిన్సిపాల్ గారి వ్యక్తిత్వం. జీవితాంతం అది నన్ను వెంటాడింది.

అలాంటి వ్యక్తిత్వాలకి రూపకల్పన చేయడానికే ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. పాఠ్య ప్రణాళికలు, తరగతి గది బోధన, జ్ఞాన్నాన్ని పెంచుతాయి. కాని వ్యక్తిత్వాలు నేర్పే పాఠాలు జీవితాల్ని మారుస్తాయి. మంచి మార్గంలోకి మళ్ళిస్తాయి.

మనకి ఇప్పుడు అలాంటి ఉపాధ్యాయులు అవసరం.

అందుకే విద్యార్థులను తయారుచేసే ముందు ఉత్తమ ఉపాధ్యాయులను తయారుచేయాలి. ఇందుకోసం పాఠ్యప్రణాళిక ఎలా తయారుచేయాలో ఆలోచించాలి.”

చెట్టు మీద కదలకుండా నిలుచున్న ఓ విద్యార్థి దృశ్యం మసకబారుతుంటే కిశోరుబాబు కంఠం సవరించుకుని తన ప్రణాళికను వివరించసాగాడు.







1 వ్యాఖ్యలు:

Anonymous said...

ఇలా చాలా సార్లు మన ఇంట్లో మన పిల్లలే చెస్తారు. బొలెదు సార్లు ఆ కరస్పాండెంట్ తాత కావచ్చు, నాన్న కవచ్చు, నానమ్మ కవచ్చు. వాళ్ళు కరస్పాండెంట్ లా చెసినా చెయ్యక పొయినా ప్రిన్సిపాల్ వదిలి వెళ్ళినట్లు వెళ్ళడానికి విలవదు. మరి పిల్లవాడి కి తప్పు ఎలా తెలియాలి?

స్కూల్ లొ అయితే టిచర్లని తయారు చెయ్యచ్చు కాని కుటుంబం లో అలంటి సదుపాయం అవసరమనే ఆలొచన కూడా రావట్లెదు. అసలు ఈ రొజు దాకా ఎవ్వరూ పెళ్ళి చేసుకోడానికి, పిల్లల్ని కనడానికి ఒక కనిస పరిజ్ఞానం కావాలి అని గుర్తించట్లెదు. అందుకే ఇంకా మీరు రాసిన"మీ అవిడని కొట్టర" లాంటి సంస్కృతే కొనసాగుతోంది....
Sumitra